ఐదేళ్ల కిందటే వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డీడీవోలకు ఇప్పుడు డిప్యూటీ సీఎం హడావుడి
వైఎస్ జగన్ హయాంలోనే పంచాయతీరాజ్ శాఖలో డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారి పోస్టుల సృష్టి
గ్రామ, వార్డు సచివాలయాలతో సమన్వయం కోసం ప్రవేశపెట్టిన గత ప్రభుత్వం
అదనపు సిబ్బంది, కారు, కార్యాలయాల నిర్వహణకు నిధుల కేటాయింపు
33 ఏళ్లుగా పదోన్నతులకు నోచుకోని ఎంపీడీవోలకు డీడీవోలుగా ప్రమోషన్
ఐదేళ్ల నుంచి ప్రతి రెవెన్యూ డివిజన్‌లో పనిచేస్తున్న అధికారులు
నాడు డీఎల్‌డీవోగా వ్యవహరించగా.. నేడు డీడీవోగా మార్చిన బాబు సర్కారు
కొత్త వ్యవస్థ, కార్యాలయాలు ప్రవేశపెట్టింది జగన్.. తన ఆలోచనలుగా చెప్పుకొన్న పవన్
సాక్షి, అమరావతి: ఎగవేతలు... అడ్డగోలు కోతలు తప్ప ఏడాదిన్నర నుంచి చేసిన మంచి పని ఒక్కటీ లేదు..! చెప్పుకోవడానికి ఏమీ లేదు..! దీంతో చంద్రబాబు సర్కారు గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల క్రెడిట్ చోరీకి పాల్పడుతోంది...! వైఎస్సార్‌సీపీ హయాంలో విప్లవాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాలను యథేచ్ఛగా తన ఖాతాలో వేసుకుంటోంది..!
వైఎస్ జగన్ వినూత్న ఆలోచనలను చంద్రబాబు ప్రభుత్వం అటుఇటు మార్చి తమ గొప్పలుగా చెప్పుకుంటోంది. వేగంగా జరుగుతున్న ఈ క్రెడిట్ చోరీలో సీఎం చంద్రబాబు దారిలోనే ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ వెళ్తున్నారు. పవన్ గురువారం 77 డివిజనల్ డెవలప్‌మెంట్ కార్యాలయాలను (డీడీవో) ప్రారంభిస్తూ, అవి తన ఆలోచన నుంచి పుట్టాయంటూ ప్రకటించుకున్నారు. కానీ, వాస్తవం మాత్రం వేరు.

మచిలీపట్నం మండలం పోతేపల్లి గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసిన మచిలీపట్నం డివిజనల్ డెవలప్‌మెంట్ ఆపీసు

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో గ్రామ సచివాలయ భవనంలో ప్రారంభించిన డీడీవో కార్యాలయం
దశాబ్దాల ఎదురుచూపులకు తెరదించి
పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో 1987లో మండల వ్యవస్థను తీసుకురాగా... కీలకమైన ఎంపీడీవోలకు 33 ఏళ్ల పాటు పదోన్నతులు లేవు. ఈ పరిస్థితుల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంపీడీవోలకు పదోన్నతులు కల్పించేందుకు నిర్ణయించింది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారి వ్యవస్థను తెచ్చారు. అప్పటివరకు ఎంపీడీవోలు వేర్వేరు సంఘాలుగా వేరుపడి సీనియారిటీ జాబితాపై వాళ్లలో వాళ్లే కోర్టుల్లో కేసులు వేసుకుంటూ గొడవలు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో నాటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చొరవ చూపి... గ్రామ, వార్డు సచివాలయాలతో సమన్వయం చేసుకునేలా డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారి పోస్టులను ప్రవేశపెట్టింది. ఈ మేరకు ఒకేసారి పెద్ద సంఖ్యలో ఎంపీడీవోలకు పదోన్నతులు కల్పించింది. అలా రాష్ట్రంలోని ప్రతి రెవెన్యూ డివిజన్‌లో ఐదేళ్ల కిత్రం 2020 సెప్టెంబరులో ‘డివిజనల్ డెవలప్‌మెంట్ కార్యాలయాల’ను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఈ కార్యాలయాల్లో సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ తదితర సిబ్బందితో ఏడుగురు చొప్పున నియామకానికి వైఎస్ జగన్ ప్రభుత్వం 2020 సెప్టెంబరు 30న జీవో నంబరు 674ను జారీ చేసింది. దీంతోపాటు కార్యాలయాల్లో కంప్యూటర్లు, ప్రింటర్లు, ఫర్నీచర్ కొనుగోలుతో పాటు అద్దెకు కారు వాడుకునేలా, ఇతర నిర్వహణ ఖర్చులకు సైతం నిధులు కేటాయించింది.

తద్వారా పెద్దఎత్తున ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఊరూవాడా అందరికీ అందేలా కృషి చేసింది. సుదీర్ఘ కాలం ఎదురుచూపులకు తెరపడుతూ డీడీవోలుగా పదోన్నతి పొందిన ఉత్సాహంతో అధికారులు సైతం సిబ్బందితో సమన్వయంతో పనిచేస్తూ లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందించారు.
అక్షరం మార్చేసి అదే కొత్తగా ప్రచారం
ఉప ముఖ్యమంత్రి పవన్ సొంత ఆలోచనగా ప్రకటించుకున్న డివిజనల్ డెవలప్‌మెంట్ కార్యాలయాలు (డీడీవో) ఐదేళ్లుగా రాష్ట్రమంతా పనిచేస్తూనే ఉన్నాయి. కానీ, కొత్తవి అన్నట్లుగా చెప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. డీడీవోలను వైఎస్ జగన్ ప్రభుత్వంలో సంక్షిప్తంగా డీఎల్‌డీవోలుగా పిలిచేవారు. ఎంపీడీవోల నుంచి పదోన్నతి పొందిన నేపథ్యంలో డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారి హోదాను డీఎల్‌డీవోగా కొనసాగించారు.
కాగా, బాబు సర్కారు ప్రస్తుతం డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారి హోదాలో డివిజనల్ అన్న పదానికి సంక్షిప్తంగా ‘డీఎల్’కు బదులు కేవలం ‘డీ’ని మాత్రమే పేర్కొంటూ... డీఎల్‌డీవోను డీడీవోగా మార్చింది. గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో రెవెన్యూ డివిజన్ స్థాయిలో డివిజనల్ పంచాయతీరాజ్ అధికారి (డీఎల్‌పీవో), డ్వామా (ఉపాధి హామీ పథకం) ఏపీడీ కార్యాలయం, డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారి (డీఎల్‌డీవో) కార్యాలయాలు వేర్వేరుచోట్ల పనిచేశాయి.
బాబు ప్రభుత్వం డీఎల్‌పీవోతో పాటు ఉపాధి హామీ ఏపీడీ కార్యాలయాలను కూడా డీడీవో కార్యాలయంలోనే కొనసాగించేందుకు నిర్ణయించింది. ఒకేచోట ఉన్నప్పటికీ, డీడీవో కార్యాలయాల్లో డీడీవో పర్యవేక్షణలో డీఎల్‌పీవోలు, ఉపాధి హామీ ఏపీడీలు వేర్వేరుగా పనిచేస్తారని పంచాయతీరాజ్ అధికారులు పేర్కొంటున్నారు.
గ్రామ సచివాలయాల్లోనేఈ కార్యాలయాలు
డిప్యూటీ సీఎం పవన్ ప్రారంభించిన డీడీవో కార్యాలయాలు కూడా కూటమి ప్రభుత్వం నిర్మించినవి కాకపోవడం గమనార్హం. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతి ఊరిలో రెండంతస్తులతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాలను డీడీవో కార్యాలయాలకు వాడుకుంటున్నట్లు పంచాయతీరాజ్ అధికారులు చెబుతున్నారు. చాలాచోట్ల కింది అంతస్తులో గ్రామ సచివాలయం ఉండగా, పైఅంతస్తును డీడీవో కార్యాలయాలకు కేటాయించారు.


