breaking news
Visakhapatnam District News
-
వానొస్తే కేజీహెచ్ వణుకే..
మహారాణిపేట: కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు కేజీహెచ్‌లో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్యాజువాలిటీ ఓపీ బ్లాక్, డైట్ క్యాంటిన్లలోకి వర్షపు నీరు చేరింది. ఓపీ బ్లాక్‌లో సీలింగ్ పెచ్చులు ఊడిపడి కిందకు పడడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. పడిపోయిన సీలింగ్‌ను డాక్టర్ గోపాలరావు పరిశీలించారు.డైట్ క్యాంటిన్‌లోనూ సీలింగ్ ఊడిపడింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇదే సమయంలో ఎయిర్ కండిషనర్ మిషన్‌లో మంటలు చెలరేగడంతో సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది.గైనిక్, పిల్లల వార్డులతో పాటు రాజేంద్రప్రసాద్, భావనగర్ వార్డుల్లోకి కూడా వర్షపు నీరు చేరడంతో రోగులు, వారి బంధువులు ఇబ్బందులు పడ్డారు. ఆయుర్వేద ఓపీలో శుక్రవారం కూడా నీరు నిలిచింది. ఓపీ సేవలకు వచ్చే రోగులు, సహాయకులు అవస్థలు ఎదుర్కొన్నారు.పలు వార్డుల్లో గోడల నుంచి నీరు కారడం, మరుగుదొడ్ల వద్ద నీరు నిలిచిపోవడం, కుర్చీలు తడవడం కనిపించింది. కొన్ని చోట్ల విద్యుత్ వైర్లు, మీటర్లపైకి నీరు చేరుతుండటంతో రోగులు, సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రూ.1.13 కోట్ల విలువైన ఆస్తి రికవరీ
అల్లిపురం: ఆగస్టు నెలలో నగరంలో నమోదైన వివిధ ఆస్తి నేరాలపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు 74 కేసులను ఛేదించి 102 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. నిందితుల నుంచి రూ.53,12,040 విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకోగా, సీఈఐఆర్ ద్వారా రూ.60.75 లక్షల విలువైన 405 మిస్సింగ్ మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు. మొత్తంగా రూ.1,13,87,040 విలువైన ఆస్తిని రికవరీ చేసినట్లు శుక్రవారం 26వ రికవరీ మేళాలో వెల్లడించారు. నగర పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో సీపీ వివరాలు తెలిపారు. డీసీపీ (క్రైమ్స్) పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు 24/7 సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి కేసులను ఛేదించాయని చెప్పారు. రికవరీ చేసిన సొత్తులో 796.065 గ్రాముల బంగారం, 9,500 గ్రాముల వెండి, రూ.14,75,800 నగదు, 25 మోటార్ సైకిళ్లు, ఒక బొలెరో వాహనం, 414 మొబైల్ ఫోన్లు, 3 ల్యాప్‌టాప్‌లు ఉన్నాయని తెలిపారు. ఛేదించిన కేసుల్లో 5 దోపిడీ కేసులు, ఒక పగటిపూట ఇంటి దొంగతనం, 7 రాత్రిపూట ఇంటి దొంగతనాలు, 5 స్నాచింగ్ కేసులు, 24 ద్విచక్ర వాహనాల చోరీలు, ఒక ఇతర వాహన చోరీ, ఒక వ్యాన్ చోరీ, 30 సాధారణ దొంగతనాలు ఉన్నాయని వివరించారు. 661 సీసీ కెమెరాల ఏర్పాటు నేరాల నియంత్రణలో భాగంగా ఆగస్టులో నగరంలోని వివిధ ప్రాంతాల్లో 661 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. క్రైమ్ వింగ్ అధికారులు 472 అవగాహన సమావేశాలు నిర్వహించి ప్రజలకు నేరాలపై అప్రమత్తత, సీసీ కెమెరాల ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. నేర ప్రభావిత ప్రాంతాల్లో పగలు, రాత్రి ప్రత్యేక గస్తీతో పాటు ఏకాంత ప్రాంతాల్లో డ్రోన్ బీట్లు కొనసాగుతున్నాయని చెప్పారు. సీఈఐఆర్‌తో 11,958 మొబైళ్ల రికవరీ సీఈఐఆర్ ద్వారా ఇప్పటివరకు మొత్తం 11,958 మొబైల్ ఫోన్లను సుమారు రూ.17.94 కోట్ల విలువతో రికవరీ చేసినట్లు సీపీ తెలిపారు. మొబైల్ పోయినా, చోరీకి గురైనా ప్రజలు సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. 26 రికవరీ మేళాల్లో రూ.26.37 కోట్ల ఆస్తి రికవరీ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన 26 రికవరీ మేళాల ద్వారా ఇప్పటివరకు 11,272 మంది బాధితులకు చెందిన రూ.26.37 కోట్ల విలువైన ఆస్తిని తిరిగి అందించినట్లు సీపీ వెల్లడించారు. 2026 నెలవారీ గణాంకాలతో పోలిస్తే ఆగస్టులోనే అత్యధికంగా రూ.1,13,87,040 విలువైన ఆస్తి రికవరీ నమోదైందని తెలిపారు. గాజువాక, పెందుర్తి టాప్ ఆగస్టులో అత్యధిక కేసులను ఛేదించిన పోలీస్ స్టేషన్లలో గాజువాక, పెందుర్తి చెరో 9 కేసులతో ముందుండగా, పీఎం పాలెం 7 కేసులను ఛేదించింది. గాజువాక పోలీసులు 19 మంది, పెందుర్తి పోలీసులు 15 మంది, పీఎం పాలెం పోలీసులు 9 మంది నిందితులను అరెస్ట్ చేశారు. -
జాతీయ శిక్షణలో శ్రీనివాసరావుకు అవార్డు
మహారాణిపేట: న్యూఢిల్లీలో సెప్టెంబర్ 21–23 వరకు జరిగిన జాతీయ స్థాయి శిక్షణ కార్యక్రమంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎం.శ్రీనివాసరావుకు అవార్డు లభించింది. 15 రాష్ట్రాలు, 10 కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు చెందిన 40 మంది అధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ జాయింట్ డ్రగ్ కంట్రోలర్ డాక్టర్ ఎస్.ఈశ్వరరెడ్డి అవార్డును అందజేశారు. శుక్రవారం విశాఖలో ఔషధ నియంత్రణ శాఖ డైరెక్టర్ జనరల్ పి.అరుణ్‌బాబును మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీనివాసరావును ఆయన అభినందించారు. అనంతరం కెమిస్ట్ వెల్ఫేర్ సొసైటీ, కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీనివాసరావును సత్కరించారు. -
వైఎస్సార్సీపీలో నియామకాలు
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ విశాఖ జిల్లా కమిటీ, అనుబంధ విభాగాల్లో పలువురిని నియమించారు. ఈ మేరకు శుక్రవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. విశాఖ జిల్లా వైస్ ప్రెసిడెంట్‌గా కర్రి వెంకట సంతోష్ అప్పారావు (పెందుర్తి), జిల్లా వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శిగా ఇరోతి గణేష్ (గాజువాక), జిల్లా పబ్లిసిటీ వింగ్ కార్యదర్శిగా శివలంక డేవిడ్ జేమ్స్ రాయ్ (గాజువాక), జిల్లా బీసీ సెల్ కార్యదర్శిగా కొణతాల సుమన్ (గాజువాక)ను నియమించారు. -
జీవీఎంసీ కాంట్రాక్టర్ల సమ్మె బాట
డాబాగార్డెన్స్: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) కాంట్రాక్టర్లు సమ్మె బాట పట్టారు. అభివృద్ధి పనులన్నీ నిలిపివేసి నిరసనకు శ్రీకారం చుట్టారు. డిమాండ్లు, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి, మంత్రులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో జీవీఎంసీ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి పనులకు స్వస్తి పలికారు. ముందస్తు హెచ్చరికలు బేఖాతరు జీవీఎంసీలో ఎన్నడూ లేని విధంగా సాధారణ నిధుల ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనులను కూడా నిధి పోర్టల్‌లో అప్లోడ్ చేయాలనే నిబంధన పెట్టడం వల్ల కాంట్రాక్టర్లు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పనులు పూర్తి చేసి, భారీగా పెట్టుబడులు పెట్టిన వారికి బిల్లుల ప్రాసెసింగ్‌లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని 2027 జనవరి 1 వరకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని, అలాగే ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు ఉన్న పెండింగ్ బిల్లులన్నింటినీ సాధారణ నిధుల ద్వారా వెంటనే చెల్లించాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఈ డిమాండ్లపై ఈ నెల 25లోగా స్పందించాలని ప్రభుత్వానికి, ప్రిన్సిపల్ సెక్రటరీకి, పురపాలక శాఖ మంత్రికి, జీవీఎంసీ కమిషనర్‌తో పాటు విశాఖ ఎంపీ, కూటమి ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులకు ముందే వినతిపత్రాలు సమర్పించారు. అయితే ఎటువంటి స్పందన రాకపోవడంతో చేసేది లేక కాంట్రాక్టర్లు సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. ఒకే ప్యాకేజీ టెండర్లపై మండిపాటు మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం, జీవీఎంసీ సంయుక్తంగా భారీ మొత్తాలతో అభివృద్ధి పనులను ఒకే ప్యాకేజీ పద్ధతిలో టెండర్లు పిలుస్తుండటంపై కాంట్రాక్టర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భారీ మొత్తాలతో ఒకే ప్యాకేజీగా టెండర్లు పిలవడం వల్ల చిన్న, మధ్యతరహా కాంట్రాక్టర్లకు పనుల్లో పాల్గొనే అవకాశం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల స్థానిక కాంట్రాక్టర్ల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. చిన్న, మధ్యతరహా కాంట్రాక్టర్లకు కూడా భాగస్వామ్యం కల్పించేలా పనులను విభజించి టెండర్లు పిలవాలని డిమాండ్ చేస్తున్నారు. గాంధీ విగ్ర హానికి నివాళులు.. నిరసన సమ్మె కార్యాచరణలో భాగంగా శుక్రవారం అసోసియేషన్ కార్యాలయంలో సమావేశమైన కాంట్రాక్టర్లు.. జీవీఎంసీ ఎదురుగా ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సంజీవరెడ్డి, రాజాన వెంకటరమణ, వీరారెడ్డి, జి.సింహాచలం, ఎం.రమేష్, శ్రీనివాసరావు, అప్పలరాజు, గొంప చంద్రమౌళి, షేక్ సిలార్, కోటేశ్వరరావు, రవికుమార్, అప్పలనాయుడు, సాదూరావు, వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. -
జీవీఎంసీ పరిధిలో 56 పునరావాస కేంద్రాలు
మహారాణిపేట: భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించిందని కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ తెలిపారు. ప్రమాద ప్రాంతాల్లో ముందస్తు చర్యల్లో భాగంగా 97 కుటుంబాలకు చెందిన 257 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. జీవీఎంసీ పరిధిలో 56 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి బాధితులకు ఆహారం అందించామన్నారు. ఈనెల 21 నుంచి 25వ తేదీ ఉదయం 10 గంటల వరకు జిల్లాలో సగటున 332.7 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. గంభీరం గెడ్డ రిజర్వాయర్‌లోకి 100 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. అదే స్థాయిలో మిగులు జలాలను దిగువకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. మేహాద్రిగెడ్డ, రైవాడ, తాటిపూడి రిజర్వాయర్లలో నీటిమట్టాలు సురక్షిత స్థాయిలో ఉన్నాయన్నారు. 12 ఇళ్లు దెబ్బతిన్నాయి : భారీ వర్షాలకు జిల్లాలో 12 ఇళ్లు దెబ్బతిన్నాయని, విద్యుత్ శాఖకు సంబంధించి ఒక సబ్‌స్టేషన్, 36 ఫీడర్లు, 181 విద్యుత్ స్తంభాలు దెబ్బతినగా.. 28,934 కనెక్షన్లపై ప్రభావం పడిందని తెలిపారు. ఆర్అండ్బీ పరిధిలో 11.5 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని, తాత్కాలిక మరమ్మతులకు రూ.30 లక్షలు, శాశ్వత పునరుద్ధరణకు రూ.5.6 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశామన్నారు. 122 చెట్లు నేలకూలగా 116 తొలగించి రాకపోకలను పునరుద్ధరించినట్లు చెప్పా రు. నాలుగు గ్రామాల్లో 34 మంది రైతులకు చెందిన 6.48 హెక్టార్ల అరటి పంట దెబ్బతిన్నట్లు తెలిపారు. 13 పాఠశాలల భవనాలు లేదా ప్రహరీ గోడలు పాక్షికంగా దెబ్బతిన్నాయని వివరించారు. 234 ఫిర్యాదులు పరిష్కారం: కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు వచ్చిన 55 ఫిర్యాదులనూ పరిష్కరించామని, జీవీఎంసీ సిటీ ఆపరేషన్స్ సెంటర్‌కు వచ్చిన 179 ఫిర్యాదుల్లో 163 పరిష్కరించినట్లు కలెక్టర్ తెలిపారు. మిగిలిన 16 ఫిర్యాదులపై పనులు కొనసాగుతున్నాయన్నారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు అల్లిపురం: తీవ్ర వాయుగుండం ‘అర్నాబ్’ ప్రభావంతో నగరంలో భారీ వర్షాలు, ఈదురు గాలుల నేపథ్యంలో జీవీఎంసీ యంత్రాంగం యుద్ధప్రాతిపదికన సహాయక, పునరుద్ధరణ చర్యలు చేపట్టిందని కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు 187 వర్ష సంబంధిత ఘటనలు నమో దుకాగా, 180 పరిష్కరించామన్నారు. 124 చోట్ల చెట్లు కూలగా, 120 ప్రాంతాల్లో తొలగించినట్లు చెప్పారు. నీరు నిలిచిన 18, డ్రైన్లు పొంగిన 17 ప్రాంతాల్లో సమస్యలు పరిష్కరించామని, మధురవాడ కొమ్మాది హౌ సింగ్ బోర్డు కాలనీలో 15 కుటుంబాలకు చెందిన 70 మందిని ఎన్డీఆర్ఎఫ్ సహకారంతో సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. డీమార్ట్ వెనుక వరద నీటిలో చిక్కుకున్న నలుగురిని రక్షించామన్నారు. అత్యవసర సహాయం కోసం జీవీఎంసీ టోల్ ఫ్రీ నంబర్ 1800 4250 0009లో సంప్రదించాలన్నారు. -
ఆస్తుల చిట్టా విప్పండి!
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ఆర్థిక అవసరాల కోసం ప్రభుత్వం కొత్తగా నిధుల సమీకరణ మార్గాలను అన్వేషిస్తున్న వేళ.. విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కంల) ఆస్తులపైనా దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. ఏపీ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) పరిధిలోని ఆస్తుల సమగ్ర వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వం తాజాగా మౌఖిక ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా కోరే ఆస్తుల జాబితాకు భిన్నంగా.. సబ్స్టేషన్ల నుంచి కార్పొరేట్ కార్యాలయాల వరకు ఉన్న ఖాళీ స్థలాల విస్తీర్ణం, ఖచ్చితమైన కొలతలు, ప్రస్తుత మార్కెట్ విలువలను సైతం నివేదికలో పొందుపరచాలని సూచించినట్లు సమాచారం. దీంతో ఈపీడీసీఎల్ ఆస్తులను తాకట్టు పెట్టి రుణాలు సమీకరించేందుకే ఈ వివరాలు సేకరిస్తున్నారా? అనే అనుమానాలు ఉద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. వేల కోట్ల విలువైన ఆస్తులు ఈపీడీసీఎల్ పరిధిలో విశాఖపట్నంతో పాటు పలు జిల్లాల్లో విలువైన భూములు, భవనాలు ఉన్నాయి. సీతమ్మధారలోని సంస్థ కార్పొరేట్ కార్యాలయంతో పాటు వివిధ స్థాయిల్లోని కార్యాలయాలు, సబ్స్టేషన్ల ప్రాంగణాల్లో భవిష్యత్ అవసరాల కోసం ఖాళీ స్థలాలు ఉన్నాయి. అయితే, గతంలో కేవలం ఆస్తుల వివరాలు మాత్రమే సేకరించిన సందర్భాలకు భిన్నంగా.. ఈసారి ఖాళీ స్థలాల ఖచ్చితమైన కొలతలు, మార్కెట్ విలువలు, ప్రధాన ప్రాంతాల్లో ఉన్న స్థలాల వివరాలను ప్రత్యేకంగా కోరడం ఉద్యోగ వర్గాల్లో చర్చకు దారితీసింది. కేవలం ఆస్తుల లెక్కల కోసమే అయితే.. వాటి మార్కెట్ విలువలు, పక్కా కొలతల వరకు ఎందుకు సేకరిస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వివరాల ఆధారంగా సంస్థ ఆస్తులపై ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తాకట్టు కోసమేనా? ప్రభుత్వ ఆదేశాల వెనుక ఆస్తులను వినియోగించుకుని నిధులు సమీకరించే ఉద్దేశం ఉందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. డిస్కంలకు చెందిన విలువైన ఆస్తులను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తెచ్చే ప్రయత్నం జరుగుతోందనే ప్రచారం సాగుతోంది. అవసరమైతే ప్రధాన ప్రాంతాల్లోని ఈపీడీసీఎల్ ఖాళీ స్థలాలను విక్రయించి నిధులు సమీకరించే అవకాశమూ ఉందని సంఘాల ప్రతినిధులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ ఆస్తులు కేవలం సంస్థకు చెందిన భూములు, భవనాలు మాత్రమే కావని.. భవిష్యత్‌లో విద్యుత్ డిమాండ్ పెరిగినప్పుడు కొత్త సబ్స్టేషన్లు, కార్యాలయాలు, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కీలకమైనవని వారు చెబుతున్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయన్న కారణంతో వాటిని తాకట్టు పెట్టడం లేదా విక్రయించడం వల్ల భవిష్యత్ అవసరాలకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంస్థ మూలధనాన్ని దెబ్బతీయొద్దు ప్రభుత్వ ఖజానాకు నిధులు సమకూర్చుకునేందుకు అత్యవసర ప్రజాసేవలు అందించే విద్యుత్ పంపిణీ సంస్థ ఆస్తులను వినియోగించుకోవడం సరికాదని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే రుణభారం పెరుగుతున్న పరిస్థితుల్లో డిస్కంల ఆస్తులను తాకట్టు పెట్టడం లేదా విక్రయించడం ద్వారా సంస్థ ఆర్థిక పునాదులను బలహీనపరిచే ప్రమాదం ఉందని పేర్కొంటున్నాయి. ఈపీడీసీఎల్‌కు చెందిన ఆస్తులను తాకట్టు పెట్టినా, విక్రయించే ప్రయత్నం చేసినా సహించేది లేదని సంఘాల ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. ఆస్తుల వివరాలు, కొలతలు, మార్కెట్ విలువలను సేకరించడానికి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల వెనుక ఉన్న ఉద్దేశాన్ని తక్షణమే బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
నీట్ పీజీలో అమృతకు ఆలిండియా 415వ ర్యాంక్
మల్కాపురం: నీట్ పీజీ–2026 ఫలితాల్లో పారిశ్రామిక ప్రాంతానికి చెందిన చెక్కా నాగరత్న అమృత ఆలిండియా 415వ ర్యాంక్ సాధించారు. నౌసేనాబాగ్ కేవీ పాఠశాలలో పాఠశాల విద్యను పూర్తి చేసిన అమృత.. ఇంటర్ విద్యను చైతన్యలో అభ్యసించారు. అనంతరం ఆంధ్ర మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. నీట్ పీజీలో జాతీయ స్థాయిలో మంచి ర్యాంక్ సాధించడంతో ఆమెను పలువురు అభినందించారు. అమృత తండ్రి రామకృష్ణ విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో, తల్లి కె. ఆదిలక్ష్మి హెచ్పీసీఎల్లో విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ఏకై క సంతానమైన అమృత.. చిన్ననాటి నుంచే చదువుల్లో ప్రతిభ కనబరుస్తూ వచ్చారు. నీట్ పీజీలో సాధించిన ర్యాంక్‌తో రేడియో డయాగ్నోసిస్ విభాగంలో ఉన్నత చదువులు కొనసాగించాలనే లక్ష్యం ఉందని అమృత తెలిపారు. చదువులోనే కాకుండా సంగీతంలోనూ ప్రతిభ కనబరిచే ఆమె మంచి గాయనిగా గుర్తింపు పొందారు. -
ఏయూలో డ్రైవర్ ప్రమోషన్లపై రగడ
విశాఖ విద్య: ఏయూలో డ్రైవర్ల ప్రమోషన్ల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ప్రమోషన్ల కోసం ఓ రేటు నిర్ణయించి బేరాలు సాగుతున్నాయంటూ నాన్ టీచింగ్ సిబ్బందిలో గుసగుసలు వినిపిస్తున్నాయి. సీనియారిటీ ప్రకారం గ్రేడ్–1 డ్రైవర్లకు పదోన్నతులు ఇవ్వాల్సి ఉండగా, కొందరిని మాత్రమే ఎంపిక చేయడంపై వర్సిటీలో చర్చ జరుగుతోంది. ప్రమోషన్ లిస్టు ఎంపిక కోసం ఓ ఆచార్యుడిని నియమించడంపై సిబ్బంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మూడు కేటగిరీల్లో డ్రైవర్లు ఆంధ్ర యూనివర్సిటీలో డ్రైవర్ పోస్టులను గ్రేడ్–1 డ్రైవర్, గ్రేడ్–2 డ్రైవర్, క్లీనర్ కేటగిరీలుగా విభజిస్తారు. నిబంధనల ప్రకారం గ్రేడ్–1 డ్రైవర్ ప్రమోషన్లను గ్రేడ్–2 డ్రైవర్ల సీనియారిటీ ఆధారంగా, గ్రేడ్–2 ప్రమోషన్లను క్లీనర్ల సీనియారిటీ ప్రకారం ఎంపిక చేస్తారు. గత కొన్నేళ్లుగా ఈ విధానమే అమలవుతోందని సిబ్బంది చెబుతున్నారు. ఇటీవల గ్రేడ్–2 డ్రైవర్ ప్రమోషన్లు సీనియారిటీ ప్రకారం జరిగినప్పటికీ, నాలుగు గ్రేడ్–1 డ్రైవర్ పోస్టుల భర్తీ విషయంలో మాత్రం కొత్తగా ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయడం అనుమానాలకు తావిస్తోందని సీనియర్ డ్రైవర్లు పేర్కొంటున్నారు. కమిటీ నిర్ణయంపై అభ్యంతరాలు నాలుగు పోస్టులకు అర్హులైన నలుగురు డ్రైవర్లకు 25 నుంచి 30 ఏళ్ల అనుభవం ఉందని, వీరంతా రిజిస్ట్రార్, ప్రిన్సిపాళ్ల కారు డ్రైవర్లుగా సేవలందిస్తున్నారని చెబుతున్నారు. అయితే ఈ నలుగురిలో ఒక్కరినే ఎంపిక చేయాలని కమిటీ సభ్యుడైన ఓ ఆచార్యుడు నిర్ణయించడం వివాదానికి కారణమైందని అంటున్నారు. సీనియారిటీ జాబితాలో మూడో స్థానంలో ఉన్న వ్యక్తికి పదోన్నతి ఇవ్వాలని సిఫార్సు చేయడం వెనుక అవినీతి ఉందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. పోస్టుకు ఇంత అని రేటు నిర్ణయించి, ఆమ్యమ్యాలు ఇచ్చిన వారికే ప్రమోషన్లు వస్తాయన్న సంకేతాలు పంపినట్లు వర్సిటీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కమిటీలోని మిగిలిన సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినా ఒక సభ్యుడి అభిప్రాయమే అమలవుతోందని తెలుస్తోంది. ట్రాన్స్‌పోర్టు విభాగంపై ఆరోపణలు ఏయూ ట్రాన్స్‌పోర్టు విభాగంపైనా పలు ఆరోపణలు వస్తున్నాయి. ప్రైవేటు అద్దె ట్రావెల్స్‌కు అనుకూలంగా ఏయూ వాహనాలను వినియోగంలోకి రానివ్వడం లేదని, కండిషన్లో లేవనే కారణాలు చూపుతున్నారని కిందిస్థాయి ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం యూనివర్సిటీ మూడు ప్రైవేట్ బస్సులకు ఒక్కో బస్సుకు నెలకు రూ.1.35 లక్షల చొప్పున అద్దె చెల్లిస్తోందని, ఆరు అద్దె కార్లకు నెలకు రూ.40 వేల చొప్పున చెల్లిస్తున్నట్లు చెబుతున్నారు. పర్మినెంట్ డ్రైవర్లు పెరిగితే అద్దె బస్సులకు ట్రిప్పుల ఆధారంగా చెల్లించే మొత్తం తగ్గుతుందని, అందువల్లే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయ చర్యలు
మహారాణిపేట: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో సమగ్ర చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్‌కిశోర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశంలో ప్రమాదాల నివారణ, బాధితులకు అందుతున్న వైద్య సేవలు, గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై సమీక్షించారు. నెలవారీగా జరిగిన రోడ్డు ప్రమాదాలు, మరణాలపై ఆడిట్ నిర్వహించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారులపై బ్లాక్స్పాట్లను తగ్గించడంతోపాటు అవసరమైన చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. జీవీఎంసీ, వీఎంఆర్డీఏ పరిధిలో ప్రతిపాదించిన పనులను వేగంగా పూర్తి చేయాలని, ఆర్థికేతర పనులకు ప్రాధాన్యమివ్వాలని ఆదేశించారు. నగరంలో పనిచేయని 11 సిగ్నల్స్‌లో ఆరు సిగ్నల్స్ పనులు కొనసాగుతున్నాయని, మిగిలినవి ఈ నెలాఖరుకు పూర్తవుతాయని అధికారులు తెలిపారు. ఆనందపురం పూల మార్కెట్‌ను తరలించేందుకు భీమిలి ఆర్డీవో, వీఎంఆర్డీఏ అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ అధిక వేగం ప్రమాదాలకు ప్రధాన కారణమవుతోందని, బస్సులు, డ్రైవర్లను తనిఖీ చేయాలని సూచించారు. సమావేశంలో డీసీపీలు మేరీ ప్రశాంతి, మణికంఠ, రవాణా శాఖ అధికారి విజయ్‌ప్రకాశ్, ఎంవీఐలు, పోలీసు, జీవీఎంసీ, ఎన్హెచ్ఏఐ, ఆర్అండ్బీ, ఏపీఎస్ఆర్టీసీ, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు పాల్గొన్నారు. -
సముద్ర సహకారానికి మరో ముందడుగు
సింథియా: ఇండియన్ కోస్ట్‌గార్డ్ నౌక షౌనక్ సెప్టెంబర్ 25న క్వాడ్ ఎట్ సీ షిప్ అబ్జర్వర్ మిషన్ కోసం చైన్నె నుంచి బయలుదేరింది. క్వాడ్ సభ్య దేశాలకు చెందిన ఆరుగురు సముద్ర పరిశీలకులు ఈ మిషన్‌లో పాల్గొంటున్నారు. భారత్, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా దేశాల మధ్య సముద్ర సహకారం, సమన్వయం, పరస్పర సామర్థ్యాలను బలోపేతం చేయడంలో ఈ మిషన్ కీలక పాత్ర పోషించనుంది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో సురక్షిత, స్వేచ్ఛాయుత, నిబంధనల ఆధారిత సముద్ర వాతావరణాన్ని ప్రోత్సహించడంతోపాటు భారతదేశ మహాసాగర్ దృక్పథాన్ని ఈ మిషన్ మరింత బలోపేతం చేస్తుందని నేవీ వర్గాలు తెలిపాయి. -
ఎమ్మెస్సీ పోస్టుల భర్తీపై వివాదం
డాబాగార్డెన్స్: జీవీఎంసీలో ఎమ్మెస్సీ పోస్టుల భర్తీ వ్యవహారం వివాదాస్పదమవుతోంది. ఎనిమిది జోన్ల నుంచి పది జోన్లుగా మార్చి ఆరు నెలలు గడుస్తున్నా.. ఖాళీల భర్తీ పూర్తికావడం లేదు. నిబంధనల ప్రకారం నోటిఫికేషన్ ద్వారా నియామకాలు చేపట్టాల్సి ఉండగా.. కొన్నింటికి నోటిఫికేషన్ ఇవ్వడం, మరికొన్నింటిని సిఫార్సుల మేరకు భర్తీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేతల కనుసన్నల్లోనే..? జీవీఎంసీ ఆస్తుల పరిరక్షణతో పాటు కోర్టు కేసుల పరిష్కారానికి ఎమ్మెస్సీలు గౌరవ వేతనంతో పనిచేస్తారు. నిబంధనల ప్రకారం నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టులు రాజకీయ నేతల కనుసన్నల్లో భర్తీ అవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం పది జోన్లకు పది మంది ఎమ్మెస్సీలు ఉండాల్సి ఉండగా.. రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నెల 21న ఒక పోస్టు భర్తీకి జీవీఎంసీ అధికారులు స్థానిక బార్ అసోసియేషన్‌కు లేఖ రాశారు. పదేళ్ల అనుభవం ఉన్న న్యాయవాదులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. గతంలో ఎనిమిది జోన్లకు ఎమ్మెస్సీలను నియమించగా.. అందులో 15వ వార్డు మాజీ కార్పొరేటర్ భర్తకు ఓ పోస్టు ఇచ్చారని, ఒకే కుటుంబంలో ఇద్దరికి జీవీఎంసీలో పోస్టులు ఉండకూడదనే విమర్శలతో ఆ నియామకాన్ని రద్దు చేశారు. దీంతో మూడు పోస్టులు ఖాళీ అయ్యాయి. రోస్టర్‌పై కోర్టును ఆశ్రయించిన న్యాయవాది ఎమ్మెస్సీ పోస్టుల భర్తీలో రోస్టర్ విధానం, రిజర్వేషన్లు సక్రమంగా అమలు కావడం లేదని నగరానికి చెందిన ఓ సీనియర్ న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. రాజకీయ నేతల సిఫార్సులకే అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపిస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ పిల్‌పై విచారణ కొనసాగుతోంది. ఎమ్మెస్సీ పోస్టుల భర్తీలో నిబంధనలు, రోస్టర్, రిజర్వేషన్లు పాటిస్తూ పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని న్యాయవాదులు కోరుతున్నారు. మిగిలిన పోస్టులపై సందిగ్ధం ఎలాంటి నోటిఫికేషన్ లేకుండానే ఇటీవల భీమిలి జోన్‌కు ఓ న్యాయవాదిని ఎమ్మెస్సీగా నియమించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రద్దయిన పోస్టుతో పాటు మరో రెండు పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉండగా.. భీమిలి పోస్టును భర్తీ చేసి, మరో పోస్టుకు మాత్రమే ఈ నెల 21న నోటిఫికేషన్ ఇవ్వడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మిగిలిన ఒక పోస్టు భర్తీ ఎప్పుడు, ఎలా జరుగుతుందనే దానిపై స్పష్టత లేదని విమర్శలు వస్తున్నాయి. -
కేజీహెచ్‌లో వర్షపు నీరు
మహారాణిపేట: భారీ వర్షాలకు కేజీహెచ్‌లోని పలు వార్డులు, కార్యాలయాల్లోకి వర్షపు నీరు చేరింది. ఆయుర్వేద ఓపీ, గైనిక్, పిల్లల వార్డులతోపాటు రాజేంద్రప్రసాద్, భావనగర్ వార్డుల్లో రోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గోడల నుంచి నీరు కారడంతోపాటు విద్యుత్ వైర్లు, మీటర్ల వద్దకు నీరు చేరడంతో ప్రమాద భయం నెలకొంది. ఆయుర్వేద ఓపీ విభాగం 11–ఎలోకి కిటికీలు, తలుపుల నుంచి నీరు చేరింది. మందులు నిల్వ చేసే గదిలోకి నీరు రావడంతో కొన్ని మందులు తడిసినట్లు కనిపించాయి. మరోవైపు డీసీఎస్‌ఆర్‌ఎంవో కార్యాలయంలో సుమారు రెండు అడుగుల మేర నీరు చేరడంతో సిబ్బంది కూర్చునే పరిస్థితి లేకుండా పోయింది. సీలింగ్ పెచ్చులు సైతం ఊడిపడ్డాయి. వర్షం పడిన ప్రతిసారీ ఇదే పరిస్థితి ఎదురవుతోందని రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. -
జీవీఎంసీ సహాయక చర్యలు ముమ్మరం
డాబాగార్డెన్స్: నగరంలో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణకు జీవీఎంసీ సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు కమిషనర్ కేతన్‌గార్గ్ తెలిపారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని గురువారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆదేశించారు. రోడ్లపై నిలిచిన నీటిని తొలగించడం, మ్యాన్‌హోల్స్, డ్రెయిన్లు, కాలువల్లో అడ్డంకులను తొలగించడం, కూలిన చెట్లు, గోడలను తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. నగరంలో ముందస్తుగా 56 పునరావాస కేంద్రాలను సిద్ధం చేసి, ఇప్పటి వరకు 58 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు కమిషనర్ తెలిపారు. గురువారం సాయంత్రం 7 గంటల వరకు 143 వర్ష సంబంధిత ఘటనలు, ఫిర్యాదులు నమోదు కాగా 140 పరిష్కరించినట్లు చెప్పారు. 89 చెట్లు కూలిన ఘటనల్లో తొలగింపు చర్యలు పూర్తయ్యాయని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారిక సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిషోర్, కమిషనర్ కేతన్‌గార్గ్ సూచించారు. -
67 ఏళ్ల విశాఖ జెడ్పీ ప్రస్థానానికి ముగింపు
నేటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన మహారాణిపేట: ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ ప్రస్థానంలో ఒక అధ్యాయం ముగిసింది. జె.సుభద్ర అధ్యక్షతన కొనసాగిన జెడ్పీ పాలకవర్గం గడువు గురువారంతో పూర్తయింది. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన విశాఖ జెడ్పీ స్వరూపం మారిపోనుంది. శుక్రవారం నుంచి కొత్త జిల్లాల్లో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కానుంది. ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్‌కు దాదాపు 67 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. దీని పరిధిలో మొత్తం 39 మండలాలు ఉండగా.. జిల్లాల విభజన తర్వాత విశాఖపట్నం జిల్లాకు 4, అనకాపల్లికి 24, అల్లూరి సీతారామరాజు జిల్లాకు 11 మండలాలు కేటాయించారు. 2021 సెప్టెంబర్ 25న బాధ్యతలు స్వీకరించిన పాలకవర్గం గడువు తీరడంతో ఉమ్మడి జెడ్పీ పేరు కనుమరుగవుతోంది. గడువు ముగిసిన నేపథ్యంలో జెడ్పీల పాలనకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం జిల్లా ప్రత్యేక అధికారిగా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్, అనకాపల్లి జిల్లాకు కలెక్టర్ విజయకృష్ణన్, అల్లూరి సీతారామరాజు జిల్లాకు కలెక్టర్ పి.నిశాంతిలు బాధ్యతలు చేపట్టనున్నారు. అధికారులతో పాటు అవసరమైన సిబ్బంది కేటాయింపులు కూడా పూర్తయ్యాయి. -
వర్ష విలయం
శుక్రవారం శ్రీ 25 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026సంపత్ వినాయగర్ హుండీల ఆదాయం రూ.15 లక్షలు విశాఖలో మహారాణిపేట: ఆశీలమెట్ట శ్రీ సంపత్ వినాయగర్ స్వామి ఆలయ హుండీలను గురువారం లెక్కించారు. 14 రోజులకు నగదు రూ.15,11,900, నాణేల రూపేణా రూ.62,981 కలిపి మొత్తం రూ.15,74,881 ఆదాయం వచ్చినట్లు ఈవో, ఏసీ ఎంవీవీప్రసాదరావు తెలిపారు. 120 అమెరికన్ డాలర్లు, 1,065 గ్రాముల బంగారం, 11.400 గ్రాముల వెండి కూడా లభించినట్లు చెప్పారు. ఆదాయాన్ని బ్యాంకు ఆఫ్ ఇండియా సూర్యాబాగ్ శాఖకు అప్పగించినట్లు తెలిపారు. సాక్షి, విశాఖపట్నం: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలు మహా విశాఖను అతలాకుతలం చేశాయి. నాలుగు రోజులుగా కొనసాగుతున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. ప్రధాన రహదారులు వరద నీటితో నదులను తలపించగా.. పలు చోట్ల కార్లు కొట్టుకుపోయాయి. కొండచరియలు విరిగిపడటం, ప్రహరీ గోడలు కూలడం, భారీ వృక్షాలు నేలకొరగడంతో నగరవాసులు ఆందోళనకు గురయ్యారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పలు కాలనీలు అంధకారంలో మునిగిపోయాయి. శుక్రవారం సాయంత్రం వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీరం దాటినా.. కొనసాగిన వర్షాలు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లా వ్యాప్తంగా 3,512.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. సగటు వర్షపాతం 319.3 మి.మీ.గా ఉంది. సుమారు 100 ప్రాంతాల్లో 100 మి.మీ.కిపైగా వర్షం కురిసింది. విశాఖ రూరల్ మండలంలో సగటున 412.4 మి.మీ, సీతమ్మధార మండలంలో 386.6 మి.మీ వర్షపాతం నమోదైంది. తీవ్ర వాయుగుండం బుధవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో శ్రీకాకుళం జిల్లా పోలాకి–కళింగపట్నం మధ్య తీరం దాటింది. అనంతరం బలహీనపడి వాయుగుండంగా మారి ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వైపు పయనిస్తోంది. తీరం దాటే ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగడంతో వాతావరణంలో తేమ ప్రభావం కారణంగా వర్షాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. కూలిన గోడలు.. విరిగిన కొండచరియలు భారీ వర్షాలకు కై లాసపురం, వెంకోజీపాలెం, చైతన్యనగర్ తదితర కొండ ప్రాంతాల్లో మట్టిపెళ్లలు, కొండచరియలు విరిగిపడ్డాయి. అధికారులు కొండవాలు ప్రాంతాల్లోని బాధిత కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. జీవీఎంసీ 22వ వార్డులోని మంగాపురం కాలనీ వెనుక ఆంధ్ర విశ్వవిద్యాలయం ఖాళీ స్థలానికి చెందిన భారీ ప్రహరీ గోడ కూలిపోవడంతో వరద నీరు సుమారు 100 ఇళ్లలోకి చేరింది. రోడ్లపై ఉన్న ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. సీతకొండ వ్యూ పాయింట్ వద్ద కొండచరియలు విరిగిపడి భారీ బండరాళ్లు రోడ్డుపైకి జారాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లు, అపార్ట్మెంట్లపైకి బండరాళ్లు జారాయి. మధురవాడ కొమ్మాదిలోని రాకాన్ టవర్స్ అపార్ట్మెంట్ నీట మునిగి ప్రహరీ గోడ కూలడంతో 15 కుటుంబాలు చిక్కుకున్నాయి. వారిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఏవీఎన్ కాలేజీ, సెయింట్ ఆంథోనీ స్కూల్ సహా పలు ప్రాంతాల్లో ప్రహరీ గోడలు కూలాయి. హనుమంతవాక కొండ వద్ద రిటైనింగ్ వాల్ కూలి మూడు ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పీఎం పాలెం సమీపంలోని ఓ అపార్ట్మెంట్ ప్రహరీ కూలడంతో ఆనుకుని ఉన్న రహదారి కుంగిపోయింది. పెదగంట్యాడలోని లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి వరద నీరు చేరింది. నేలకొరిగిన వృక్షాలు.. నిలిచిన విద్యుత్ ఈదురుగాలులు, కుండపోత వర్షాలకు ఆనందపురం హైవే, ఏయూ గ్రౌండ్స్, బీచ్‌రోడ్, ఆశీలమెట్ట, లాసన్స్ బే కాలనీ సహా నగరంలోని పలు ప్రాంతాల్లో 80కిపైగా భారీ చెట్లు నేలకొరిగాయి. కొన్ని చెట్లు విద్యుత్ తీగలపై పడటంతో సుమారు 19 వేల ఇళ్లకు సరఫరా నిలిచిపోయింది. నాయుడుతోటలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోగా.. పీఎం పాలెంలోని కీర్తన ఆర్కేడ్ అపార్ట్మెంట్ సెల్లార్లోకి నీరు చేరి విద్యుత్ మీటర్లు ధ్వంసమయ్యాయి. ఎండాడ, కొమ్మాది జంక్షన్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ తీగలు తెగి రోడ్లపై పడ్డాయి. మధురవాడ, మిథిలాపురికాలనీల్లో సుమారు 12 గంటల పాటు విద్యుత్ సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మహారాణిపేట: తీవ్ర వాయుగుండం ప్రభావంతో జిల్లాలో మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు, ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ సూచించారు. కలెక్టరేట్, జీవీఎంసీ, విపత్తు నిర్వహణ శాఖలు సమన్వయంతో 24 గంటలూ సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. కణితి కెనాల్ వద్ద కాలువలో పడిన కారు నుంచి ఒకరిని, మధురవాడ వద్ద నీటిలో చిక్కుకున్న కారులోని నలుగురిని సురక్షితంగా రక్షించినట్లు వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల బాధితుల కోసం సైక్లోన్ షెల్టర్లు, కమ్యూనిటీ హాళ్లలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఆహారం, తాగునీరు, వైద్య వసతులు కల్పిస్తున్నారు. విద్యుత్, రహదారులు, తాగునీటి సరఫరా పునరుద్ధరణను వేగవంతం చేయాలని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అత్యవసర సహాయక నంబర్లు: కలెక్టరేట్ కంట్రోల్ రూమ్: 0891–2590100 / 0891–2590102 జీవీఎంసీ టోల్ ఫ్రీ: 1800–425–00009 వాట్సాప్: 9014218870 విద్యుత్ శాఖ: 7382299975 ఫైర్ సర్వీసెస్: 101 / 0891–2563582 మెడికల్ ఎమర్జెన్సీ: 8331093136 / 9010292576 100 ప్రాంతాల్లో 100 మి.మీ.కిపైగా వర్షం కూలిన ప్రహరీ గోడలు.. విరిగిపడిన కొండచరియలు ఇళ్లు, అపార్ట్మెంట్లపై జారిన బండరాళ్లు నేలకొరిగిన భారీ వృక్షాలు.. 19 వేల ఇళ్లకు నిలిచిన విద్యుత్ సరఫరా 4.05 హెక్టార్లలో ధ్వంసమైన అరటి పంట నేడు కూడా విద్యా సంస్థలకు సెలవు ఆరిలోవ: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ శుక్రవారం కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. ఈ మేరకు డీఈవో ఎన్.ప్రేమకుమార్ గురువారం ప్రకటన విడుదల చేశారు. వర్ష తీవ్రత తగ్గకపోవడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం కూడా సెలవు ప్రకటించినట్లు డీఈవో తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నీ తప్పనిసరిగా సెలవు పాటించాలని ఆదేశించారు. 52 మద్యం షాపులకు నోటిఫికేషన్ మహారాణిపేట: జిల్లాలో మిగిలిన 52 మద్యం షాపులకు ఎకై ్సజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. వీటికి అక్టోబర్ 1లోగా దరఖాస్తు చేసుకోవా లని జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఆర్.ప్రసాద్ తెలిపారు. జీవీఎంసీ పరిధిలో 40, పద్మనాభంలో 5, ఆనందపురంలో 5, భీమిలి రూరల్‌లో 2 షాపులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 5న వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఏరినాలో జిల్లా కలెక్టర్ సమక్షంలో లాటరీ నిర్వహించి షాపులను కేటాయించనున్నట్లు ప్రసాద్ తెలిపారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తం స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులకు పీఎఫ్ వడ్డీ జమ ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతాల్లో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 8.25 శాతం వార్షిక వడ్డీని గురువారం జమ చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వడ్డీ రేటు మేరకు స్టీల్‌ప్లాంట్ ఈపీఎఫ్ ట్రస్ట్ ఇటీవల జరిగిన సమావేశంలో 8.25 శాతం వడ్డీని ఆమోదించింది. అనంతరం ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో వడ్డీ మొత్తాన్ని పోస్టింగ్ చేశారు. వడ్డీ జమ కావడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓల్డ్ ఐటీఐలో వెల్డింగ్ శిక్షణమురళీనగర్: కంచరపాలెం ఓల్డ్ ఐటీఐలో నిరుద్యోగ యువకులకు వెల్డింగ్ టెక్నాలజీలో మూడు నెలల ఉచిత శిక్షణ ఈ నెల 28న ప్రారంభం కానుంది. ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రధాని కౌశల్ వికాస్ యోజనలో భాగంగా శిక్షణ ఇస్తారు. టెన్త్, ఆపై చదివిన వారు అర్హులు. ఆధార్, అర్హత సర్టిఫికెట్ల కాపీలు, పాస్ పోర్టు ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు 8555868681 నంబర్‌ను సంప్రదించాలి. -
అత్యాచార యత్నం కేసులో ఐదేళ్ల తర్వాత అరెస్ట్
నిందితుడిని దుబాయ్ నుంచి రప్పించిన పోలీసులు మల్కాపురం: మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని మల్కాపురం పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. మల్కాపురం ప్రాంతానికి చెందిన జూరెడ్డి కిరణ్ 2021లో ఇదే ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మల్కాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదు చేసే సమయానికే నిందితుడు దేశం విడిచి దుబాయ్ వెళ్లిపోయాడు. విషయం తెలియక పోలీసులు పలు ప్రాంతాల్లో అతడి కోసం గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు. అనంతరం నిందితుడు దుబాయ్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఇమిగ్రేషన్ అధికారుల సహకారంతో గురువారం ఉదయం అతడిని విదేశాల నుంచి మల్కాపురం పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. నిందితుడిని విచారించిన అనంతరం పోక్సో చట్టం కింద రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుపై మల్కాపురం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్
గోపాలపట్నం: నగరంలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను ఎయిర్‌పోర్టు క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఎయిర్‌పోర్టు క్రైమ్ పోలీస్ స్టేషన్లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో క్రైమ్ ఏసీపీ ఎ.వెంకటరావు, వెస్ట్ సబ్ డివిజన్ క్రైమ్ సీఐ తిరుమలరావు వెల్లడించిన వివరాలు.. మురళీనగర్, మాధవధార ప్రాంతాల్లో ఆగస్టు 17న ఇందన సుశీల, ఉషారాణిల మెడలో బంగారు గొలుసులు, పుస్తెలతాళ్లు అపహరించిన ఘటనలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించిన పోలీసులు ఎస్ఐ కె.రవికిషోర్ ఆధ్వర్యంలో ఆరు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టి అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు మహేంద్ర సింగ్ రాపిడో బైక్ రైడర్‌గా పనిచేస్తూ మధురవాడ దరి చంద్రంపాలెంలో నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాజస్థాన్‌లోని పాగౌర్ జిల్లా పంచవటి గ్రామానికి చెందిన అతడిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సుమారు 40 చైన్ స్నాచింగ్ కేసులు ఉన్నట్లు వెల్లడించారు. 2012 నుంచి 2015 మధ్య హైదరాబాద్‌లో జీడిమెట్ల, కూకట్పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, బాలానగర్, సనత్‌నగర్, బహీర్బాద్, మియాపూర్, అల్వాల్, 2024లో బాచుపల్లి, జగద్గిరిగుట్ట, అంధ్రప్రదేశ్‌లోని చేబ్రోలు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. 2025–26 మధ్య రాజమహేంద్రవరం ప్రకాష్‌నగర్‌లో 2, శ్రీకాకుళం 2, కాజీపేట 2, అనకాపల్లి 2, కాకినాడ సర్పవరం 2, నెల్లూరు బాలాజీనగర్ 2, విశాఖలో 2 చోట్ల దొంగతనాలకు పాల్పడ్డాడు. దొంగిలించిన బంగారాన్ని కొమ్మాది జంక్షన్‌కు చెందిన మండ్రు లతారత్నాకర్ సహకారంతో అనకాపల్లి గోల్డ్ మార్కెట్లో విక్రయించేవారని తెలిపారు. నిందితుల నుంచి 65 గ్రాముల బంగారం, రూ.5.55 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన నిందితులను రిమాండ్‌కు తరలించారు. రాత్రి వేళ ఒంటరిగా ప్రయాణించేటప్పుడు విలువైన ఆభరణాలు ధరించవద్దని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, దాడి చేసినా.. వెంటనే 112కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. -
రూ.50 లక్షల భవనం.. వర్షం పడితే వాటర్‌ఫాల్!
