తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ముఖ్యంగా ఏపీలోని నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆకస్మిక వరదల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నదులు, వాగులు ఉప్పొంగే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.

నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తుండగా, కొన్ని ప్రాంతాల్లో రహదారులు నీటమునిగాయి. రవాణాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. విద్యుత్ సరఫరా కూడా కొన్ని చోట్ల నిలిచిపోయింది. అత్యవసర పరిస్థితుల్లో సహాయక బృందాలు సిద్ధంగా ఉన్నాయని అధికార యంత్రాగం తెలిపింది. ప్రజలు అవసరమైతే మాత్రమే బయటకు రావాలని.. వర్షాల సమయంలో వాగులు, చెరువుల దగ్గరికి వెళ్లకూడదని సూచించారు.
గూడురులో భారీ వర్షం కారణంగా.. నాలుగు కాలనీల్లోకి వరద నీరు చేరింది. చిల్లకూరు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. గూడూరు, విందూరులకు పూర్తిగా రాకపోకలకు నిలిచిపోయాయి. పంబలేరు, ఉప్పుటేరు వాగులు పొంగిపొర్లుతున్నాయి. వాకాడు బ్యారేజ్ 8 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.
ఇక తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంటోంది. హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. రైతులు తమ పంటలను రక్షించుకోవాలని సూచించింది. వర్షాల ప్రభావం వల్ల రవాణా, విద్యుత్ వ్యవస్థల్లో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. అదే సమయంలో..
ఈ నెల 9వ తేదీ తర్వాత తెలంగాణ అంతటా చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాత్రి, ఉదయం వేళల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు ఉన్నవాళ్లు, వృద్ధులు, చిన్నపిల్లలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.


