సాక్షి, చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రామనాథపురం జిల్లాలో రెండు కార్లు ఢీ కొట్టడంతో ఐదుగురు మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో నలుగురు ఆంధ్రప్రదేశ్‌కు(ఉత్తరాంధ్ర) చెందిన వాళ్లని తమిళనాడు పోలీసులు చెబుతున్నారు.
ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులు శబరిమల దర్శనం తర్వాత రామేశ్వరం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగింది. శనివారం ఉదయం కీళకరై ఈసీఆర్ వద్ద వీళ్లు ప్రయాణిస్తున్న కారు.. ఆగి ఉన్న కారును వేగంగా వచ్చి బలంగా ఢీ కొట్టింది. మృతుల్లో నలుగురు ఏపీకి చెందినవారని పోలీసులు తెలిపారు. డ్రైవర్ ముస్తాక్ కూడా అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. రెండు కార్లలోనూ అయ్యప్ప భక్తులు ఉన్నారని చెప్పారు.

గాయపడిన వాళ్లకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. మృతులు విశాఖపట్నంకి చెందినవాళ్లుగా తెలుస్తోంది. శబరిమల దర్శనం ముగించుకుని రామేశ్వరం.. అక్కడి నుంచి వస్తుండగా ఈ దుర్ఘటనలో ప్రాణాలు పొగొట్టుకున్నారని పోలీసులు తెలిపారు. వాళ్లకు సంబంధించిన వివరాలను వెల్లడించాల్సి ఉంది.