మధురవాడ: జీవీఎంసీ మధురవాడ జోనల్ ఆఫీస్ చూశారా? అక్షరాలా రూ.50 లక్షల ప్రజాధనంతో చేసిన అద్భుత పునరుద్ధరణ పనుల తీరు చూసి ముక్కున వేలేసుకోవాల్సిందే! రూ.కోట్లు పెట్టి కట్టిన కొత్త భవనాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో ప్రారంభించి ఏడాది కూడా నిండకుండానే ఈ కార్యాలయం నాణ్యతలో డొల్లతనం బట్టబయలైంది. కొద్దిపాటి వర్షానికే భవనం పైకప్పు నుంచి జోరుగా నీరు కారుతుంటే, అధికారులకు వాటర్ ఫాల్స్ చూడటానికి ఎక్కడికో వెళ్లాల్సిన పనే లేకుండా పోయిందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు..! ఇక్కడ ఫ్లోర్‌కు వేసిన టైల్స్ మరీ విచిత్రం. చిన్న నీటి చుక్క పడిందంటే చాలు.. సర్కస్ ఫీట్లు చేయకుండానే నేలమీద గాల్లోకి ఎగిరి పడొచ్చు. జోన్‌కు పలు సమస్యలపై వచ్చే ప్రజలకు ఈ అడ్వెంచర్ రైడ్ పూర్తిగా ఉచితం. సిబ్బంది పరిస్థితి మరింత దయనీయం. విలువైన ఫైల్స్, ఖరీదైన కంప్యూటర్లు ఎక్కడ కొట్టుకుపోతాయోనని.. బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు. జీవీఎంసీ ఇంజినీరింగ్ ప్రతిభకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఈ అద్భుత కట్టడానికి మరమ్మతుల పేరుతో ఇంకెంత మొత్తం స్వాహా చేస్తారో.. ఉన్నతాధికారులే సెలవివ్వాలి..! -
ముడసర్లోవకు కొత్త నీరు
2 రోజుల వర్షాలకు 3 అడుగులు పెరిగిన నీటి మట్టం ఆరిలోవ: ముడసర్లోవ జలాశయంలో వరద నీరు చేరుతోంది. వర్షాకాలం వచ్చి నెలలు గడుస్తున్నా.. సరైన వానలు లేకపోవడం, దీనికి తోడు ఎండల ప్రభావంతో రిజర్వాయర్ దాదాపుగా అడుగంటిపోయింది. ఆరిలోవ ప్రాంతానికి తీవ్ర తాగు నీటి సమస్య నెలకొంది. గత రెండు రోజులగా కురిసిన వర్షాలకు కంబాలకొండలు నుంచి వరద నీరు చేరడంతో జలకళ వచ్చింది. బుధవారం నాటికి మూడు అడుగులు కొత్త నీరు చేరినట్లు జీవీఎంసీ నీటి సరఫరా విభాగం ఏఈ శ్రీనివాస్ తెలిపారు. రెండు రోజుల క్రితం 151.4 అడుగులు ఉన్న నీటి మట్టం వరద నీటి రాకతో 154.4కు చేరినట్లు వెల్లడించారు. రిజర్వాయర్‌కు నీటి చేరికతో భూగర్భ జలాలు కూడా కొంత మేర పెరుగుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సింహాచలం దేవస్థానం కొండలు నుంచి వరద నీరు రాకుండా అడ్డుకట్టపడిందని, లేకుంటే మరింతగా నీరు చేరేదని చెప్తున్నారు. గూగుల్ డేటా సెంటర్ పనుల కోసం నీటి దారులు మూసేయడంతో ఆ కొండల నుంచి వరద నీరు జలాశయానికి వచ్చే వీల్లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా పాలకులు పునరాలోచన చేయాలని కోరుతున్నారు. -
అందరికీ తెలిసేలా బధిరుల సంకేత భాష
సీతంపేట: విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, విశాఖపట్నం జిల్లా బధిరుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ప్రపంచ బధిరుల దినోత్సవం, అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ, సివిల్ జడ్జి ఆర్.సన్యాసినాయుడు మాట్లాడుతూ బధిరుల సంకేత భాష అందరికీ తెలిసేలా ప్రతి కార్యాలయంలో ప్రదర్శించాలన్నారు. బధిర ఉద్యోగుల ద్వారా ఇతర ఉద్యోగులకు వారి భాషపై అవగాహన కల్పించాలని, బధిరులు ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన తరువాత కూడా వారి సంఘంలో సభ్యులుగా ఉండి అన్ని కార్యక్రమాల్లో పాల్గొని సంఘానికి సహకరించాలని సూచించారు. జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ ప్రభుత్వం అమలు చేస్తోందని, జిల్లా పరిపాలన యంత్రాంగం వారికి కావలిసిన సహాయ సహకారాలు అందజేస్తుందని తెలిపారు. విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు కె.కవిత మాట్లాడుతూ మూగ, బధిరులకు ప్రభుత్వం ఉచితంగా వినికిడి యంత్రాలు, టచ్ ఫోన్స్, లాప్టాప్స్ అందజేస్తోందన్నారు. కార్యక్రమంలో బధిర సంకేత భాష ట్రాన్స్‌లేటర్ సునీత, బధిర సంఘం ప్రతినిధులు నరసింహమూర్తి, బేగ్, భవాని, శివప్రసాద్, చిన అప్పల నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
మత్స్యకారులను ఆదుకోవాలి
మహారాణిపేట: తుపాను కారణంగా సముద్రంలో చేపల వేటకు వెళ్లలేని మత్స్యకార కుటుంబాలకు నిత్యావసర సరుకులతో పాటు అత్యవసర ఆర్థిక సాయం అందించాలని సీపీఎం నాయకుడు ఎం.సుబ్బారావు కోరారు. బుధవారం కలెక్టరేట్లో ఏవో బి.వి.రాణికి వినతిపత్రం అందించారు. భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారుల భద్రత దృష్ట్యా సముద్రంలో చేపల వేటకు వెళ్లకుండా ప్రభుత్వం నిషేధం విధించడంతో రోజువారీ వేటపై ఆధారపడే మత్స్యకార కుటుంబాల జీవనోపాధి తీవ్రంగా ప్రభావితమవుతోందన్నారు. మత్స్యకార కుటుంబాల సమస్యను ప్రభుత్వం ప్రత్యేకంగా పరిగణించి వారికి తక్షణ సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు యు.సోమేష్, కె.చంద్రశేఖర్, ఎం.సుబ్బారావు, ఎన్.తాతారావు తదితరులు పాల్గొన్నారు. -
వీపీఏలో ‘ప్రివెంటివ్ విజిలెన్స్’పై శిక్షణ
మహారాణిపేట: ప్రివెంటివ్ విజిలెన్స్ క్యాంపెయిన్, విజిలెన్స్ అవేర్నెస్ వీక్–2026లో భాగంగా విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఆడిటోరియంలో బుధవారం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం జరిగింది. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (డీసీఐఎల్), వీపీఏ విజిలెన్స్ విభాగాలు సంయుక్తంగా ‘ముందస్తు నిఘా, క్రమశిక్షణ చర్యల నిర్వహణ’ అనే అంశంపై ఈ సదస్సు నిర్వహించాయి. వీపీఏ, డీసీఐఎల్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ టి.అరుణ్ ప్రసాద్ మార్గదర్శకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ డాక్టర్ జి.త్రినాథ్ కుమార్ వక్తగా పాల్గొని ప్రివెంటివ్ విజిలెన్స్, క్రమశిక్షణ చర్యల విధివిధానాల గురించి వివరించారు. వీపీఏ, డీసీఐఎల్ సంస్థలకు చెందిన పలువురు అధికారులు, ఉద్యోగులు పాల్గొని ముందస్తు విజిలెన్స్ చర్యలు, పొరపాట్లను ముందుగానే గుర్తించి అరికట్టడం, చట్టబద్ధమైన క్రమశిక్షణ చర్యలను సరైన రీతిలో ఎలా అమలు చేయాలనే విషయాలపై అవగాహన పొందారు. అధికారుల్లో విజిలెన్స్పై అవగాహన పెంచడం, వారి సామర్థ్యాన్ని బలోపేతం చేయడం ద్వారా సంస్థాగత పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనం, నిజాయితీలను మరింతగా పెంపొందించడమే ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. -
టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరంలో 117 వినతులు
అల్లిపురం: ఏపీడీపీఎంఎస్, టీడీఆర్, ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించేందుకు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు బుధవారం నిర్వహించిన టౌన్‌ప్లానింగ్ ఓపెన్ ఫోరంలో 117 వినతులు వచ్చాయి. వినతుల్లో ఎల్ఆర్ఎస్ 83, టీడీఆర్ 30, ఏపీడీపీఎంఎస్ 4 వినతులు ఉన్నాయి. పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో భాగంగా ఏపీడీపీఎంఎస్లో 19, ఎల్ఆర్ఎస్లో 68, టీడీఆర్‌లో 17 దరఖాస్తులు పరిష్కరించారు. అదనంగా 48 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను ఎల్టీపీలు సమర్పించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ ఎస్.ఎస్.వర్మ మాట్లాడుతూ ఏపీడీపీఎంఎస్, టీడీఆర్‌లు, ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను అనవసరంగా పెండింగ్‌లో ఉంచకుండా నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. -
నకిలీ ఐడీలతో.. స్టీల్‌ప్లాంట్‌లో చోరీలు
ఉక్కునగరం: నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించి స్టీల్‌ప్లాంట్‌లోకి అక్రమంగా ప్రవేశించి చోరీలకు పాల్పడుతున్న ఏడుగురు సభ్యుల ముఠాను సౌత్ డివిజన్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు 300 కేజీల కాపర్ కేబుల్, ఐదు నకిలీ ఐడీ కార్డులు, రెండు రబ్బర్ స్టాంపులు, ఐదు ఖాళీ ఐడీ కార్డులు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం స్టీల్‌ప్లాంట్ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో క్రైమ్ ఏసీపీ ఎ.వెంకటరావు, సౌత్ క్రైమ్ ఇన్స్పెక్టర్ జి.డి.బాబు వివరాలు వెల్లడించారు. ఈ నెల 18న పైడిపాటి వెంకట భార్గవ్ రాఘవ్‌తో పాటు మరికొందరు నకిలీ ఐడీ కార్డులతో స్టీల్‌ప్లాంట్ ప్రహరీ గోడ దూకి లోపలికి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. తిరిగి వాచ్‌టవర్–10 వద్ద కొందరు ప్రహరీ దూకి బయటకు పారిపోయేందుకు ప్రయత్నించగా సీఐఎస్ఎఫ్ సిబ్బంది పట్టుకున్నారు. వారి వద్ద నకిలీ ఐడీ కార్డులను గుర్తించి స్టీల్‌ప్లాంట్ పోలీసులకు అప్పగించారు. దీంతో కేసు నమోదు చేసిన క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టి ముఠాను గుర్తించారు. మల్కాపురానికి చెందిన పైడిపాటి వెంకట భార్గవ్ రాఘవ్ (38), పోతిన శ్రీకాంత్, గోపాలపట్నానికి చెందిన ఇసకపల్లి నాగేంద్రశర్మ (21), గాజువాకకు చెందిన గిర్గియా రవిశంకర్ (24), బంగారు సతీష్‌కుమార్ (30), ఇసకపల్లి వంశీ (27), నవాబు యువరాజ్ కలిసి ముఠాగా ఏర్పడి నకిలీ గుర్తింపు కార్డులతో ప్లాంట్‌లోకి ప్రవేశించి చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. సమావేశంలో క్రైమ్ ఎస్ఐ వై.సాంబశివరావు, ఏఎస్ఐ డి.వి.రమణ, సిబ్బంది పాల్గొన్నారు. -
ఖరీఫ్ ధాన్యం సేకరణకు ముందస్తు ఏర్పాట్లు
మహారాణిపేట: జిల్లాలో ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి ధాన్యం కొనుగోలు, సేకరణకు సంబంధించిన వివిధ శాఖల అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సుమారు 2,278 హెక్టార్లలో వరి సాగైనట్లు, దాదాపు 11,600 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ శాఖాధికారి చంద్రారావు జేసీకి వివరించారు. నవంబర్ రెండో వారం నుంచి ధాన్యం దిగుబడి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, సేకరణ, రవాణా తదితర అంశాలపై ఇప్పటి నుంచే తగిన చర్యలు చేపట్టాలని జేసీ సూచించారు. రైతులతో ముందుగానే సంప్రదించి, అవసరాన్ని బట్టి క్లస్టర్లను విభజించాలని జేసీ ఆదేశించారు. సెప్టెంబర్ నెలాఖరులోగా క్లస్టర్ల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసి, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించేందుకు తగిన రవాణా సదుపాయాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ–పంట, ఈ–కేవైసీ ప్రక్రియలో పెండింగ్‌లో ఉన్న వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ధాన్యం నాణ్యత, తేమ శాతాన్ని పరిశీలించేందుకు అవసరమైన పరికరాలు అందుబాటులో ఉండేలా చూడాలని, లీగల్ మెట్రాలజీ అధికారులు తేమ శాతం, తూనికలు, నాణ్యతా ప్రమాణాలను పర్యవేక్షించాలని ఆదేశించారు. అధికారుల బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించాలని, కనీస మద్దతు ధర, నాణ్యతా ప్రమాణాలు, కొనుగోలు విధానంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కొనుగోలు ప్రారంభానికి ముందే సంబంధిత రైస్ మిల్లులను తనిఖీ చేయాలని, ధాన్యం సేకరణ, రవాణా, నిల్వ ప్రక్రియలో ఎలాంటి వృథా జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన గన్నీ బ్యాగులను ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలని, రైస్ మిల్లర్లు ముందస్తుగా అవసరమైన బ్యాంకు గ్యారంటీలను సమర్పించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారదర్శకంగా, సకాలంలో ధాన్యం సేకరణ జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జేసీ విద్యాధరి స్పష్టం చేశారు. సమావేశంలో సివిల్ సప్లైస్ డీఎం సృజన, జిల్లా సహకార అధికారి ప్రవీణ, మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, లీగల్ మెట్రాలజీ, రవాణా శాఖ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు. అధికారులను ఆదేశించిన జేసీ గొబ్బిళ్ల విద్యాధరి -
ముగిసిన భారత్–శ్రీలంక ద్వైపాక్షిక సముద్ర విన్యాసాలు
సింథియా: భారత్–శ్రీలంక ద్వైపాక్షిక సముద్ర విన్యాసాలు 13వ ఎడిషన్ స్లినెక్స్–26 విశాఖపట్నంలో ఘనంగా ముగిసింది. సెప్టెంబర్ 17 నుంచి 21 వరకు నిర్వహించిన ఈ విన్యాసాల ద్వారా ఇరుదేశాల నౌకాదళాల మధ్య వృత్తిపరమైన సంబంధాలు మెరుగుపడి, ఉత్తమ పద్ధతుల అన్వేషణ, పరస్పర కార్యచరణ సామర్థ్యం పెంపొందించేందుకు దోహదపడుతుందని ఇరు దేశాల ప్రతినిధులు పేర్కొన్నారు. హార్బర్ దశలో భారత్–శ్రీలంక నౌకాదళాల సిబ్బంది మధ్య వృత్తి పరమైన పరస్పర చర్చలు, ఇరుదేశాల నౌకలను ఒకరినొకరు సందర్శించడం, క్రీడా కార్యక్రమాలు నిర్వహించారు. సముద్ర దశలో ఇరుదేశాల మధ్య సమన్వయంతో కూడిన సముద్ర విన్యాసాలు, వైమానిక కార్యకలాపాలు, ఇంధన సరఫరా, ప్రత్యేక దళాల విన్యాసాలు జరిగాయి. స్లినెక్స్–26 భారత్–శ్రీలంక మధ్య ఉన్న బలమైన సముద్ర భాగస్వామ్యాన్ని, సురక్షిత, సుస్థిర హిందూ మహాసముద్ర ప్రాంతం కోసం ఉమ్మడి నిబద్ధతకు అద్దంపడుతుందని నేవీ వర్గాలు అభిప్రాయపడ్డాయి. -
విశాఖ జలమయం
సాక్షి, విశాఖపట్నం: ఆకాశానికి చిల్లులు పడ్డాయా.. అన్నట్టుగా రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరం అతలాకుతలమైంది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో 12.95 సెం.మీ. వర్షపాతం నమోదవగా.. ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొండవాలు ప్రాంతాల్లో చరియలు విరిగిపడుతుండటంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. ఈదురుగాలులకు చెట్లు నేలకొరగడంతో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సముద్రం ఉగ్రరూపం దాల్చడంతో రుషికొండ బీచ్‌ను మూసివేశారు. మత్స్యకారులను సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు. మరో రెండు రోజులు భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తమైంది. విశాఖ జిల్లాకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఒక్క రోజే 9.4 సెం.మీ. వర్షం : బుధవారం ఒక్క రోజే నగరంలో 9.4 సెం.మీ. వర్షం కురిసింది. ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. దీంతో నిత్యం రద్దీగా ఉండే రోడ్లు నిర్మానుష్యంగా మారిపోయాయి. వినియోగదారులు లేక మార్కెట్లు బోసిపోయాయి. చిరు వ్యాపారులు సైతం ఇళ్లకే పరిమితమయ్యారు. బలమైన ఈదురు గాలులకు నగరంలో 34 చోట్ల చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ తీగలపై చెట్లు పడటంతో నగరంలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సాగరతీరం మూసివేత : వర్షాల కారణంగా సాగరతీరంలో పర్యాటకులు, సందర్శులను అనుమతించలేదు. సముద్రంలో ఆటుపోట్లు ఉధృతంగా ఉండటంతో పాటు ఈదురు గాలుల ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రుషికొండ బీచ్‌కు వెళ్లే ప్రధాన రహదారి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి మూసివేశారు. వర్ష బీభత్సం.. ● 46వ వార్డు కై లాసపురం పరిధిలోని కస్తూరినగర్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. ● కొమ్మాది జంక్షన్ సమీపంలోని వికలాంగుల కాలనీలో కొండచరియలు జారిపడ్డాయి. ● బుల్లయ్య కళాశాల వద్ద ఫుట్‌పాత్‌పై ఉన్న భారీ వృక్షం నేలకొరిగింది. ● ఎన్ఏడీ కొత్తరోడ్డు పరిసర ప్రాంతాల్లో బీఆర్టీఎస్ రహదారి పూర్తిగా దెబ్బతింది. ● 90వ వార్డు బుచ్చిరాజుపాలెం బస్టాప్ ఎదురుగా భారీ గొయ్యి ఏర్పడింది. ● భీమిలి మండలంలో గోస్తనీ నది పోటెత్తి ప్రవహిస్తోంది. టి.నగరపాలెం వద్ద నదికి అడ్డంగా నిర్మించిన మట్టికట్ట కొట్టుకుపోయింది. దీంతో తాటితూరు, టి.నగరపాలెం పంచాయతీల ప్రజలు, రైతులు, విద్యార్థుల రాకపోకలు స్తంభించిపోయాయి. అపార నష్టం.. ● 11 కేవీ ఫీడర్స్ –11 డామేజ్ అయ్యాయి ● 11 కేవీ ఫోల్స్ –3 డామేజ్ అయ్యాయి ● 15 ఎల్టీ ఫోల్స్, 10 డీటీఆర్ ఫోల్స్ డామేజ్ అయ్యాయి ● జీవీఎంసీ పరిధిలో 33 చెట్లు ఇరిగిపోయాయి ● 5.5 కి.మీ రోడ్డులు డామేజ్ అయ్యాయి -
అధినేతతో ముఖ్య నేతలు
విశాఖపట్నం: తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గ్రేటర్ విశాఖకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు, నాయకులు, కార్యకర్తలతో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో శాసనసమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, రీజనల్ కో–ఆర్డినేటర్లు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, పీఏసీ సభ్యులు గొల్ల బాబూరావు, తిప్పల నాగిరెడ్డి, కరణం ధర్మశ్రీ, విశాఖ పార్లమెంట్ పరిశీలకులు కదిరి బాబూరావు, అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేటి ప్రసాద్, నియోజకవర్గ సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్‌కుమార్, మళ్ల విజయప్రసాద్, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, తిప్పల దేవన్‌రెడ్డి, మొల్లి అప్పారావు, బొత్స అనూష, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, కుంభ రవిబాబు, నియోజకవర్గ పరిశీలకులు పసుపులేటి బాలరాజు, తైనాల విజయ్‌కుమార్, చింతలపూడి వెంకటరామయ్య, కోలా గురువులు, చింతకాయల సన్యాసిపాత్రుడు, రొంగలి జగన్నాథం, సతీష్‌వర్మ, వీసం రామకృష్ణ, జహీర్ అహ్మద్, బాణాల శ్రీనివాసరావు, చిక్కాల రామారావు, సీఈసీ, ఎస్ఈసీ సభ్యులు, రాష్ట్ర, జిల్లా పార్టీ కమిటీ సభ్యులు, మాజీ కార్పొరేట్లు, వార్డు అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన
మహారాణిపేట: జిల్లాలో మండల ప్రజా పరిషత్ పాలక వర్గాల గడువు బుధవారం ముగిసింది. జిల్లాలో మొత్తం 39 మండలాల్లో పాలక వర్గం స్థానంలో ప్రత్యేకాధికారుల పాలన గురువారం నుంచి మొదలుకానుంది. దీంతో విశాఖ జిల్లాలో ఉన్న నాలుగు మండలాలకు ప్రత్యేక అధికారులను జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ నియమించారు. ఆనందపురం మండలం ప్రత్యేక అధికారిగా వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి.విజయప్రసాద్, భీమిలిపట్నం ప్రత్యేక అధికారిగా డివిజనల్ డెవలప్మెంటు అధికారి బి.రమేష్‌నాయుడు, పద్మనాభం మండలానికి జంతు సంరక్షణ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ వి.సునీల్, పెందుర్తి మండల ప్రత్యేక అధికారిగా డివిజనల్ డెవలప్మెంటు ఆఫీసర్ సి.ఉషారాణి నియమితులయ్యారు. -
● నెలకు రూ.6 లక్షలు వచ్చే బిర్యానీ పాయింట్లు కాజేసిన ఎమ్మెల్యే అనుచరులు ● ఈ సెటిల్మెంట్ దందాలో చేతులు కలిపిన టీడీపీ మాజీ కార్పొరేటర్ ● ఉపాధి కోల్పోవడంతో రగిలిపోయిన సాయి ● బీహార్‌లో గన్ కొనుగోలు.. మూడు రౌండ్లు కాల్చి ప్రాక్టీస్
ప్రశాంత విశాఖ నగరంలో రోజురోజుకూ నేరాలు పెరిగిపోతున్నాయి. అది ఎంతగానంటే.. బిహార్ నుంచి గన్ కొనుగోలు చేసి మరీ.. కాల్పులు జరిపేంత! తాజాగా నగరంలో కలకలం రేపిన జనసేన నేతపై గన్ కాల్పుల వ్యవహారంలో.. అధికార పార్టీ నాయకుల దౌర్జన్యానికి ఉపాధి కోల్పోయిన ఓ వ్యక్తి కడుపు మంటే కారణమని తెలుస్తోంది. ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం కూడా బయటపడుతోంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రెండు బిర్యానీ పాయింట్ల వ్యవహారంలో మొదలైన పంచాయితీ.. ఓ వ్యక్తి కడుపు మంటకు కారణమయింది. ఆర్థిక నష్టం కాస్తా.. కక్షగా మారి గన్ కాల్పుల దాకా వెళ్లింది. ప్రతి నెలా రూ.6 లక్షల లాభాన్ని తెచ్చిపెట్టే తన వ్యాపారాన్ని బలవంతంగా లాక్కోవడమే ఎమ్మెల్యే అనుచరుడు మద్ది రాజశేఖరరెడ్డిపై గునుకుల సాయినారాయణ గన్ కాల్పులకు తెగబడేందుకు దారి తీసింది. బిర్యానీ పాయింట్ల విషయంలో జరిగిన ప్రైవేటు పంచాయితీనే ఈ ఘటనకు మూలమని దర్యాప్తులో పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి సాయి నారాయణతోపాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. రూ.20 వేల రోజువారీ ఆదాయంపై కన్ను? విశాఖ సౌత్ జైల్ రోడ్ పరిధిలో నరేంద్ర, సాయినారాయణ కలిసి రెండు బిర్యానీ పాయింట్లు నిర్వహిస్తున్నారు. వ్యాపారం బాగుండటంతో ఒక్కో పాయింట్ నుంచి రోజుకు సుమారు రూ.10 వేల చొప్పున నెలకు రూ.6 లక్షల ఆదాయం వచ్చేది. దీంతో వీటిపై సదరు ఎమ్మెల్యే అనుచరుడి కన్ను పడింది. ఈ క్రమంలో మొదట టీడీపీకి చెందిన ఓ మాజీ కార్పొరేటర్ వద్ద పంచాయితీ జరిగింది. చెరో బిర్యానీ పాయింట్ తీసుకోవాలని సూచించినా వినకపోవడంతో.. ఎమ్మెల్యే కీలక అనుచరుడి దగ్గరకు పంచాయితీ వెళ్లింది. రూ.10 లక్షలు డీడీ తీసుకుని రెండు బిర్యానీ పాయింట్లను రాజశేఖరెడ్డికి వదిలి వెళ్లిపోవాలంటూ సాయిని హెచ్చరించారు. తనకు ఇష్టం లేకపోయినా బలవంతంగా రాజీకి ఒప్పించి, తీవ్ర ఆర్థిక నష్టానికి కారణమైన రాజశేఖర్‌రెడ్డిపై సాయి కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. మూడున్నర నెలలు...మూడు రౌండ్ల ట్రయల్...! నాలుగు నెలల క్రితం ఈ ప్రైవేట్ పంచాయితీ జరిగింది. మూడున్నర నెలల నుంచి అక్రమ ఆయుధ కొనుగోలుకు సాయి ప్రయత్నించాడు. బిహార్‌కు వెళ్లి మరీ గన్ కొనుగోలు చేశాడు. బిహార్‌లో ఎక్కడెక్కడ గన్స్ విక్రయిస్తారో తెలుసుకుంటూ గల్లీగల్లీ తిరిగి మరీ ఓ వ్యక్తిని కలిశాడు. సదరు వ్యక్తి సాయి కళ్లకు గంతలు కట్టి, అక్రమ ఆయుధాల కారాగారం వద్దకు తీసుకెళ్లారు. రూ.3 లక్షలు చెల్లించి 7.65 ఎంఎం సైజ్ గన్, పది రౌండ్ల బుల్లెట్లు కొనుగోలుచేశాడు. అక్కడే మూడు రౌండ్ల బుల్లెట్లు కాల్చి మరీ కాల్పులు జరిపేందుకు ట్రయల్ వేశాడు. మిగిలిన బుల్లెట్లతో పాటు గన్ తీసుకుని విశాఖ చేరుకున్నాడు. సౌండ్ వచ్చింది.. బుల్లెట్ రాలేదు దాడికి రెక్కీ నిర్వహించాడు. ఈ నెల 12న రాత్రి 11:30 నుంచి 12 గంటల సమయంలో నీలమ్మ వేపచెట్టుకు సమీపంలోని ఇందిరాగాంధీ విగ్రహం ఎదురుగా రాజశేఖర్‌రెడ్డి తన బైక్ అపి దిగేటపుడు కాల్పులు జరిపాడు. తుపాకీ నుంచి శబ్దం వచ్చినా.. గుండు పేలనట్టు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన రాజశేఖర్ పెద్దగా కేకలు వేయడంతో... అక్కడి నుంచి సాయి బైక్ మీద పరారయ్యాడు. కానిస్టేబుల్‌కు తెలిసినా.. రాజశేఖరరెడ్డి గతంలో హోంగార్డుగా పనిచేశాడు. స్థానిక స్టేషన్‌లోని ఒక కానిస్టేబుల్‌కు తనపై దాడి సమాచారం అందించాడు. ఫిర్యాదు మాత్రం చేయలేదు. సదరు కానిస్టేబుల్ కూడా ఈ కాల్పుల వ్యవహారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకపోవడం గమనార్హం. చివరకు ఘటన జరిగిన 9 రోజుల తర్వాత తనకు ప్రాణ హాని ఉందని భావించి రాజశేఖర్ ఈ నెల 21 న టూ టౌన్ పోలీసులకు పిర్యాదు చేశాడు. విశాఖ సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు... గొల్లల పాలెంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టి కాల్పులకు తెగబడ్డ సాయితో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నాటు తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల ఘటనపై ముందే సమాచారం ఉన్నప్పటికీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లని కానిస్టేబుల్‌ను కనీసం హెచ్చరించకపోవడం గమనార్హం. ఈ మొత్తం వ్యవహారానికి కీలకమైన ప్రైవేట్ పంచాయితీ చేసిన మాజీ కార్పొరేటర్‌తో పాటు ఎమ్మెల్యే కీలక అనుచరుడి జోలికి మాత్రం పోలీసులు వెళ్లడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
తీవ్ర వాయుగుండంపై జీవీఎంసీ అప్రమత్తం
అల్లిపురం: బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం ప్రభావంతో నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ జీవీఎంసీ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని జిల్లా కలెక్టర్, జీవీఎంసీ ప్రత్యేక అధికారి ఎం.అభిషిక్త్ కిషోర్, కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజుతో కలిసి కై లాసపురం కస్తూరి నగర్లో కొండచరియలు జారిన ప్రాంతాన్ని కలెక్టర్, కమిషనర్ బుధవారం పరిశీలించారు. ప్రమాదకర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. కస్తూరి నగర్‌లోని 8 కుటుంబాలను ముందుజాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 56 ప్రభావిత ప్రాంతాలకు 56 పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. జీవీఎంసీ సిటీ ఆపరేషన్స్ సెంటర్, అన్ని జోనల్ కంట్రోల్ రూమ్‌లు 24 గంటలూ పనిచేస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. నగర వ్యాప్తంగా 98 క్షేత్ర స్థాయి బృందాలను అందుబాటులో ఉంచారు. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు 43 ఫిర్యాదులు, సంఘటనలు నమోదు కాగా వాటిలో 41 ఫిర్యాదులు పరిష్కరించారు. వీటిలో చెట్లు కూలిన ఘటనలు 36, నీరు నిలిచిన ఫిర్యాదులు 3, కాలువలు పొంగిన ఘటనలు 4 ఉన్నాయి. అత్యవసర సహాయక చర్యల కోసం 22 జేసీబీలు, 149 టిప్పర్లు, టాటా ఏస్ వాహనాలు, 30 మినీ ఎక్స్కవేటర్లు సిద్ధంగా ఉంచారు. చెట్లు, హోర్డింగులు, విద్యుత్ స్తంభాలు కూలడం, కాలువలు పొంగడం, కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనలపై తక్షణమే స్పందించేలా అన్ని విభాగాల సిబ్బందిని క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచారు. పోలీస్, అగ్నిమాపక, ఈపీడీసీఎల్, రెవెన్యూ, ఆర్అండ్బీ తదితర శాఖల సమన్వయంతో సహాయక చర్యలు చేపడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అనవసరంగా బయటకు రావద్దని, చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగులు, బలహీన భవనాలు, కొండవాలు ప్రాంతాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసర సహాయం కోసం జీవీఎంసీ టోల్‌ఫ్రీ 1800 4250 0009, వాట్సాప్ 9014218870 నంబర్లలో తెలియజేయాలని కోరారు. -
సింహగిరిపై కొనసాగుతున్న పవిత్రోత్సవాలు
సింహాచలం: సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామివారి పవిత్రోత్సవాల్లో భాగంగా రెండోరోజు మంగళవారం హోమాలు, పవిత్ర ప్రతిష్ట పూజలు నిర్వహించారు. ఉదయం స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి,భూదేవిలను ఆలయ కల్యాణమండపంలో కొలువుదీర్చి శాంతిపఠనం, యాగశాలార్చన, కుంభావాహనం, పవిత్రాధివాసం, చక్రాబ్జమండలరచనం, ఆవాహనం, పవిత్రప్రతిష్ట జరిపించారు. సాయంత్రం 5గంటల నుంచి ఆలయ బేడామండపంలో తిరువీధి, రాత్రి విశేష హోమాలు నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకుడు కరి సీతారామాచార్యులు, ఉప ప్రధానార్చకుడు కె.కె.ప్రసాదాచార్యులు, అర్చకులు, పారాయణదారులు, వేద పండితులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. -
జీవీఎంసీ ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రచురణ
అల్లిపురం: జీవీఎంసీ సాధారణ ఎన్నికలు–2026కు సంబంధించి వార్డుల వారీగా సిద్ధం చేసిన ఓటర్ల జాబితాలను మంగళవారం ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రచురించినట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల వివరాల సేకరణకు సిబ్బంది వార్డు స్థాయిలో సర్వే నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ సర్వే కీలకమని, పౌరులు భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. ఓటర్ల వివరాలు (సెప్టెంబర్ 22, 2026 నాటికి) జీవీఎంసీలోని 120 వార్డుల పరిధిలో మొత్తం 18,29,966 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 9,02,171 మంది పురుషులు, 9,27,676 మంది మహిళలు, 119 మంది ఇతరులు ఉన్నారు. నేటి నుంచి కేటగిరీల వారీగా సర్వే -
అప్పన్న ఆగ్రహంతోనే గోడ కూలిందా?!
ఆరిలోవ: సింహాద్రి అప్పన్న కొలువైన కొండను గుల్ల చేస్తూ, ప్రకృతిని శాసించాలనుకున్న దుర్మార్గానికి ప్రకృతి నుంచి తొలి దెబ్బ తగిలింది. ముడసర్లోవ వద్ద సింహాచలం దేవస్థానం కొండ దిగువన జీవీఎంసీ నిర్మించిన భారీ రక్షణ గోడ మంగళవారం భారీ వర్షానికి పేకమేడలా కూలిపోయింది. కొండను ధ్వంసం చేస్తూ చేపట్టిన డేటా సెంటర్ నిర్మాణాల తంతుపై స్థానికంగా ఇప్పుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ‘తన కొండను ఛిన్నాభిన్నం చేస్తున్న వారిపై సాక్షాత్తు సింహాద్రి వరాహలక్ష్మీనృసింహుడి ఆగ్రహమే ఈ కూల్చివేతకు కారణం’అంటూ స్థానికులు భయంతోనూ, ఆగ్రహంతోనూ మండిపడుతున్నారు. అసలేం జరిగింది? : ముడసర్లోవ రిజర్వాయర్ ఎదురుగా దేవుడి కొండపై ఎలాంటి ముందూచూపు లేకుండా డేటా సెంటర్ నిర్మాణ పనులు చేపడుతున్నారు. నిర్మాణాల పేరుతో కొండపై పచ్చదనాన్ని పూర్తిగా తొలగించడమే కాకుండా, రిజర్వాయర్‌లోకి వర్షపు నీరు చేరే సహజ సిద్ధమైన దారులను ఇష్టానుసారంగా మూసివేశారు. ఈ నేపథ్యంలో ఎడతెరిపి లేకుండా మంగళవారం కురిసిన వర్షానికి కొండపై నుంచి ఉప్పొంగి వచ్చిన వరద నీరు దిగువకు వెళ్లే దారిలేక రిజర్వాయర్ మార్గం వద్ద నిలిచిపోయింది. దీంతో సుమారు 200 మీటర్ల మేర రక్షణ గోడ కొండ వైపునకు కుప్పకూలింది. డేటా సెంటర్ పనులను కప్పి ఉంచిన రేకుల ముసుగు కూడా నేలమట్టమైంది. అధికారుల మౌనం.. భయాందోళనలో ప్రజలు ప్రకృతిని నాశనం చేస్తూ చేపట్టిన ఈ పనుల వల్లే ఈ ముప్పు ముంచుకొచ్చిందని నిపుణులు, స్థానికులు స్పష్టం చేస్తున్నారు. నీటి ప్రవాహ మార్గాలను అడ్డగించి, కొండను ఇష్టానుసారంగా తవ్వుతుంటే అధికారులు ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు తీవ్రమవుతున్నాయి. దేవుడి భూములు, కొండ కనుమరుగవుతుంటే అప్పన్న కోపానికి బలికాక తప్పదంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
అభివృద్ధి పనుల్లో సింహభాగం విశాఖకే
మధురవాడ: రాష్ట్ర వ్యాప్తంగా రూ.11 వేల కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో విశాఖకు రూ.3,892 కోట్లతో 16 ప్రాజెక్టులు దక్కాయని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. మంగళవారం కుప్పం నుంచి సీఎం చంద్రబాబు పలు అభివృద్ధి పనులకు వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా పీఎంపాలెం వీ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన సభలో మంత్రి నారాయణ మాట్లాడుతూ విశాఖలో చేపట్టే పనులన్నింటినీ 2027 మార్చి నాటికి పూర్తి చేస్తామన్నారు. నగరానికి డబుల్ డెక్కర్ మెట్రో రైలు రానుందని చెప్పారు. ప్రాజెక్టుల టెండర్ ప్రక్రియ పూర్తయిందన్నారు. సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్, ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. పాత నగరంలో జరిగిన లోపాలు ప్రస్తుత పనుల్లో పునరావృతం కాకూడదని ఎంపీ భరత్ అన్నారు. ఎండాడతో పాటు నగరంలో ఫుట్‌పాత్‌లు, రోడ్డు స్థలాలను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహించడం వల్ల పాదచారులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ తన పేరును నాయకులు ఇప్పుడు మరిచిపోయినా, స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు ఇచ్చే సమయంలో మాత్రం మరిచిపోవద్దంటూ టీడీపీ నేతలకు చురకలు అంటించారు. నగరంలో రహదారులు, ట్రాఫిక్ నిర్వహణ, డ్రైనేజీలు, వీధిలైట్లు తదితర మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ తెలిపారు. కోస్టల్ కారిడార్ పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, రామకృష్ణబాబు, గణబాబు, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, మార్క్‌ఫెడ్ చైర్మన్ గండి బాబ్జి తదితరులు పాల్గొన్నారు. ఏర్పాట్లలో వైఫల్యం : ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నా మహిళలను సభకు తరలించారు. వర్షంలో తడుస్తూనే పలువురు వెనుదిరిగారు. మరుగుదొడ్లు, భోజనం వంటి సౌకర్యాలు సక్రమంగా లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. మంత్రి నారాయణ మాట్లాడుతుండగానే పలువురు మహిళలు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. -
ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి
రైల్వే అధికారులకు జీఎం సందీప్ మాధుర్ ఆదేశాలు తాటిచెట్లపాలెం: బంగాళాఖాతంలో అల్పపీడనం, భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సౌత్ కోస్ట్ రైల్వే జీఎం సందీప్ మాథుర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ప్రిన్సిపల్ హెడ్స్, నాలుగు డివిజన్ల (విశాఖ, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు) డీఆర్ఎంలతో ప్రత్యేక భద్రతా సమావేశం నిర్వహించారు. ప్రయాణికుల భద్రతకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, సమస్యాత్మక బ్రిడ్జిలు, ట్రాక్‌లు, యార్డుల వద్ద 24/7 నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల సహాయార్థం హెల్ప్‌లైన్ సెంటర్లు, సరిపడా ఆహారం, తాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. అత్యవసర పరిస్థితుల కోసం పవర్ బ్యాకప్, డీజిల్ లోకోలు, ప్రమాద సహాయక రైళ్లు, విపత్తు నిర్వహణ బృందాలను సిద్ధంగా ఉంచాలని, డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. -
విశాఖలో గన్ కల్చర్!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: నగరంలో అక్రమ ఆయుధాల వ్యవహారం మరోసారి కలకలం రేపింది. ఓ ప్రైవేటు పంచాయితీ విషయంలో జనసేన నేత మద్ది రాజశేఖర్‌రెడ్డిపై కక్ష పెంచుకున్న సాయి అనే వ్యక్తి నాటు తుపాకీతో కాల్పులకు యత్నించినట్లు పోలీసులు గుర్తించారు. బిహార్ నుంచి నాటు తుపాకీ, బుల్లెట్లు కొనుగోలు చేసి విశాఖకు తీసుకొచ్చినట్లు విచారణలో వెల్లడైనట్టు సమాచారం. ఈ ఘటన ఈ నెల 12న జరగగా.. తనకు ప్రాణహాని ఉందంటూ రాజశేఖర్‌రెడ్డి 21న టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నిందితుడు సాయితో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. సెటిల్మెంట్ వివాదమే కారణం! జైల్‌రోడ్డులో నరేంద్ర, సాయి భాగస్వామ్యంతో రెండు బిర్యానీ దుకాణాలు నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా వ్యాపార వ్యవహారంలో ఇద్దరి మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కొందరు రాజకీయ నాయకులు మధ్యవర్తిత్వం చేసి రాజీ కుదిర్చినట్లు సమాచారం. నరేంద్ర బంధువు, స్థానిక ఎమ్మెల్యే అనుచరుడిగా చెప్పబడుతున్న మద్ది రాజశేఖర్‌రెడ్డి ఈ వ్యవహారంలో కీలకంగా జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. రాజీ ప్రకారం నరేంద్ర రూ.10 లక్షలను డీడీ రూపంలో సాయికి ఇచ్చినట్లు సమాచారం. అయితే తనకు ఇష్టం లేకపోయినా బలవంతంగా రాజీకి ఒప్పించి, ఆర్థికంగా నష్టం కలిగించారని భావించిన సాయి.. రాజశేఖర్‌రెడ్డిపై కక్ష పెంచుకున్నట్లు పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. కాల్పులకు విఫలయత్నం ఈ నెల 12న రాత్రి 11.30 గంటల నుంచి అర్ధరాత్రి మధ్య నీలమ్మ వేపచెట్టు సమీపంలోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద రాజశేఖర్‌రెడ్డి తన బైక్ ఆపి దిగారు. అప్పటికే అక్కడ కాపుకాసి ఉన్న సాయి నాటు తుపాకీతో కాల్పులు జరిపినట్లు సమాచారం. తుపాకీ పేలిన శబ్దం వినిపించినప్పటికీ తూటా బయటకు రాలేదని తెలుస్తోంది. అప్రమత్తమైన రాజశేఖర్‌రెడ్డి కేకలు వేయడంతో సాయి అక్కడి నుంచి బైక్‌పై పరారైనట్లు సమాచారం. ఘటన జరిగిన తొమ్మిది రోజుల తర్వాత.. ఈ నెల 21న టూ టౌన్ పోలీసులకు రాజశేఖర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని ఉందని, ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీతో పాటు ఇతర ఆధారాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది. పోలీసుల అదుపులో ఇద్దరు ఘటనపై సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాలతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గొల్లలపాలెంలో తనిఖీలు చేపట్టి సాయితో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారి నుంచి నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఇద్దరూ టూ టౌన్ పోలీసుల అదుపులో ఉన్నారు. ప్రైవేటు పంచాయితీ విషయంలోనే కక్ష పెంచుకుని దాడికి యత్నించినట్లు సాయి విచారణలో వెల్లడించినట్టు సమాచారం. ప్రైవేటు పంచాయితీలపై చర్చ వ్యక్తిగత, వ్యాపార వివాదాల్లో రాజకీయ నాయకుల జోక్యం పెరుగుతోందని, సెటిల్మెంట్ల పేరుతో ప్రైవేటు పంచాయితీలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు ఇటీవల వినిపిస్తున్నాయి. తాజా ఘటన నేపథ్యంలోనూ ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. వివాదాలను చట్టపరమైన మార్గంలో పరిష్కరించుకోవాల్సి ఉండగా, రాజకీయ మధ్యవర్తిత్వం కారణంగా కక్షలు పెరిగి హింసాత్మక ఘటనలకు దారితీస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో రాజకీయ జోక్యంపై వచ్చిన ఆరోపణలపై సంబంధిత వర్గాల స్పందన తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా, ఇదే నియోజకవర్గంలో గతంలో ఆర్థిక లావాదేవీల వివాదంలో కాల్పుల ఘటన చోటుచేసుకోవడం, తాజాగా మరోసారి తుపాకీతో దాడికి యత్నం జరగడం పోలీసులకు సవాల్‌గా మారింది. నగరంలో అక్రమ ఆయుధాల రవాణా, వినియోగంపై ప్రత్యేక నిఘా అవసరాన్ని తాజా ఘటన మరోసారి చాటుతోంది. జనసేన నేత హత్యకు స్కెచ్ బిహార్ నుంచి నాటు తుపాకీ కొనుగోలు సెటిల్మెంట్లు, పంచాయితీల్లో జోక్యమే కారణం? పది రోజుల తర్వాత ఫిర్యాదు చేసిన జనసేన నేత పోలీసుల అదుపులో నిందితులు, నాటు తుపాకీ స్వాధీనంబిహార్ నుంచి అక్రమ రవాణా? నిందితుడు నాటు తుపాకీ, బుల్లెట్లను బిహార్ నుంచి కొనుగోలు చేసి విశాఖకు తీసుకొచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్టు సమాచారం. గంజాయి అక్రమ రవాణాకు ఉపయోగించే మార్గాల ద్వారానే అక్రమ ఆయుధాలను కూడా విశాఖకు తరలిస్తున్నారన్న అనుమానాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. నగరంలో అక్రమ ఆయుధాల సరఫరా వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలోనూ విచారణ సాగుతున్నట్లు సమాచారం. -
న్యాయవాది గీతాప్రసన్నపై మరోకేసు
ద్వారకానగర్: పోలీసు సిబ్బంది విధి నిర్వహణకు ఆటంకం కలిగించడం, బెదిరింపులకు పాల్పడిన ఘటనపై న్యాయవాది గీతాప్రసన్నపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఆమైపె సైబర్ క్రైమ్ కేసు నమోదు కాగా, తాజాగా ద్వారక పోలీసు స్టేషన్లో మంగళవారం రెండో కేసు నమోదైంది. సైబర్ క్రైమ్ కేసులో విచారిస్తున్న పోలీసులకు న్యాయవాది గీతాప్రసన్న ప్రమేయం ఉండటంతో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు. సైబర్ క్రైమ్ కేసులో అరెస్టు చేసే సమయంలో ఆమె మహిళా పోలీస్ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించడంతో ఈ కేసు నమోదయింది. ఈ నెల18న న్యాయవాది గీతాప్రసన్న ద్వారకానగర్ పబ్లిక్ లైబ్రరీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ ఘటన జరిగింది. ఆమెను అదుపులోకి తీసుకునే సమయంలో పోలీసులను బెదిరించడంతో పాటు, చెవిపోగుతో తనకు తానే గాయపర్చుకునేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసు సిబ్బంది విధులును అడ్డుకోవడం, వారిపై బలప్రయోగం చేయడంతో పిట్టా జయలక్ష్మి ఇచ్చిన నివేదిక ఆధారంగా ద్వారక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పత్రికా విలువలకే మాయని మచ్చ
డాబాగార్డెన్స్: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాస్తున్న ‘తొలిపలుకు’వ్యాసాలు పత్రికా విలువలకు భంగం కలిగించేలా ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లవరపు జాన్‌వెస్లీ ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పత్రికలు సమాజానికి దర్పణంలా ఉండాలని, కుల, రాజకీయ ప్రయోజనాల కోసం ఒకరికి అనుకూలంగా, మరొకరిపై విమర్శలు చేసేలా వ్యవహరించకూడదని హితవు పలికారు. రాధాకృష్ణ తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మత విశ్వాసాలను, ప్రజల మధ్య విభేదాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబును జీవితాంతం అధికారంలో ఉంచాలనే పేరాశతో జగన్మోహన్రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక ప్రతికూల ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. తన కలంలో కులాన్ని రంగరించి, రాష్ట్ర ప్రజల మెదళ్లలో విషం చిందిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో నిత్యావసర ధరలు పెరిగాయని, శాంతిభద్రతలు క్షీణించాయని, ప్రభుత్వ పాలన గాడి తప్పిందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో అంతిమ తీర్పు ప్రజలదేనని, ప్రజలను ప్రభావితం చేసేలా వార్తలు, వ్యాసాలు ఉండకూడదని ఆయన పేర్కొన్నారు. -
ఐదేళ్లలో ఎంతో సాధించాం
కళ్లలో సంతృప్తి.. గుండెల్లో వీడ్కోలు బాధ.. ఈ రెండు భావాల మధ్య మంగళవారం ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చివరి సర్వసభ్య సమావేశం జరిగింది. జిల్లాల విభజనతో మూడు ముక్కలైన ఉమ్మడి విశాఖను ఒకే వేదికపైకి తీసుకొచ్చిన ఈ చివరి భేటీ, కేవలం ఒక పరిపాలనా తంతుగా కాక భావోద్వేగాల సంగమంగా మారింది. పింఛన్ల మంజూరు మొదలు వైద్య సేవల విస్తరణ దాకా ప్రజా సమస్యలపై వాడీవేడి చర్చలు ఒకవైపు సాగుతుండగా, మరోవైపు ఐదేళ్ల అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర స్వరం భారమైంది . ‘జిల్లాలు విడిపోయినా ప్రజాసేవలో మాత్రం మనమంతా కలిసే ఉంటాం’ అంటూ ఆమె పలికిన మాటలు సభాస్థలిని కంటతడి పెట్టించాయి. –సాక్షి, విశాఖపట్నంసమావేశంలో విద్య, వైద్యం, తాగునీరు, రహదారులు, గ్రామీణాభివృద్ధి, సంక్షేమ అంశాలపై సభ్యులు చర్చించారు.గ్రామ స్థాయి సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యంపై సభ్యులు ప్రస్తావించారు. మండల కేంద్రాల్లో అంబులెన్స్ సేవలు అందుబాటులోకి తేవాలని, ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చే రోగులను కేజీహెచ్‌కు రిఫర్ చేయాలని కోరారు. సీజనల్ వ్యాధుల నియంత్రణపై కూడా చర్చించారు.కొత్త పింఛన్ల మంజూరు, సదరం సర్టిఫికెట్ల జారీలో అర్హులందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒంటరి మహిళల పింఛన్ల నిబంధనలు సడలించాలని కోరారు. జెడ్పీటీసీలు, ఎంపీటీసీల గౌరవ వేతనాలు పెండింగ్‌లో ఉన్న అంశాన్ని సభ్యులు సమావేశంలో ప్రస్తావించారు. పింఛన్లపై వాడీవేడిగా చర్చ పింఛన్ల అంశంపై సమావేశంలో వాడీవేడి చర్చ జరిగింది. సభ్యుల డిమాండ్‌తో జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర అధికారులను ఉమ్మడి జిల్లాలో వచ్చిన పింఛన్ దరఖాస్తుల వివరాలు వెల్లడించాలని ఆదేశించారు. జీవీఎంసీ, డీఆర్డీఏ అధికారులు వివరాలు ఇవ్వగా, వాటిపై సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.విడో, దివ్యాంగ, వృద్ధాప్య పింఛన్లు, సదరం సర్టిఫికెట్ల జారీలో సమన్యాయం లేదని సభ్యులు ప్రస్తావించారు. శిశుసంక్షేమశాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఈర్లె అనురాధ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు దాటినా పింఛన్లు మంజూరు కాలేదన్నారు. దరఖాస్తులకు ఇచ్చిన గడువు తక్కువగా ఉందని, అర్హులందరికీ పింఛన్లు అందుతాయా అనే అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. భర్తను కోల్పోయిన మహిళలకు విడో పింఛన్ దరఖాస్తులోనూ ఆంక్షలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. దీనిపై అధికారులు స్పష్టత ఇవ్వాలని సభ్యులు కోరారు. జెడ్పీటీసీల గౌరవ వేతనాలకు తీర్మానం 2021–2026 సెప్టెంబర్ 24 వరకు పనిచేసిన జెడ్పీటీసీ సభ్యుల పెండింగ్ గౌరవ వేతనాలు చెల్లించాలని సభ్యులు కోరారు. జెడ్పీ జనరల్ ఫండ్ నుంచైనా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేయగా, జెడ్పీ చైర్పర్సన్ సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం నుంచి పెండింగ్‌లో ఉన్న 18 నెలల గౌరవ వేతనం రూ.66 లక్షలు విడుదల చేయాలని, 15వ ప్లానింగ్ కమిషన్ చివరి క్వార్టర్ నిధులు రూ.2.82 కోట్లు మంజూరు చేయాలని సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. జిల్లాల మధ్య ఆస్తుల పంపిణీపై సూచన జిల్లా పరిషత్ విభజన అనంతరం విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు సమన్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, సీఈవోలను ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తితో పాటు సభ్యులు కోరారు. ఉమ్మడి జిల్లా ఆస్తులు, గెస్ట్‌హౌస్‌లను మూడు జిల్లాలకు చెందినవిగా పరిగణించాలని, భవిష్యత్తులో జనాభా ప్రాతిపదికన న్యాయమైన వాటా కల్పించాలని కోరారు. ఏజెన్సీ, అనకాపల్లి ప్రాంతాల ప్రజలు, మాజీ ప్రజాప్రతినిధులు జడ్పీ గెస్ట్‌హౌస్‌లను వినియోగించుకునేలా వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆత్మీయ సత్కారం జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్రను రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తదితరులు సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన జెడ్పీటీసీ సభ్యులు, పలువురు ఎంపీపీలను కూడా అతిథుల చేతుల మీదుగా ఆత్మీయంగా సత్కరించారు. ఈ సందర్భంగా సభ్యులు భావోద్వేగ ప్రసంగాలు చేస్తూ తమ అనుభవాలు, జ్ఞాపకాలను పంచుకున్నారు. పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యలపై చర్చించి పరిష్కారానికి కృషి చేశారని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి జెడ్పీ చైర్పర్సన్ సుభద్రను అభినందించారు. అల్లూరి ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, డిప్యూటీ సీఈవో రాజ్‌కుమార్, ఉమ్మడి జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థే రాజకీయ పునాది పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రజాప్రతినిధుల రాజకీయ ప్రస్థానానికి పునాది వంటిదని రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి చేరాలంటే పంచాయతీరాజ్ సంస్థలను బలోపేతం చేయాలని పేర్కొన్నారు. జిల్లా పరిషత్‌లో పనిచేసిన అనుభవమే తన రాజకీయ ఎదుగుదలకు పునాదిగా మారిందన్నారు. విశాఖ జిల్లా పరిషత్ నాలుగు మండలాలకు పరిమితం కావడం బాధాకరమని, విస్తృత సేవల కోసం మరిన్ని మండలాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పదవీకాలాన్ని ముగింపుగా కాకుండా భవిష్యత్ అవకాశాలకు పునాదిగా చూడాలని సభ్యులకు సూచించారు. ప్రజల విశ్వాసమే అసలైన గుర్తింపు ప్రజల విశ్వాసాన్ని పొందడమే ప్రజాప్రతినిధుల అసలైన విజయమని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అన్నారు. జిల్లా పరిషత్ ద్వారా గ్రామీణాభివృద్ధికి చైర్పర్సన్, సభ్యులు అందించిన సేవలను అభినందించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీరు, తాగునీరు వంటి సమస్యలను సమావేశాల్లో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు. పదవులు శాశ్వతం కాదని, ప్రజల కోసం చేసిన సేవలు, సంపాదించుకున్న గౌరవమే చిరస్థాయిగా నిలుస్తాయని పేర్కొన్నారు. జగనన్నకు రుణపడి ఉంటా మారుమూల ప్రాంతంలో జన్మించిన తనకు ఐదేళ్లపాటు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించిన వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటానని జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. రాజకీయ అనుభవం లేని తనకు జిల్లాలో అత్యున్నతమైన జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ పదవి కల్పించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానన్నారు. చైర్‌పర్సన్‌గా ఐదేళ్లపాటు ప్రజలకు సేవ చేయడం సంతృప్తినిచ్చిందని తెలిపారు. ఉమ్మడి జిల్లా పరిషత్ చివరి సమావేశం కావడం కొంత బాధగా ఉన్నప్పటికీ, పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా జిల్లాల విభజన సహజ ప్రక్రియ అని పేర్కొన్నారు. జిల్లాలు విడిపోయినా ప్రజాసేవలో మాత్రం అందరం కలిసే ఉంటామన్నారు. తన పదవీకాలంలో సహకరించిన జెడ్పీటీసీ సభ్యులు, వైస్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, మీడియా మిత్రులకు జల్లిపల్లి సుభద్ర కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సేవలో అంకితభావంతో పనిచేద్దాం జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర భావోద్వేగాల నడుమ ఆఖరి సర్వసభ్య సమావేశం ఉమ్మడి జిల్లా సమగ్ర అభివృద్ధిపై చర్చ -
ఎలక్రికల్ కేబుల్ వైర్ల చోరీలో ముగ్గురికి రిమాండ్
770 కిలోల అల్యూమినియం, 110 కిలోల ప్రొటెక్షన్ వైర్, ఓ వ్యాన్ స్వాధీనం పరవాడ: అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ కేబుల్ వైర్ చోరీకి పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పరవాడ సీఐ ఎల్.భాస్కరరావు మీడియాకు మంగళవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి... జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ కేబుల్ పనులు జరుగుతున్నాయి. రోడ్డు పక్కన ఉంచిన అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ కేబుల్ వైర్‌ను గత నెల 25న గుర్తు తెలియని వ్యక్తులు కత్తిరించి, దొంగిలించుకుపోయారు. దీనిపై యాజమాన్యం పరవాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ.మర్రిపాలెం ఎస్కే యాడ్ సమీపంలో సదరు దొంగతానికి పాల్పడిన పెదగంట్యాడ మండలం స్వతంత్రనగర్‌కు చెందిన షేక్ నబీల్(20), అదే మండలం రామచంద్రనగర్‌కు చెందిన పెండ్ర వెంకటేష్(26) ఆసనాల రవి(25)ని మంగళవారం అరెస్టు చేసినట్టు సీఐ వెల్లడించారు. వారు అప్పటికే కేబుల్ వైర్‌ను కరిగించి అల్యూమినియం దిమ్మలుగా మార్చేశారు. నిందితు నుంచి సుమారు 770 కిలోల 30 అల్యూమినియం దిమ్మలు, 110 కిలోల ప్రొటెక్షన్ వైర్‌ను, చోరీకి ఉపయోగించిన టాటా ఏస్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. షేక్ నబీల్‌పై గాజువాక, న్యూపోర్టు పోలీస్ స్టేషన్లలో ఐదు చోరీ కేసులు ఉన్నాయి. పెండ్ర వెంకటేష్‌పై పరవాడ పోలీస్ స్టేషన్లో ఓ చోరీ కేసు నమోదై ఉంది. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. -
కృష్ణ స్వామి సహిత సంపత్ వినాయకుడిగా..
మహారాణిపేట: ఆశీలమెట్టలోని శ్రీ సంపత్ వినాయక స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి మహోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు శ్రీ కృష్ణ స్వామి సహిత సంపత్ వినాయకుడిగా స్వామివారిని అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, గణపతి హోమం, సామవేద పారాయణం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమంలో 2,100 మందికి భోజనం వడ్డించగా, ఉచిత ప్రసాద వితరణ చేపట్టారు. కోలాటం, భజన, కూచిపూడి నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. -
పవిత్రోత్సవాలకు అంకురార్పణ
సింహాచలం: సింహగిరిపై సోమవారం నుంచి పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాత్రి అంకురార్పణ పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయంలో తొలుత రుత్విక్ వరణం, ఉత్సవాంగీకారం జరిపారు. చక్రపెరుమాళ్లను కల్యాణమండపం వద్దకు తీసుకొచ్చి వేదికపై వేంజేపచేశారు. పుట్టమనున్న స్వామి వద్ద ఉంచి మృత్సగ్రహణం నిర్వహించారు. ప్రధానార్చకుడు కరి సీతారామాచార్యులు శిరస్సుపై పుట్టమన్ను పెట్టుకుని, పాలికల్లో వేసి అంకురార్పణ జరిపారు. దేవస్థానం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యులు, అర్చకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు, మాజీ ట్రస్ట్‌బోర్డు సభ్యుడు గంట్ల శ్రీనుబాబు పాల్గొన్నారు. అర్చకులు, రుత్విక్‌లకు దీక్షా వస్త్రాలను ఈవో అందజేశారు. -
జీవీఎంసీ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలి
డాబాగార్డెన్స్: జీవీఎంసీ ఎన్నికలను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు ముందస్తు ప్రణాళికతో పకడ్బందీగా సన్నద్ధం కావాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ సూచించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం రిటర్నింగ్ అధికారులు (ఆర్వోలు), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు (ఏఆర్వోలు) చేపట్టాల్సిన విధులు, బాధ్యతలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సమావేశంలో అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి, మేయర్ ఎన్నికకు నియమితులైన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డాక్టర్ దయానిధి పాల్గొని ఎన్నికల నియమావళి, విధి విధానాలను వివరించారు. జీవీఎంసీ కార్యదర్శి బీవీ రమణ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఎన్నికల సన్నద్ధతపై వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జీవీఎంసీ పరిధిలో 120 వార్డులు, 1,955 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ ప్రతులను ఈ నెల 22న జీవీఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్, తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వార్డుల వారీగా ఓటర్ల సంఖ్య, పోలింగ్ స్టేషన్ల వివరాలను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి డూప్లికేషన్, మిస్సింగ్‌కు తావులేకుండా చూడాలన్నారు. పోలింగ్ స్టేషన్లలో మౌలిక సదుపాయాలపై ముందస్తు తనిఖీలు చేపట్టాలని సూచించారు. ఎన్నికల నిర్వహణకు 14 వేల మందికిపైగా సిబ్బంది అవసరమవుతారని పేర్కొన్నారు. ఇప్పటికే ఆర్వోలు, జోనల్ కమిషనర్లకు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. నూతన ఎన్నికల నియమావళి, మార్గదర్శకాలపై పూర్తి అవగాహనతో నిబంధనలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. -
విశాఖలో గంటల కొద్దీ పవర్ కట్!
మహారాణిపేట: మహా విశాఖ నగరంలో నీటి సమస్యతో పాటు గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంపై సోనాలి సాహా అనే విద్యార్థిని చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదువుకునే కీలక సమయాల్లో విద్యుత్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గంటల తరబడి విద్యుత్ కోతలు విధిస్తే విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుందని ఆమె వీడియోలో ప్రశ్నించారు. నగరంలో విద్యుత్ సరఫరాకు అంతరాయానికి కారణమేంటి? గంటల తరబడి విద్యుత్ కోతలు ఎందుకు కొనసాగుతున్నాయి? అనే అంశాలపై ఈపీడీసీఎల్ అధికారులు తక్షణమే స్పష్టత ఇవ్వాలని ఆమె వీడియోకు నెటిజన్లు, విద్యార్థుల తల్లిదండ్రులు మెసేజ్‌ల ద్వారా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు చేపట్టి విద్యుత్ కోతలను నివారించాలని కోరుతున్నారు. -
ఈ–కేవైసీ మరిచారో..గ్యాస్ కనెక్షన్ బ్లాక్ అయిపోద్ది!
సాక్షి, విశాఖపట్నం: దేశవ్యాప్తంగా గ్యాస్ వినియోగదారులకు అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమలు కానున్నాయి. బయోమెట్రిక్ ఆధార్ ధ్రువీకరణ(ఈ–కేవైసీ) చేసుకోని వారికి 14.2 కిలోల సబ్సిడీ సిలిండర్ల పంపిణీని నిలిపివేయనున్నారు. వీరికి ఇకపై కేవలం 5 కిలోలు లేదా 10 కిలోల సిలిండర్లను మాత్రమే చమురు సంస్థలు సరఫరా చేస్తాయి. జూన్ 30 వరకు ఉన్న గడువును సెప్టెంబర్ 14 వరకు పలుమార్లు పెంచిన తర్వాత ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లకు దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా అందింది. జేబుకు చిల్లు గ్యారంటీ! ఈ కేవైసీ పూర్తి చెయ్యకపోతే.. సామాన్యులకు ఇది పెద్ద ఆర్థిక భారంగా పరిగణించనుంది. ఈ–కేవైసీ చేసుకోని వారికి సబ్సిడీ నిలిచిపోతుంది. అంతేకాకుండా, వారు తీసుకునే 5 కిలోలు, 10 కిలోల సిలిండర్లను వాణిజ్య గ్యాస్ తరహాలో బహిరంగ మార్కెట్ ధరలకు కొనాల్సి వస్తుంది. ఉదాహరణకు, విశాఖలో.. 14.2 కిలోల సిలిండర్ ధర సుమారు రూ.950 ఉంటే, 5 కిలోల సిలిండర్ రూ.829.50, 10 కిలోల సిలిండర్ రూ.1,765 గా ఉంది. ‘గ్యాస్’పక్కదారి పట్టకుండా.. గ్యాస్ సిలిండర్లు పక్కదారి పట్టకుండా అడ్డుకోవడానికే ఈ తరహా కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నామని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ చెబుతోంది. గృహావసరాలకు ఇచ్చే సబ్సిడీ సిలిండర్లను కొందరు వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తున్నారు. బయోమెట్రిక్ అనుసంధానం వల్ల నకిలీ, అనర్హమైన కనెక్షన్లు తొలగిపోతాయి. దీనివల్ల సబ్సిడీ డబ్బు నిజమైన అర్హులకు మాత్రమే చేరుతుందని కేంద్రం చెబుతోంది. త్వరగా ఈ–కేవైసీ చేసుకోండి ఈ–కేవైసీ పూర్తి చేయని విశాఖ వాసులు వెంటనే గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి బయోమెట్రిక్ వేస్తే కనెక్షన్ తిరిగి యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత యథావిధిగా సబ్సిడీతో 14.2 కిలోల సిలిండర్ లభిస్తుంది. ఒకవేళ ఈ–కేవైసీ కోసం గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్లలేని వారు సంస్థల వెబ్ పోర్టల్, మొబైల్ యాప్, వాట్సప్ చాట్‌బాట్ లేదా ఐవీఆర్ఎస్ ద్వారా తమ ఆప్షన్‌ను నమోదు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలెర్ట్.. మీరు మీ గ్యాస్ కనెక్షన్‌ని ఈ–కేవైసీ చెయ్యలేదా? అయితే.. మీ కనెక్షన్ బ్లాక్ అయిపోయినట్లే. తర్వాత.. సబ్సీడీ కట్. ఇక మీకు పెద్ద సిలిండర్లు రావు.. కేవలం మార్కెట్లో చిన్న సిలిండర్లను భారీ ధరలకు కొనుగోలు చేసుకోవాల్సిందే. ఎందుకంటే.. ఈ కేవైసీ నమోదుపై కేంద్రం కఠినంగా వ్యవహరిస్తోంది. ఇదే చివరి అవకాశం. ఇంక మీ ఇష్టం అంటూ తుది హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 30లోపు ఈకేవైసీ చేయించుకోకపోతే.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. అమలవుతాయని స్పష్టం చేసింది. జిల్లాలో వివరాలు మొత్తం గ్యాస్ ఏజెన్సీలు 62 సింగిల్ సిలిండర్ కనెక్షన్లు 2,24,604 డబుల్ సిలెండర్ కనెక్షన్లు 5,33,988 దీపం కనెక్షన్లు 1,31,749 మొత్తం కనెక్షన్లు 8,90,341 ప్రతి రోజూ డెలివరీలు 25 వేలు నుంచి 28 వేలు సిలెండర్లు ఇప్పటివరకూ ఈ–కేవైసీ జరిగింది 89 శాతం -
చారిత్రక ప్రస్థానం.. చివరి అంకం
సాక్షి, విశాఖపట్నం: ఒకనాడు రాష్ట్రంలోని అతిపెద్ద జిల్లా పరిషత్‌లలో ఒకటిగా వెలుగొందిన ఉమ్మడి విశాఖ జెడ్పీ చరిత్ర ముగియనుంది. 1950లో ఆవిర్భవించిన ఈ సంస్థ.. 76 ఏళ్ల ప్రస్థానం అనంతరం మూడు జిల్లాలుగా విడిపోనుంది. ప్రస్తుత పాలకవర్గం గడువు ఈ నెల 24తో ముగియనుండగా.. మంగళవారం జరిగే సర్వసభ్య సమావేశమే ఉమ్మడి విశాఖ జెడ్పీకి చివరిది కానుంది. కొత్త జిల్లాల ప్రాతిపదికన జిల్లా పరిషత్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు జెడ్పీలు ఏర్పడనున్నాయి. నాలుగు మండలాలకే విశాఖ జెడ్పీ ఉమ్మడి విశాఖ జెడ్పీ పరిధిలో గతంలో 39 మండలాలు ఉండేవి. తాజా విభజనతో అనకాపల్లి జెడ్పీ పరిధిలో 24 మండలాలు, అల్లూరి సీతారామరాజు జెడ్పీ పరిధిలో 11 మండలాలు చేరనున్నాయి. విశాఖ జెడ్పీకి మాత్రం భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి మండలాలు మాత్రమే మిగలనుండటంతో.. నాలుగు మండలాలతో రాష్ట్రంలోనే అతిచిన్న జిల్లా పరిషత్గా విశాఖ జెడ్పీ ఏర్పడనుంది. 1950లో మొదలు.. 2026లో ముగింపు విశాఖ జిల్లా పరిషత్ ప్రస్థానం 1950లో ప్రారంభమైంది. 1959లో సమితులు, తాలూకాలు, జిల్లా బోర్డుల వ్యవస్థగా కొనసాగిన ఈ సంస్థ.. 1983లో మండల, జిల్లా ప్రజా పరిషత్‌లుగా రూపాంతరం చెందింది. 1986లో పూర్తిస్థాయి మండల, జిల్లా ప్రజా పరిషత్గా ఏర్పడింది. 2021 సెప్టెంబర్ 25న జె. సుభద్ర అధ్యక్షతన ప్రస్తుత పాలకవర్గం కొలువుదీరింది. ఈ పాలకవర్గం గడువు ఈ నెల 24తో ముగియడంతో ఉమ్మడి విశాఖ జెడ్పీకి అధికారికంగా తెరపడనుంది. చివరి చైర్‌పర్సన్‌గా జల్లిపల్లి సుభద్ర నిలవనున్నారు. జిల్లా ప్రజా పరిషత్ చివరి సర్వసభ్య సమావేశం మంగళవారం ఉదయం 10.30 గంటలకు స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో జరగనుంది. సిబ్బంది కేటాయింపులోనూ విభజన రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఈ నెల 25 నుంచి విభజన ప్రక్రియ అధికారికంగా అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో అధికారులు, సిబ్బంది కేటాయింపునకు అధికారులు చర్యలు చేపట్టారు. పంచాయతీరాజ్ శాఖలో సీనియారిటీ ఆధారంగా బదిలీలు, సిబ్బంది పంపకాలకు రంగం సిద్ధమైంది. ఉమ్మడి జెడ్పీ పరిధిలోని 876 మంది అధికారులు, సిబ్బందిని జిల్లాల వారీగా సర్దుబాటు చేయనున్నారు. అనకాపల్లి జిల్లాకు 60 శాతం, అల్లూరి సీతారామరాజు జిల్లాకు 30 శాతం, విశాఖ జిల్లాకు 10 శాతం చొప్పున కేటాయించనున్నారు. నిధులు, అభివృద్ధిపై సందేహాలు? ఒకప్పుడు 39 మండలాలతో విస్తరించిన ఉమ్మడి విశాఖ జెడ్పీ.. ఇప్పుడు కేవలం నాలుగు మండలాలకే పరిమితం కానుంది. కొత్త జెడ్పీలో చైర్మన్, వైస్‌చైర్మన్ పదవులతో పాటు పరిమిత సంఖ్యలో సభ్యులతో పాలన సాగనుంది. ఇంత చిన్న పరిధిలో జెడ్పీకి వచ్చే నిధులు, చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలపై ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా.. భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి మండలాలను జీవీఎంసీలో విలీనం చేసే ప్రతిపాదనలపై ఇటీవల నిర్వహించిన గ్రామసభల్లో పలుచోట్ల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఆయా గ్రామాలు కూడా జీవీఎంసీలో విలీనమైతే విశాఖ జెడ్పీ పరిధి మరింత తగ్గిపోనుంది. ఈ నేపథ్యంలో నిధులు, అభివృద్ధిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
పింఛన్‌దారులకు పోర్టల్ పోటు
మహారాణిపేట: అర్హత ఉన్నప్పటికీ కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోలేకపోయామని, మరో అవకాశం కల్పించాలని కోరుతూ వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు సోమవారం కలెక్టరేట్ బాట పట్టారు. పీజీఆర్ఎస్కు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కలెక్టర్‌కు అర్జీలు సమర్పించారు. కొత్త పింఛన్ల కోసం ప్రభుత్వం ఆన్లైన్ పోర్టల్ ప్రారంభించడంతో అర్హుల్లో ఆశలు చిగురించాయని, అయితే కొద్దిరోజులకే పోర్టల్ మూసివేయడంతో దరఖాస్తు చేసుకోలేకపోయారని తెలిపారు. పింఛన్ కోసం అవసరమైన వివిధ ధ్రువపత్రాల సేకరణలో జాప్యం జరగడంతో గడువులోగా దరఖాస్తు చేయలేకపోయామని అర్జీదారులు వాపోయారు. ప్రస్తుతం అవసరమైన ధ్రువపత్రాలు చేతికి వచ్చినప్పటికీ దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయిందని పేర్కొన్నారు. తమకు పింఛన్ పొందేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని, కేవలం ధ్రువపత్రాల జారీలో ఆలస్యం కారణంగానే అవకాశం కోల్పోయామని తెలిపారు. ఆన్లైన్ పోర్టల్‌ను మరోసారి తెరిచి కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. అర్జీదారుల విజ్ఞప్తులను పరిశీలించి అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఒంటరి మహిళ అంటే చులకనగా చూస్తారా? ఒంటరి మహిళలు సమస్యలపై సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో వినతిపత్రం సమర్పించాం. ఒంటరి మహిళలకు వయస్సుతో సంబంధం లేకుండా పింఛన్ మంజూరు చేయాలని, అర్హులను గుర్తించి పింఛన్ అందించి ఆదుకోవాలని కోరాం. వేదికపై ఉన్న ఓ అధికారికి వినతిపత్రం అందించాం. అయితే ఆ అధికారి హేళనగా మాట్లాడారు. పీజీఆర్ఎస్లో అందరు అధికారుల సమక్షంలో ఒంటరి మహిళల సమస్యలపై మాట్లాడుతున్న సమయంలో.. ‘ఏమైనా సమస్యలు ఉంటే అసెంబ్లీకి వెళ్లి చెప్పుకోండి’ అంటూ హేళనగా మాట్లాడారు. అంతేకాకుండా ‘మీకు మైక్ ఇస్తాను.. స్పీచ్ ఇవ్వండి. కింద స్టేజ్ కడతాను.. అక్కడ స్పీచ్ ఇవ్వండి’ అంటూ చులకనగా మాట్లాడడం బాధ కలిగించింది. – లక్ష్మి, సాలో ఆర్గనైజేషన్, పీ.ఎం.పాలెం చేయూతనందించాలి పుట్టుకతో దివ్యాంగురాలిని. కుటుంబం అండ లేక ఒంటరిగా జీవిస్తున్నాను. నాకు వృద్ధాప్య పింఛన్ రావడం లేదు. గతంలో పీజీఆర్ఎస్లో పింఛన్ కోసం దరఖాస్తు చేశాను. కానీ రాలేదు. దయుంచి పింఛన్ ఇప్పించాలి. – పెట్లి లక్ష్మి, తుంగ్లాం, గాజువాక -
సమరభేరి
నీటి సంక్షోభంపైసాక్షి, విశాఖపట్నం: విశాఖ మహానగరంలో తాగునీటి సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. గత మూడు నెలలుగా నగరవాసులు చుక్క నీటి కోసం అల్లాడుతున్నా కూటమి ప్రభుత్వం గాఢనిద్ర వీడడం లేదు. అధికార యంత్రాంగం ఉదాసీనత, ప్రభుత్వ ముందస్తు ప్రణాళికారాహిత్యం వల్ల నీటి కొరత రికార్డు స్థాయికి చేరింది. మూడు రోజులకొకసారి, అదీ అర్ధరాత్రి వేళల్లో కుళాయిల ద్వారా నీటిని సరఫరా చేస్తుండటంతో ప్రజలు జాగారం చేయాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది. ఉదయం లేచినప్పటి నుంచి పనులు, పిల్లల చదువులు, ఉపాధిని సైతం పక్కనబెట్టి ఖాళీ బిందెలు, డ్రమ్ములతో ప్రజలు రోడ్లపై పడిగాపులు కాస్తున్నారు. మహిళలు నిరసనలకు దిగుతున్నా ప్రభుత్వంలో ఏమాత్రం స్పందన కరువైంది. దీంతో నగరవాసుల తరఫున కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టేందుకు వైఎస్సార్సీపీ సమరభేరి మోగించింది. ప్రజల కనీస అవసరాలను తీర్చడంలో విఫలమైన ప్రభుత్వం, జీవీఎంసీ అధికారుల తీరును నిలదీస్తూ మంగళవారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జీవీఎంసీ కార్యాలయ ముట్టడి జరగనుంది. ఈ నిరసన కార్యక్రమంలో నగరవాసులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పిలుపునిచ్చారు. దాహాన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేటు దందా! ఓ పక్క ప్రజల దాహార్తితో విలవిలలాడుతుంటే, మరోపక్క నీటి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. జీవీఎంసీ నీటి సరఫరా విభాగం అధికారులు ప్రజల కష్టాలను పట్టించుకోకుండా ప్రైవేట్ దళారులకు కొమ్ముకాస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోజువారీ అవసరాల కోసం ఉదయం 6 గంటలకే వచ్చి టోకెన్లు తీసుకున్న సామాన్యులను గాలికి వదిలేసి, ప్రైవేటు వాటర్ ట్యాంకర్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. రూ. 300ల నామమాత్రపు రుసుముతో జీవీఎంసీ నుంచి 6 వేల లీటర్ల నీటిని పొందుతున్న ప్రైవేటు అసోసియేషన్లు, కేవలం రెండు మూడు కిలోమీటర్ల పరిధిలోని ప్రజల నుంచి ఏకంగా రూ. 3,000 వసూలు చేస్తూ దోచుకుంటున్నాయి. ముందస్తు సమీక్ష ఏదీ? వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఇటీవల భీమిలి, విశాఖ ఉత్తర నియోజకవర్గాల్లో పర్యటించి స్థానికుల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నగరానికి ప్రధాన తాగునీటి వనరులైన మేఘాద్రిగెడ్డ, రైవాడ, గంభీరం తదితర రిజర్వాయర్లలో నీటి నిల్వలు, పూడికతీత, వర్షపు నీటి సంరక్షణపై ప్రభుత్వం ముందస్తు సమీక్షలు నిర్వహించడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. జీవీఎంసీ పరిధిలోని ఆరిలోవ, ఎండాడ, మధురవాడ, రుషికొండతో పాటు నగర నడిబొడ్డున ఉన్న అక్కయ్యపాలెం, దొండపర్తి, ఎంవీపీ కాలనీ, సీతమ్మధార, జగదాంబ, డాబాగార్డెన్స్, కంచరపాలెం, మాధవనగర్, ఎన్ఏడీ, గోపాలపట్నం, గాజువాక తదితర ప్రాంతాల్లో తాగునీటి ఇబ్బందులు తీవ్రంగా ఉన్నాయని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రభుత్వం నుంచి స్పందన లేకుండాపోయిందని విమర్శించారు. ప్రభుత్వాన్ని నిలదీస్తాం: కేకే రాజు తాగునీటి సమస్యపై ప్రభుత్వం, జీవీఎంసీ అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మంగళవారం జీవీఎంసీ కార్యాలయాన్ని ముట్టడిస్తున్నామని కేకే రాజు తెలిపారు. ప్రజల దాహార్తిని తీర్చడంలో ప్రభుత్వం తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నగరంలో నెలకొన్న నీటి సంక్షోభాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతోపాటు ప్రజా సమస్యలపై ప్రతిపక్షంగా నిరంతరం పోరాడతామన్నారు. అధికారుల నిద్రమత్తు వదిలించేందుకు నేడు చేపట్టే ముట్టడి కార్యక్రమంలో నగరవాసులు, పార్టీ నాయకులు, శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. నేడు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జీవీఎంసీ ముట్టడి మూడు నెలలుగా అల్లాడుతున్న నగరవాసులు మూడు రోజులకొకసారి అర్ధరాత్రి నీటి సరఫరా ఖాళీ బిందెలతో రోడ్లపై నిరీక్షిస్తున్న మహిళలు సామాన్యుల దాహార్తిపై ప్రైవేటు దందా.. రూ. 300 ట్యాంకర్ రూ. 3 వేలకు విక్రయం! -
గురజాడ భావితరాలకు స్ఫూర్తిదాత
మహారాణిపేట: ప్రముఖ కవి, రచయిత, సంఘ సంస్కర్త గురజాడ వెంకట అప్పారావు జయంతిని సోమవారం కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా రెవెన్యూ అధికారి ఎం.విశ్వేశ్వరనాయుడు, ఇతర అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గురజాడ రచనలు సమాజంలో నెలకొన్న అసమానతలు, మూఢనమ్మకాలు, అన్యాయాలను ప్రశ్నిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చాయని డీఆర్వో పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ లక్ష్మీపతి, జిల్లా పర్యాటక శాఖ అధికారిణి జె.మాధవి, డిప్యూటీ కలెక్టర్లు టి. గోవిందు, శేషశైలజ, ఏడీసీ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
స్వయం సమృద్ధి దిశగా వీఈఆర్
బీచ్‌రోడ్డు: విశాఖ ఎకనామిక్ రీజియన్ (వీఈఆర్)ను స్వయం సమృద్ధితో ఆదాయం సమకూర్చుకునే దీర్ఘకాలిక ఆర్థిక వనరుగా అభివృద్ధి చేయాలని వీఎంఆర్డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ సూచించారు. వీఈఆర్ అభివృద్ధిపై సోమవారం వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధి అభిజిత్ రాయ్ బృందంతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విశాఖలో మౌలిక వసతుల కల్పనకు సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. వీఎంఆర్డీఏ ప్రతిపాదిస్తున్న విశాఖ బే సిటీ ప్రాజెక్టును సమీకృత, సుస్థిర, పర్యావరణహిత నమూనాగా తీర్చిదిద్దితే పెట్టుబడులు, పర్యాటకానికి విశాఖ మరింత ఆకర్షణీయ గమ్యస్థానంగా మారుతుందని పేర్కొన్నారు. వీఈఆర్ అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు సహకారం, నిధుల కేటాయింపుపైనా సంప్రదింపులు జరిపినట్లు వెల్లడించారు. సమావేశంలో జీవీఎంసీ అదనపు కమిషనర్ కె.రమేష్, వీఎంఆర్డీఏ అదనపు కమిషనర్ దాట్ల కీర్తి, ఓఎస్డీ కృష్ణ నాయక్, చీఫ్ ఇంజినీర్ వినయ్‌కుమార్ పాల్గొన్నారు. -
జీవీఎంసీ పీజీఆర్ఎస్కు 108 వినతులు
డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)కు 108 వినతులు అందాయి. అదనపు కమిషనర్లు పి.నల్లనయ్య, ఎస్ఎస్ వర్మతో కలిసి కమిషనర్ కేతన్‌గార్గ్ ఫిర్యాదులు స్వీకరించారు. వీటిలో జోనల్ అడ్మినిస్ట్రేషన్‌కు 4, జీవీఎంసీ అడ్మినిస్ట్రేషన్ అండ్ అకౌంట్స్ విభాగానికి 9, రెవెన్యూ 11, ప్రజారోగ్య శాఖ 6, అత్యధికంగా పట్టణ ప్రణాళికా విభాగానికి 52 రాగా, ఇంజినీరింగ్ సెక్షన్‌కు 22, డీడీహెచ్కు 2, యూసీడీకి 2 ఫిర్యాదులు వచ్చాయి. వీటి పరిష్కారానికి సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్(అమృత్) డి.విజయభారతి, డీసీఆర్ ఎస్.శ్రీనివాసరావు, ప్రధాన వైద్యాధికారి(ఇన్చార్జి) డాక్టర్ కృష్ణంరాజు, యూసీడీ ప్రాజెక్ట్ డైరక్టర్ బీవీ రమణ, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డి, పర్యవేక్షక ఇంజినీర్లు, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
పీజీఆర్ఎస్లో ప్రజాగళం
మహారాణిపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సోమవారం వివిధ ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, విద్యార్థి, దళిత సంఘాల ప్రతినిధులు తమ సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. వీధి విక్రయదారులకు ఉపాధి రక్షణ కల్పించడం నుంచి బీసీ స్టడీ సర్కిల్లో మౌలిక వసతులు, జీవీఎంసీ మేయర్ పదవి దళితులకు రిజర్వు చేయడం, మెడికల్ మాఫియాపై చర్యలు తీసుకోవడం వరకు పలు అంశాలపై అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. మేయర్ పదవి దళితులకే ఇవ్వాలి రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో మేయర్ పదవిని దళితులకు రిజర్వు చేయాలని పలు దళిత, బహుజన సంఘాల నేతలు డిమాండ్ చేశారు. సోమవారం పీజీఆర్ఎస్లో కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. జీవీఎంసీలో 120 వార్డుల ప్రాతిపదికన ఎస్సీలకు 19, ఎస్టీలకు 8 వార్డులు రిజర్వు చేయాలని, గతంలో రిజర్వేషన్ల కేటాయింపులో రాజ్యాంగ నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. కార్యక్రమంలో అంబేడ్కర్ మెమోరియల్ సొసైటీ ప్రధాన కార్యదర్శి జేవీ ప్రభాకర్, సహాయ కార్యదర్శి బత్తుల గౌతమ్ బాబు, బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశరావు, ఆర్పీఐ (అంబేడ్కర్ ) ఉత్తరాంధ్ర అధ్యక్షుడు కొంగరపు గణపతి, భారత్ సమాజ్ డెవెలప్ పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు చింతాడ సూర్యం, డీహెచ్‌పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుడాల రాంబాబు, రైల్వే ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పివిఆర్ మోహన్ రావు, తదితరులు పాల్గొన్నారు. మెడికల్ మాఫియాపై చర్యలు తీసుకోవాలి జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లలో జరుగుతున్న మెడికల్ మాఫియా ఆగడాలను అరికట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆర్వైఎస్ఎఫ్ నాయకులు సోమవారం పీజీఆర్ఎస్లో వినతిపత్రం సమర్పించారు. చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేపడతామని రైట్స్ ఫర్ యూత్ అండ్ స్టూడెంట్స్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామల లక్ష్మారెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి పడమట నరేష్, జిల్లా కన్వీనర్ ఎన్.శ్రీను హెచ్చరించారు. ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్ల యాజమాన్యాలు కుమ్మకై ్క కమీషన్ల కోసం అవసరం లేకపోయినా అనేక రకాల టెస్టుల పేరుతో పేద ప్రజలను పీడిస్తున్నారన్నారు. వీధి విక్రయదారులను ఆదుకోవాలి రైల్వే, ఆర్పీఎఫ్, జీవీఎంసీ అధికారులు తమను వ్యాపారం చేయనివ్వడం లేదని ఆరోపిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వీధి విక్రయదారులు సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. పీజీఆర్ఎస్లో వినతిపత్రం సమర్పించి యథావిధిగా వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు.కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకుడు తెడ్డు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బీసీ స్టడీ సర్కిల్లో వసతులు కల్పించాలి జిల్లా బీసీ స్టడీ సర్కిల్లో గ్రూప్స్ అభ్యర్థులకు తగిన మౌలిక వసతులు కల్పించాలని డీవైఎఫ్ఐ నాయకులు పీజీఆర్ఎస్లో సోమవారం వినతిపత్రం సమర్పించారు. ముఖ్యంగా మహిళా అభ్యర్థులకు మరుగుదొడ్ల కొరతతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. -
స్కూటీ అదుపుతప్పి లోయలోపడ్డ యువతి
పెందుర్తి: దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న ఓ యువతి స్కూటీ అదుపు తప్పి స్థానిక వేంకటాద్రి కొండను ఆనుకుని ఉన్న లోయలో పడిపోయింది. దాదాపు 30 అడుగుల లోయలో పడివున్న సదరు యువతిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. వివరాలివి.. చినముషిడివాడ శారాదపీఠం ప్రాంతంలో నివాసం ఉంటున్న జాహ్నవి(24) సోమవారం ఉదయం వేంకటాద్రిపై ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయానికి దర్శనానికి వెళ్ళింది. తిరిగి స్కూటీపై దిగువ ఘాట్‌లో వస్తున్న క్రమంలో అదుపు తప్పి, పక్కనే ఉన్న లోయలో స్కూటీతో సహా పడిపోయింది. బాగా లోతులోకి పడిపోయిన ఆమె బిగ్గరగా అరవడంతో స్థానికులు ప్రమాదాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సీఐ కేవీ సతీష్‌కుమార్ ఆదేశాల మేరకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీస్ బృందం లోయలోకి దిగి జాహ్నవిని సురక్షితంగా పైకి తీసుకొచ్చారు. చిన్నపాటి గాయాలతో పాటు, తీవ్ర ఆందోళనకు గురైన బాధితురాల్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
25, 26 తేదీల్లో సోలార్ ఎక్స్పో
సీతంపేట: నగరంలో తొలిసారిగా ఈ నెల 25, 26 తేదీల్లో బీచ్‌రోడ్డులోని గాదిరాజు ప్యాలెస్‌లో ‘ఆంధ్రప్రదేశ్ సోలార్ ఎక్స్పో, రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్పో–2026’ను నిర్వహించనున్నట్లు ఏపీ సోలార్ ఇంటిగ్రేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్(ఏపీ శివ) అధ్యక్షుడు బి.విశ్వప్రసాద్ తెలిపారు. సీతంపేటలోని అసోసియేషన్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఎక్స్పో కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. ఫస్ట్ వ్యూ, సోలార్ క్వార్టర్ సంస్థలు సంయుక్తంగా ఈ ఎక్స్పోను నిర్వహిస్తుండగా, తమ అసోసియేషన్‌ను పార్టనర్‌గా ఎంపిక చేశాయన్నారు. ఎక్స్‌పోలో సుమారు 100 మంది ఎగ్జిబిటర్లు పాల్గొని 100 స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నారని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సేవలను ప్రజలకు పరిచయం చేయడమే దీని ప్రధాన ఉద్దేశమన్నారు. సోలార్‌తో పాటు రెన్యూవబుల్ ఎనర్జీ రంగానికి చెందిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్(బీఈఎస్ఎస్), ఇన్వర్టర్లు, సోలార్ మాడ్యూల్స్, కేబుల్స్ తదితర అధునిక పరికరాలను ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో ఏపీ శివ సలహాదారు కమ్ కోర్ కమిటీ సభ్యుడు కె.గోపాల్ రెడ్డి, కోశాధికారి పీటీవీఆర్ కృష్ణారావు పాల్గొన్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
మహారాణిపేట: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, పీజీఆర్ఎస్ ద్వారా అందిన ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమ వారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) కార్యక్రమంలో డీఆర్వో ఎం.విశ్వేశ్వరనాయుడు, ఎస్డీసీలు టి.గోవిందు, శేషశైలజ, జీవీఎంసీ ఏడీసీ రమణమూర్తిలతో కలిసి ఆమె ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజలు వివిధ సమస్యలపై మొత్తం 450 వినతులు సమర్పించారు. వాటిలో రెవెన్యూ విభాగానికి చెందినవి 56, జీవీఎంసీ 108, పోలీస్ శాఖ 31, ఇతర శాఖలకు సంబంధించినవి 255 ఉన్నాయి. వాటిని సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి, నిబంధనల మేరకు సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
‘నులిపురుగుల నిర్మూలన’కు ఏర్పాట్లు పూర్తి చేయాలి
మహారాణిపేట: ఈ నెల 25న నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం. విశ్వేశ్వరనాయుడు అధికారులను ఆదేశించారు. జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో 1 నుంచి 19 ఏళ్ల వయస్సు గల 5,74,496 మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు అందించాలని సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో డీఆర్వో మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం చేసిన అరగంట తర్వాత పిల్లలకు మాత్రలు వేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. 25న మాత్రలు తీసుకోలేని వారికి అక్టోబరు 5న నిర్వహించే మాప్‌అప్ రౌండ్లో అందించాలని సూచించారు. అనంతరం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో అదనపు డీఎంహెచ్‌వో డాక్టర్ ఆర్. రమేష్, డీసీహెచ్ఎస్ డాక్టర్ నరేంద్ర సింగ్, డాక్టర్ బి. హారిక, ఎస్డీసీ గోవిందు, డీఈవో ప్రేమకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మృతుని నేత్రాలు దానం
పెందుర్తి: మరణించిన ఓ వ్యక్తి నేత్రాలను దానం చేసి అతని కుటుంబ సభ్యులు పెద్ద మనసు చాటుకున్నారు. పెందుర్తిలో నివాసం ఉంటున్న జీవీఎంసీ ఉద్యోగి చిక్కాల వరాహనరసింహం(50) సోమవారం ఉదయం అనారోగ్యంతో మరణించారు. సమాచారం అందుకున్న సాయి హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు దాడి శ్రీనివాస్ నేత్రదానం గురించి కుటుంబ సభ్యులను సంప్రదించారు. మృతుని భార్య పార్వతి వెంటనే అంగీకారం తెలిపారు. ఎల్వీ ప్రసాద్ మొహిషిన్ నేత్రనిధి ప్రతినిధులు మనోజ్, లక్ష్మి వచ్చి, మృతదేహం నుంచి నేత్రాలు సేకరించారు. -
డయల్ యువర్ ఈపీడీసీఎల్ సీఎండీకి 56 వినతులు
మహారాణిపేట: విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారం కోసం ఏపీఈపీడీసీఎల్ ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ‘డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ’కార్యక్రమానికి వినియోగదారుల నుంచి 56 వినతులు అందాయి. నగరంలోని సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వినియోగదారులు వివిధ సమస్యలను ప్రస్తావించారు. ముఖ్యంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరు, లైన్ షిఫ్టింగ్, కొత్త విద్యుత్ కనెక్షన్లు, విద్యుత్ బిల్లులు, పోల్ షిఫ్టింగ్ తదితర ఫిర్యాదులు, వినతులను నేరుగా సీఎండీ దృష్టికి తీసుకువచ్చారు. వీటిని పరిశీలించి, పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వినియోగదారులు విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1912, లేదా 9493681912 వాట్సాప్ నంబర్ ద్వారా కూడా తమ విద్యుత్ సమస్యలను నివేదించవచ్చన్నారు. కార్యక్రమంలో సీజీఎం పి.సోల్మన్రాజు, జనరల్ మేనేజర్లు ఎం.ఝాన్సీ, వీవీఎస్ఎన్వీ ప్రసాద్ పాల్గొన్నారు. -
‘స్థానిక’ పోరుకు సిద్ధం కండి
సాక్షి, విశాఖపట్నం: స్థానిక ఎన్నికల్లో బలమైన, ఆమోదయోగ్యమైన అభ్యర్థులను వైఎస్సార్ సీపీ నుంచి బరిలోకి దించాలని వైఎస్సార్ సీపీ రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జీవీఎంసీ వార్డు కార్పొరేటర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ స్థానాలకు బలమైన అభ్యర్థులను ఎంపిక చేయాలని సూచించారు. పార్టీ కష్టకాలంలో నిజాయతీగా నిలబడిన కార్యకర్తలు, నాయకులను అభినందించారు. ఆదివారం మాధవదారలోని వుడాకాలనీలో ఉన్న గ్రాండ్ మిలాన్ ఫంక్షన్ హాల్లో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక కార్యవర్గ సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి హాజరయ్యారు. కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. నగరంలో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలపై పోరాటాలు చేపట్టాలని తెలిపారు. స్థానిక ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని, ప్రతి డివిజన్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి చర్చించి బలమైన అభ్యర్థుల జాబితాను రూపొందించాలని సూచించారు. సోషల్ మీడియా ద్వారా పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, ప్రభు త్వ విధానాలపై పార్టీ అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సోషల్ మీడియా విభాగం కీలక పాత్ర పోషించాలన్నారు. అనంతరం పార్టీ నాయకులకు ఐడీ కార్డులు అందజేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో ప్రతి డివిజన్ నుంచి పోటీ చేయాలనే ఆసక్తి ఉన్న ఇద్దరు, ముగ్గురు అభ్యర్థుల పేర్లను తీసుకుని, అందరితో చర్చించి పార్టీ నిర్ణయం మేరకు ముందుకు వెళ్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో కొందరు అభ్యర్థులను ఫోన్ చేసి బెదిరించడం, పోటీ చేస్తే ఇది చేస్తాం.. అది చేస్తామని భయపెట్టడం వంటి చర్యలకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. రాబోయే 30 రోజుల్లో వార్డు సమావేశాల షెడ్యూల్ సిద్ధం చేస్తామన్నారు. సమావేశంలో నియోజకవర్గ పరిశీలకులు సతీష్ వర్మ, బాణాల శ్రీనివాసరావు, మాజీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, ప్రచార విభాగం జోన్–1 ప్రెసిడెంట్ రవి రాజు, మాజీ కార్పొరేటర్లు రెయ్యి వెంకటరమణ, అల్లు శంకర్ రావు, కె.అనిల్ కుమార్ రాజు, సాడి పద్మారెడ్డి, మువ్వల పోలారావు, వావిలపల్లి ప్రసాద్, సేనాపతి అప్పారావు, పామోటి బాబ్జి, భర్కత్ అలీ, కేవీఎన్ శిశికళ, జీవీ రమణి, దల్లి రామక్రిష్ణరెడ్డి, వార్డు అధ్యక్షులు పైడి రమణ, గుజ్జు వెంకటరెడ్డి, బల్ల శ్రీనివాసరావు, బొడ్డేటి కిరణ్, భీశెట్టి ప్రసాద్, జక్కంపూడి సత్యనారా యణ, హాబీబ్, బలిరెడ్డి గోవింద్, కె.సుకుమార్, డోప్ప శ్రీను, ఐ.రవికుమార్, వేణు, మెట్ట దమయంతి, కడితి చిరంజీవి, ఎర్రంశెట్టి శ్రీనివాసరావు, రాష్ట్ర, జోనల్, జిల్లా, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. -
కొండపై బాంబుల మోత.. ఇళ్లలో దడ!
కొమ్మాది: కొండపై బాంబుల పేలుళ్లు.. భారీ శబ్దాలు.. కదులుతున్న ఇళ్లు.. చెల్లాచెదురవుతున్న సామగ్రి.. వెరసి ఎండాడ దుర్గానగర్, ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ వాసులు బిక్కుబిక్కుమంటున్నారు. రాళ్ల తొలగింపు కోసం పేలుళ్లు జరుపుతుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీవీఎంసీ 8వ వార్డు పరిధిలోని ఎండాడ దుర్గానగర్ సమీపంలో సర్వే నంబర్ 1లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణానికి ప్రభుత్వం స్థలం కేటాయించింది. ప్రస్తుతం కొండపై రాళ్ల తొలగింపు పనులు జరుగుతున్నాయి. మిషన్లతో రాళ్లను తొలగించడం కష్టంగా ఉండటంతో పేలుళ్ల ద్వారా రాళ్లను తొలగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పేలుళ్ల ధాటికి భారీ శబ్దాలు వస్తుండటంతో ఇళ్లలోని సామగ్రి కదులుతోందని చెబుతున్నారు. పనులు అడ్డుకున్న స్థానికులు : కొండకు ఆనుకుని దుర్గానగర్, ఎస్సీ కాలనీ, బీసీ కాలనీలు ఉండటంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నివాస ప్రాంతాలకు సమీపంలోనే పేలుళ్లు జరుపుతుండటంతో ఇళ్లకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వాపోతున్నారు. పేలుళ్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానిక మహిళలు, యువకులు సంఘటనా స్థలానికి చేరుకుని నిరసన తెలిపారు. పనులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ అడ్డుకున్నారు. అనంతరం కొండపైకి వెళ్లి పేలుళ్లు జరిపిన ప్రాంతాన్ని పరిశీలించారు. నివాసాలకు ఆనుకుని బాంబులు పెట్టి కొండను తొలగించడంపై అధికారులను నిలదీశారు. మరోసారి పేలుళ్లు జరిపితే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
నీటి దారులు మూసేశారు.. ముడసర్లోవను ఎండబెట్టారు
ఆరిలోవ: ముడసర్లోవ రిజర్వాయర్‌కు కొండల నుంచి వచ్చే నీటి దారులు మూసుకుపోవడంతోనే రిజర్వాయర్ ఎండిపోయిందని వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు ఆరోపించారు. ఆదివారం ఆయనతో పాటు వైఎస్సార్సీపీ నాయకులు రిజర్వాయర్‌ను సందర్శించి బీటలు వారిన అడుగు భాగాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మొల్లి అప్పారావు మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావం ఉంటుందని ముందుగానే తెలిసినా విశాఖలో నీటి సమస్య తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేదన్నారు. దీంతో నగరంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొందని మండిపడ్డారు. ఆరిలోవ ప్రాంతానికి తాగునీరు అందించే ముడసర్లోవ రిజర్వాయర్ పూర్తిగా ఎండిపోయిందన్నారు. అప్పన్న కొండపై తవ్వకాలతో.. సింహాచలం అప్పన్న కొండపై గూగుల్ డేటా సెంటర్ పేరుతో తవ్వకాలు చేపట్టడం వల్ల కొండల నుంచి వచ్చే నీటి మార్గాలు మూసుకుపోతున్నాయని వెల్లడించారు. నీరు రిజర్వాయర్‌కు చేరే మార్గాలు లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఈ పాపం కూటమి నాయకులకు తగులుతుందన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి కోసం ప్రజలు ఖాళీ బిందెలతో ఆందోళనలు చేస్తున్నారని, నీటి సమస్య పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. నీటి సమస్య పరిష్కరించాలని అడుగుతున్న ప్రజలపై జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఎదురుదాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ విభాగం అధికార ప్రతినిధి అల్లంపల్లి రాజబాబు, రాష్ట్ర గ్రీవెన్స్ విభాగం ప్రధాన కార్యదర్శి సత్తి మందారెడ్డి, రాష్ట్ర చేనేత విభాగం ప్రధాన కార్యదర్శి వానపల్లి ఈశ్వరరావు, వార్డు అధ్యక్షులు సత్యాల వెంకట్, మొల్లి హేమంత్, పతివాడ కనకరాజు, నాయకులు కన్నేటి సుబ్బారెడ్డి, బేత దుర్గారావు, వానపల్లి మంగరాజు, ప్రసంగి వాసు, పాండ్రంగి శ్రీనివాస్, గోవింద్, బాబూరావు, బంగార్రాజు, రాము, మహేష్, సురేష్, బాషా తదితరులు పాల్గొన్నారు. -
రెవెన్యూ సర్వీసెస్ రాష్ట్ర సంఘంలో రాజేంద్ర వర్మ
మహారాణిపేట: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర సంఘం ఎన్నికల్లో జిల్లా కలెక్టర్ పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తున్న డి.రాజేంద్ర వర్మ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా మరోసారి ఎన్నికయ్యారు. ఆదివారం విజయవాడలో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోసారి అధ్యక్షుడిగా, సీసీఎల్ఏ కార్యాలయంలో అడిషనల్ అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న చేబ్రోలు కృష్ణమూర్తి మూడోసారి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అమరావతి విశాఖపట్నం జిల్లా చైర్మన్ సత్తి నాగేశ్వరరెడ్డి, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ విశాఖ జిల్లా అధ్యక్షుడు ఎస్.ఎ.త్రినాథరావు, కార్యదర్శి పి.శ్యాం ప్రసాద్, కోశాధికారి జి.రాజేష్, పి.సుధీర్, యోగి, వి.వరుణ్, గౌతమ్ తదితరులు రాష్ట్ర నూతన కార్యవర్గ సభ్యులను ఘనంగా సత్కరించి అభినందించారు. రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నూతన కార్యవర్గం మరింత సమర్థవంతంగా కృషి చేయాలని నాగేశ్వరరెడ్డి ఆకాంక్షించారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగిని అనుమానాస్పద మృతి
పోచారం (హైదరాబాద్): సాఫ్ట్వేర్ ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో అత్మహత్యకు పాల్పడటం పోచారం ఐటీ కారిడార్‌లో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురానికి చెందిన కే. మౌనిక సంతోషి (28) పోచారం ఐటీ కారిడార్‌లోని యాక్సిస్ బ్యాంక్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తోంది. వైజాగ్‌కు చెందిన రమాకాంత్‌ను ప్రేమించి 8 ఏళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకుంది. పోచారంలోని సంస్కృతి టౌన్షిప్ సమీపంలోని గ్యాలాక్సీ టవర్స్‌లో ఉంటున్నారు. వీరికి రెండున్నరేళ్ల వయస్సు గల మగ కవల పిల్లలు ఉన్నారు. రమాకాంత్ ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్వేర్ హెచ్ఆర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆదివారం ఉదయం తలుపులు తెరిచి ఉండటంతో పని మహిళ ఇంట్లోకి వచ్చి చూడగా మౌనిక ఉరి వేసుకున్న స్థితిలో కనిపించింది. వెంటనే హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శనివారం రాత్రే ఈ ఘటన జరిగి ఉండొచ్చని, ఆ సమయంలో భర్త ఇంట్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. మౌనిక మృతికి భర్త వేధింపులే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
లాంగ్ రైడ్ విషాదాంతం
యలమంచిలి రూరల్: అంతవరకూ ఆనందంగా... స్నేహితుల కోలాహలంతో సాగుతున్న ప్రయాణంలో అంతలోనే విషాదం అలుముకుంది. వారాంతంలో సరదాగా స్నేహితులతో కలిసి విశాఖ నుంచి ప్రకాశం జిల్లా చీరాల బీచ్‌కు లాంగ్ రైడ్‌కు వెళ్లిన యువ వ్యాపారి తిరుగు ప్రయాణంలో యలమంచిలి మండలం రేగుపాలెం హైవే కూడలి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. యలమంచిలి రూరల్ ఎస్ఐ ఉపేంద్ర, స్థానికులు తెలిపిన వివరాలు... విశాఖపట్నం కంచరపాలెం ప్రాంతానికి చెందిన దుస్తుల వ్యాపారి పురిపండ నాగ దంతేశ్వర రావు(34).. వీకెండ్ కావడంతో తన స్నేహితులు జోసెఫ్, మాథ్యూ, రితేష్ ,మరికొందరితో కలిసి స్పోర్ట్స్ బైక్‌లపై లాంగ్ రైడ్‌కు చీరాల బీచ్‌కు వెళ్లారు. అక్కడ సరదాగా గడిపిన అనంతరం తిరిగి విశాఖపట్నం ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో యలమంచిలి మండలం రేగుపాలెం హైవే కూడలి సమీపానికి వచ్చేసరికి దంతేశ్వరరావు తన ద్విచక్ర వాహనాన్ని ఎడమ వైపు నుంచి ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించాడు. ద్విచక్రవాహనం అదుపుతప్పి లారీ వెనుక చక్రాల కిందకు దూసుకుపోయింది. దంతేశ్వరరావు శరీరంపై నుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సరదా కోసం మొదలైన ప్రయాణం రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించడంతో విషాదాంతమైంది. ప్రమాద సమాచారం అందుకున్న హైవే పెట్రోలింగ్ పోలీసులు, యలమంచిలి రూరల్ ఎస్ఐ ఉపేంద్ర, సిబ్బందితో ప్రమాద స్థలానికి చేరుకుని లారీ చక్రాల కింద చిక్కుకుపోయిన ద్విచక్రవాహనాన్ని, మృతదేహాన్ని పక్కకు తొలగించి, వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు. మృతదేహాన్ని అంబులెన్సులో అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. దీనిపై మృతుడి సోదరుడు పురిపండ నవీన్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
పోలమాంబకు టెండర్!
పెదవాల్తేరు: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పుగా, విశాఖలో ప్రసిద్ధి చెందిన పెదవాల్తేరు కరక చెట్టు పోలమాంబ అమ్మవారి ఆలయ ఆదాయంపై వివాదం నెలకొంది. ఆలయానికి ప్రధాన ఆదాయ వనరైన కల్యాణ మండపం టెండర్‌దారుడు నిబంధనల మేరకు సొమ్ము చెల్లించకుండానే మండపాన్ని నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రూ.1.60 కోట్లకు టెండర్.. చెల్లించింది రూ.45 లక్షలే దేవదాయ శాఖ ఆధ్వర్యంలోని పోలమాంబ ఆలయ కల్యాణ మండపానికి పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలతో పాటు ఎగ్జిబిషన్లు, వివిధ కార్యక్రమాల నిర్వహణకు డిమాండ్ ఉంది. మండపం నిర్వహణకు ప్రతి రెండేళ్లకోసారి బహిరంగ వేలం నిర్వహిస్తారు. 2025 జూన్‌లో జరిగిన వేలంలో శ్రీనివాస్ అనే వ్యక్తి రెండేళ్ల కాలానికి రూ.1.60 కోట్లకు టెండర్ దక్కించుకున్నట్లు సమాచారం. జీఎస్టీతో కలిపి ఈ మొత్తం సుమారు రూ.1.89 కోట్లు వరకు చెల్లించాల్సి ఉంది. నిబంధనల ప్రకారం తొలి ఏడాదిలో మొత్తం టెండర్ విలువలో 50 శాతం, అంటే రూ.80 లక్షలు చెల్లించాల్సి ఉంది. మిగతా మొత్తాన్ని రెండో ఏడాదిలో చెల్లించాలి. అయితే 16 నెలలు గడిచినా ఇప్పటివరకు రూ.45 లక్షలు మాత్రమే చెల్లించినట్లు తెలుస్తోంది. 4 నెలల సొమ్ము ఎగ్గొట్టే ఎత్తుగడ? బకాయిలు చెల్లించాలని అధికారులు నోటీసులు పంపించారు. దీంతో టెండర్‌దారుడు తనకు నష్టం వచ్చిందని, తెలియక ఎక్కువగా వేలంపాట పాడానని, ఏడాది లీజు చెల్లించి తప్పుకుంటానని ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది. దీనిపై టీడీపీ నేతలు కూడా అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే 16 నెలలపాటు మండపాన్ని వినియోగించుకుని 12 నెలలకు చెల్లిస్తే ఆలయ ఆదాయానికి నష్టం వాటిల్లుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెరవెనుక టీడీపీ నేతలు సాధారణంగా టెండర్ నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే నోటీసులు ఇచ్చి టెండర్ రద్దు చేయాలి. కానీ 4 నెలలుగా గడువు దాటినా దేవదాయ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీని వెనుక స్థానికంగా ఉన్న కొంతమంది అధికార టీడీపీ నాయకుల హస్తం ఉందని, వారి అండదండలతోనే లీజు మొత్తాన్ని చెల్లించడం లేదన్న వాదనలు ఉన్నాయి. ఆలయ ఆదాయానికి నష్టం వాటిల్లకుండా పెండింగ్ బకాయిలు వడ్డీతో సహా వసూలు చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. అక్టోబరు నాటికి ఏడాది బకాయి చెల్లిస్తానన్నారు టెండర్‌కు సంబంధించి ఏడాది కాలానికి చెల్లించాల్సిన బకాయి సొమ్ము చెల్లించాలని శ్రీనివాస్‌కు నోటీసులు ఇచ్చాం. దీనిపై శ్రీనివాస్ స్పందిస్తూ.. అక్టోబరు నాటికి ఏడాది కాలం బకాయిలు చెల్లిస్తానని రాతపూర్వకంగా చెప్పారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం. వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం రాజగోపాల్‌రెడ్డి, ఈవో, పోలమాంబ దేవాలయం -
‘గ్యాంగ్స్ ఆఫ్ సికింద్రాబాద్’ చిత్ర బృందం సందడి
అల్లిపురం: నగరంలో ‘గ్యాంగ్స్ ఆఫ్ సికింద్రాబాద్’ చిత్ర బృందం సందడి చేసింది. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా 50 మంది నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి, ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. యువత మాదకద్రవ్యాలు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని శంఖబ్రత బాగ్చి పిలుపునిచ్చారు. సామాజిక సందేశంతో రూపొందిన సినిమాలు యువతలో మార్పుకు దోహదపడతాయని అన్నారు.చిత్ర బృందం సభ్యులు ఇమ్రాన్, హర్ష సాయి మాట్లాడుతూ యువత, తల్లిదండ్రులు చిత్రాన్ని ఆదరించాలని కోరారు. మహిళా సాధికారతలో భాగంగా కుట్టు మిషన్లు అందించడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం మానసిక దివ్యాంగులకు సత్కారం చేశారు. కార్యక్రమంలో డైరెక్టర్ మణి డి అపెక్స్, నటీనటులు కట్టప్ప, గోపాల్, హర్ష, చింటూ, సలీం, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. -
అడవివరం గ్రామకంఠాల సమస్యపై అఖిలపక్ష పోరు
సింహాచలం : అడవివరం గ్రామకంఠాల సమస్యపై పార్టీలకతీతంగా పోరాడాలని అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చారు. అడవివరం, పాతఅడవివరం, విజినిగిరిపాలెం గ్రామకంఠాల సమస్య పరిష్కారం కోసం ఆదివారం అడవివరంలోని రాజవీధిలో ఉన్న రామాలయం వద్ద గ్రామసభ నిర్వహించారు.ఏళ్ల తరబడి గ్రామకంఠాల సమస్యతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నాయకులు ప్రస్తావించారు. గ్రామకంఠాల్లో ఉన్న ఇళ్లు, జిరాయితీ భూములు, ఖాళీ స్థలాలపై హక్కులు ఉన్నప్పటికీ ప్రభుత్వం హక్కుదారులుగా పరిగణించకపోవడం దారుణమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామకంఠాల్లో నివసించే వారికి ప్రభుత్వం హక్కులు కల్పిస్తూ, భూములను 22ఏ నుంచి తొలగిస్తోందని, కానీ అడవివరం గ్రామకంఠాల భూముల విషయంలో మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.అడవివరంలోని సర్వేనంబరు 81ఏలోని 25 ఎకరాలు, విజినిగిరిపాలెంలోని సర్వేనంబరు 123లోని 1.66 ఎకరాలు, పాతఅడవివరంలోని 8.58 ఎకరాలను 22ఏ(1)(సి) నుంచి తొలగించి హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామకంఠం భూముల సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ విషయంపై భీమిలి ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్‌ను కలుస్తామని తెలిపారు.పంచగ్రామాల భూ సమస్యతో గత ముప్పై ఏళ్లుగా ప్రజలు, నివాసితులు, రైతులు, ఖాళీ స్థలాల యజమానులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వారిని ఆక్రమణదారులుగా చిత్రీకరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. సమస్యలపై పోరాటానికి కమిటీని ఏర్పాటు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. సమావేశంలో భీమిలి మాజీ ఎమ్మెల్యే కర్రిసీతారాం, అడవివరం మాజీ సర్పంచ్ పాశర్ల ప్రసాద్, అడవివరం కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు కర్రి అప్పలస్వామి, గ్రామస్తులు కొలుసు ఈశ్వరరావు, గుసిడి శంకరరావు, లంక సత్తిబాబు, కొణపల సత్యనారాయణ, రచ్చ ఆనందశ్రీనివాసవర్మ తదితరులు పాల్గొన్నారు. రూ.లక్ష విరాళం అడవివరం గ్రామకంఠం భూముల సమస్య, పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం కోసం కమిటీ చేసే పోరాటానికి తనవంతుగా లక్ష రూపాయల విరాళం అందిస్తానని కర్రి అప్పలస్వామి సభాముఖంగా ప్రకటించారు. సమస్య పరిష్కారం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. -
లారీ ఢీకొని మహిళ మృతి
ఎంవీపీ కాలనీ: లారీ ఢీకొని ఓ మహిళ మృతి చెందిన ఘటన ఎంవీపీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరిలోవ డెయిరీఫారం ఆదర్శనగర్‌కు చెందిన చింతాడ శ్రీదేవి (40) కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటోంది. ఆదివారం ఉదయం మార్కెట్‌కు వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆమె ఇసుకతోటలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఎదురుగా రోడ్డుపక్కన నడుచుకుంటూ వెళ్తోంది. అదే సమయంలో హనుమంతవాక నుంచి మద్దిలపాలెం వైపు వెళ్తున్న ఏపీ 35వై 4445 నంబరు గల లారీ పెట్రోల్ బంక్‌లోకి వెళ్లే క్రమంలో శ్రీదేవిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి భర్త తమ్మినాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంవీపీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ పైడి నాయుడు అజాగ్రత్తగా వాహనం నడపడంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. -
ఉత్సాహంగా చెస్ పోటీలు
పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లులో ఆదివారం రాష్ట్రస్థాయి ఓపెన్ ర్యాపిడ్ చదరంగం పోటీలు ఉత్సాహంగా జరిగాయి. స్థానిక బ్రాడీపేట బైపాస్ రోడ్డులో యూరోకిడ్స్లోని అనసూయ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు మాదాసు కిశోర్ మాట్లాడుతూ పోటీలకు ఆరు జిల్లాల నుంచి 67 మంది క్రీడాకారులు హాజరైనట్టు చెప్పారు. పోటీల్లో చొప్పా వీర వెంకట వివేశ్ (ఏలూరు జిల్లా), ఆముదాలపల్లి పూజిత (పశ్చిమగోదావరి), పినిశెట్టి ధరణి (కోనసీమ), కొట్టాల గీతశ్రీ (అనకాపల్లి), ఎం.మౌర్యసూర్య (పశ్చిమగోదావరి) మొదటి ఐదు స్థానాల్లో నిలిచారన్నారు. విజేతలకు రూ.30 వేల నగదు బహుమతులు అందించినట్టు తెలిపారు. యూరోకిడ్స్ డైరెక్టర్ మద్దుల రాజేష్ పాల్గొన్నారు. -
25 నుంచి పూర్తిస్థాయి రాజకీయ నేతగా..
మహారాణిపేట: జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా నిజాయితీగా పనిచేశానని, ఈ నెల 25 నుంచి పూర్తిస్థాయి రాజకీయ నేతగా మారబోతున్నానని ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఆమెకు ఆత్మీయ సత్కార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనకు కల్పించిన అవకాశాన్ని ఐదేళ్లపాటు సద్వినియోగం చేసుకున్నానని తెలిపారు. రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియని తనకు ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన జగన్మోహన్రెడ్డిని జీవితాంతం గుర్తుంచుకుంటానని భావోద్వేగానికి గురయ్యారు. తనకు అండగా నిలిచిన సోదరుడు, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఒత్తిళ్లకు లొంగకుండా.. చైర్‌పర్సన్‌గా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా లొంగకుండా.. జిల్లా అధిపతిగా కాకుండా ఉత్తమ అధికారిలా పనిచేయాలనే ఆలోచనతో ముందుకు సాగానన్నారు. అందుకే జెడ్పీ ఉద్యోగులంతా తన కుటుంబ సభ్యులుగా మారారని పేర్కొన్నారు. కోవిడ్ తదితర కారణాలతో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు చెందిన 160 మందికి కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు ఇప్పించామన్నారు. తన హయాంలో వివిధ స్థాయిల్లో 195 మందికి పదోన్నతులు కల్పించగలిగామని, కష్టాల్లో ఉన్న ఉద్యోగుల కుటుంబాలకు అండగా నిలిచినందుకు సంతృప్తిగా ఉందన్నారు. పాలనాదక్షతకు చైర్పర్సన్ నిదర్శనం జెడ్పీ సీఈవో నారాయణమూర్తి మాట్లాడుతూ.. పాలనా దక్షత, నిబద్ధతకు చైర్పర్సన్ సుభద్ర నిదర్శనమన్నారు. ఉద్యోగులను కుటుంబ సభ్యులుగా చూసుకుంటూనే రాజకీయ ఒత్తిళ్లను అధిగమించి అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చారని తెలిపారు. జెడ్పీ చరిత్రలోనే ఉద్యోగులంతా సంతోషంగా గడిపిన కాలం చైర్పర్సన్ సుభద్ర హయాంలోనేనన్నారు. ఆమెకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు. డిప్యూటీ సీఈవో రాజకుమార్, పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సత్తిబాబు తదితరులు సుభద్ర సేవలను కొనియాడారు. అనంతరం జల్లిపల్లి సుభద్ర–మూర్తి దంపతులను ఉద్యోగులు గజమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డీడీవో ఉషారాణి, ఎస్జీఎస్డబ్ల్యూ జిల్లా అధికారి సత్యనారాయణ, సంఘం ప్రధాన కార్యదర్శి సీతారామరాజు, అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సోనాయి అప్పలరాజు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
డేటా సెంటర్లకు వ్యతిరేకంగా ర్యాలీ
మహారాణిపేట: నగరంలో ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ గ్రీన్ విశాఖ ఆధ్వర్యంలో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. ఆర్కే బీచ్ స్టాప్ నుంచి భగత్‌సింగ్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. నగరంలో తాగునీటి సమస్యను మరింత పెంచే డేటా సెంటర్లను రద్దు చేయాలని, ఉపాధి అవకాశాలు కల్పించని డేటా సెంటర్లకు ఇచ్చిన అనుమతులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రీన్ విశాఖకు చెందిన జయశ్రీ హటాంగిడి, దీక్ష, గ్రీన్ విశాఖ కోశాధికారి జి. కాంతారావు, కె. తిరుపతిరావు, అజయ్, సాయి తేజ తదితరులు పాల్గొన్నారు. ఆర్కే బీచ్ వద్ద నిరసన తెలియజేస్తున్న యువతీయువకులు -
కాంట్రాక్ట్ ఉద్యోగుల సమరభేరి
ఉద్యోగుల ఆందోళనకు సంఘీభావం తెలియజేస్తున్న జేఏసీ నాయకులు సమావేశానికి వెళ్లకుండా కాంట్రాక్ట్ ఉద్యోగులను అడ్డుకుంటున్న పోలీసులుమహారాణిపేట: కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరుతూ ఆందోళన చేస్తున్న వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగుల జేఏసీ ఆదివారం సమరభేరి మోగించింది. ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల జోన్–1 మహా సమావేశాన్ని టర్నర్ సత్రం ఆవరణలో నిర్వహించాలని నిర్ణయించగా, అనుమతులు రద్దు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనుమతి లేకుండా సమావేశం నిర్వహించవద్దని సూచించారు. దీంతో సమావేశాన్ని రామాటాకీస్ అంబేద్కర్ భవన్‌కు మార్చారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు చెందిన కాంట్రాక్టు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జేఏసీ నాయకులు ఎస్.కె.ఆశ, ఎం.సిహెచ్ కిశోర్‌రావు, పైడిరాజు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఉద్యోగులు చేరుకున్న వెంటనే పోలీసులు అంబేడ్కర్ భవన్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. తనిఖీల అనంతరం మాత్రమే లోపలికి అనుమతించారు. డిమాండ్లపై ఉద్యోగుల ఆందోళన పోలీసు ఆంక్షల మధ్య సమావేశం నిర్వహించారు. కాంట్రాక్టు ఉద్యోగులందరినీ తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని, అప్పటివరకు 100 శాతం గ్రాస్ శాలరీ అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని జేఏసీ డిమాండ్ చేసింది. అనుమతి లేకుండా ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించవద్దని పోలీసులు సూచించారు. ఇటీవల సచివాలయం ఉద్యోగుల ఆందోళనల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా నిబంధనలు విధించినట్లు తెలిసింది. మధ్యాహ్నానికి సమావేశం ముగిసింది. శాంతియుతంగా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కార్యక్రమం చేపడుతుండగా పోలీసుల ఆంక్షలు విధించడం సరికాదని జేఏసీ నాయకులు ఎస్.కె.ఆశ, ఎం.సిహెచ్ కిశోర్‌రావు, పైడిరాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశానికి పోలీసుల ఆంక్షలు -
వాటర్ నిల్
ఐటీ హిల్.. రుషికొండ ఐటీ హిల్స్సాక్షి, విశాఖపట్నం: ఉదయం లేచింది మొదలు.. ఐటీ రంగం అభివృద్ధి గురించి గొప్పలు చెప్పే చంద్రబాబు ప్రభుత్వం అసలు వైఖరి బయటపడింది. విశాఖలోని రుషికొండ ఐటీ హిల్స్‌లో దాహం కేకలు వినిపిస్తున్నా.. ప్రభుత్వం చెవికి సోకడం లేదు. ఏపీఐఐసీ హిల్ నం.2,3లో ఉన్న ఐటీ కంపెనీలు చుక్క నీరు లేక విలవిల్లాడుతున్నాయి. భూగర్భ జలాలు దారుణంగా అడుగంటిపోవడంతో అక్కడ పనిచేస్తున్న సుమారు 5,000 మంది ఐటీ ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఐటీ పరిశ్రమలకు నెలకు 6.5 మిలియన్ లీటర్ల నీరు అవసరం కాగా ప్రస్తుతం కేవలం 2.5 మిలియన్ లీటర్లు మాత్రమే సరఫరా అవుతుండటంతో పరిస్థితి దయనీయంగా మారింది. సమస్యను ఎన్నిసార్లు విన్నవించుకున్నా ప్రభుత్వం కనీస స్థాయిలో పట్టించుకోకపోవడం సర్కారు చేతకానితనానికి అద్దం పడుతోంది. పొదుపుగా వాడుకోవాలంటూ నోటీసులు రుషికొండ ఐటీ హిల్స్‌లో ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వంటి దాదాపు 15 ప్రముఖ ఐటీ కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా నీటి వినియోగం భారీగా పెరిగి, భూగర్భ జలాలు దారుణంగా పడిపోయాయి. దీంతో అక్కడ పరిస్థితి మరింత దిగజారింది. పంపింగ్ మోటార్లను రోజుకు 12 నుంచి 15 గంటల పాటు నిరంతరాయంగా నడిపిస్తున్నప్పటికీ, డిమాండ్‌కు తగ్గ నీరు అందడం లేదు. దీంతో సమస్యను పరిష్కరించలేమంటూ ఏపీఐఐసీ చేతులెత్తేసింది. నీటిని అత్యవసరాలకే వాడుకోవాలని.. పొదుపుగా వినియోగించాలంటూ ఐటీ సంస్థలకు ఏకంగా నోటీసులు జారీ చేసి చేతులు దులిపేసుకుంది. అడుగంటిన భూగర్భ జలాలు రెండు హిల్స్‌లో నీటి వినియోగం సుమారు 4.5 ఎంఎల్‌డీగా ఉండేది. ప్రస్తుతం ఈ నీటి వినియోగం 6.2 ఎంఎల్డీలకు పెరిగింది. కానీ, ఉన్న బోరుబావుల్లో నీటి ఊట దారుణంగా పడిపోవడంతో పంపింగ్ సామర్థ్యం తగ్గిపోయింది. రుషికొండ ప్రాంతాల్లో గతేడాది సెప్టెంబర్‌లో 22 అడుగులకు భూగర్భ జలాలు ఉండగా.. ఈ ఏడాది ఏకంగా 80 నుంచి 90 అడుగులకు పడిపోయాయి. దీంతో మోటర్లకు నీరు అందే పరిస్థితి కనిపించడం లేదు. 250 నుంచి 300 అడుగుల లోతుకు వెళ్తే తప్ప నీరు అందడం లేదని స్థానికులు చెబుతున్నారు. సమస్య చెప్పినా పట్టించుకోని ప్రభుత్వం నీటి కొరతను తీర్చడంలోనూ.. ముందస్తు ప్రణాళికలు రచించడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐటీ సంస్థలకు కనీస అవసరమైన నీటిని కూడా సరఫరా చేయలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందనడానికి తాజా గణాంకాలే ప్రత్యక్ష నిదర్శనం. నీటి కొరత వేధిస్తోందంటూ పలు ఐటీ కంపెనీలు కొద్ది రోజులుగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాలు చూపించకుండా.. పొదుపు చేయాలని నోటీసులివ్వడంపై ఐటీ సంస్థల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హెచ్చరికలతో ఆదరాబాదరాగా.. ఇలాగైతే ఇక్కడ పనిచేయలేమని కొన్ని సంస్థలు ప్రభుత్వ పెద్దలకు నేరుగా తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఇన్నాళ్లూ నిద్ర నటించిన ప్రభుత్వం ఇప్పుడు హడావుడి మొదలు పెట్టింది. ప్రస్తుతం ఉన్న సరఫరాకు అదనంగా మరో వనరును సమకూర్చేందుకు ఏర్పాట్లు చేయాలంటూ ఏపీఐఐసీని ఆదేశించింది.ఐటీ హిల్స్ సమీపంలో ఉన్న కృష్ణా మినీప్లెక్స్ సమీపంలోని రెండు బోరుబావుల్లో నీరు పడుతున్నప్పటికీ, అక్కడ తక్కువ సామర్థ్యం గల మోటార్లు ఉన్నాయి. వాటి స్థానంలో అధిక సామర్థ్యం గల మోటార్లను బిగించి, అక్కడి నుంచి హిల్ నం.3 సంప్‌కు పైప్‌లైన్ వేయాలని ఏపీఐఐసీ ప్రణాళికలు సిద్ధం చేసే పనిలో పడింది. దీంతో పాటు హిల్ నం.2,3 కోసం కొత్త వాటర్ సప్లై ప్లాన్‌ను కూడా రూపొందిస్తోంది.కొద్ది రోజులుగా వేలాది మంది ఐటీ ఉద్యోగులు ఇన్ని ఇబ్బందులు పడుతూ ప్రభుత్వానికి తమ గోడు వెళ్లబోసుకున్నా, అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి.. ఇప్పుడు హడావుడి చేస్తుండటంపై మండిపడుతున్నారు. రుషికొండ ఐటీ హిల్స్‌లో దాహం కేకలు ఐటీ కంపెనీల ప్రాంతంలో అడుగంటిన భూగర్భ జలాలు దారుణంగా పడిపోయిన గ్రౌండ్‌వాటర్ లెవల్స్ ఐటీ పరిశ్రమలకు నెలకు 6.5 మిలియన్ లీటర్లు అవసరం ప్రస్తుతం 2.5 మిలియన్ లీటర్లు మాత్రమే సరఫరా నీరు లేక అవస్థలు పడుతున్న 5 వేల మంది ఐటీ ఉద్యోగులు నీటిని పొదుపుగా వాడాలంటూ ఐటీ సంస్థలకు నోటీసులిచ్చిన ఏపీఐఐసీ సమస్య విన్నవించుకున్నా పట్టించుకోని ప్రభుత్వంఇదేనా మీ విజనరీ చంద్రబాబూ.? ప్రత్యామ్నాయ మార్గాలు పూర్తయ్యే సరికి మరో 50 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటివరకు ఐటీ కంపెనీలు తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సిందేనన్నది స్పష్టమవుతోంది. ఐటీ రంగంలో పెద్ద పెద్ద మార్పులు తెస్తాననీ.. విశాఖను ఐటీ హబ్‌గా చేసేస్తానంటూ పదేపదే చంద్రబాబు, లోకేష్ బీరాలు పలికారు. ఇప్పుడు కనీసం అక్కడ పనిచేసే ఉద్యోగులకు గుక్కెడు నీరు అందించలేని స్థితిలో ఉండటం విస్మయానికి గురిచేస్తోంది.ఇదే నిర్లక్ష్యంతో ప్రభుత్వం వ్యవహరించి.. కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా కేవలం ప్రకటనలకే పరిమితమైతే.. ఉన్న కంపెనీలు కూడా వెళ్లిపోయి విశాఖ ఐటీ రంగం కుదేలవడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
భీమిలి కస్తూర్బా ఘటనపై విచారణ
భీమునిపట్నం: భీమిలిలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో తొమ్మిదో తరగతి విద్యార్థినుల జడలు కత్తిరించిన ఘటనపై సమగ్ర విచారణ జరుగుతోందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం విద్యాలయాన్ని సందర్శించిన ఆయన ప్రిన్సిపాల్ గంగాకుమారితో పాటు విద్యార్థినులతో మాట్లాడారు. అనంతరం ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ ఘటన దురదృష్టకరమన్నారు. విద్యార్థినులను విచారించినప్పటికీ తమకు తెలియదని, ఘటనపై ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదన్నారు. బయటి వ్యక్తులు వచ్చి ఈ ఘటనకు పాల్పడే అవకాశం లేదని, విద్యాలయంలోని వారిలోనే ఎవరో ఒకరు చేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని, త్వరలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ఇద్దరికి తీవ్రగాయాలు పెందుర్తి: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. పెందుర్తి పోలీసుల వివరాల ప్రకారం.. మన్యం జిల్లా కల్లికోటకు చెందిన బోని రాంబాబు (22) తెనాలిలోని ఓ హోటల్లో పనిచేస్తున్నాడు. గాజువాకలో ఉంటున్న తన అక్క ఇప్పిలి ధనలక్ష్మి, ఆమె కుమారుడు దేవ్‌తో కలిసి రాంబాబు సొంత గ్రామమైన కల్లికోటకు వెళ్లాడు. తిరిగి ఆదివారం ముగ్గురూ బైక్‌పై ఆనందపురం హైవే మీదుగా పెందుర్తి వైపు వస్తున్నారు. అక్కిరెడ్డిపాలెం వద్ద మలుపు దాటిపోవడంతో బైక్‌ను వెనక్కి తిప్పుతుండగా.. వెనుక నుంచి వచ్చిన వ్యాన్ బుల్లె ట్ను ఢీకొట్టింది. రాంబాబు అక్కడికక్కడే మృతిచెందగా ధనలక్ష్మి, దేవ్‌కు గాయాలు కావడంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పెందుర్తి సీఐ సతీష్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భీమిలి కస్తూర్బా విద్యాలయంలో అమానుషం
భీమునిపట్నం: విశాఖ జిల్లా భీమిలిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు కొందరు తొమ్మిదో తరగతి చదువుతున్న పదిమంది విద్యార్థినుల జడలు కత్తిరించడం కలకలం రేపింది. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి జరగగా శనివారం వెలుగులోకి వచ్చింది. ఈ తరగతిలో మొత్తం 38 మంది విద్యార్థినులు ఉన్నారు. వీరిలో 20 మంది ఒక గదిలో, 18 మంది మరో గదిలో నిద్రిస్తారు. బుధవారం రాత్రి 12 గంటల వరకు వార్డెన్ పర్యవేక్షణలోనే విద్యార్థినులు ఉన్నారు. అనంతరం అందరూ నిద్రించిన తర్వాత.. ఒక గదిలో నిద్రిస్తున్న ఆరుగురి జడలను, మరో గదిలో నిద్రిస్తున్న నలుగురి జడలను గుర్తుతెలియని వ్యక్తులు కత్తిరించినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. కేవలం ఒక్క జడ వేసుకున్న బాలికల జడలనే కత్తిరించడం గమనార్హం. ఈ ఘటనపై గురువారం విద్యార్థినులను పిలిచి విచారించినప్పటికీ తమకేమీ తెలీదని చెప్పినట్లు ప్రిన్సిపాల్ గంగాకుమారి తెలిపారు. దీంతో పోలీసులకు సమాచారం అందించగా ఎస్ఐ గౌరి విద్యార్థినులను విచారించా రని, ఆమె వద్ద కూడా తమకు తెలియదనే సమాధానం చెప్పారని ప్రిన్సిపాల్ వెల్లడించారు. ఈ విషయాన్ని జిల్లా గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ అధికారి శ్రీదేవి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. కాగా, విద్యాలయంలోకి బయటి వ్యక్తులు ప్రవేశించే అవకాశంలేదని, విద్యార్థినుల్లోనే ఎవరైనా ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది. -
ఘనంగా రాధాష్టమి వేడుకలు
తగరపువలస: ఆనందపురం మండలం గంభీరం ఐఐఎంవీ రోడ్డులోని హరేకృష్ణ వైకుంఠంలో శనివారం హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో రాధాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు స్వయంగా తయారు చేసిన పూలమాలలను రాధారాణికి సమర్పించారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. సాయంత్రం రాధారాణి, మదన మోహనుల విగ్రహాలకు గంగా, గోదావరి తదితర సప్తనదుల నుంచి సేకరించిన జలాలు, పండ్ల రసాలు, పంచామృతాలు, పంచగవ్యాలతో వేదమంత్రాలు, పుష్పాలు, సంకీర్తనల మధ్య మహాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులు సామూహికంగా రాధికాష్టకం పారాయణం చేశారు. హరేకృష్ణ మూవ్మెంట్ అధ్యక్షుడు నిష్కించన భక్తదాస మాట్లాడుతూ రాధాదేవి ఆరాధనకు రాధాష్టమి అపురూపమైన సమయమన్నారు. రాధ అంటే సాక్షాత్తూ శ్రీకృష్ణుడి అంతరంగ శక్తి అని తెలిపారు. మహా మంగళహారతి అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమాలను యదురాజ దాస పర్యవేక్షించారు. -
విశాఖను విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం
సాక్షి, విశాఖపట్నం: సరికొత్త ప్రాజెక్టులు, పెట్టుబడులతో విశాఖ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు అన్నారు. ఏయూ ఇంజనీరింగ్ మైదానంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో 11 మండలాల పరిధిలోని 399 ఎకరాలను క్రమబద్ధీకరించి 28,445 కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టారు. సీఎం చంద్రబాబు లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో తలెత్తుతున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు. పోలవరం ద్వారా గోదావరి జలాలను విశాఖకు తీసుకొచ్చి తాగునీటి ఇబ్బందులను అధిగమిస్తామని చెప్పారు. అనంతరం ఆర్కే బీచ్‌లో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ సాగరతీర స్వచ్ఛత కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. బీచ్‌ను శుభ్రం చేయడంతో పాటు సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తున్న మత్స్యకారులు, స్కూబా డైవర్లు, పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖి మాట్లాడారు. సముద్ర వ్యర్థాల సేకరణ ద్వారా మత్స్యకారులు అదనపు ఆదాయం పొందుతున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. డిజిటల్ తూకం వేసి వారికి ప్రోత్సాహకాలు అందించారు. పెడజాలరిపేటలో ఏర్పాటు చేయనున్న ఓషన్ ప్లాస్టిక్ రికవరీ సెంటర్ పైలట్ సైట్‌ను సీఎం వర్చువల్‌గా ప్రారంభించారు. జీవీఎంసీ మురుగు కాల్వల శుభ్రతకు వినియోగిస్తున్న రోబోటిక్ పరికరాలను పరిశీలించారు. బీచ్‌లో మురిమిక్చర్ విక్రయిస్తున్న ఒంటరి మహిళను పలకరించి ఆమె సమస్యలను తెలుసుకున్నారు. ఆమెకు తక్షణమే పెన్షన్ మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. స్నాక్స్ కోసం మహిళల తోపులాట ఏయూలో శనివారం సీఎం చంద్రబాబు పాల్గొన్న పట్టాల పంపిణీ కార్యక్రమం వద్ద స్నాక్స్ కోసం మహిళలు తోపులాటకు దిగారు. ఒకవైపు సభ జరుగుతుండగా.. మరోవైపు స్నాక్స్ తీసుకునేందుకు మహిళలు ఒక్కసారిగా ఎగబడటంతో కౌంటర్ల వద్ద గందరగోళం నెలకొంది. స్నాక్స్ కోసం మహిళలు పోటీపడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
భీమిలిలో ‘అనూషో’త్సాహం.!
సాక్షి, విశాఖపట్నం: భీమిలి నియోజకవర్గ వైఎస్సార్సీపీ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు శాసనమండలిలో విపక్ష నేత, సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ కుమార్తె డాక్టర్ బొత్స అనూషను భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. ఇప్పటివరకు సమన్వయకర్తగా వ్యవహరించిన మజ్జి శ్రీనివాసరావు పార్టీని వీడిన నేపథ్యంలో భీమిలి బాధ్యతలను అనూషకు అప్పగించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. నియోజకవర్గంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తూ శ్రేణులను ఏకతాటిపైకి తెచ్చే బాధ్యతలను ఆమె భుజానకెత్తుకోవడంతో క్షేత్రస్థాయి కేడర్‌లో నూతనోత్సాహం వెల్లువెత్తుతోంది. క్రియాశీల రాజకీయాల్లోకి.. బొత్స కుటుంబం నుంచి మరో తరం రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ఈ నియామకంతో చర్చనీయాంశంగా మారింది. ప్రత్యక్ష రాజకీయాల్లో చురుకై న పాత్రకు సిద్ధమవుతున్న అనూషకు భీమిలి బాధ్యతలు కీలకమైనవిగా మారాయి. 2024 ఎన్నికల అనంతరం తండ్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహించిన చీపురుపల్లి నియోజకవర్గంలో పార్టీ శ్రేణులతో ఆమె మమేకమైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించడం, స్థానిక నాయకత్వంతో సమన్వయం చేసుకోవడం ద్వారా అక్కడ పార్టీ కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నట్లు పేర్కొంటున్నాయి. ఇప్పుడు భీమిలి బాధ్యతలు చేపట్టడంతో ఆ అనుభవాన్ని కొత్త నియోజకవర్గంలో వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా స్థానిక నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం పెంచడం, పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం ఆమె ముందున్న తక్షణ బాధ్యతలుగా మారాయి. వైద్య సేవ నుంచి ప్రజా క్షేత్రంలోకి.. డాక్టర్ అనూష కేవలం రాజకీయ వారసురాలు మాత్రమే కాదు.. ప్రజాసేవే పరమావధిగా ముందుకు సాగుతున్న నిబద్ధత గల యువ నేత. ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టక ముందే ధీరా ఫౌండేషన్, సత్య ఎడ్యుకేషన్ సొసైటీల డైరెక్టర్‌గా అందించిన వైద్య, సామాజిక సేవలు ప్రజల్లో ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఉన్నత విద్య, వైద్య నేపథ్యం, ప్రజల సమస్యలపై స్పష్టమైన పట్టు, ఆకట్టుకునే వాక్చాతుర్యం ఉన్న యువ నాయకురాలు భీమిలి బాధ్యతలు స్వీకరించడం పట్ల స్థానిక నాయకులు, కార్యకర్తలు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు. భీమిలిలో 2029లోపార్టీ జెండా ఎగరేస్తా.. బాధ్యతలు స్వీకరించిన వెంటనే స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టి సారించనున్నట్లు అనూష ప్రకటించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని, పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు తెలిపారు. తనపై పార్టీ అధినేత వైఎస్ జగన్ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని పేర్కొన్నారు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో భీమిలిలో వైఎస్సార్సీపీ జెండా ఎగరేయడమే తన లక్ష్యమని అనూష ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇప్పటి నుంచే నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని భావిస్తున్నారు. ఈ సందర్భంగా తనకు బాధ్యతలు అప్పగించిన వైఎస్ జగన్‌కు అనూష కృతజ్ఞతలు తెలిపారు. -
‘ఏయూ’ నిధులపై నోరెత్తని బాబు
విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయం అభివృద్ధికి రూ. 500 కోట్లు మంజూరు చేస్తామంటూ ఇచ్చిన హామీ గాల్లోనే తేలిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం మళ్లీ విశాఖకు వచ్చినా, ఏయూ నిధులపై ఎలాంటి ప్రకటనా చేయకపోవడంపై విశ్వవిద్యాలయ విద్యార్థి, ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. నాలుగు నెలలైనా కదలని జీవో ఏప్రిల్ 27న జరిగిన ఏయూ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా వర్సిటీ మౌలిక వసతులు, ఇతర అభివృద్ధి పనుల కోసం రూ. 500 కోట్లు కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారు. అయితే నాలుగు నెలలు గడిచినా ఆర్థిక శాఖ నుంచి ఎలాంటి జీవో విడుదల కాలేదు. శనివారం ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో జరిగిన కార్యక్రమానికి వచ్చిన సీఎం, నిధుల విడుదలపై స్పష్టత ఇస్తారని అంతా ఆశగా ఎదురుచూశారు. కానీ ఆయన ప్రసంగంలో నిధుల ప్రస్తావన తేకపోవడమే కాకుండా, కనీసం ఏయూ వీసీతో కూడా మాట్లాడకపోవడం నిరాశ పరిచింది. ఖజానా ఖాళీ చేస్తున్నారు: నిరుద్యోగ సంఘాల ఆరోపణ సీఎం చెప్పే మాటలకు, చేసే చేతలకు అసలు పొంతన ఉండటం లేదని పలువురు విమర్శిస్తున్నారు. శతాబ్ది వేడుకలకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడం దారుణమని నిరుద్యోగ సంఘాల కన్వీనర్ డాక్టర్ సురేష్ మీనన్ మండిపడ్డారు. రూ. 500 కోట్ల మాట దేవుడెరుగు, ఉన్న వర్సిటీ ఖజానాపై కన్నేసి ప్రభుత్వ కార్యకలాపాలకు నిధులను మళ్లిస్తున్నారు. ఏయూ నిధులను సర్కారు వినియోగించడం తక్షణమే మానేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యక్రమానికి రాజకీయ రంగు విద్యాసంస్థల గౌరవాన్ని, పవిత్రతను కాపాడాల్సిన ప్రజాప్రతినిధులే నిబంధనలను విస్మరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శనివారం ఏయూ మైదానంలో పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమం పూర్తిగా ప్రభుత్వ పరమైనది. అయినప్పటికీ, ఏయూ ప్రాంగణానికి వెళ్లే మార్గంలో టీడీపీ జెండాలు, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఆయన కుమారుడి ఫొటోలతో కూడిన ప్లెక్సీలను ఏర్పాటు చేయడంపై విద్యార్థి సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను స్వాగతిస్తున్నామని అయితే ఏయూ మైదానాలను వాడుకుంటున్నందుకు తక్షణమే వర్సిటీకి అద్దెలు చెల్లించాలని డాక్టర్ సురేష్ మీనన్ కోరారు. విద్యాసంస్థల్లో విద్యార్థులకు రాజకీయ మకిలి అంటించకుండా నాయకులు బాధ్యతతో వ్యవహరించాలని, దిగువ స్థాయి కార్యకర్తలకు సీఎం చంద్రబాబు ఈ విషయంలో స్పష్టమైన దిశా నిర్దేశం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
వెలగపూడీ.. ఇదేమి తీరు?
సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వం నిర్వహించిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఫొటోలతో కూడిన కవర్లను పంపిణీ చేయడం చర్చనీయాంశంగా మారింది. తన ఫొటోతో పాటు తన కుమారుడు వెలగపూడి ప్రతాప్ రుద్ర పేరుతో కూడిన ఫొటోలను కవర్లపై ముద్రించి పట్టాలతో పాటు పంపిణీ చేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ కార్యక్రమానికి రాజకీయ రంగు పులమడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కవర్ల పంపిణీ జరుగుతున్నా అధికారులు వాటిని అడ్డుకోకపోవడంపైనా విమర్శలు వస్తున్నాయి. -
రైతు బజార్లలో సబ్సిడీ బియ్యం పరిమితి పెంపు
ఎంవీపీకాలనీ: పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని రైతు బజార్ల ద్వారా జరుగుతున్న సబ్సిడీ బియ్యం విక్రయాల్లో త్వరలో మార్పులు తీసుకురానున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రస్తుతం ఆధార్ కార్డు నమోదు ఆధారంగా లబ్ధిదారులకు 10 కేజీల వరకు అందిస్తున్న సబ్సిడీ బియ్యం పరిమితిని త్వరలో 25 కేజీలకు పెంచనున్నట్లు వెల్లడించారు. నగర పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం ఎంవీపీ కాలనీ రైతు బజార్లో జరుగుతున్న సబ్సిడీ బియ్యం విక్రయ కేంద్రాన్ని మంత్రి పరిశీలించారు. ఇదిలా ఉండగా వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సోమవారం నుంచి రైతు బజార్లలో సబ్సిడీ ఉల్లి విక్రయాలను ప్రారంభించనున్నట్లు మంత్రి ప్రకటించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సంయుక్త సంచాలకుడు పి.సుధాకర్, ఉప సంయుక్త సంచాలకుడు శ్రీనివాసకిరణ్, డీఎస్వో భాస్కరరావు, డీఎం సృజన, పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు. -
జెడ్పీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రదర్శన
మహారాణిపేట: త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల తుది జాబితాను విశాఖ జిల్లా పరిషత్ కార్యాలయంలో శనివారం జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి, డిప్యూటీ సీఈవో కె.రాజ్‌కుమార్, జెడ్పీ పర్యవేక్షకుడు మూర్తి ప్రదర్శించారు. ఉమ్మడి విశాఖ జిల్లాల పరిధిలోని 39 మండలాల్లో మొత్తం 2,350 పోలింగ్ కేంద్రాలను ఖరారు చేశారు. వీటిలో విశాఖ జిల్లాలో 203, అనకాపల్లి జిల్లాలో 1,530, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 617 కేంద్రాలు ఉన్నాయి. జెడ్పీ అధికారులు ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు జెడ్పీ సీఈవో తెలిపారు. -
బాబు సభకు బస్సులు జనాలకు తిప్పలు
ఫుట్‌పాత్‌పై ప్రమాదకర ప్రయాణండాబాగార్డెన్స్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం విశాఖలో నిర్వహించిన కార్యక్రమాలకు భారీగా ఆర్టీసీ బస్సులను తరలించడంతో సామాన్య ప్రయాణికులు నరకం చూశారు. జన సమీకరణ కోసం జిల్లాలోని వివిధ డిపోల నుంచి దాదాపు 70 శాతం బస్సులను సీఎం సభకు మళ్లించడంతో ప్రజా రవాణా వ్యవస్థ ఒక్కసారిగా స్తంభించింది. ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికుల కోసం ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు, రైల్వే ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. గంటల తరబడి నిరీక్షణ.. కిక్కిరిసిన ప్రయాణం పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, ఆసుపత్రులకు వెళ్లే రోగులతో పాటు డాక్‌యార్డ్, సింధియా, నేవీ తదితర సంస్థలకు వెళ్లే ఉద్యోగులు బస్టాండ్లలో గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఎప్పుడో ఒకసారి వచ్చిన కొద్దిపాటి బస్సులన్నీ కిక్కిరిసిపోయాయి. దీంతో ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఫుట్‌బోర్డులపై ప్రమాదకరంగా గమ్యస్థానాలకు చేరారు. బస్సులు ఎక్కే క్రమంలో తొక్కిసలాట జరిగి మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్సు పాసులున్నా ప్రయోజనం లేకుండా పోయిందని పలువురు ఉద్యోగులు వాపోయారు. మరోవైపు సీఎం సభకు వెళ్లిన కొన్ని బస్సులు కేవలం 10, 15 మందితోనే ఖాళీగా దర్శనమివ్వడం పట్ల ప్రజలు మండిపడ్డారు. నిలువునా దోచేసిన ఆటోవాలాలు బస్సులు లేకపోవడాన్ని ఆసరాగా చేసుకున్న ఆటోలు, ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు ప్రయాణికుల నుంచి ఇష్టారీతిన చార్జీలు వసూలు చేసి జేబులు గుల్ల చేశారు. ముంబై, హైదరాబాద్, చైన్నె, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి విశాఖ రైల్వే స్టేషన్లో దిగిన ప్రయాణికులు.. గమ్యస్థానాలకు చేరేందుకు బస్సులు లేక గందరగోళానికి గురయ్యారు. తప్పనిసరి పరిస్థితుల్లో డిమాండ్ చేసినంత చెల్లించి ఆటోలను ఆశ్రయించాల్సి వచ్చింది. నెలలో ఇది రెండోసారి రాజకీయ సభల కోసం బస్సులను మళ్లించి సామాన్యులను ఇబ్బంది పెట్టడం షరా మామూలుగా మారిందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలలోనే పాయకరావుపేటలో జరిగిన జలహారతి కార్యక్రమానికి, గత నెలలో భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సైతం వందలాది బస్సులను తరలించారు. ప్రతిసారీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఆర్టీసీ యాజమాన్యం తమను రోడ్డున పడేస్తోందని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ సభల కోసం ప్రజా రవాణా వ్యవస్థను స్తంభింపజేయడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. -
673, 975 జీవోలను రద్దు చేయాలి
బీచ్‌రోడ్డు: మున్సిపల్ కార్మికుల ఉపాధికి గొడ్డలిపెట్టుగా మారిన 673, 975 జీవోలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట గాంధీ విగ్రహం వద్ద మహాధర్నా నిర్వహించారు. మున్సిపల్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నాను ఉద్దేశించి యూనియన్ గౌరవ అధ్యక్షుడు పి. వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం బడా పెట్టుబడిదారుల ఆదాయాలు పెంచేలా పాలన సాగిస్తోందే తప్ప, సామాన్య ప్రజలు, కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. గతంలో కార్మిక వ్యతిరేక జీవో 279ని తీసుకొచ్చినందుకే ఆనాడు చంద్రబాబు నాయుడిని కార్మికులు గద్దె దించారని గుర్తుచేశారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఆదాయాలను ప్రభుత్వం తన వైపు తిప్పుకుంటోందే తప్ప, స్థానిక సంస్థలను బలోపేతం చేయడం లేదన్నారు. ఇప్పటికే వీధిలైట్ల నిర్వహణను ప్రైవేటుపరం చేసి, ఆ కాంట్రాక్టులను తమ అనుచరులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి ఉరుకుటి రాజు మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో మున్సిపల్ కార్మికులందరికీ ‘మినిమం టైమ్ స్కేల్’ అమలు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు మాట తప్పి ప్రైవేటీకరణ పేరిట కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తోందని మండిపడ్డారు. యూనియన్ అధ్యక్షుడు టి.నూకరాజు మాట్లాడుతూ ‘స్వచ్ఛ సర్వేక్షన్’లో నగరానికి ఉత్తమ ర్యాంకులు రావడానికి, పట్టణాన్ని శుభ్రంగా ఉంచడానికి మున్సిపల్ కార్మికులే ప్రధాన పాత్ర పోషిస్తున్నారన్నారు. అలాంటి కార్మికులను పర్మినెంట్ చేయాల్సింది పోయి, ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించడం అత్యంత దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు గొలగాని అప్పారావు, జె. నాయుడు, కె. వెంకట్రావు, జి. రమణ, సీహెచ్. రాజు, ఎం.వి. ప్రసాద్, పి. అప్పలరాజు, ఎన్. నాగరాజు, కె.ఎస్. బాలు, ఇ. ఆదినారాయణ, జి. రాము తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ధర్నా -
ఆకట్టుకున్న పురాతన కరెన్సీ, స్టాంపుల ప్రదర్శన
బీచ్‌రోడ్డు: నగరంలోని రామ్‌నగర్ లయన్స్ క్లబ్లో ఏర్పాటు చేసిన భారతీయ పురాతన కరెన్సీ, అంతర్జాతీయ నాణేలు, నోట్లు, తపాలా స్టాంపుల ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ ప్రదర్శనలో భారతీయ కరెన్సీతో పాటు ప్రపంచంలోని సుమారు 200 దేశాలకు చెందిన నాణేలు, నోట్లు, తపాలా స్టాంపులను ప్రదర్శనకు ఉంచారు. రాజుల కాలం నాటి రాగి, వెండి నాణేలు, బ్రిటిష్ కాలం నాటి కరెన్సీ, స్వాతంత్య్రం అనంతరం విడుదలైన తొలి నోట్లతో పాటు ప్రపంచంలోనే అతి చిన్న నాణెం నుంచి అతిపెద్ద నాణెం వరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇలాంటి ప్రదర్శనలు విద్యార్థుల్లో చారిత్రక అవగాహనతో పాటు సేకరణపై ఆసక్తిని పెంచుతాయని నిర్వాహకులు తెలిపారు. ప్రజలు, విద్యార్థులు ఈ ప్రదర్శనను సందర్శించి భారత కరెన్సీ చరిత్రతో పాటు ప్రపంచ దేశాల కరెన్సీ విశిష్టతను తెలుసుకోవాలని కోరారు.పాఠ్యపుస్తకాల్లో చదివిన చరిత్రను ప్రత్యక్షంగా చూసే అవకాశం లభించడం ఎంతో ఆనందంగా ఉందని విద్యార్థులు తెలిపారు. ఈ ప్రదర్శన ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉచితంగా అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు. -
పేదల భూముల పరిరక్షణకు పోరాడుతాం
మహారాణిపేట: దళితులు, బడుగు బలహీన వర్గాలు, రైతులకు సంబంధించిన భూముల పరిరక్షణ విషయంలో వైఎస్సార్సీపీ ప్రజల తరఫున నిరంతరం పోరాడుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మంచా నాగమల్లేశ్వరి స్పష్టం చేశారు. మద్దిలపాలెం కృష్ణా కాలేజ్ రోడ్డులోని పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. దశాబ్దాల క్రితం దళితులు, బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం కేటాయించిన భూములపై ప్రస్తుతం హక్కులు కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆరోపించారు. పేదలు, అణగారిన వర్గాలకు కేటాయించిన భూములను వారి నుంచి దూరం చేసే ప్రయత్నాలను తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. ‘పేదల భూములపై కన్నేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. భోగాపురం పరిసర ప్రాంతాల్లోని పలు సర్వే నంబర్ల భూములపై ప్రజల్లో ఆందోళనలు ఉన్నాయని ఆమె తెలిపారు. ముఖ్యంగా 17, 27, 30, 33, 59 తదితర సర్వే నంబర్ల భూముల విషయంలో వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. కొండపాలెం, బండిపాలెం ప్రాంతాలకు చెందిన 189, 191 తదితర సర్వే నంబర్ల భూముల వివరాలను కూడా ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు. గతంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దళితులు, బడుగు బలహీన వర్గాల హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యం ఇచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం కూడా భూముల సమస్యలపై తమ పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుందని స్పష్టం చేశారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మంచా నాగమల్లేశ్వరి -
ఏలేరు–కణితి ద్వారా తాగునీరు
మహారాణిపేట: విశాఖ నగరానికి తాగునీటి కొరత రాకుండా ఏలేరు–కణితి వ్యవస్థ ద్వారా నీటిని అందిస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. శనివారం విశాఖలోని నార్త్ కోస్టు ఇరిగేషన్ సీఈ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు ఏలేరు నుంచి రోజుకు 300 క్యూసెక్కుల నీరు అందుతోందన్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా ఏలేరులో నీటిని నిల్వ చేస్తున్నామని చెప్పారు. విశాఖకు ప్రధాన నీటి వనరులైన రైవాడ, మేఘాద్రిగెడ్డ, తాటిపూడి రిజర్వాయర్లలో ఉన్న నీటిని తాగునీటికి ప్రాధాన్యమిస్తూ సమర్థంగా వినియోగిస్తున్నట్లు తెలిపారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ నుంచి మేఘాద్రిగెడ్డకు 100 క్యూసెక్కుల నీరు అందించే పైప్‌లైన్ పనులు కొనసాగుతున్నాయని, 10.5 కిలోమీటర్లకు 9 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయని చెప్పారు. 2027లో పోలవరం పూర్తయిన వెంటనే ఎడమ ప్రధాన కాలువ ద్వారా 17,500 క్యూసెక్కుల సామర్థ్యంతో ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. -
వ్యర్థాల శాసీ్త్రయ నిర్వహణకు చర్యలు
మంత్రి నారాయణ మధురవాడ: నగరంలో ఉత్పత్తయ్యే వ్యర్థాలను శాసీ్త్రయంగా నిర్వహించి, ఉపయోగకరమైన వనరులుగా మార్చేందుకు కాపులుప్పాడ డంపింగ్ యార్డులో ఏర్పాటు చేసిన ప్లాంట్లను సమర్థంగా వినియోగించాలని మంత్రి పి.నారాయణ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సునీల్‌కుమార్‌రెడ్డి, జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ తదితర అధికారులతో కలిసి డంపింగ్ యార్డులోని బయోగ్యాస్, సీ అండ్ డీ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లను పరిశీలించారు. నగరంలో ఉత్పత్తయ్యే వ్యర్థాలను ప్లాంట్లకు తరలించి రీసైక్లింగ్ చేస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. ప్లాంట్ల సమర్థ నిర్వహణకు అవసరమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ రూపొందించాలని ఆదేశించారు. భవన నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలను రోడ్ల పక్కన, కాలువలు, ఖాళీ ప్రదేశాల్లో పారవేయకుండా డంపింగ్ యార్డుకు తరలించేలా పటిష్ట చర్యలు చేపట్టాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేష్‌కుమార్ ఆదేశించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ డాక్టర్ పి.సంపత్‌కుమార్, ఇతర అధికారులతో కలిసి ఆయన సీ అండ్ డీ వేస్ట్ ప్లాంట్‌ను సందర్శించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ నల్లనయ్య, జెడ్సీ అయ్యప్పనాయుడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
నాడు విమర్శలు.. నేడు ప్రగల్బాలు
విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) మైదానాల అభివృద్ధిని ఒకప్పుడు కంటిలో నలుసులా చూసి.. పనులపై విష ప్రచారం చేసిన కూటమి నేతలకు.. నేడు అధికారంలోకి వచ్చాక అవే మైదానాలు శరణ్యమయ్యాయి. అప్పట్లో మైదానాల విస్తరణను అడ్డుకోవాలని కుట్రలు పన్నిన నోళ్లే.. ఇప్పుడు అదే విశాలమైన గ్రౌండ్స్‌లో హెలికాప్టర్లతో దిగుతూ.. బహిరంగ సభలు నిర్వహిస్తూ.. ప్రగల్బాలు పలుకుతున్నాయి. గతంలో విశ్వవిద్యాలయ అభివృద్ధిని కక్షపూరితంగా విమర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. నేడు అదే ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానం వేదికగా పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం ఆయన ద్వంద్వ వైఖరికి అద్దం పడుతోంది. విశాలంగా మైదానాలు ఏయూ ప్రధాన మైదానం గతంలో పరిమిత విస్తీర్ణంలో ఉండేది. తుప్పలతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. దీంతో 2019–2024 మధ్య మైదానాలను విస్తరించి, వర్సిటీ భూములను రక్షించాలనే ఉద్దేశంతో గత ఏయూ పాలకవర్గం పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ ప్రధాన మైదానాన్ని 15 ఎకరాల నుంచి 23 ఎకరాలకు విస్తరించారు. 12 ఎకరాల్లో ‘ఊర్జా’ మైదానాన్ని ఏర్పాటు చేశారు. 15.6 ఎకరాల స్థలంలో హెలిప్యాడ్ నిర్మించి, దాని పక్కనే పార్కింగ్ సదుపాయం కల్పించారు. దీంతో నగరంలో భారీ బహిరంగ సభలతో పాటు హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అనువైన మైదానం ఏయూలో అందుబాటులోకి వచ్చింది. భూముల రక్షణకు చర్యలు వర్సిటీ భూములను పరిరక్షించడంతో పాటు అందుబాటులో ఉన్న స్థలాలను సద్వినియోగం చేసేలా అప్పటి అధికారులు చర్యలు చేపట్టారు. పొలమాంబ ఆలయం వద్ద సుమారు 12 ఎకరాలు భూమి అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించారు. మద్దిలపాలెం బ్లాక్–1 వద్ద కూడా స్థలాన్ని సద్వినియోగంలోకి తీసుకొచ్చారు. అయితే మైదానాల విస్తరణ సమయంలో అభివృద్ధి పనులను అడ్డుకోడానికి అప్పటి ప్రతిపక్ష టీడీపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. ఇప్పుడు అదే వేదికపై.. మైదానాల విస్తరణతో ఏయూలో భారీ కార్యక్రమాలకు అనువైన వేదికలు అందుబాటులోకి వచ్చాయి. ప్రధానమంత్రి సభతో పాటు ముఖ్యమంత్రి పాల్గొనే పలు కార్యక్రమాలు ఇక్కడే జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి సహా వీవీఐపీలు హెలిప్యాడ్‌లో నేరుగా దిగి కార్యక్రమాలకు హాజరవుతున్నారు. గతంలో మైదానాల అభివృద్ధిని వ్యతిరేకించిన వారే ఇప్పుడు వాటిని వినియోగించుకుంటున్నారని విద్యార్థి సంఘాల నేతలు గుర్తు చేస్తున్నారు. నిధుల విడుదలకు డిమాండ్ ప్రభుత్వ కార్యక్రమాలకు ఏయూ మైదానాలు, హాస్టళ్లు, గెస్ట్‌హౌస్‌లను వినియోగిస్తున్నప్పుడు కనీసం అద్దె అయినా చెల్లించాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. వర్సిటీ అభివృద్ధికి ప్రకటించిన రూ.500 కోట్లను వెంటనే విడుదల చేయాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంతో పాటు మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నారు. శనివారం జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈ మేరకు స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రూ.500 కోట్ల హామీ ఏమైంది? ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో ఈ ఏడాది ఏప్రిల్ 27న జరిగిన వర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏయూ అభివృద్ధికి రూ.500 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. అయితే ఇప్పటివరకు నిధులు విడుదల కాలేదని, ఇందుకు సంబంధించిన జీవో కూడా రాలేదని విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక శాఖ నుంచి కూడా ఎలాంటి సమాచారం లేదని చెబుతున్నారు. ఇప్పుడు మళ్లీ ఇదే మైదానంలో పట్టాల పంపిణీ కార్యక్రమానికి సీఎం వస్తున్న నేపథ్యంలో.. గత హామీపై ప్రకటన చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. -
ఏయూ దూరవిద్య ప్రవేశాల గడువు పొడిగింపు
విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రంలో ప్రవేశాలకు దరఖాస్తు గడువును అక్టోబర్ 13వ తేదీ వరకు పొడిగించినట్లు దూరవిద్య సంచాలకులు ఆచార్య డీఏ నాయుడు తెలిపారు. యూజీసీ–డీఈబీ సూచనలకు అనుగుణంగా ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ (ఓడీఎల్) ఆఫ్‌లైన్, ఆన్లైన్ లెర్నింగ్ కోర్సులకు ఈ గడువు పొడిగించినట్లు పేర్కొన్నారు. జూలై–ఆగస్టు 2026 సెషన్‌కు సంబంధించి ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులు అక్టోబర్ 13లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓడీఎల్ (ఆఫ్‌లైన్) కోర్సుల ప్రవేశాలు, ఆన్లైన్ కోర్సుల వివరాల కోసం ఏయూ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని తెలిపారు. -
బాబు!
విశాఖపట్నందాహం● మూడు రోజులకోసారి కుళాయి.. అదీ అరకొర నీరే ● బోర్లు ఒట్టిపోయి.. ట్యాంకర్లు, వాటర్ క్యాన్లే దిక్కు ● బిందెడు నీటి కోసం తెల్లవారుజాము నుంచే పడిగాపులు ● ముడసర్లోవ, గంభీరం పరిస్థితి దారుణం.. రైవాడ, మేహాద్రిగెడ్డకూ ముప్పు ● సీఎం పర్యటన వేళ శాశ్వత నీటి భద్రతపై నగరవాసుల ఆశలు7శనివారం శ్రీ 19 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026 నేడు విశాఖకు సీఎం చంద్రబాబు మహారాణిపేట: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం విశాఖకు రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు విమానంలో నగరానికి చేరుకుంటారు. అనంతరం ఆర్కే బీచ్‌లో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య కార్మికులు, ప్రజలతో ముఖాముఖి మాట్లాడతారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్‌కు చేరుకుని లబ్ధిదారులకు పట్టాల పంపిణీతో పాటు పలు మౌలిక సదుపాయాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3.50 గంటలకు విశాఖ నుంచి విమానంలో తిరుగుపయనమవుతారు. నేడు ఇళ్ల పట్టాల పంపిణీ జిల్లాలో ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న 25,880 మందికి సీఎం చంద్రబాబు ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ మైదానంలో పట్టాలు పంపిణీ చేయనున్నారు. విశాఖ రూరల్ మండలంలో అత్యధికంగా 8,074 మందికి, ములగాడ మండలంలో 4,213 మందికి, గాజువాకలో 3,999 మందికి, గోపాలపట్నంలో 2,956 మందికి, పెందుర్తిలో 2,736 కుటుంబాలకు, పెదగంట్యాడలో 1,694 మందికి, మహారాణిపేట మండలంలో 1,228 మందికి కన్వేయన్స్ డీడ్లు అందించనున్నారు. తీర్చండి అడుగంటుతున్న జలాశయాలు.. గొంతెండుతున్న నగరంసాక్షి, విశాఖపట్నం : విశాఖ గొంతెండుతోంది. బిందెడు నీటి కోసం నగరవాసులు నానా అవస్థలు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచే కుళాయిల వద్ద బిందెలతో పడిగాపులు కాస్తున్నా.. వచ్చే నీరు గంట కూడా ఉండటం లేదు. కొన్ని ప్రాంతాల్లో మూడు రోజులకోసారి కుళాయి తిప్పుతుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో అరకొర సరఫరాతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఇళ్లలోని బోర్లు ఒట్టిపోయాయి.. వీధి బోర్లు మూగబోయాయి. తాగడానికి, వంటకు, ఇతర నిత్యావసరాలకు నీరు లేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో వాటర్ క్యాన్లు, ప్రైవేట్ ట్యాంకర్లను ఆశ్రయిస్తూ జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. ఒకవైపు వర్షాభావంతో జలాశయాలు అడుగంటుతుండగా.. మరోవైపు కాంక్రీట్ నిర్మాణా లతో భూగర్భజలాలు కూడా పాతాళానికి పడిపోతున్నాయి. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సమస్య రోజురోజుకూ ముదురుతోంది. మూడు నెలలుగా కొన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతున్నా.. శాశ్వత పరిష్కారం కనిపించకపోవడంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం విశాఖ పర్యటనకు వస్తున్న వేళ.. ‘బాబు.. విశాఖ దాహం తీర్చండి.. మా నీటి కష్టాలు పట్టించుకోండి’ అంటూ నగరవాసులు కోరుతున్నారు. ట్యాంకర్ నీటికి వేల రూపాయలు నీటి సమస్యను ఆసరాగా చేసుకుని ప్రైవేట్ ట్యాంకర్ల నిర్వాహకులు అధిక మొత్తాలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జీవీఎంసీకి నామమాత్రపు రుసుము చెల్లించి నీటిని తీసుకెళ్లే ట్యాంకర్లు.. అదే నీటిని ప్రజలకు అధిక ధరకు విక్రయిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆరు వేల లీటర్ల ట్యాంకర్‌కు పరిధిని బట్టి జీవీఎంసీకి సుమారు రూ.300 వరకు చెల్లిస్తుండగా.. ప్రజల నుంచి రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పటికే నీటి కోసం ఇబ్బందులు పడుతున్న కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. కుళాయి కోసం కాపలా.. నీటి సమస్య కేవలం తాగునీటితోనే ఆగడం లేదు. వంట, స్నానం, ఇంటి శుభ్రత, ఇతర నిత్యావసరాలన్నింటికీ నీరు అవసరం కావడంతో కుటుంబాల రోజువారీ జీవనం అస్తవ్యస్తమవుతోంది. ఉదయం కుళాయి ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూడటం.. వచ్చిన కొద్దిపాటి నీటిని బిందెల్లో నింపుకోవడం.. అది సరిపోకపోతే ట్యాంకర్ కోసం ఫోన్ చేయడం.. ఇలా రోజువారీ జీవితం నీటి చుట్టూనే తిరుగుతోందని నగరవాసులు చెబుతున్నారు. అపార్ట్మెంట్లలో ట్యాంకర్ల ఖర్చు పెరుగుతోంది. పేద, మధ్యతరగతి కుటుంబాలకు మాత్రం ఆ అదనపు భారం మరింత ఇబ్బందిగా మారుతోంది. బోర్లు ఎండిపోవడంతో సొంత నీటి వనరులపై ఆధారపడే అవకాశం కూడా లేకుండా పోయింది. అక్టోబర్ తర్వాత పరిస్థితి ఏంటి? ఇప్పటికే పలు ప్రాంతాల్లో నీటి కష్టాలు కొనసాగుతుండగా.. రాబోయే రోజుల్లో జలాశయాల పరిస్థితి మరింత దిగజారితే నగరంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. రైవాడ, మేహాద్రిగెడ్డ నుంచి ప్రస్తుతం మొత్తం 25.27 ఎంజీడీల నీరు అందుతోంది. అక్టోబర్‌లో ఈ వనరుల నిల్వలు తగ్గితే ఆ లోటును ఎక్కడి నుంచి భర్తీ చేస్తారన్నది కీలక ప్రశ్న. ముడసర్లోవ నుంచి సరఫరా దాదాపు నిలిచిపోగా.. గంభీరం నుంచి ఇప్పటికే నీరు రావడం లేదు. దీంతో ఏలేరు, తాటిపూడి, గోస్తనీ, శారదా తదితర వనరులపై మరింత ఆధారపడాల్సి ఉంటుంది. ఆ సమయంలో నగరంలోని ప్రస్తుత సరఫరాను కొనసాగించేందుకు జీవీఎంసీ వద్ద ఉన్న ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏమిటన్నది ప్రజలకు తెలియాల్సి ఉంది. జీవీఎంసీకి ప్రస్తుతం ఏలేరు, రైవాడ, తాటిపూడి, మేహాద్రిగెడ్డ, ముడసర్లోవ, గంభీరం, గోస్తనీ, శారదా తదితర వనరుల నుంచి రోజుకు 88.41 ఎంజీడీల నీరు అందుతోంది. ఇందులో ఏలేరు నుంచే 46.91 ఎంజీడీలు వస్తుండటంతో నగర సరఫరాలో సగానికిపైగా దానిపైనే ఆధారపడుతోంది. ప్రస్తుతం ఏలేరులో 10.66 టీఎంసీల నిల్వ ఉండగా.. పురుషోత్తపట్నం స్టేజ్–2 ద్వారా 1,400 క్యూసెక్కుల నీటిని నింపుతున్నారు. తాటిపూడి నిల్వలు ఫిబ్రవరి 2027 వరకు సరిపోతాయని అంచనా ఉండగా.. రైవాడ, మేహాద్రిగెడ్డ నిల్వలు అక్టోబర్‌లో కీలక దశకు చేరనున్నాయి. ముడసర్లోవ ఇప్పటికే కనిష్ట నీటిమట్టం కంటే దిగువకు పడిపోయింది. గంభీరం నుంచి సరఫరా సున్నాకు చేరింది. జలాశయాల్లో తగ్గుతున్న నిల్వలుశివపూజ గణపతిగా శ్రీ సంపత్ వినాయగర్ నీరులేక సాగుభూమిలా మారిన మేహాద్రిగెడ్డ జలాశయంఅడుగంటిన ముడసర్లోవ జలాశయం -
మూడు నెలలుగా ఇదే తంటా
మహా విశాఖ నగరంలోని వివిధ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆరిలోవ పరిధిలోని 9 నుంచి 13 వార్డులు, విశాలాక్షినగర్, రవీంద్రనగర్ సహా పలు కాలనీల్లో ముడసర్లోవ రిజర్వాయర్ ఎండడం, బోర్లు ఎండిపోవడంతో మూడు రోజులకోసారి వచ్చే కుళాయిల కోసం బిందెలతో ఎదురుచూస్తూ బయట కేన్లు కొనుక్కుంటున్నారు. మధురవాడ, పీఎం పాలెం, ఎంవీవీ సిటీ ప్రాంతాల్లో భూగర్భజలాలు పడిపోయి గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్ల వాసులు జీవీఎంసీ ట్యాంకర్లకు డబ్బు చెల్లించినా సకాలంలో అందక ప్రైవేట్ ట్యాంకర్లపై అదనపు భారం మోస్తున్నారు. అక్కయ్యపాలెంలోని చిన్నూరు, కాళ్లవారితోటల్లో బోర్లు పనిచేయక కుళాయిలపై ఆధారపడితే తెల్లవారుజామున వచ్చే కొద్దిపాటి నీటిలోనూ బురద వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక దక్షిణ నియోజకవర్గ పరిధిలోని సాలిపేట, పూర్ణామార్కెట్, కల్లుపాకలు, రెల్లివీధి వంటి మురికివాడల్లో టౌన్ సర్వే రిజర్వాయర్ సరఫరా సమయం తగ్గించడంతో తీవ్ర నీటి కొరత ఏర్పడిందని, పనిచేయని వీధి బోర్లకు వెంటనే మరమ్మతులు చేసి ఆదుకోవాలని నగరవాసులు కోరుతున్నారు. -
నకిలీ ఫోన్‌పే మోసాల గుట్టురట్టు
అక్కిరెడ్డిపాలెం: నకిలీ ఫోన్‌పే యాప్ ద్వారా ప్రజలను మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును గాజువాక క్రైం పోలీసులు రట్టు చేశారు. శుక్రవారం గాజువాక క్రైం విభాగంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడిషనల్ క్రైమ్ డీసీపీ ఎన్.రమ్య వివరాలు వెల్లడించారు. ఈ నెల 10న బీహెచ్‌పీవీ జంక్షన్ ఎస్బీఐ ఏటీఎం వద్ద నగదు జమ చేయడానికి వచ్చిన బోరా వెంకటరమణను నిందితుడు బుద్ధ హేమసాయి మోసం చేశాడు. తనకు అత్యవసరంగా నగదు అవసరమని నమ్మించి, ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపిస్తానని చెప్పి అతని వద్ద నగదు తీసుకున్నాడు. అనంతరం నకిలీ ఫోన్‌పే, వాట్సాప్ స్క్రీన్‌షాట్ చూపించి పరారయ్యాడు. ఖాతాలో డబ్బులు జమ కాకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు క్రైమ్ సీఐ జీడీ బాబు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కదలికలను గుర్తించి, ఈ నెల 17న శ్రీనగర్ ఏటీఎం వద్ద నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఒక మొబైల్ ఫోన్, రూ.2,04,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. పోస్టల్ ఉద్యోగే సూత్రధారి ప్రధాన నిందితుడు బుద్ధ హేమసాయి పాడేరు పోస్టల్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్‌గా (ఏబీపీఎం) విధులు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం మెడికల్ లీవ్‌లో ఉన్న అతను, సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో తన స్నేహితులతో కలిసి ఈ మోసాలకు పాల్పడ్డాడు. నకిలీ ఫోన్‌పే యాప్‌లను ఉపయోగించి ఏటీఎంల వద్ద అమాయకులను లక్ష్యంగా చేసుకుని వరుస మోసాలకు పాల్పడుతున్నట్లు తేలింది. నిందితులపై నగరంలో ఇప్పటికే 14 కేసులు ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితులు హేమసాయి, కోరుబిల్లి తరుణ్, శరగడం మురారి, జంజాల గౌతమ్ గగన్ చంద్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడు సూరిశెట్టి హేమంత్ పరారీలో ఉండగా, అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ కేసును విజయవంతంగా ఛేదించిన ఏసీపీ వెంకట్రావు, సీఐ జీడీ బాబు, ఎస్ఐ హరికృష్ణతో పాటు సిబ్బందిని డీసీపీ అభినందించారు. నలుగురు నిందితుల అరెస్ట్,మరో నిందితుడు పరారీ రూ.2.04 లక్షల నగదు,మొబైల్ స్వాధీనం పాడేరు పోస్టల్ ఉద్యోగే కీలక సూత్రధారి -
రైల్వే ఉద్యోగులకు మెరుగైన బ్యాంకింగ్ సేవలు
తాటిచెట్లపాలెం: రైల్వే ఉద్యోగులకు మరింత మెరుగైన బ్యాంకింగ్, ఆర్థిక సేవలందించేందుకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకొచ్చింది. ఈమేరకు సెంట్రల్ బ్యాంక్.. సౌత్ కోస్ట్ రైల్వే విశాఖపట్నం డివిజన్ మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. దొండపర్తిలోని డీఆర్ఎం కార్యాలయంలో శుక్రవారం ఇరు సంస్థల అధికారులు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా డీఆర్ఎం లలిత్ బోహ్రా మాట్లాడుతూ రైల్వే ఉద్యోగులకు సౌకర్యవంతమైన ఉద్యోగి కేంద్రిత ఆర్థిక సేవలు అందించడంలో ఈ భాగస్వామ్యం ఎంతో ఉపయోగకరమన్నారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ జోనల్ హెడ్ ఎం.పిచ్చయ్య మాట్లాడుతూ ఈ అవగాహన ఒప్పందం ద్వారా రైల్వే ఉద్యోగులకు ఆర్థిక భద్రత, బ్యాంకింగ్ సేవలపై మరింత అవగాహన కల్పించడంతోపాటు వారి అవసరాలకు అనుగుణంగా డిపాజిట్లు, రుణాలు, డిజిటల్ బ్యాంకింగ్ తదితర సేవలను సులభంగా అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. సీనియర్ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ జూసుఫ్ కబీర్ అన్సారీ.. సెంట్రల్ బ్యాంక్ విశాఖపట్నం రీజన్ రీజనల్ హెడ్ వి.కృష్ణమోహన్‌లు పరస్పరం ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. కార్యక్రమంలో ఇరు సంస్థల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
ఎన్నికలొస్తేనే చంద్రబాబుకు పేదలు గుర్తొస్తారా?
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వ భూముల్లో ఏళ్లుగా నివసిస్తున్న అర్హులైన పేదల ఇళ్లను నిబంధనల మేరకు క్రమబద్ధీకరించి, వారికి శాశ్వత నివాస భద్రత కల్పించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు శుక్రవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఆగస్టు 31న జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఎన్నికలొస్తేనే చంద్రబాబుకు పేదలు గుర్తొస్తారని, లేకుంటే పేదల బతకుల గురించి కనీసం పట్టించుకోరని ఎద్దేవా చేశారు. జీవో ఎంఎస్ నం.296తో పాటు వర్తించే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అర్హత కలిగిన పేదల ఇళ్ల క్రమబద్ధీకరణకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో హడావుడిగా పేదల ఇళ్ల సమస్యను ప్రభుత్వం తెరపైకి తీసుకురావడం సరికాదన్నారు. ప్రజా సమస్యలను ఎన్నికలతో సంబంధం లేకుండా పరిష్కరించాలని సూచించారు. ప్రకటనలకు పరిమితం కాకుండా స్పష్టమైన ఉత్తర్వులు, పారదర్శక ప్రక్రియ, కాలపరిమితితో కూడిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. జీవితకాల సంపాదనతో ఇళ్లు నిర్మించుకుని దశాబ్దాలుగా నివసిస్తున్న పేద కుటుంబాలకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. అర్హులైన ప్రతి కుటుంబాన్ని గుర్తించి క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కేకే రాజు ప్రభుత్వాన్ని కోరారు. -
రెండు రోజులకు ఒకసారి కుళాయి
రెండు రోజులకు ఒకసారి మాత్రమే కుళాయి నీరు వస్తోంది. భూగర్భ జలాలు ఎండిపోవడంతో చేతి బోర్లు, సొంత బోర్లు పనిచేయడం లేదని.. తాగునీటి కోసం బయట క్యాన్లు కొనాల్సి వస్తోంది. – దాసరి రజని, లక్ష్మీనగర్ ఎలక్షన్ వస్తే చెబుతాం.. మధురవాడ కార్పెంటర్స్ కాలనీ కొండపైకి జీవీఎంసీ నీరు రావడం లేదు. కింద నుంచి బిందెలతో నీరు మోసుకెళ్లేందుకు అవస్థలు పడుతున్నాం. తాగునీటికి ఇన్ని ఇబ్బందులు ఎప్పుడూ చూడలేదు. స్థానిక ఎన్నికలు వస్తే అప్పుడు చెబుతాం. – మహాదేవ విజయ, కార్పెంటర్స్ కాలనీ, మధురవాడ -
మెట్ల పై నుంచి జారిపడి వ్యక్తి మృతి
అక్కిరెడ్డిపాలెం: బీసీ రోడ్డులోని సంజీవనగర్ కాలనీలో కుళాయి నీటి కోసం వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి జారిపడి మృతి చెందాడు. గాజువాక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళలోని కొల్లాం జిల్లాకు చెందిన తాడా విజయ్ (60) సంజీవనగర్ కాలనీలో ఎలక్ట్రిష న్గా పనిచేస్తూ కొంతకాలంగా ఒంటరిగా నివసిస్తున్నా డు. శుక్రవారం కు ళాయి నీటి కోసం కిందకు దిగి, నీటి బిందెతో తిరిగి పైకి ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి మెట్లపై నుంచి పడిపోయా డు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి బంధువు లు అందుబాటులో కి రాలేదని, వారి ఆచూకీ కోసం చర్యలు చేపడుతున్నామని పోలీసు లు తెలిపారు. బంధువులు వచ్చిన అనంతరం కేసు నమోదు చేసి దర్యా ప్తు కొనసాగిస్తామని వెల్లడించారు. -
రెండు, మూడు బిందెలే కష్టం
పైనాపిల్ కాలనీ జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో నాలుగు నెలలుగా తాగునీటి ఇబ్బందులు ఉన్నాయి. బోరు నుంచి నీరు రావడంలేదు. ట్యాంకర్ల ద్వారా రెండు, మూడు బిందెల నీరే దొరుకుతోంది. – నసీమా బేగం, జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీ, పైనాపిల్ కాలనీ బోర్లు పనిచేయడం లేదు స్వతంత్రనగర్ ఎన్టీఆర్ హుద్‌హుద్ కాలనీలో కుళాయిలు లేవు. ఉన్న బోర్లు కూడా పనిచేయడం లేదు. జీవీఎంసీ ట్యాంకర్లు వచ్చినా ఐదారు బిందెలకు మించి నీరు దొరకడం లేదు. పనులు మానుకుని ఎదురుచూడాల్సి వస్తోంది. తాగునీటికి ఇబ్బందులు పడుతున్నాం. – సకల ప్రసాద్, మధురవాడ -
బిట్‌కాయిన్ చుట్టూ రాజకీయ, పోలీసు రగడ
విశాఖ విద్య: బిట్‌కాయిన్ వ్యవహారం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నగర పోలీస్ కమిషనర్‌కు బిట్‌కాయిన్ ఇచ్చారంటూ వచ్చిన ఆరోపణలపై న్యాయవాది గీతా ప్రసన్న హైకోర్టును ఆశ్రయించడం, అనంతరం తనపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆమె ఆరోపించడం కలకలం రేపుతోంది. హైకోర్టు న్యాయవాదులు కార్తీక్ సిద్ధార్థ్, వంశీకృష్ణ, సుభాష్‌లతో కలిసి శుక్రవారం పౌర గ్రంథాలయంలో మీడియాతో మాట్లాడిన గీతా ప్రసన్న.. బిట్‌కాయిన్ అంశంపై ఆధారాలు ఉన్నాయని, వాటిపై విచారణ జరగాలని కోరారు. ఈ విషయాన్ని ప్రశ్నించినందుకే తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. విశాఖ పోలీసులు ‘బడ్స్’ కేసుల విషయంలో చట్టపరమైన విధానాలను పాటించడం లేదని న్యాయవాది కార్తీక్ సిద్ధార్థ్ ఆరోపించారు. బాధితుల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసి సంబంధిత వ్యవస్థకు అప్పగించాల్సిన పోలీసులు అంతకుమించి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ అంశాలను ప్రశ్నిస్తున్నందుకే గీతా ప్రసన్నతో పాటు ఆమె భర్తపై కూడా కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. కరిష్మా కేసులో నేతలున్నారు కరిష్మా అనే యువతి తనకు అన్యాయం జరిగిందంటూ తనను ఆశ్రయించిందని, కేసు పూర్వాపరాలను పరిశీలించానని న్యాయవాది గీతా ప్రసన్న తెలిపారు. ఈ వ్యవహారం అనేక మలుపులు తిరిగిందని, విశాఖకు చెందిన ఓ ఎమ్మెల్యే, సాయిరాం అనే వ్యక్తి తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యేతో జరిగిన సంభాషణకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకే పోలీసులు, సాయిరాం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గత మార్చిలో జరిగిన ఈ కేసు విషయంలో ఎమ్మెల్యేతో పాటు పోలీసులు కూడా తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ పోలీసుల తీరుపై ఆగస్టు 17న కోర్టు కూడా స్పందించిందని, న్యాయవాదులపై అక్రమ కేసులు నమోదు చేసే పరిస్థితి ఏర్పడిందని న్యాయవాది కార్తీక్ సిద్ధార్థ్ ఆవేదన వ్యక్తం చేశారు. గీతా ప్రసన్నపై మహిళా పోలీస్ స్టేషన్ ఏసీపీ అంబేడ్కర్ బార్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయడం దారుణమన్నారు. ఏప్రిల్‌లో ఎమ్మెల్యేపై తాను స్వయంగా సీపీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గీతా ప్రసన్న తెలిపారు. ప్రెస్మీట్లో సాయిరాం హల్చల్ న్యాయవాదులు మీడియాతో మాట్లాడుతున్న సమయంలో కరిష్మా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాయిరాం అక్కడికి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. తనపై న్యాయవాదులు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని, తన వాదన చెప్పేందుకే వచ్చానని తెలిపారు. దీంతో కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. కరిష్మా ఆందోళన ఇదే సమయంలో కరిష్మా పౌర గ్రంథాలయం వద్ద బైఠాయించి తనకు న్యాయం చేయాలని కోరారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తన హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. సమాచారం అందుకున్న ద్వారకా పోలీసులు అక్కడికి చేరుకుని న్యాయవాదులు, కరిష్మా, సాయిరాంను స్టేషన్‌కు తరలించారు. బిట్‌కాయిన్ వ్యవహారంపై ఉత్కంఠ బిట్‌కాయిన్ ఆరోపణల చుట్టూ నెలకొన్న వివాదంలో అసలు వాస్తవాలు ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. పోలీస్ కమిషనర్‌పై ఆరోపణలు రావడంతో ఈ అంశంపై అధికారుల స్పందన ఎలా ఉంటుందన్నది ఆసక్తిగా మారింది. -
మూడు రోజుల్లో 230 వినతులు
డాబాగార్డెన్స్: జీవీఎంపీ పరిధిలో ఏపీడీపీఎంఎస్ ద్వారా భవన నిర్మాణ అనుమతులకు సంబంధించిన టీడీఆర్ ఆన్లైన్, ఎల్ఆర్ఎస్ పెండింగ్ సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేసేందుకు చేపట్టిన రెండో విడత ప్రత్యేక టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరంనకు మూడు రోజుల్లో 230 వినతులు వచ్చాయి. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు అదనపు కమిషనర్ ఎస్ఎస్ వర్మ, చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకరరావు ఆధ్వర్యంలో టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది, లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్ చివరి రోజు శుక్రవారం ప్రజల నుంచి 62 ఫిర్యాదులు స్వీకరించారు. -
మానసిక వేదనకు మరణమే శరణ్యమా?
