సిరీస్‌ తేలేది వైజాగ్‌లోనే.. | - | Sakshi
Sakshi News home page

సిరీస్‌ తేలేది వైజాగ్‌లోనే..

Dec 4 2025 7:46 AM | Updated on Dec 4 2025 7:46 AM

సిరీస్‌ తేలేది వైజాగ్‌లోనే..

సిరీస్‌ తేలేది వైజాగ్‌లోనే..

● హాట్‌కేకుల్లా అమ్ముడైన టికెట్లు ● 6న దక్షిణాఫ్రికా–భారత్‌ వన్డే మ్యాచ్‌

విశాఖ స్పోర్ట్స్‌: భారత్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌ ఫలితాన్ని తేల్చే ఆఖరి మ్యాచ్‌కు వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియం ముస్తాబవుతోంది. ఈ నెల 6న మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానున్న ఈ డే/నైట్‌ మ్యాచ్‌ కోసం క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌పై ఉన్న క్రేజ్‌ టికెట్ల అమ్మకాల్లో స్పష్టంగా కనిపించింది. మూడు దఫాలుగా ఆన్‌లైన్‌లో విడుదల చేసిన టికెట్లు కేవలం కొన్ని నిమిషాల్లోనే హాట్‌ కేకుల్లా అమ్ముడయ్యాయి. విశాఖతో ప్రత్యేక అనుబంధం ఉన్న రోహిత్‌ శర్మ ఓపెనింగ్‌ను, వన్‌డౌన్‌లో కింగ్‌ కోహ్లీ మెరుపులను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులు సిద్ధమయ్యారు. మ్యాచ్‌ నిర్వహణలో ఎక్కడా లోపం రాకుండా అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. ఆటగాళ్లు, అభిమానుల కోసం ప్రవేశ ద్వారాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. డిజిటల్‌ టికెట్ల స్కానింగ్‌, పబ్లిక్‌ అడ్రసింగ్‌ సిస్టమ్‌ను సిద్ధం చేశారు. జీవీఎంసీ ఆధ్వర్యంలో జీరో క్లీనింగ్‌ పద్ధతిలో స్టేడియాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం ఫ్లడ్‌లైట్ల వెలుతురును నిర్వాహక కమిటీ మరోసారి పరిశీలించింది. అవుట్‌ ఫీల్డ్‌, డ్రైనేజీ వ్యవస్థ, గ్యాలరీల్లో సీటింగ్‌, పార్కింగ్‌ సదుపాయాలను పర్యవేక్షించింది. కాగా.. గురువారం రెండు జట్ల ఆటగాళ్లు విశాఖ చేరుకుంటారు. శుక్రవారం స్టేడియంలో ఇరు జట్లు నెట్‌ ప్రాక్టీస్‌ చేస్తాయి. ఈ సందర్భంగా ఏసీఏ ప్రతినిధి గిరిష్‌ డొంగ్రే మాట్లాడుతూ.. ‘విశాఖ స్టేడియం అంతర్జాతీయ క్రికెట్‌కు పెట్టింది పేరు. ఇక్కడ అంతర్జాతీయ ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీపడలేదు. ఆటగాళ్లకు, ప్రేక్షకులకు అత్యుత్తమ అనుభవాన్ని అందించేందుకు సర్వం సిద్ధం చేశాం.’ అని వివరించారు. పిచ్‌ క్యురేటర్‌ నాగమల్లయ్య మాట్లాడుతూ.. ‘బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండింటికీ అనుకూలించేలా బ్యాలెన్స్‌డ్‌ వికెట్‌ను తయారు చేశాం. ఇది కచ్చితంగా వన్డేలకు సరిపోయే పిచ్‌. ఇరు జట్ల ప్రదర్శన ఈ పిచ్‌పై ఆసక్తికరంగా ఉంటుందని ఆశిస్తున్నాం.’అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement