
భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న గౌరవం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ దేశ శాంతిభద్రతల పరిరక్షణకు వెన్నెముకగా నిలిచే ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అత్యంత గౌరవప్రదమైన, బాధ్యతాయుతమైన వృత్తిగా ఉంది. ఇది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు.. ప్రజలకు సేవ చేయడానికి, సరైన న్యాయం అందించడానికి వీలు కల్పిస్తుంది. చదువు పూర్తి చేసుకొని సివిల్స్ పరీక్షలో మెరిట్ సాధించిన చాలామంది యువత ప్రజలకు సర్వీసు అందించడంతోపాటు ఆకర్షణీయమైన జీతభత్యాలు, ఇతర ప్రయోజనాలు పొందుతున్నారు. ఐపీఎస్ స్థాయి అధికారుల నెలవారీ జీతం, ర్యాంక్ వారీగా వేతన నిర్మాణం ఎలా ఉంటుందో చూద్దాం.(రాష్ట్రాలు ప్రత్యేకంగా అందించే అలవెన్స్‌లనుబట్టి వారి వేతనాల్లో మార్పులుంటాయని గమనించాలి)
ఐపీఎస్ అధికారులకు కేంద్ర ప్రభుత్వ సివిల్ సర్వీసెస్ తరహాలో వేతన స్కేల్‌ను అందిస్తారు. 7వ వేతన సంఘం సిఫార్సుల తర్వాత ఐపీఎస్ అధికారుల వేతనాలను పే మ్యాట్రిక్స్ విధానం ద్వారా నిర్ణయిస్తున్నారు. జూనియర్ స్కేల్‌లో నియమితులైన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) నెలవారీ ప్రాథమిక వేతనం సుమారు రూ.56,100తో ప్రారంభమవుతుంది. అధికారి అనుభవం, సర్వీస్, ర్యాంక్ పెరిగే కొద్దీ వారి జీతం కూడా అధికమవుతుంది. దేశంలో అత్యున్నత పోలీస్ పదవి అయిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) స్థాయిలో జీతం అత్యధికంగా ఉంటుంది.
ర్యాంకుల వారీగా పే స్కేల్ (నెలవారీ ప్రాథమిక వేతనం)
ర్యాంక్ | నెలవారీ ప్రాథమిక వేతనం |
---|---|
డిప్యూటీ ఎస్పీ (DSP) / ఏసీపీ (ACP) | రూ. 56,100 |
అడిషనల్ ఎస్పీ | రూ. 67,700 |
పోలీసు సూపరింటెండెంట్ (SP) | రూ. 78,800 |
డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (DIG) | రూ. 1,31,000 |
ఇన్స్పెక్టర్ జనరల్ (IG) | రూ. 1,44,200 |
అడిషనల్ డీజీపీ (ADGP) | రూ. 2,05,000 |
డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) | రూ. 2,25,000 |
ఐపీఎస్ అధికారులకు అలవెన్సులు, సౌకర్యాలు
ఐపీఎస్ అధికారులు ప్రాథమిక జీతంతో పాటు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడానికి తోడ్పడే వివిధ రకాల భత్యాలు, సౌకర్యాలను కూడా పొందుతారు. ద్రవ్యోల్బణం రేటును బట్టి ఎప్పటికప్పుడు డియర్నెస్ అలవెన్స్ ఇస్తారు. ఇది ద్రవ్యోల్బణం ప్రభావాలకు వ్యతిరేకంగా అధికారుల జీతాలను సమతుల్యంగా ఉంచుతుంది.
పోస్టింగ్ నగరాన్ని బట్టి HRA మారుతుంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో ఇది అత్యధికంగా ఉంటుంది.
అధికారిక పర్యటనల కోసం ప్రయాణ భత్యం ఇస్తారు. ఇందులో దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలు కూడా ఉంటాయి.
ఐపీఎస్ అధికారులు వారి కుటుంబాలకు ప్రభుత్వ ఆరోగ్య పథకాల కింద ఉచిత చికిత్స, వైద్య సదుపాయాలు కల్పిస్తారు.
సీనియర్ ర్యాంక్ అధికారులకు భద్రతా సిబ్బంది, వ్యక్తిగత సిబ్బందిని అందిస్తారు.
ప్రభుత్వ గృహాలు (క్వార్టర్స్), విద్యుత్, సబ్సిడీలు, టెలిఫోన్ బిల్లులపై రాయితీలు కూడా ఉంటాయి.
ఇదీ చదవండి: 3డీ సెన్సార్లతో రహదారి లోపాలు గుర్తింపు