విశాఖ విద్య: విశాఖ నగరంలో ప్రతినెలా ఎక్కడోచోట ఆత్మహత్యల రూపంలో విషాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఒక జీవితం ముగిసిపోవడంతో కుటుంబాలు రోడ్డున పడుతున్న ఉదంతాలు కోకొల్లలు. ఆత్మహత్యలకు ప్రేరణ ఎలా మొదలవుతుంది? ఆత్మహత్య చేసుకునే ముందు కనిపించే లక్షణాలు ఎలాంటివి? వీటిని నివారించవచ్చా? అనే ప్రశ్నలకు మానసిక నిపుణులు ‘ఖచ్చితంగా సాధ్యమే’నని భరోసా ఇస్తున్నారు. విద్యార్థులు, యువతే ఎక్కువ! ఈ దశాబ్దంలో విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య అత్యధికంగా ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా 18 నుండి 30 ఏళ్ల వయసువారే ఎక్కువగా ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. విద్యార్థుల్లో తీవ్ర మానసిక ఒత్తిడి, పరీక్షల్లో వైఫల్యాలు ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, ఉద్యోగ భద్రత లేకపోవడం కూలీలు, శ్రామికుల బలవన్మరణాలకు కారణమవుతున్నాయి. యువతలో ఉద్యోగ సంబంధిత సమస్యలు, భవిష్యత్తుపై ఆందోళన, సమాజం నుంచి వస్తున్న ఒత్తిళ్లు కారణమైతే, కుటుంబ సమస్యలతో విసిగి వేసారి ఆత్మహత్యే శరణ్యమని మహిళలు భావిస్తున్నారు. ముందస్తు సంకేతాలు గుర్తించాలి విశాఖకు చెందిన సైకాలజిస్ట్ డా.పూజిత జోస్యుల ‘హోల్డ్ ఆన్: సూసైడ్ వ్యాక్సినేషన్ అండ్ ఫస్ట్ ఎయిడ్’అనే పుస్తకంలో పలు అంశాలను ప్రస్తావించారు. ఆత్మహత్య చేసుకోవాలనుకునే వ్యక్తుల హెచ్చరిక సంకేతాలను గుర్తించలేకపోవడం వల్లే దుర్ఘటనలు జరుగుతున్నాయి. గుర్తించినా ఎలా స్పందించాలో తెలియని పరిస్థితి. అలాంటి సమయాల్లోనే ‘సూసైడ్ ఫస్ట్ ఎయిడ్’అత్యంత అవసరమని డా.పూజిత చెప్తున్నారు. తీవ్ర మానసిక వేదనతో ఒంటరిగా ఉన్న వారి పక్కన సరైన వ్యక్తి ఉండి, వారి మాటలను ఓపికగా వింటే ఆ ఆలోచనల నుంచి దూరం చేయవచ్చు. నిత్యం వారితో కలిసిమెలిసి ఉంటూ తల్లిదండ్రులు, స్నేహితులు భరోసా కల్పించాలి. తీర్పులు ఇవ్వకుండా, వారి బాధను అర్థం చేసుకుంటూ అవసరమైతే మానసిక నిపుణులను సంప్రదించాలి. జూన్ 25 పీఎం పాలెంలో 25 ఏళ్ల వివాహిత ఆత్మహత్య జూలై 24 ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఫోరెన్సిక్ మెడిసిన్ చదువుతున్న పీజీ విద్యార్థిని హాస్టల్ రూమ్‌లో ఆత్మహత్య. అగస్టు30 పెందుర్తి మండలం చింతలఅగ్రహారంలో అప్పుల బాధకు ఆటో డ్రైవర్ వినోద్ భార్య, ఇద్దరు పిల్లలతో ఆత్మహత్య సెప్టెంబర్ 14 మధురవాడ ఆర్టీసీ కాలనీలో కుటుంబ గొడవలతో వివాహిత ఆత్మహత్య ఇలాంటి ఆత్మహత్యలు ఇటీవల విపరీతంగా పెరుగుతున్నాయి. తాత్కాలిక ఆవేశం, బాధకు లోనై తక్షణ నిర్ణయాలతో తనువు చాలిస్తున్నారు. చుట్టూ ఉన్నవారు కాస్త గమనిస్తే ఇలాంటి వారిని కాపాడుకోవచ్చని మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు. -
సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
మహారాణిపేట: ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు ఈ నెల 19న విశాఖ పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. పర్యటనకు సంబంధించి భద్రత, వేదికలు, రవాణా, పార్కింగ్, ప్రజల రాకపోకలు తదితర ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి గురువారం పరిశీలించారు. ముందస్తు భద్రతా సమీక్షలో భాగంగా ఏయూ ప్రాంగణంలోని హెలీప్యాడ్, సీఎం పాల్గొనే పట్టాల పంపిణీ కార్యక్రమ వేదికను సందర్శించి ఏర్పాట్లపై ఆరా తీశారు. అనంతరం బీచ్‌రోడ్‌లో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించే ప్రాంతాన్ని సందర్శించారు. ఏయూ వేదిక వద్ద కార్యక్రమానికి నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్న జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, బీచ్‌రోడ్ కార్యక్రమానికి నోడల్ అధికారిగా ఉన్న జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌లతో ఏర్పాట్లపై సమీక్షించారు. నిర్దేశిత సమయానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి కార్యక్రమాలు సజావుగా జరిగేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. -
జీవీఎంసీ వార్డుల పునర్విభజన అశాసీ్త్రయం
పెందుర్తి: జీవీఎంసీ వార్డుల పునర్విభజన తీరుపై జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పెందుర్తి నియోజకవర్గంలోని కొన్ని వార్డుల విభజన చాలా అశాసీ్త్రయంగా జరిగిందని ఆక్షేపించారు. ప్రభుత్వం పారదర్శకంగా ఉన్నప్పటికీ కొంతమంది అధికారులు చాలా నిర్లక్ష్యపూరితంగా, దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. పెందుర్తిలో గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గ పరిధి 92వ వార్డులో ఉన్న కొంత భాగాన్ని పెందుర్తి నియోజకవర్గ పరిధిలోని 88వ వార్డులో కలపడాన్ని తప్పుబట్టారు. ఒకవేళ 92వ వార్డులో జనాభా ఉంటే పక్కనే ఉన్న వార్డుల్లో కలపాలి తప్ప.. దాదాపు 10 కి.మీ. పైగా దూరం ఉన్న 88వ వార్డులో విలీనం చేయడమేంటని ప్రశ్నించారు. ఓ కార్పొరేటర్‌ను కలవాలంటే ప్రజలు అంత దూరం వెళ్లాలా అని ప్రశ్నించారు. ఈ చర్య చాలా దుర్మార్గంగా, అమానుషంగా ఉందన్నారు. జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు పునర్విభజన ప్రక్రియపై అభ్యంతరాలు కోరితే తాము పై ప్రక్రియను పూర్తిగా వ్యతిరేకించి, తగు సూచనలు కూడా చేశామన్నారు. అయితే ఓ ఎమ్మెల్యే వినతిని కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు పరిగణలోకి తీసుకోకపోవడం దారుణమన్నారు. శాసనసభ్యుడిగా తన లేఖకు, ప్రజల అర్జీలకు విలువ లేకపోయిందన్నారు. టౌన్ ప్లానింగ్ ఏసీపీ సహా సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయా తప్పులను వెంటనే సరిదిద్దకపోతే ప్రజలతో కలిసి ఉద్యమం చేస్తామని పంచకర్ల ఈ సందర్భంగా హెచ్చరించారు. -
ఐఐఎంవీలో ఈఎంబీఏ నాలుగో బ్యాచ్ ప్రవేశాలు
ఆనందపురం: గంభీరం పంచాయతీలో ఉన్న ఐఐఎంవీ ఉద్యోగుల కోసం నిర్వహిస్తున్న ఎగ్జిక్యూటివ్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఈఎంబీఏ) నాలుగో బ్యాచ్ ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించింది. క్యాంపస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ‘లీడింగ్ వాట్స్ నెక్స్ట్’ చర్చాగోష్టితో పాటు ఈఎంబీఏ బ్రోచర్‌ను ఐఐఎంవీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం. చంద్రశేఖర్, ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ మాజీ చైర్మన్ రాజ్‌కుమార్ దూబే ఆవిష్కరించారు. మారుతున్న అంతర్జాతీయ వ్యాపార విధానాలు, కృత్రిమ మేధ సాంకేతికతకు అనుగుణంగా పనిచేస్తున్న నిపుణుల్లో నాయకత్వ లక్షణాలు, మేనేజ్మెంట్ నైపుణ్యాలను పెంపొందించేలా రెండేళ్ల ఈ కోర్సును రూపొందించారు. డైరెక్ట్ టు డివైస్ ఆన్లైన్ విధానంలో సాగే ఈ ప్రోగ్రామ్‌లో 740 గంటల లెర్నింగ్, మేనేజ్మెంట్ పాఠ్యాంశాలు, క్యాంపస్ ఇమ్మర్షన్ మాడ్యూల్స్‌తో పాటు డెన్మార్క్ అధ్యయన పర్యటన ఉంటుంది. కోర్సులో చేరేందుకు అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీల అభ్యర్థులకు నిబంధనల మేరకు మార్కుల్లో సడలింపు ఉంటుంది. కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ డిగ్రీతో పాటు ఐఐఎంవీ పూర్వ విద్యార్థుల హోదా లభిస్తుంది. -
హెచ్ఎం శాపనార్థాలపై ఉపాధ్యాయిని కన్నీరు
మధురవాడ: రాష్ట్రంలోని అతిపెద్ద పాఠశాలల్లో ఒకటైన చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గజలక్ష్మి అనే ఉపాధ్యాయురాలు గురువారం బోరున విలపించారు. భర్త మరణంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న తాను సెలవు కోరుతూ వెళితే.. సెలవు ఇవ్వకపోగా, ఎగతాళి చేస్తూ ‘నీ ఉసురు తగలడం వల్లే నీ భర్త చనిపోయాడు’అంటూ ప్రధానోపాధ్యాయుడు వెంకటరావు శాపనార్థాలు పెట్టారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తాను తీవ్ర మనోవేదనలో ఉండి విశ్రాంతి, ఇతర కార్యక్రమాల కోసం సెలవు అడిగితే అంత దయలేకుండా మాట్లాడతారా.. అని ఆక్షేపించారు. ‘తన తప్పులపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశా’వంటూ ఎత్తిపొడిచారని వాపోయారు. ఈ ఘటనతో పాఠశాలలో హెచ్ఎంకు, ఇతర ఉపాధ్యాయులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సహచర ఉపాధ్యాయినులు బాధితురాలికి బాసటగా నిలిచి ఓదార్చారు. కొందరు ప్రధానోపాధ్యాయుడి తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. మహిళా ఉపాధ్యాయుల పట్ల ఇలా వ్యవహరిస్తే హెచ్ఎం అని కూడా చూడకుండా తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుందని ఓ ఉపాధ్యాయుడు హెచ్చరించారు. అయితే, సదరు ఉపాధ్యాయినే తనను నిందించినట్లు హెచ్ఎం వెంకటరావు చెప్పారు. పాలకుల ఉదాసీనతతో తరచూ వివాదాలు ఈ పాఠశాలలో హెచ్ఎం తీరు పట్ల అత్యధిక మంది ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు సందర్భాల్లో స్థానిక ఎమ్మెల్యేతో పాటు విద్యాశాఖ కమిషనర్ వరకు ఫిర్యాదులు చేసినా, అధికారులు నామమాత్రపు విచారణలతో సరిపెడుతున్నారన్న ఆక్షేపణలున్నాయి. ఈ వివాదాల ప్రభావం విద్యార్థుల ప్రవేశాలు, క్రమశిక్షణ, బోధన, ఉత్తీర్ణతా శాతంపై కూడా పడుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాలకుల ఈ నిర్లక్ష్య వైఖరే మరోసారి పాఠశాలలో వివాదానికి దారితీసిందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హెచ్ఎం, టీచర్ మధ్య వాగ్వాదం చంద్రంపాలెం హైస్కూల్లో విలపిస్తున్న ఉపాధ్యాయిని చంద్రంపాలెం జెడ్పీ హైస్కూల్లో ఘటన -
ఆస్ట్రేలియాలో ప్రమాదం.. విశాఖలో విషాదం!
అల్లిపురం/విశాఖ స్పోర్ట్స్: నిన్నటి వరకు చిరునవ్వులతో కళకళలాడిన ఆ ఇంట్లో ఇప్పుడు పెను విషాదం అలుముకుంది. చిన్నారి తొలి పుట్టినరోజు వేడుకల్లో పంచుకున్న ఆనందపు కేరింతలు చెరిగిపోకముందే.. విధి ఆ కుటుంబాన్ని కన్నీటి సంద్రంలోకి నెట్టింది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం సీతమ్మధారకు చెందిన జి.టి.ప్రసాద్ కుటుంబాన్ని కోలుకోలేని శోకాన్ని మిగిల్చింది. కేవలం క్షణాల వ్యవధిలో జరిగిన ఈ దుర్ఘటనలో విశాఖ జిల్లా క్రికెట్ సంఘం (వీడీసీఏ) మాజీ జాయింట్ సెక్రటరీ జి.టి.ప్రసాద్ భార్య రమాదేవి (67), కోడలు నేహా బొమ్మలి (33) ప్రాణాలు కోల్పోవడం నగర క్రీడా, సామాజిక వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మనవళ్లను చూడాలన్న ఆశతో వెళ్లి.. విశాఖ షిప్‌యార్డ్‌లో రిటైర్డ్ ఉద్యోగిగా, 2017 వరకు వీడీసీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీలో జాయింట్ సెక్రటరీగా సేవలందించిన జి.టి.ప్రసాద్.. ఎంతో మంది ఔత్సాహిక క్రీడాకారులను రంజీ దిశగా ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించారు. తన కుమారుడు, కోడలు, మనవళ్లను చూసేందుకు, అక్కడే జరిగే ఒక శుభకార్యంలో పాల్గొనేందుకు ఆయన తన భార్య రమాదేవితో కలిసి ఆస్ట్రేలియా వెళ్లారు. కుమారుడి కుటుంబంతో ఆనందంగా గడపాల్సిన ఆ వృద్ధ దంపతుల ప్రయాణం ఇలాంటి విషాదంతో ముగుస్తుందని ఎవరూ ఊహించలేదు. మధురజ్ఞాపకాలు మరువకముందే.. వరుణ్‌చంద్ర గున్నా, నేహా దంపతులకు మూడున్నరేళ్ల కుమారుడు హారవ్, ఏడాది వయసున్న కుమార్తె వివాన్వి ఉన్నారు. కొద్ది రోజుల క్రితమే చిన్నారి వివాన్వి మొదటి పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులు, ఆప్తుల సమక్షంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఆ వేడుకల్లో పిల్లలతో కలిసి నేహా ఎంతో ఉత్సాహంగా నవ్వుతూ, నృత్యం చేస్తూ గడిపిన క్షణాలు ఆ కుటుంబానికి జీవితాంతం పదిలంగా ఉండాల్సిన మధుర జ్ఞాపకాలు. కానీ, ఆ సంతోషం నెల రోజులు కూడా గడవకముందే జరిగిన ఈ ప్రమాదం ఆ పసిబిడ్డలకు అమ్మను, నానమ్మను దూరం చేసింది. తల్లి లేని లోటుతో ఆ చిన్నారులు రోదిస్తున్న తీరు చూసేవారి హృదయాలను ద్రవింపజేస్తోంది. మృతదేహాల రాకకు 10 రోజులు హిందూ సంప్రదాయాల ప్రకారం మృతదేహాలను విశాఖకు రప్పించి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భౌతికకాయాలు విశాఖ చేరుకోవడానికి కనీసం 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ క్లిష్ట సమయంలో ఆ కుటుంబానికి మానవతా దృక్పథంతో అండగా నిలిచేందుకు ఆస్ట్రేలియన్ తెలుగు కమ్యూనిటీ ‘గో ఫండ్ మీ’ ద్వారా విరాళాలు సేకరిస్తోంది. జి.టి.ప్రసాద్ కుటుంబానికి జరిగిన ఈ నష్టం పట్ల వీడీసీఏ ప్రతినిధులు, నగర ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. కళ్లెదుటే జరిగిన ఘోరం మెల్బోర్న్లోని పాయింట్ కుక్‌లో బుధవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో వీరు ప్రయాణిస్తున్న టయోటా కొరోలా కారును ఎదురుగా వచ్చిన పోర్షే మెకాన్ కారు తీవ్రంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో రమాదేవి, నేహా అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. కళ్లెదుటే భార్య, తల్లి విగతజీవులుగా మారడాన్ని చూసి కుమారుడు వరుణ్‌చంద్ర గున్నా పడిన వేదన వర్ణనాతీతం. భార్యను, తల్లిని ఒకేసారి కోల్పోయిన ఆయనను ఓదార్చడం ఎవరితరం కాలేదు. -
25 నుంచి పనులు బంద్ చేస్తాం
జీవీఎంసీ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డాబాగార్డెన్స్: ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నింటినీ జనరల్ ఫండ్ ద్వారా చెల్లించాలని, 2027 జనవరి 1 నుంచి నిధి పోర్టల్ ద్వారా బిల్లులు అప్లోడ్ చేసి చెల్లింపులు చేపట్టాలని గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ నెల 25లోగా పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే ఆ రోజు నుంచి జీవీఎంసీ పరిధిలో పనులన్నీ నిలిపివేస్తామని హెచ్చరించింది. జీవీఎంసీ ప్రాంగణంలోని అసోసియేషన్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రతినిధులు మాట్లాడారు. జనరల్ ఫండ్ ద్వారా చేపట్టే అభివృద్ధి పనులను నిధి పోర్టల్‌లో అప్లోడ్ చేయడం వల్ల ఇప్పటికే పనులు చేపట్టి ఆర్థికంగా పెట్టుబడులు పెట్టిన కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బిల్లుల ప్రాసెసింగ్, పనుల నిర్వహణలో సమస్యలు తలెత్తుతున్నందున 2027 జనవరి 1 వరకు నిధి పోర్టల్ అప్లోడ్ నుంచి సడలింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఒకే ప్యాకేజీపై అభ్యంతరం రాష్ట్ర ప్రభుత్వం, జీవీఎంసీ సంయుక్తంగా భారీ మొత్తాలతో అభివృద్ధి పనులకు ఒకే ప్యాకేజీ విధానంలో టెండర్లు పిలవడంపై కాంట్రాక్టర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. చిన్న, మధ్య తరహా కాంట్రాక్టర్లు కూడా పనుల్లో భాగస్వాములు అయ్యేలా టెండర్లను విభజించి పిలవాలని కోరారు. భారీ మొత్తాలతో ఒకే ప్యాకేజీగా టెండర్లు పిలవడం వల్ల స్థానిక కాంట్రాక్టర్లకు అవకాశాలు తగ్గుతున్నాయని తెలిపారు. నిధి పోర్టల్ కారణంగా కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, భారీ ఉమ్మడి ప్యాకేజీ టెండర్లను పునఃపరిశీలించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ల సమస్యలపై జీవీఎంసీ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్చించి పరిష్కారం చూపాలని కోరారు. సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సంజీవరెడ్డి, రాజాన వెంకటరమణ, వీరారెడ్డి, జి.సింహాచలం, ఎం.రమేష్, శ్రీనివాసరావు, అప్పలరాజు, గొంప చంద్రమౌళి, షేక్ సిలార్, కోటేశ్వరరావు, రవికుమార్, అప్పలనాయుడు, సాదూరావు, వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. -
త్రిముఖ గణపతిగా సంపత్ వినాయగర్
మహారాణిపేట: ఆశీలమెట్టలోని శ్రీ సంపత్ వినాయక స్వామి దేవాలయంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం నాల్గో రోజు శ్రీ త్రిముఖ గణపతి అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామున గణపతి హోమం, సామవేద పారాయణం, పంచామృతాభిషేకం, పుష్పార్చనలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 2,300 మందికి అన్నదానం, ఉచిత ప్రసాద వితరణ చేపట్టారు. భక్తి గీతాలు, కోలాటం, కూచిపూడి, జానపద నృత్య ప్రదర్శనలు, అన్నమయ్య కీర్తనల ఆలాపన ఆకట్టుకున్నాయి. -
ఉన్నవి దాచి.. ఊడ్చినవి బిగించి!
సాక్షి, విశాఖపట్నం: ‘మా సంస్థలో కొత్త మీటర్లు చాలా ఉన్నాయి. కానీ.. అవి ఇప్పుడు వినియోగించం. మా దగ్గర ఉన్న పాతవి వాడిన తర్వాత.. కొత్తవి వాడతాం.’ సాక్షిలో గురువారం ప్రచురితమైన ‘కొత్త మీటర్లు లేవండీ.!’ అనే కథనంపై ఈపీడీసీఎల్ అధికారుల స్పందన ఇదీ. మీటర్ల మంజూరు వ్యవహారంలో విద్యుత్ శాఖ అధికారులు వ్యవహరిస్తున్న అలసత్వాన్ని ఎండగడుతూ ప్రచురించిన కథనంపై స్పందించిన ఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం ఇచ్చిన వివరణలో సారాంశం వింటే.. ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. సంస్థ పర్చేజెస్ సీజీఎం విజయ్‌ప్రతాప్ మాట్లాడుతూ.. సంస్థ వద్ద దాదాపు లక్ష కొత్త విద్యుత్ మీటర్లు అందుబాటులో ఉన్నప్పటికీ, వినియోగదారులకు మాత్రం గతంలో వాడిన పాత మీటర్లనే బిగిస్తున్నామని స్వయంగా అంగీకరించారు. ఈపీడీసీఎల్ పరిధిలో మీటర్ల కొరత లేదని.. గురువారం నాటికి సంస్థ వద్ద ఏకంగా 98,667 కొత్త మీటర్లు స్టాక్‌లో సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. విచిత్రమైన వివరణ గోదాముల్లో వేలాది కొత్త మీటర్లు నిల్వ ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో పాత మీటర్లనే ఎందుకు వాడుతున్నారనే దానికి సంస్థ విచిత్రమైన వివరణ ఇచ్చింది. ఇటీవల స్మార్ట్ మీటర్లను అమర్చే క్రమంలో తొలగించిన పాత మీటర్లను మిగిలిన సర్వీస్ కనెక్షన్లకు పునర్వినియోగిస్తున్నామని చెప్పడం గమనార్హం. ఇలా ఇతర సర్వీసుల నుంచి తీసిన మీటర్లను ‘పాత మీటర్లు’గా పరిగణించలేమంటూ కొత్త భాష్యం చెప్పారు. ఆ మీటర్లలో ఉన్న రీడింగ్‌ను ఇనీషియల్ రీడింగ్‌గా నమోదు చేసి బిల్లులు ఇస్తున్నామనీ.. దీనివల్ల వినియోగదారులకు ఎలాంటి నష్టం వాటిల్లదని సమర్థించుకోవడం విశేషం. మరోవైపు నిబంధనల ప్రకారమే కొత్త మీటర్లకు నిర్దేశిత ఛార్జీలు వసూలు చేస్తున్నామని, వినియోగదారుల నుంచి ఎలాంటి అదనపు వసూళ్లు చేయడం లేదన్నారు. అదేవిధంగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై వినియోగదారులపై ఎలాంటి ఒత్తిళ్లు తీసుకురావడం లేదని.. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే ఆధునీకరణ చేపడుతున్నామని తెలిపారు. స్టాక్‌లో దాదాపు లక్ష కొత్త మీటర్లు ఉన్నాయని ప్రకటిస్తూనే.. మరోవైపు తొలగించిన మీటర్లనే ఇతర కనెక్షన్లకు బిగిస్తున్నామని చెప్పడం కొసమెరుపు. మీటర్ల కొరతపై ఈపీడీసీఎల్ వింత వాదన -
డీలర్లకు యాప్‌సోపాలు
మహారాణిపేట: రేషన్ బియ్యం పంపిణీలో పారదర్శకత పేరుతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సరికొత్త ‘క్యూఆర్ కోడ్’ విధానం.. క్షేత్రస్థాయిలో చౌక ధరల దుకాణాల డీలర్లకు తలనొప్పిగా మారనుంది. జిల్లాలో త్వరలో అమల్లోకి రానున్న ఈ విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేదంటే జిల్లాకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ డీలర్లు ఇప్పటికే అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఈ క్యూఆర్ కోడ్ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. జిల్లా పరిధిలోని 625 చౌక ధరల దుకాణాల ద్వారా 5,12,619 తెల్ల రేషన్ కార్డుదారులకు సుమారు 8,161 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. మనిషికి 5 కిలోల చొప్పున ఉచిత బియ్యంతో పాటు, అంత్యోదయ అన్నయోజన కింద 35 కిలోల బియ్యం, రాయితీపై పంచదార వంటి సరుకులను పంపిణీ చేయాలి. అయితే ఇప్పటివరకు మామూలుగా సాగిన ఈ తంతుకు.. కొత్తగా వచ్చిపడిన క్యూఆర్ కోడ్ స్కానింగ్ పెద్ద అడ్డంకిగా మారనుంది. గతంలో ఎంఎల్ఎస్ పాయింట్లు, ఎఫ్‌సీఐ గోదాముల నుంచి రేషన్ షాపులకు సరుకులు చేరడం, డీలర్లు వాటిని తూకాల్లో సర్దుబాటు చేసుకోవడం సాఫీగా జరిగేది. రవాణా సమయంలో బస్తాలు కొద్దిగా చిరిగినా, బరువు తగ్గినా డీలర్లు ఆ నష్టాన్ని సర్దుబాటు చేసుకునేవారు. కానీ కొత్త నిబంధనల ప్రకారం ప్రతీ 50 కిలోల బియ్యం బస్తాకు ఉండే క్యూఆర్ కోడ్‌ను ప్రత్యేక యాప్ ద్వారా విధిగా స్కాన్ చేయాల్సిందే. ఈ స్కానింగ్ పూర్తయి, పీపీఎస్ యాప్ ద్వారా సబ్మిట్ చేసి, ఈ–పాస్ ద్వారా ఆర్వో జనరేట్ అయితేనే హమాలీలు బస్తాలను అన్లోడ్ చేయడానికి వీలవుతుంది. ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. మొరాయిస్తున్న సర్వర్లు గోదాముల నుంచి తరలించే సమయంలో బస్తాలకు ఉన్న క్యూఆర్ కోడ్ పేపర్లు చాలాచోట్ల చిరిగిపోతున్నాయి. అలా చిరిగిన వాటిని ఏం చేయాలో తెలియక డీలర్లు తలలు పట్టుకుంటున్నారు. ఇక యాప్‌లో పది బస్తాలను స్కాన్ చేస్తే కేవలం నాలుగైదు మాత్రమే సక్సెస్ అవుతున్నాయని, మిగతావాటికి సర్వర్ మొరాయించడం లేదా సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయని డీలర్లు వాపోతున్నారు. మరోవైపు చాలా మంది డీలర్ల వద్ద కనీసం స్మార్ట్ఫోన్లు కూడా లేవు. ఈ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకుని ఆపరేట్ చేయాలంటే కొత్త స్మార్ట్ఫోన్లు కొనడం, వాటి వాడకంపై అవగాహన పెంచుకోవడం గ్రామీణ ప్రాంతాల డీలర్లకు కత్తిమీద సాములా మారింది. ఒక చిన్న బస్తాను స్కాన్ చేయడానికే గంటల తరబడి సమయం వృథా అవుతుండటంతో, నిర్దేశిత గడువులోగా పంపిణీ చేయడం ఎలాగని వారు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్ల వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పి.చిట్టిరాజు ఆధ్వర్యంలో డీలర్లు డీఎస్వో వి.భాస్కరరావును కలిసి వినతిపత్రం అందజేశారు. సాంకేతిక పరిజ్ఞానం, స్మార్ట్ఫోన్లు లేని వృద్ధ డీలర్లు ఈ విధానం వల్ల తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ లక్ష్యం మంచిదే అయినా, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులను, డీలర్ల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని విశాఖ జిల్లాకు ఈ క్యూఆర్ కోడ్ విధానం నుంచి మినహాయింపు ఇవ్వాలని వారు కోరుతున్నారు. సమస్య పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో రేషన్ పంపిణీ ప్రక్రియ మరింతస్తంభించి, కార్డుదారులకు ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఈ కొత్త సాంకేతిక సంస్కరణలు క్షేత్రస్థాయిలో సామాన్యులకు, డీలర్లకు ఎలాంటి ఇబ్బందులు సృష్టిస్తున్నాయి? దీన్ని పరిష్కరించడానికి పౌరసరఫరాల శాఖ ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సి ఉంది? -
‘సూసైడ్ వ్యాక్సినేషన్’ తప్పనిసరి
ఆత్మహత్యకు ప్రేరేపించే పరిస్థితుల నుంచి బయటపడటానికి మానసికంగా బలపడే నైపుణ్యాలను డా.పూజిత ‘వ్యాక్సినేషన్’తో పోల్చారు. భావోద్వేగాలను నియంత్రించుకోవడం, ఒత్తిడిని ఎదుర్కోవడం, సహాయం కోరడం వంటి లక్షణాలను చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలన్నారు. దీనివల్ల ఎలాంటి కష్టాన్నయినా ఎదుర్కొనే మానసిక స్థైర్యం పెరుగుతుందని పేర్కొన్నారు. కొన్ని సంకేతాలను హెచ్చరికలుగా గుర్తించాలని ఆమె చెప్తున్నారు. ● మరణం గురించి తరచూ మాట్లాడటం, నేను లేకపోతే అందరికీ బాగుంటుంది.. అని ప్రస్తావించడం. ● కుటుంబ సభ్యులు, స్నేహితులకు దూరంగా ఉండటం, ముఖ్యమైన కార్యక్రమాలకు గైర్హాజరు కావడం. ● తీవ్ర నిరాశ, బాధ నుంచి అకస్మాత్తుగా ప్రశాంతంగా మారిపోవడం. ● తనకు ఎంతో ఇష్టమైన వస్తువులను ఇతరులకు దానంగా ఇచ్చేయడం. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తమై బాధితులకు మానసిక సాంత్వన చేకూర్చాలి. వారికి తోడుగా ఉంటూ, ఒంటరిగా వదలకుండా తగిన భరోసా కల్పిస్తే ఆత్మహత్యల ముప్పును విజయవంతంగా తగ్గించవచ్చు. -
తాగునీటి సమస్య పరిష్కారంలో కూటమి విఫలం
మహారాణిపేట: జీవీఎంసీ పరిధిలో నెలకొన్న తీవ్ర తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని, లేదంటే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆల్ఫా కృష్ణ హెచ్చరించారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలో తాగునీటి ఇబ్బందులు కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయని అధికార పార్టీ నేతలు చెప్పడం సరికాదన్నారు. మూడు నెలలుగా పలు వార్డుల్లో ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.ఎన్నికల సమయంలో హడావుడి చర్యలు కాకుండా ఏడాది పొడవునా నిరంతర తాగునీటి సరఫరాకు శాశ్వత ప్రణాళిక రూపొందించాలని డిమాండ్ చేశారు. ప్రజల మౌలిక అవసరాలైన ఇళ్లు, నీరు, ఇతర సదుపాయాల కల్పన ప్రభుత్వ బాధ్యత అన్నారు. అలాగే రైతు బజార్లలో కూరగాయల ధరల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, సామాన్యులపై భారం తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో ప్రజల మద్దతుతో వైఎస్సార్ సీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి ఆల్ఫా కృష్ణ -
సీఎం సభకు ట్రాఫిక్ ఆంక్షలు
ప్రత్యేక రిమిషన్‌పై ఖైదీ విడుదల ఆరిలోవ: ఓ హత్య కేసులో 16 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీని విశాఖ కేంద్ర కారాగారం నుంచి ప్రత్యేక రిమిషన్(సత్ప్రవర్తన, వయసు, ఇతర మానవతా అంశాల)పై గురువారం విడుదలచేశారు. హోమ్ డిపార్ట్మెంట్ జీవో నం.174 ప్రకారం ఇక్కడి నుంచి ఒక ఖైదీ విడుదలైనట్లు కేంద్ర కారాగారం పర్యవేక్షణాధికారి బి.చంద్రశేఖర్ తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక రిమిషన్ ద్వారా రాష్ట్రంలో ముగ్గురు ఖైదీలకు అవకాశం లభించిందన్నారు. వారిలో విశాఖ జైల్ నుంచి లాలం రాము(46) ఉన్నట్లు వెల్లడించారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం రాజకోడూరు గ్రామానికి చెందిన రాము ఓ హత్య కేసులో 16 ఏళ్లు జైల్ శిక్ష అనుభవించాడన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన ప్రత్యేక రిమిషన్‌తో నిబంధనల మేరకు ఆయన్ని విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటి నుంచి రాము బయట ప్రపంచంలో కుటుంబ సభ్యులతో కలిసి, బయట ప్రపంచంలో బాధ్యతాయుతంగా మెలగాలని ఆకాంక్షించారు. -
30 నుంచి జీవీఎంసీ నీటి సరఫరా కార్మికుల సమ్మె
డాబాగార్డెన్స్: జీవీఎంసీ తాగునీటి సరఫరా విభాగంలోని ఔట్సోర్సింగ్ కార్మికులకు చట్ట ప్రకారం రావాల్సిన హక్కులు, ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30 నుంచి సమ్మె చేపట్టనున్నట్లు జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ లేబర్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు మహాదేవ్ ఆనందరావు తెలిపారు. ఈ మేరకు గురువారం జీవీఎంసీ అదనపు కమిషనర్ ఎస్.ఎస్.వర్మకు యూనియన్ ప్రధాన కార్యదర్శి రెల్లి సత్యం, నాయకులతో కలిసి సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా ఆనందరావు మాట్లాడుతూ తాగునీటి సరఫరా విభాగంలో సాంకేతిక విధులు నిర్వహిస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికులకు వారు చేస్తున్న పనికి అనుగుణంగా హోదా, కేటగిరీ నమోదు చేయాలని కోరారు. కౌన్సిల్ తీర్మానాలు, జీవోలు, మెమోల మేరకు ఏరియర్స్ చెల్లించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. కార్మికులు 24 గంటలూ మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తూ నగరానికి నిరంతర తాగునీటి సరఫరాలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. బల్క్, సెమీ బల్క్, ఇంటి కుళాయిల ద్వారా జీవీఎంసీకి ఏటా సుమారు రూ.300 కోట్ల ఆదాయం సమకూరడంలోనూ వీరి సేవలు కీలకమన్నారు. జీవీఎంసీలో 280 మంది కార్మికులు మృతి చెందడం, మరో 60 మంది పదవీ విరమణ చేయడంతో ఖాళీలు ఏర్పడి ప్రస్తుతం పనిచేస్తున్న వారిపై పనిభారం పెరిగిందన్నారు. పదవీ విరమణ చేసిన కార్మికుల వారసులకు ఉపాధి కల్పించి, ప్రస్తుత కార్మికులపై పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. సీఎఫ్‌ఎమ్‌ఎస్‌లో పేర్లు ఉండటం వల్ల వితంతు, వృద్ధాప్య పింఛన్లు, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని, సంబంధిత సమస్యను పరిష్కరించాలని కోరారు. అప్కోస్లో హాజరు నమోదులో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించి, జీతాలు అందని కార్మికులకు వెంటనే వేతనాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. అదనపు కమిషనర్‌ను కలిసిన వారిలో యూనియన్ నాయకులు రామకృష్ణ, సతీష్, సాగరమూర్తి, ఈశ్వరరావు, జీవన్, దుర్గాప్రసాద్ తదితరులు ఉన్నారు. -
పట్టాల పేరుతో పైసా వసూల్!
సాక్షి, విశాఖపట్నం: పేదలకు గూడు కల్పిస్తామంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు అదే పేదల నెత్తిన పెద్ద టోపీ పెడుతోంది. ‘పట్టా’ల పంపిణీ పేరుతో పెద్ద ఎత్తున ప్రచారార్భాటానికి తెరలేపిన చంద్రబాబు సర్కారు.. పాత పట్టాలనే పాలిష్ చేసి మళ్లీ పంచుతూ ప్రజలను దారుణంగా మోసం చేస్తోంది. ఇదే అదనుగా.. టీడీపీ నేతలు అందినకాడికి దోచుకునే స్వాహా పర్వానికి తెరతీశారు. 19న నగరంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా జరగనున్న పట్టాల పంపిణీ కార్యక్రమం.. స్థానిక చోటా, బడా నేతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. క్రమబద్ధీకరణ జాబితాలో పేరుండాలంటే ముడుపులు చెల్లించాల్సిందేనని అధికార పార్టీ నేతలు హుకుం జారీ చేస్తుండటంతో.. పేదల నుంచి ఏకంగా రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ కప్పం వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు పాత పట్టాలకే కొత్త రంగులు అద్దుతూ పత్రికల్లో, టీవీల్లో ఊదరగొడుతూ ప్రచారం చేసుకుంటూనే.. మరోవైపు పేదల రక్తాన్ని జలగల్లా పీలుస్తున్న పచ్చ నేతల ‘బడా దందా’ ఇప్పుడు సర్వత్రా తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. చెల్లికి పెళ్లి.. మళ్లీ మళ్లీ.! ఓ సినిమాలో విలన్ చెప్పిన ‘చెల్లికి పెళ్లి.. జరగాలి మళ్లీ మళ్లీ..’ అనే సామెత ఈ పట్టాల పంపిణీ కార్యక్రమానికి సరిగ్గా అతికినట్లు సరిపోతుంది. పేద ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని పైకి గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం, విశాఖ జిల్లాలో ఒకేరోజు 25,880 కుటుంబాలకు హక్కులు కల్పిస్తున్నామంటూ ప్రచారం చేస్తోంది. ఇందుకోసం రూ.కోట్లు ప్రజాధనాన్ని ఖర్చు చేస్తూ.. కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాల్లో నివాసాలు నిర్మించుకున్న వారికి పట్టాలు ఇవ్వనున్నట్లు ఊదరగొడుతున్నారు. కానీ, 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వమే ఇచ్చిన పట్టాలకు ఇప్పుడు మళ్లీ మురిపెం పేరుతో పంపిణీ చేయడం ఏంటని ప్రజలు నిలదీస్తున్నారు. ప్రస్తుతం అందిస్తున్న పట్టాల్లో 80 శాతం వరకూ పాతవే కావడం గమనార్హం. పట్టా కావాలంటే పైసా చెల్లించాల్సిందే.! ప్రభుత్వ స్థలాల్లో అభ్యంతరం లేని ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు హక్కులను కల్పించేలా వివిధ రకాల జీవోల అమలు ముసుగులో టీడీపీ, జనసేన నేతలు భారీ ఎత్తున అవినీతికి తెరలేపారు. ఒక్క విశాఖ జిల్లాలోని 11 మండలాల పరిధిలో దాదాపు 400 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఇళ్ల పట్టాలను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో విశాఖ రూరల్ మండలంలో అత్యధికంగా 8,074 మందికి, ములగాడ మండలంలో 4,213, గాజువాకలో 3,999, గోపాలపట్నంలో 2,956, పెందుర్తిలో 2,736, పెదగంట్యాడలో 1,694, మహారాణిపేట మండలంలో 1,228 కుటుంబాలకు ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరిస్తున్నామని ప్రభుత్వం లెక్కలు చూపుతోంది. అయితే, ఈ రెగ్యులరైజేషన్ జాబితాలో అర్హులైన పేదల పేర్లు ఉండాలంటే అధికార పార్టీ నేతలు అడిగినంత సమర్పించుకోవాల్సి వస్తోంది. ఈ దందాలో కింది స్థాయి చోటా నేతల నుంచి పై స్థాయి బడా నేతల వరకు అందరికీ వాటాలు వెళుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. రెగ్యులరైజేషన్ పేరుతో జరుగుతున్న ఈ తంతు అంతా పార్టీ నేతల జేబులు నింపేందుకేనన్నది స్పష్టమవుతోంది. పేదలకు అండగా ఉంటున్నామని బిల్డప్ ఇస్తూ సాగుతున్న ఈ ప్రచారార్భాటం వెనుక ఉన్న దారుణమైన దోపిడీపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక సామాన్యులు తోచిన కాడికి సమర్పించేసుకుంటుండటం కొసమెరుపు. -
సెంట్రల్ బ్యాంక్‌కు ‘రాజభాషా కీర్తి’ ప్రథమ పురస్కారం
సీతంపేట: అధికారిక భాష అయిన హిందీ అమలులో అత్యుత్తమ కృషికి 2025–26 సంవత్సరానికి ‘రాజభాషా కీర్తి’ ప్రథమ పురస్కారం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు దక్కింది. భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ రాజభాషా విభాగం ఆధ్వర్యంలో నవీ ముంబైలో నిర్వహించిన అఖిల భారత రాజభాషా సదస్సులో ఈ పురస్కారాన్ని అందించారు. బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో కల్యాణ్ కుమార్ ఈ అవార్డును కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా చేతుల మీదుగా స్వీకరించారు. అధికారిక భాష అమలు, హిందీ భాష ప్రోత్సాహం, రాజభాషా విధానంపై బ్యాంకు కొనసాగిస్తున్న కృషికి ఈ పురస్కారం గుర్తింపుగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బ్యాంకు ద్విభాషా అంతర్గత పత్రిక ‘సెంట్రలైట్’ వందేళ్లు పూర్తయిన సందర్భంగా రూపొందించిన ‘హెరిటేజ్ ఎడిషన్’ను రాజభాషా శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్, బండి సంజయ్ కుమార్, రాజభాషా విభాగం కార్యదర్శి అంషులీ ఆర్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మహేంద్ర దోహారే, చీఫ్ జనరల్ మేనేజర్ రాజభాషా కుశాల్ పాల్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రాజభాషా హితేంద్ర ధుమాల్, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న రాజభాషా అధికారులు పాల్గొన్నారు. -
ఫేక్ ఇన్స్టాగ్రామ్ ఖాతాతో మహిళలపై వేధింపులు
మార్ఫింగ్ ఫొటోలు పోస్టు చేసిన ఇద్దరి అరెస్ట్ అల్లిపురం: ఫేక్ ఇన్స్టాగ్రామ్ ఖాతా సృష్టించి మహిళా డ్యాన్సర్ల ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు చేసిన ఇద్దరిని విశాఖ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించారు. విశాఖపట్నం చినగంట్యాడకు చెందిన నెట్టెం శంకర్ సాయి శ్రీకాంత్(31), శ్రీకాకుళం జిల్లాకు చెందిన జరుగుల్ల జ్యోతి ప్రసాద్‌రావు(25)లను నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేశారు. వ్యక్తిగత కక్షలు, అసూయకు గురై డ్యాన్స్ ఈవెంట్స్ నిర్వాహకుడి ఫొటోతో ఫేక్ ఖాతా సృష్టించి, మహిళా డ్యాన్సర్ల ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు చేసినట్లు దర్యాప్తులో తేలింది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సోషల్ మీడియా ఖాతాలు, మొబైల్ నంబర్లు, ఇతర డిజిటల్ ఆధారాలను విశ్లేషించి నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. సోషల్ మీడియాలో ఇతరుల ఫొటోలు, వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయడం, ఏఐ ద్వారా ఫొటోలు, వీడియోల మార్ఫింగ్, అసభ్యకర, తప్పుడు కంటెంట్ ప్రచారం చట్టరీత్యా నేరమని పోలీసులు తెలిపారు. సైబర్ వేధింపులకు గురైతే వెంటనే 1930 ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. జరుగుల్ల జ్యోతి ప్రసాద్‌రావు నెట్టెం శంకర్ సాయి శ్రీకాంత్ -
వేగానికి బ్రేక్.. ట్రాఫిక్ ఉల్లంఘనలకు చెక్
అల్లిపురం: నగరంలో వాహనాల సంఖ్యతోపాటు ట్రాఫిక్ రద్దీ కూడా పెరుగుతోంది. కొందరు వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తూ వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం, తీవ్ర గాయాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉల్లంఘనలను మరింత సమర్థవంతంగా గుర్తించి, చర్యలు తీసుకునేందుకు ఎలక్ట్రానిక్ ఆధారిత ఎన్‌ఫోర్స్‌మెంట్‌పై పోలీసులు దృష్టి సారించారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో సీపీ శంఖబ్రత బాగ్చి వెల్లడించిన వివరాలు.. రూ.27 లక్షలతో 3 స్పీడ్ గన్స్ వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ ఉల్లంఘనలు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ను మరింత పటిష్టం చేసేందుకు సౌత్ ఏషియా ఎల్పీజీ కంపెనీ ప్రై.లి.ను సీపీ శంఖభ్రత బాగ్చి సంప్రదించారు. స్పందించిన సంస్థ సీఎస్సార్ కింద సుమారు రూ.18 లక్షల విలువైన రెండు స్పీడ్ లేజర్ గన్స్‌ను అందజేసింది. అదానీ గంగవరం పోర్ట్ ప్రై.లి. సీఎస్సార్ కింద సుమారు రూ.9 లక్షల విలువైన మరో స్పీడ్ లేజర్ గన్ను అందించింది. 100 మీటర్ల దూరం నుంచే.. ఈ స్పీడ్ లేజర్ గన్స్ ద్వారా సుమారు 100 మీటర్ల దూరం నుంచే ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించి వాహన వివరాలను నిక్షిప్తం చేయవచ్చు. అతివేగం, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడపడం, పిలియన్ రైడర్ హెల్మెట్ ధరించకపోవడం, ట్రిపుల్ రైడింగ్, వ్యతిరేక మార్గంలో వాహనం నడపడం తదితర ఉల్లంఘనలను గుర్తించి చలానాలు విధించనున్నారు. ఏఐతో రియల్‌టైమ్ చలానాలు మూడు స్పీడ్ లేజర్ గన్స్‌ను నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్(ఎన్ఐసీ) ద్వారా అనుసంధానించనున్నారు. ఏఐ ఆధారంగా ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించి రియల్‌టైమ్‌లో కాంటాక్ట్‌లెస్ చలానాలు విధించేలా వ్యవస్థను వినియోగించనున్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణతోపాటు నగర ట్రాఫిక్ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ఈ సాంకేతిక పరిజ్ఞానం దోహదపడనుంది. ట్రాఫిక్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు సీఎస్సార్ ద్వారా సహకారం అందించిన సౌత్ ఏషియా ఎల్పీజీ కంపెనీ, అదానీ గంగవరం పోర్ట్ సంస్థలకు సిటీ పోలీసుల తరఫున సీపీ కృతజ్ఞతలు తెలిపారు. -
జూనియర్ సివిల్ జడ్జిలుగా డీఎన్ఎన్ఎల్యూ పూర్వ విద్యార్థులు
సబ్బవరం: దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయానికి(డీఎస్ఎల్యూ) పూర్వ విద్యార్థులు 9 మంది జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎంపిక కావడం విశ్వవిద్యాలయ ఘనతకు నిదర్శనమని వీసీ ఆచార్య డి.సూర్యప్రకాశరావు అన్నారు. న్యాయమూర్తులుగా ఎంపికై న ఎల్.సూర్యకాంత్, వై.దివ్యచౌదరి, బి.విశ్వజాహింద్, కె.బిందు, డి.రిషికిరణ్, ఎన్.గౌతమి, అమన్‌దీప్ మాలిక్, సాయి శ్రీకీర్తన, షేక్ మొహమ్మద్ అజామ్‌లను బుధవారం వర్సిటీలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు వృత్తిపరంగా ఉపయోగపడే విద్యను, అవసరమైన శిక్షణను అందించడంలో ఎప్పుడూ రాజీపడటం లేదన్నారు. వర్సిటీ నుంచి అనేక మంది విద్యార్థులు న్యాయమూర్తులుగా, కార్పొరేట్ సంస్థల్లో న్యాయవాదులుగా, ప్రభుత్వ రంగ సంస్థల్లో లా ఆఫీసర్లుగా స్థిరపడుతున్నారని తెలిపారు. ఇటీవల వెలువడిన నోటిఫికేషన్లో ఒకేసారి 9 మంది జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎంపిక కావడం విశ్వవిద్యాలయానికి గర్వకారణమన్నారు. న్యాయమూర్తులుగా ఎంపికై నవారు వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో సమతుల్యత పాటించాలని సూచించారు. ‘ప్రారంభం’పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని, ఇకపై ఏటా వర్సిటీ నుంచి వివిధ రంగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులను సన్మానించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అనంతరం జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎన్నికై న పూర్వ విద్యార్థులను ఉపకులపతి సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన క్యాంటీన్లోని విభాగాన్ని ఎంపికై న జూనియర్ సివిల్ జడ్జిలతో ప్రారంభించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఇన్చార్జ్ విశ్వచంద్రనాథ్, అధ్యాపకులు డాక్టర్ సోమా భట్టాచార్య, డాక్టర్ దయానందమూర్తి, ప్రొఫెసర్ నందిని, కొండయ్య, పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. -
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
మహారాణిపేట/విశాఖ విద్య: ఈ నెల 19న ముఖ్యమంత్రి విశాఖ పర్యటన సందర్భంగా నిర్వహించనున్న స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర, 26,426 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు, కన్వేయన్స్ డీడ్ల పంపిణీ కార్యక్రమాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉదయం 11.30 నుంచి 12.30 గంటల వరకు బీచ్‌రోడ్‌లో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో పట్టాల పంపిణీ జరుగుతుందని తెలిపారు. పట్టాల పంపిణీకి 10 గ్యాలరీలు, 100 కౌంటర్లు ఏర్పాటు చేసి, నియోజకవర్గాలు, వార్డుల వారీగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి వార్డుకు వీఆర్వోను ఇన్చార్జిగా నియమించి లబ్ధిదారుల వివరాలను పక్కాగా మ్యాపింగ్ చేయాలని సూచించారు. ముందుగా ఏయూ మైదానంలో వేదిక, గ్యాలరీలు, పార్కింగ్, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, తాగునీరు, మరుగుదొడ్లు, భోజన వసతులను కలెక్టర్ పరిశీలించారు. లబ్ధిదారులకు పికప్ పాయింట్లు, మార్గాలపై ముందుగానే సమాచారం అందించాలని, మధ్యాహ్నం 1 గంటకే వేదిక వద్దకు చేరుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. పార్కింగ్ ప్రాంతాల్లో జంగిల్ క్లియరెన్స్ చేపట్టాలని, ఈ నెల 18న రూట్‌మ్యాప్, పార్కింగ్‌పై మాక్‌డ్రిల్ నిర్వహించాలని ఆదేశించారు. 18, 19 తేదీల్లో బీచ్‌రోడ్‌లో ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, పారిశుద్ధ్యం, వైద్య, విద్యుత్, తాగునీటి ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పరిశీలనలో ఎంపీ ఎం. శ్రీభరత్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్ రాజు, డీసీపీలు మేరీ ప్రశాంతి, మణికంఠ, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
లేవండీ!
