రిజిస్ట్రేషన్ పూర్తి కాని వారికి 3 నెలలు జరిమానా నుండి మినహాయింపు
సాక్షి, అమరావతి: ఉమీద్ పోర్టల్‌లో వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి కేంద్రం భారీ ఊరటనిచ్చింది. రిజిస్ట్రేషన్ చేయని వారిపై వచ్చే మూడు నెలలు ఎటువంటి జరిమానాలు, కఠిన చర్యలు ఉండబోవని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు హామీ ఇచ్చారు. గడువు సడలింపు తర్వాత కూడా ప్రక్రియ పూర్తి చేయలేని పరిస్థితిలో ముతవల్లీలు వక్ఫ్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాలని మంత్రి సూచించారు.
రిజిస్ట్రేషన్‌కు డిసెంబర్ 5తో ముగుస్తున్న 6 నెలల గడువు పొడిగింపునకు ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టం చేసిన విషయాన్ని మంత్రి ప్రస్తావిస్తూ, అయితే నమోదులో ఏదైనా సమస్యలు ఉంటే వక్ఫ్ ట్రైబ్యునల్‌కు మరొక ఆరు నెలల వరకు గడువు ఇవ్వడానికి అధికారం ఉందని చెప్పారు.
ఇప్పటివరకు ఉమీద్ పోర్టల్‌లో ఒక లక్ష 51 వేలకుపైగా వక్ఫ్ ఆస్తులు నమోదయ్యాయని మంత్రి వెల్లడించారు. దేశంలో దాదాపు 9 లక్షల ఎకరాలకుపైగా వక్ఫ్ ఆస్తులు ఉన్న సంగతి గమనార్హం. అయితే సాంకేతిక సమస్యల కారణంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికాని పరిస్థితి నెలకొంది.
రాష్ట్రంలో పరిస్థితి ఇదీ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 4,748 వక్ఫ్ ఆస్తులు (రిజిస్టర్డ్ ప్రోపర్టీలు), పదివేలకు పైగా అన్ రిజిస్టర్డ్ ఆస్తులు ఉన్నాయి. ఇప్పటికే వక్ఫ్ సంస్థల ముతవల్లీలు, నిర్వాహకుల (మేకర్) స్థాయిలో దాదాపుగా అన్ని రిజిస్టర్ ఆస్తులు అప్‌లోడ్ చేసినట్టు చెబుతున్నారు. వాటికి చెకర్ (వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్) పరిశీలన తర్వాత అప్రూవర్ (వక్ఫ్‌బోర్డు సీఈఓ) ఆమోదం తెలపాల్సి ఉంది.
సర్వర్ డౌన్ సమస్యతో ఈ ప్రక్రియ పెండింగ్‌లో పడిపోయింది. ఇప్పుడు కేంద్రం ఇచ్చిన మూడు నెలల గడువులో ఈ ప్రక్రియ అంతా ‘ఎటువంటి జరిమానాలు లేకుండా’ పూర్తయ్యే వెసులుబాటు ఉంటుందని వక్ఫ్ అధికారులు చెబుతున్నారు. అటు తర్వాత మిగిలిన పదివేలకుపైగా అన్ రిజిస్టర్డ్ వక్ఫ్ ఆస్తులు క్రమంగా ఆన్‌లైన్ చేసుకోవచ్చని పేర్కొంటున్నారు.


