విదేశాలకు మించిన చార్జీలతో ప్రయాణికుల జేబులు గుల్ల చేస్తున్న వైనం
హైదరాబాద్ నుంచి కోల్‌కతకు రూ. 69 వేలు.. ఢిల్లీ నుంచి విజయవాడకు రూ. 67 వేలు.. హైదరాబాద్–శ్రీనగర్‌కు సుమారు రూ. 60 వేలు.. విశాఖ నుంచి ముంబైకి సుమారు రూ. 56 వేలు.. ఢిల్లీ టు హైదరాబాద్ రూ. 50 వేలు... తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల నుంచి దేశంలోని వివిధ నగరాలకు శుక్రవారం వివిధ విమానయాన సంస్థలు విక్రయించిన ఒక్కో ఎకానమీ క్లాస్ విమాన టికెట్ ధర ఇది.
అవే విమానయాన సంస్థల వెబ్‌సైట్లలో శుక్రవారం హైదరాబాద్ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా అమెరికాలోని న్యూయార్క్‌కు టికెట్ ధర కనిష్టంగా రూ. 50 వేలలోపే అందుబాటులో ఉంది. అలాగే విశాఖ నుంచి సింగపూర్‌కు ఆదివారం రోజున టికెట్ రూ. 17,309కే లభిస్తోంది.
శంషాబాద్/సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, విశాఖపట్నం/విమానాశ్రయం (గన్నవరం)/రేణిగుంట: పైలట్ల కొరత, నిర్వహణ సమస్యలతో ఇండిగో ఎయిర్‌లైన్స్ (IndiGo Airlines) శుక్రవారం దేశవ్యాప్తంగా ఏకంగా వెయ్యికిపైగా సర్వీసులను రద్దు చేయడంతో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నుంచి దేశంలోని ప్రధాన నగరాల మధ్య రాకపోకలు సాగించే మిగతా ఎయిర్‌లైన్స్ సంస్థలు టికెట్ ధరలను అసాధారణ రీతిలో పెంచేశాయి. సాధారణ రోజుల్లో వసూలు చేసే చార్జీలతో పోలిస్తే కొన్ని రెట్లు అధికంగా వసూలు చేశాయి. దీంతో కొన్ని దేశీయ సర్వీసుల చార్జీలు విదేశీ టికెట్ చార్జీలను సైతం మించిపోయి ప్రయాణికుల జేబులను గుల్లచేశాయి.
దేశీయ విమాన చార్జీలు సైతం అమెరికా వెళ్లాల్సిన చార్జీలకన్నా భారీగా ఉండటంతో విమాన ప్రయాణికులు తప్పనిసరైన ప్రయాణాలను మాత్రమే ఎంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇండిగో విమాన సర్వీసుల రద్దుతో 24 గంటల నుంచి 48 గంటల ముందు టికెట్లు బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు మాత్రం ఈ అధిక ధరలు చెల్లించాల్సిన దుస్థితి తలెత్తింది.

మరో రెండు నుంచి మూడు రోజులు మాత్రమే టికెట్ ధరలు అధికంగా చూపిస్తున్న ఎయిర్‌లైన్స్ సంస్థలు.. ఆ తర్వాత సాధారణ చార్జీలనే చూపిస్తున్నప్పటికీ ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రేట్లు మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రాజకీయ నాయకులకు తప్పని చిక్కులు..
పార్లమెంట్ సమావేశాల కారణంగా తెలుగు రాష్ట్రాల ఎంపీలు ఢిల్లీలో ఉండగా వివిధ పనుల నిమిత్తం ఢిల్లీకి చేరుకున్న వివిధ పార్టీల నేతలు, వారి అనుచరగణం ఇండిగో విమాన సర్వీసుల రద్దు, ఆలస్యంతో ఇక్కట్లు పడుతున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, చెన్నై, బెంగళూరు, కొచ్చి, అహ్మదాబాద్, పటా్న, కోల్‌కతా, ముంబై వంటి నగరాలకు వెళ్లే విమాన సర్వీసులేవీ నేరుగా అందుబాటులో లేవు. మధ్యలో ఒకటి, రెండు స్టాప్‌లతో నడిచే వాటినే ఇతర విమానయాన సంస్థలు అందుబాటులో ఉంచుతున్నాయి.

ఒక స్టాప్ లేదా రెండు స్టాప్‌లతో హైదరాబాద్ వెళ్లే విమానాల టికెట్ రేట్లకు పరిమితి లేకుండా పోయింది. కొన్ని విమానాలు రూ. లక్షకుపైగా టికెట్ ధర పెట్టడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఇక హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లే ప్రయాణికులు దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. రూ. 40 వేలకు పైగా టికెట్ ధర ఉండటంతో ప్రయాణికులు అక్కడే నిరీక్షిస్తున్న ఉదంతాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
శంషాబాద్‌కు 84 డిపార్చర్, 71 అరైవల్ విమానాల రద్దు
వివిధ గమ్యస్థానాల నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన 71 ఇండిగో ఎయిర్‌లైన్స్ సర్వీసులను సంస్థ శుక్రవారం రద్దు చేసింది. అలాగే హైదరాబాద్ నుంచి బయలుదేరాల్సిన 84 ఇండిగో విమానాలు కూడా రద్దయ్యాయి. మరికొన్ని ఇండిగో విమాన సర్వీసులు గంటల కొద్దీ ఆలస్యంగా నడుస్తున్నాయి. శుక్రవారం శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
మరోవైపు విశాఖ నుంచి శుక్రవారం 15 ఇండిగో విమాన సర్వీసులు, విజయవాడ నుంచి రెండు సర్వీసులు రద్దయ్యాయి. మరోవైపు.. శుక్రవారం దుబాయ్ ఈకే–526 విమానాన్ని బాంబులతో పేల్చివేయనున్నట్లు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మెయిల్ రావడంతో తనిఖీలు చేశారు.