కొత్త మీటర్లుఈపీడీసీఎల్లో విద్యుత్ మీటర్ల కొరత కొత్త కనెక్షన్లకూ, కాలిపోయిన వాటికీ పాత మీటర్లే దిక్కు కొత్త మీటర్‌కు వసూలు చేస్తున్నట్లుగానే చార్జీలు స్మార్ట్ మీటర్ల కోసం తెరవెనుక ఒత్తిళ్లు?సాక్షి, విశాఖపట్నం: ఈపీడీసీఎల్ పరిధిలో నెల రోజులుగా కొత్త విద్యుత్ మీటర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. కొత్తగా ఇళ్లు నిర్మించుకుని విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మీటర్లు అందుబాటులో లేక ఇబ్బందులు తప్పడం లేదు. కొన్ని ప్రాంతాల్లో కనెక్షన్ మంజూరైనా మీటర్ బిగించకపోవడంతో గృహ ప్రవేశాలు చేసిన వారు విద్యుత్ కోసం ఇరుగుపొరుగు ఇళ్లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరోవైపు హైఓల్టేజ్, షార్ట్‌సర్క్యూట్, ఇతర కారణాలతో మీటర్లు కాలిపోయినా వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడం లేదు. పాడైన మీటర్లను తొలగించి పాత మీటర్లనే మరమ్మతులు చేసి తిరిగి బిగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్టాక్ లేదన్న కారణంతో సిబ్బంది జాప్యం చేస్తుండటంతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. చలానా మాత్రం కొత్త దానికే..! కొత్త మీటర్లు అందుబాటులో లేకపోవడంతో ఏళ్ల క్రితం వినియోగించి పక్కనపెట్టిన మీటర్లనే మరమ్మతులు చేసి ప్రస్తుతం బిగిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త కనెక్షన్లకే కాకుండా మీటర్లు కాలిపోయినా, పాడైపోయినా వాటి స్థానంలో వీటినే ఏర్పాటు చేస్తున్నారు. అయితే మీటర్ ఫీజు విషయంలో మాత్రం వినియోగదారులకు మినహాయింపు ఉండటం లేదు. కొత్త మీటర్‌కు ఎంత చెల్లించాలో అంతే మొత్తాన్ని చలానా రూపంలో వసూలు చేస్తున్నారు. కొత్త మీటర్ కోసం పూర్తి స్థాయిలో డబ్బులు చెల్లించి.. చివరకు పాత మీటర్ బిగించడంపై వినియోగదారులు మండిపడుతున్నారు. పాత మీటర్ల పనితీరు, కచ్చితత్వంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మీటర్ రీడింగ్‌లో లోపాలు తలెత్తితే విద్యుత్ బిల్లులు తారుమారయ్యే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. స్మార్ట్ మీటర్ల వైపు మళ్లించేందుకేనా? ఒకవైపు సాధారణ మీటర్ల కొరత నెలకొనడం.. మరోవైపు స్మార్ట్ మీటర్ల వైపు ప్రజలను మళ్లించేందుకు సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారన్న ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. కొత్త కనెక్షన్ కావాలంటే స్మార్ట్ మీటర్ ఏర్పాటు చేసుకోవాలని కొందరు సిబ్బంది వినియోగదారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. వాటికి సమ్మతించని వారికి పాత మీటర్లు బిగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్మార్ట్ మీటర్లతో విద్యుత్ బిల్లుల భారం పెరుగుతుందన్న ఆందోళనతో పాటు.. రీఛార్జ్ విధానంపై స్పష్టత లేకపోవడంతో పలువురు వినియోగదారులు వాటిపై ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో సాధారణ మీటర్ల కొరతకు కారణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇంకా స్టాక్ రాలేదంట..? కొత్త మీటర్ల కోసం ఇప్పటికే కేంద్ర కార్యాలయానికి ఇండెంట్ పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే పైస్థాయి నుంచి ఇంకా స్టాక్ సరఫరా కాలేదని స్థానిక సిబ్బంది పేర్కొంటున్నారు. మీటర్లు వచ్చే వరకు పాత వాటితోనే నెట్టుకురావాల్సి ఉంటుందని అనధికారికంగా స్పష్టం చేస్తున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి కొత్త మీటర్ల కొరతను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. లేదంటే కొత్త కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే వారితో పాటు కాలిపోయిన, పాడైన మీటర్లను మార్చుకోవాల్సిన వినియోగదారుల ఇబ్బందులు మరింత పెరిగే అవకాశం ఉంది. పీఎం పాలెంలో సూర్యకిరణ్ కొత్తగా ఇల్లు నిర్మిస్తున్నారు. విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొత్త కనెక్షన్ కావడంతో కొత్త మీటర్ వస్తుందని భావించారు. అయితే ఈపీడీసీఎల్ సిబ్బంది పాత మీటర్ బిగించారు. దీనిపై ప్రశ్నించగా కొత్త మీటర్లు స్టాక్‌లో లేవని సమాధానమిచ్చారు. పెదగదిలికి చెందిన వెంకటలక్ష్మి ఇంట్లో మీటర్ రెండు రోజుల క్రితం కాలిపోయింది. ఈపీడీసీఎల్ కాల్‌సెంటర్‌కు ఫిర్యాదు చేసి రూ.920 చలానా చెల్లించారు. రెండు రోజుల తర్వాత సిబ్బంది వచ్చి కాలిపోయిన మీటర్ స్థానంలో కొత్తది కాకుండా పాత మీటర్‌ను ఏర్పాటు చేశారు. అడిగితే కొత్త మీటర్లు లేవని బదులిచ్చారు. విద్యుత్ సేవల్లో తామే ముందున్నామని చెప్పుకునే ఈపీడీసీఎల్ పనితీరుకు ఈ రెండు ఘటనలు అద్దం పడుతున్నాయి. -
పచ్చ గద్దలు!
ఇరువాడలో వాలినసబ్బవరం: సనాతన ధర్మం, దేవాలయాల పరిరక్షణ, హిందూ ధర్మ రక్షణ అంటూ రాజకీయ వేదికలపై పెద్దెత్తున మాట్లాడే కూటమి నేతలు.. అదే దేవుడి భూముల పరిరక్షణ విషయంలో మాత్రం ఎందుకు మౌనం వహిస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సబ్బవరం మండలం ఇరువాడలోని భీమలింగేశ్వరస్వామి ఆలయానికి చెందిన కోట్లాది రూపాయులు విలువైన భూములపై కొంత మంది కూటమి నేతలే కన్నేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారి అండదండలతోనే ఆక్రమణలు కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తుండగా.. అడ్డుకోవాల్సిన రెవెన్యూ, దేవదాయ శాఖల అధికారులు మాత్రం పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రూ.80 కోట్ల ఆస్తికి ఎసరు భీమలింగేశ్వరస్వామి ఆలయానికి వివిధ సర్వే నెంబర్లలో రికార్డుల ప్రకారం సుమారు 10.19 ఎకరాలు ఉన్నాయి. ముఖ్యంగా 33/1, 33/2 సర్వే నెంబర్లలో 9.85 ఎకరాలు గ్రామానికి, జాతీయ రహదారికి ఆనుకుని ఉండడంతో భారీ ధర పలుకుతోంది. ఎకరం రూ.7 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకూ విలువ ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈ లెక్కన భూముల విలువ సుమారు రూ.80 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. గతంలో ఆక్రమణల తొలగింపు దేవస్థానం భూముల్లో ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఫిర్యాదులు అందడంతో అప్పటి దేవదాయ శాఖాధికారులు చర్యలు చేపట్టారు. అసిస్టెంట్ కమిషనర్ శాంతి, తదితర అధికారులు స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి ఆక్రమణలు తొలగించి, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. భూములను సమగ్రంగా సర్వే చేసి ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు ఫలం సాయానికి ఇచ్చేలా వేలం ద్వారా పరిరక్షించే దిశగా అధికారులు సన్నాహాలు చేశారు. వేలం అడ్డుకునేందుకు కోర్టు బాట దేవస్థానం భూములను వేలం వేసే ప్రక్రియ ముందుకు సాగుతున్న సమయంలో అప్పటికే ఆక్రమణలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు కూటమి నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అలా ఆ ప్రక్రియను అడ్డుకున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ వివాదంపై న్యాయస్థానం ఇచ్చిన తీర్పులో సదరు భూములన్నీ భీమలింగేశ్వరస్వామి దేవస్థానానికే చెందినవని స్పష్టం చేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. హైవే నుంచి గ్రామానికి వేసిన రోడ్డు తొలగింపు గత ప్రభుత్వంలో జాతీయ రహదారిని ఆనుకుని గ్రామ అవసరాల కోసం ఎన్‌హెచ్–16 అధికారులు ఏర్పాటు చేసిన రహదారిని కొందరు కూటమి నేతలు పొక్లెయిన్లతో తొలగించి ట్రాక్టర్లతో మట్టిని ఆ ప్రాంతంలోని దేవస్థానం భూముల్లో ఫిల్లింగ్ చేయించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అదే ప్రాంతంతో రేకుల షెడ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని చెబుతున్నారు. గ్రామ ప్రజల అవసరాల కోసం ఉన్న రహదారిని తొలగించి దేవస్థానం భూమిలో ఫిల్లింగ్ చేయడానికి ఎవరు అనుమతులు ఇచ్చారు.?, నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదు.? అనే ప్రశ్నలు ఇప్పడు అందరిలో తలెత్తుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి కోట్ల విలువైన భీమలింగేశ్వరుడి స్వామి ఆలయ భూములను కాపాడాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఫిర్యాదులు వస్తే దేవదాయ శాఖకు పంపిస్తాం.. దేవస్థానం భూముల పరిరక్షణ అంశం పూర్తిగా దేవదాయ శాఖ పరిధిలో ఉంటుంది. ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు అందితే దేవదాయ శాఖ అధికారులకు సమాచారం ఇస్తాం. ఆక్రమణల తొలగింపు, భూముల సర్వే, దేవస్థానానికి అప్పగించే ప్రక్రియలో రెవెన్యూ శాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తాం. – అరుణ్ చంద్ర, తహసీల్దార్, సబ్బవరం మండలం తీర్పు తర్వాతా ఆక్రమణలు కోర్టు తీర్పుతో భూములపై హక్కులు స్పష్టమైనప్పటికీ వాటిని పూర్తిగా దేవస్థానం ఆధీనంలోకి తీసుకుని రక్షణ కల్పించాల్సిన అధికారులు.. ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. దీంతో మళ్లీ ఆక్రమణలు మొదలయ్యాయని స్థానికులు చెబుతున్నారు. సర్వే నెంబర్ 33/1లో మట్టి ఫిల్లింగ్ చేయడంతో పాటు రేకుల షెడ్లు నిర్మించి పశువుల పెంపకం చేపడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇరువాడలో దేవదాయ శాఖకు చెందిన భీమలింగేశ్వరస్వామి భూములపై ‘పచ్చ’గద్దల చూపు పడింది. హైవేకు ఆనుకుని ఉన్న ఈ భూముల విలువ సుమారు రూ.80 కోట్లకు పైగా పలుకుతుండడంతో ఆక్రమణలకు పావులు కదుపుతున్నారు. గతంలో ఆక్రమణలను తొలగించినా కోర్టును ఆశ్రయించి అడ్డంకులు సృష్టించారు. ఈ భూములన్నీ దేవస్థానానివేనని న్యాయస్థానం స్పష్టంగా తేల్చినా, కూటమి నేతల అండతో మళ్లీ ఆక్రమణదారులు కన్నేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో దేవాలయ ఆస్తుల పరిరక్షణపై సందేహాలు తలెత్తుతున్నాయి. -
ఉద్యోగుల ఎదుగుదల్లో తల్లిదండ్రుల పాత్ర కీలకం
విశాఖ లీగల్: ఉద్యోగులు ఉన్నతంగా ఎదగడంలో తల్లిదండ్రుల పెంపకం, బాల్యదశ కీలకమని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ న్యాయ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు పైల సన్నిబాబు అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో ఇటీవల నజీర్‌గా పదోన్నతి పొందిన గారపాటి కొండబాబును బుధవారం ఆయన ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సన్నిబాబు మాట్లాడుతూ కొండబాబు ఉన్నత వ్యక్తిత్వం, మృదుస్వభావం కార్యశీలత కూడిన వ్యక్తిగా కొనియాడారు. ఎందరో న్యాయమూర్తులు దగ్గర తలలో నాలుకగా ఎదిగిన కొండబాబు ఉద్యోగులందరికీ ఆదర్శమన్నారు. నజీర్ కొండబాబు మాట్లాడుతూ అందరి సహకారంతోనే తానీస్థాయికి ఎదిగానన్నారు. అధికారులకు, న్యాయమూర్తులకు కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు నమ్మి సన్యాసిరావు, న్యాయ ఉద్యోగుల సంఘం నాయకులు, సంఘం ప్రతినిధులు, సిబ్బంది పాల్గొని కొండబాబును అభినందించారు. అప్పన్న సన్నిధిలో ఆర్థికశాఖ ఉన్నతాధికారుల బృందం -
డేటా సెంటర్లకు అనుమతులపై పౌర సంఘాల ఆందోళన
బీచ్‌రోడ్డు: డేటా సెంటర్లు, బీచ్ షాక్స్ వల్ల భూమి, నీరు, విద్యుత్, ప్రకృతి, పర్యావరణం, సంస్కృతి తీవ్ర ప్రభావం చూపుతుందని పౌర సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం ప్రాంగణంలో విశాఖ పౌర సమావేశం బుధవారం నిర్వహించారు. పౌర చైతన్య వేదిక విశాఖ జిల్లా అధ్యక్షుడు ప్రొఫెసర్ కె.కొలవెన్ను చాంద్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి సీపీడీఆర్‌ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ కుంచె శ్రీధర్ ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. ఏఐ డేటా సెంటర్లకు ప్రభుత్వాలు వేగంగా అనుమతులు మంజూరు చేస్తున్నాయని, వాటి కోసం విశాఖ పరిసరాల్లో చెట్ల తొలగింపు, కొండల తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. డేటా సెంటర్ల వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలపై స్పష్టత అవసరమని పేర్కొన్నారు. గ్రీన్ విశాఖ అధ్యక్షుడు రాజా రామమోహన్ రాయ్ మాట్లాడుతూ పర్యావరణ విధ్వంసం భవిష్యత్ తరాలపై ప్రభావం చూపుతుందన్నారు. విశాఖలో ఇప్పటికే నీటి కొరత ఉన్న నేపథ్యంలో భారీగా నీరు అవసరమయ్యే డేటా సెంటర్లకు అనుమతులు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పౌర చైతన్య వేదిక కార్యదర్శి సీహెచ్ ప్రమీల మాట్లాడుతూ బీచ్ షాక్స్ వల్ల తీర ప్రాంత ప్రశాంతతకు భంగం కలగడంతోపాటు మహిళల భద్రత, సామాజిక సంస్కృతిపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశం అనంతరం డేటా సెంటర్ల ఏర్పాటును నిలిపివేయాలని, బీచ్ షాక్స్‌కు సంబంధించిన జీవో 362ను రద్దు చేయాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో గ్రీన్ విశాఖ, పౌర చైతన్య వేదిక ప్రతినిధులు అచ్చిబాబు, తిరుపతిరావు, ఎస్.గోవిందరాజులు, విద్యార్థి సంఘ నాయకులు అభిలాష్, సంతోష్, ధృవ తదితరులు పాల్గొన్నారు. -
మేహాద్రిగెడ్డపై సమగ్ర అధ్యయనం చేయాలి
డాబాగార్డెన్స్: నగర తాగునీటి సరఫరాలో కీలకమైన మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌లో ప్రస్తుత నీటిమట్టం, నీటి లభ్యత, క్యాచ్మెంట్ ప్రాంతాల పరిస్థితిపై సమగ్ర అధ్యయనం చేపట్టాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ అధికారులను ఆదేశించారు. జీవీఎంసీ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీరు పల్లంరాజు, అడ్వైజర్ జగన్మోహనరావు, ఇరిగేషన్ శాఖ ఉప కార్యనిర్వాహక ఇంజనీరు స్వామినాయుడుతో కలిసి రిజర్వాయర్‌ను బుధవారం పరిశీలించారు. రిజర్వాయర్ నీటిమట్టం, నీరు చేరే క్యాచ్మెంట్ ప్రాంతాలు, ప్రవాహ మార్గాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కోటపాడు, సబ్బవరం పరిసర ప్రాంతాల్లోని చెరువులు, పరీవాహక ప్రాంతాల నుంచి రిజర్వాయర్‌కు నీరు చేరుతుందని అధికారులు తెలిపారు. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ప్రస్తుత నీటిమట్టం తగ్గడానికి గల కారణాలను కమిషనర్ సమీక్షించారు. స్పిల్‌వే రెగ్యులేటర్ ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం గత ఐదేళ్ల నీటిమట్టాల రికార్డులను పరిశీలించారు. గత పదేళ్ల నీటిమట్టాల వివరాలను క్రోడీకరించి, తగ్గుదలకు కారణాలతో సమగ్ర నివేదిక అందజేయాలని పర్యవేక్షక ఇంజనీరు పల్లంరాజును ఆదేశించారు. రిజర్వాయర్‌లో డీసిల్టేషన్, డ్రెడ్జింగ్ చేపట్టేందుకు ముందుగా డ్రోన్ సర్వే నిర్వహించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కార్యనిర్వాహక ఇంజనీరు మురళీకృష్ణను ఆదేశించారు. పరిశీలనలో జీవీఎంసీ నీటి సరఫరా విభాగం ఉప కార్యనిర్వాహక ఇంజనీరు వీరయ్య, ఇరిగేషన్ శాఖ సహాయక ఇంజనీరు నళిని తదితరులు పాల్గొన్నారు. డ్రోన్ సర్వేతో డీసిల్టేషన్, డ్రెడ్జింగ్‌కు కార్యాచరణ: జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ -
గణేష్ నిమజ్జన కోలాహలం
ఆరిలోవ: జోడుగుళ్లపాలెం బీచ్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనాలతో బుధవారం సాయంత్రం నుంచి సందడి నెలకొంది. ఆరిలోవ, విశాలాక్షినగర్, ఆదర్శనగర్, ఎంవీపీ కాలనీ, లాసన్స్ బే కాలనీ, డాక్టర్స్ కాలనీ, ఇసుకతోట, మద్దిలపాలెం, పిఠాపురం కాలనీ, సింహాచలం తదితర ప్రాంతాల నుంచి పదుల సంఖ్యలో విగ్రహాలను నిమజ్జనం కోసం తీరం వద్దకు తీసుకొచ్చారు. మూడు రోజుల గణేష్ ఉత్సవాల అనంతరం బుధవారం అనుపు కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అపార్ట్మెంట్లలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాల నుంచి భక్తులు విగ్రహాలను ఊరేగింపుగా తీరం వద్దకు తీసుకువచ్చి ‘జైజై గణేశా.. బైబై గణేశా’అంటూ వీడ్కోలు పలికారు. విగ్రహాలను గజ ఈతగాళ్లకు అప్పగించగా, వారు సముద్రంలో నిమజ్జనం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఆరిలోవ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఆటోనగర్ సబ్ డివిజన్‌లోకి అగనంపూడి సెక్షన్ కార్యాలయం
అగనంపూడి: ఆర్ఈసీఎస్ పరిధిలోని కశింకోట సబ్ డివిజన్లో ఇప్పటివరకు కొనసాగిన అగనంపూడి సెక్షన్ కార్యాలయాన్ని బుధవారం నుంచి విశాఖ డివిజన్ ఆటోనగర్ సబ్ డివిజన్లో విలీనం చేస్తూ ఏపీ ఈపీడీసీఎల్ ఉత్తర్వులు జారీ చేసింది. అగనంపూడి ప్రాంతం ప్రస్తుతం విశాఖ జిల్లా పరిధిలో ఉండటంతో బీహెచ్‌పీవీ సమీపంలోని ఏడీఈ కార్యాలయంతో కూడిన ఆటోనగర్ సబ్ డివిజన్ పరిధిలోకి బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. సబ్ సెక్షన్ కార్యాలయాన్ని ఏఈ కార్యాలయంగా మార్చినట్లు తెలిపింది. అయితే అగనంపూడి కార్యాలయ సిబ్బంది ఆర్ఈసీఎస్లోనే కొనసాగుతారని ఏపీఈపీడీసీఎల్ చైర్మన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
చెదలు పట్టాయని.. రోడ్డుపై నోట్లు పారేశాడు!
అల్లిపురం: నగరంలో రోడ్డుపై పెద్ద సంఖ్యలో చిరిగిన కరెన్సీ నోట్లు కనిపించడంతో కలకలం రేగింది. సెంట్రల్ పార్క్ ఎదురుగా బుధవారం తెల్లవారుజామున వాకర్స్ వీటిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో టూటౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని నోట్లను స్వాధీనం చేసుకున్నారు. సీఐ అప్పలనాయుడు ఆధ్వర్యంలో పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. విచారణలో కేజీహెచ్ ప్రాంతంలోని తాడివీధికి చెందిన ఆదిమూలం సూర్యారావు నోట్లను అక్కడ పడేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆయనను పిలిపించి విచారించగా.. తాను కిరాణా దుకాణాలకు సరుకులు సరఫరా చేస్తుంటానని తెలిపాడు. కొంతకాలంగా ఇంట్లోని అట్టపెట్టెలో నగదుతోపాటు ఎల్ఐసీ రసీదులు ఉంచినట్లు చెప్పాడు. వాటికి చెదలు పట్టడంతో.. కుటుంబ సభ్యులకు తెలిస్తే వివాదం తలెత్తుతుందనే ఉద్దేశంతో మంగళవారం సాయంత్రం చిరిగిన నోట్లను సెంట్రల్ పార్క్ ఎదురుగా రోడ్డుపై పడేసినట్లు సీఐ అప్పలనాయుడు తెలిపారు. చిరిగిన నోట్ల విలువ సుమారు రూ.3 వేల వరకు ఉంటుందని సూర్యారావు చెప్పాడు. అవి వినియోగానికి పనికిరావని భావించి రోడ్డుపై పడేసినట్లు వివరించాడు. దీంతో నోట్లతోపాటు అక్కడ లభించిన ఎల్ఐసీ రసీదులు, పాన్‌కార్డును పోలీసులు బుధవారం మధ్యాహ్నం సూర్యారావుకు అందజేశారు. పోలీసుల దర్యాప్తుతో రోడ్డుపై చిరిగిన నోట్లు ప్రత్యక్షమైన ఘటన వెనుక మిస్టరీ వీడింది. -
వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఘనంగా చవితి వేడుకలు
మహారాణిపేట: మద్దిలపాలెంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించారు. అనంతరం కేకే రాజు మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కొంటున్నారని, కూటమి పాలనతో ప్రజలు పడుతున్న కష్టాలన్నీ తొలగిపోవాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించినట్లు తెలిపారు. భవిష్యత్తులో వైఎస్ జగన్ చేపట్టే అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా విజయవంతమై, పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త మొల్లి అప్పారావు, పార్టీ కార్యాలయ పర్యవేక్షకుడు రవిరెడ్డి, పార్టీ నాయకులు మంచ నాగమల్లేశ్వరి, పీవీ నారాయణ, తాడి జగన్నాథ్ రెడ్డి, బోని శివరామకృష్ణ, బిపిన్ కుమార్‌జైన్, గాలి ప్రసాద్, చొల్లంగి నాగేశ్వరరావు, మధు, జగదీష్, కొట్యాడ సూర్య, మహేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
విశ్వేశ్వరయ్య స్ఫూర్తితో ప్రజాసేవ
మహారాణిపేట : ఇంజనీర్స్ డే సందర్భంగా ఏపీఎస్ఈబీ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య కాంస్య విగ్రహాన్ని సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ విశ్వేశ్వరయ్య సాంకేతిక ప్రతిభ, నిస్వార్థ ప్రజాసేవ స్ఫూర్తిగా ఇంజనీర్లు పనిచేయాలన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని విద్యుత్ రంగ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డైరెక్టర్లు టి.వి.సూర్యప్రకాష్, టి.వనజ, ఏపీఎస్ఈబీ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
‘ఎస్ఐఆర్’తో బీజేపీ శాశ్వత అధికారానికి కుట్ర
అల్లిపురం: ఎస్ఐఆర్ పేరుతో దేశవ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది ఓట్లను తొలగించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు కుట్ర చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జె.వి.సత్యనారాయణమూర్తి ఆరోపించారు. అల్లిపురంలోని సీపీఐ కార్యాలయంలో మంగళవారం జరిగిన జిల్లా సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ జీడీపీ 7.5 శాతంగా ఉందని కేంద్రం చెబుతున్నప్పటికీ, మాజీ ఆర్థికశాఖ ఉన్నతాధికారులు, ఆర్బీఐ మాజీ గవర్నర్లు వెల్లడించిన గణాంకాలు భిన్నంగా ఉన్నాయన్నారు. విద్యా విధానాల్లో మార్పులు, ప్రశ్నపత్రాల లీకేజీలపై కేంద్రం తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఇటీవల కాగ్ నివేదికలో 40 కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఖర్చుల నిర్వహణ సక్రమంగా లేదని పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలను పక్కనపెట్టి ప్రధాని మోదీని పొగడటానికే పరిమితమవుతోందని విమర్శించారు. లోకేశ్‌ను ముఖ్యమంత్రిని చేయాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు మోదీకి మద్దతుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ మెరుగైన ఫలితాలు సాధించేలా పార్టీ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.మన్మధరావు అధ్యక్షత వహించిన సమావేశంలో జిల్లా కార్యదర్శి షేక్ రహిమాన్, సహాయ కార్యదర్శి పి.చంద్రశేఖర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఎ.విమల, కార్యవర్గ సభ్యులు ఎం.పైడిరాజు, కె.వనజాక్షి, ఎం.డి.బేగం, ఆర్.శ్రీనివాసరావు, ఎన్.నాగభూషణరావు తదితరులు పాల్గొన్నారు. -
సౌత్‌కోస్ట్ రైల్వే డీజీఎంగా శ్రీనివాసు
తాటిచెట్లపాలెం: సౌత్‌కోస్ట్ రైల్వే డిప్యూటీ జనరల్ మేనేజర్(జనరల్)గా నియమితులైన నాగ రొంగల శ్రీనివాసు మంగళవారం బాధ్యతలను స్వీకరించారు. 2011 ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్స్ బ్యాచ్‌కు చెందిన ఈయనకు కీలక సాంకేతిక, అధునాతన పద్ధతుల్లో విశేష అనుభవం ఉందని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. శ్రీనివాసు గతంలో సౌత్ కోస్ట్రైల్వే, లోకోమోటివ్స్ ఆపరేషన్స్‌లో డిప్యూటీ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్‌గా, ఎలక్ట్రిక్ లోకోషెడ్ రాయపురంలో సీనియర్ డివిజనల్ ఇంజినీర్‌గా, ఎలక్ట్రిక్ లోకో షెడ్, అరక్కోణంలో సీనియర్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజినీర్‌గా పనిచేశారు. -
ఆళ్ల నాని మృతి బాధాకరం
విశాఖ విద్య: మాజీ మంత్రి ఆళ్ల నాని ఆకస్మిక మృతి తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. ఆళ్ల నాని ప్రజా జీవితంలో సుదీర్ఘకాలం సేవలందించారని పేర్కొన్నారు. వైఎస్ జగన్ మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించి, ప్రజలకు సేవ చేశారని గుర్తు చేసుకున్నారు. వైఎస్ జగన్ ఆయనకు శాసనసభ్యుడిగా, శాసనమండలి సభ్యుడిగా అవకాశం కల్పించారని ఈ సందర్భంగా తెలిపారు. సీతమ్మధారలో ఉన్న నాని నివాసానికి వెళ్లి, ఆయన భౌతిక కాయనికి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ● టీడీపీ నేత, మాజీ మంత్రి ఆళ్ల నాని ఆకస్మిక మృతి పట్ల విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే, బీజేపీ ఫ్లోర్ లీడర్ పి.విష్ణుకుమార్‌రాజు సంతాపం తెలిపారు. నాని అకాల మరణం రాజకీయ, ప్రజా జీవితానికి తీరని లోటన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా ఆళ్ల నాని భౌతికకాయానికి నివాళులర్పించారు. -
● ఏకదంతం.. విభిన్న రూపం
విఘ్నాలను తొలగించే వినాయకుడు.. భక్తుల ఊహలకు అనుగుణంగా విభిన్న రూపాల్లో దర్శనమిస్తున్నాడు. విశాఖ మహానగరంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మండపాల్లో గణనాథుడిని ప్రత్యేక ఆకృతుల్లో కొలువుదీర్చారు. ఫైర్‌మెన్ గణపతి నుంచి పెద్ది, గోవా, భవానీ మాలధారుడు, గాజులు, పసుపుకొమ్ములు, పప్పుదినుసులు, ఖర్జూరం, రుద్రాక్ష గణపతి తదితరఆకట్టుకునే రూపాలు కొలువుదీరాయి. క్రికెటర్ అవతారంలో దర్శనమిస్తున్న గణపతి భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాడు. సంప్రదాయ భక్తి.. సృజనాత్మకత మేళవింపుతో రూపుదిద్దుకున్న ఈ గణేశ విగ్రహాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. వివిధ రూపాల్లో కొలువుదీరిన ఏకదంతుడి వైభవాన్ని ‘సాక్షి’ కెమెరా క్లిక్‌మనిపించింది. – ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్–విశాఖపట్నంరెల్లివీధి పెద్ది గణేశుడుపెయిందొరపేటలో...కోటవీధిలో ఝాన్సీరాణిగా.. -
తెలుగు ప్రేక్షకుల ప్రేమే మా గెలుపు
డాబాగార్డెన్స్/మద్దిలపాలెం: ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ పతాకంపై సూరి, సుహాస్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు మదిమారన్ పుగళేంది తెరకెక్కించిన ‘మండాడి’చిత్రం ఘన విజయంపై చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. నగరంలో చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్లలో చిత్ర యూనిట్ సోమవారం సందడి చేసింది. థియేటర్లలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో సూరి మాట్లాడుతూ మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని పేర్కొన్నారు. ‘మండాడి’ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. విడుదలకు ముందే చిత్రంపై నమ్మకం వ్యక్తం చేసిన మైత్రి సంస్థ ప్రతినిధులు నవీన్, రవికి ధన్యవాదాలు చెప్పారు. సహనటుడు సుహాస్‌తో పాటు చిత్ర విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ సముద్రతీరం, మత్స్యకారుల జీవన విధానంతో అనుబంధం ఉన్న ప్రేక్షకులు తప్పక చూడాల్సిన చిత్రమని సూరి పేర్కొన్నారు. హీరో సుహాస్ మాట్లాడుతూ ప్రాణాలు పణంగా పెట్టి ఈ చిత్రంలో నటించినందుకు తగ్గ ఫలితం దక్కిందన్నారు. విశాఖ అంటే తనకు ఎంతో సెంటిమెంట్ అన్నారు. ఇక్కడ సినిమా రెస్పాన్స్‌పై ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో నిర్మాత ఎల్రెడ్ కుమార్, డిస్ట్రిబ్యూటర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. సూరి, సుహాస్‌లతో సెల్ఫీలు తీసుకునేందుకు ప్రేక్షకులు పోటీపడ్డారు. నగరంలో సందడి చేసిన ‘మండాడి’ చిత్ర యూనిట్ -
బిందెలతో రోడ్డెక్కారు
ఆరిలోవ: తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న ఆరిలోవ ప్రాంతవాసులు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. జీవీఎంసీ 13వ వార్డు పరిధి శ్రీకాంత్‌నగర్‌లోని జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో సకాలంలో కుళాయి నీరు సరఫరా కావడం లేదని నిరసన వ్యక్తం చేశారు. చాలీచాలని నీటితో రోజువారీ అవసరాలు తీర్చుకోవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఖాళీ బిందెలతో నిరసన చేపట్టిన స్థానికులకు వైఎస్సార్సీపీ నాయకులు మద్దతు తెలిపారు. కాలనీలోని అవసరాలకు సరిపడేలా ప్రతిరోజూ కుళాయి నీటిని సరఫరా చేయాలని, నీటి సరఫరాలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జీవీఎంసీ నీటి సరఫరా విభాగం అధికారులను డిమాండ్ చేశారు. కొండవాలులోనూ అరకొర నీరే.. జీవీఎంసీ 12వ వార్డు పరిధి సుందరయ్యకాలనీ కొండవాలు ప్రాంతంలోనూ తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేస్తుండగా, మెట్ల పక్కన ఏర్పాటు చేసిన సింథటిక్ ట్యాంకుల్లో నీటిని నింపుతున్నారు. అయితే సుమారు మూడు నెలలుగా ట్యాంకులు అరకొరగానే నిండుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో కొండవాలులో నివసించే కుటుంబాలకు నీరు సరిపోవడం లేదని వాపోతున్నారు. నీటి అవసరాలు తీర్చేందుకు సింథటిక్ ట్యాంకులను ప్రతిరోజూ పూర్తిస్థాయిలో నింపాలని, నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. -
అర్హత ఉన్నా తిరస్కరణ
అన్ని అర్హతలు ఉన్నా అధికారుల సాంకేతిక తప్పిదాల వల్ల పింఛను అందుకోలేక సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు పలువురు బాధితులు. జీవీఎంసీ 25వ వార్డు శాంతిపురానికి చెందిన కర్రి భారతి (35) భర్త కరోనాతో మరణించగా, అపార్టుమెంట్ వాచ్‌మెన్‌గా పనిచేస్తూ ఇద్దరు పిల్లలను పోషించుకుంటోంది. వితంతు పింఛను కోసం ఈమె దరఖాస్తు చేయగా, ప్రజా సాధికార సర్వే మ్యాపింగ్‌లో వేర్వేరు రేషన్ కార్డులు ఉన్నప్పటికీ అత్తగారితో కలిపి చూపించారు. అత్తకు ఇప్పటికే పింఛను వస్తుండటంతో, భారతి దరఖాస్తును అధికారులు తిరస్కరిస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి తన లాంటి నిజమైన అర్హులకు పింఛను మంజూరు చేయాలని కోరుతోంది. -
ఉమెన్ గ్రాండ్ మాస్టర్‌గా సాహితి
విశాఖ స్పోర్ట్స్: విశాఖకు చెందిన అంతర్జాతీయ చెస్ మాస్టర్ మూగి సాహితి వర్షిణి ‘ఉమెన్ గ్రాండ్ మాస్టర్’(డబ్ల్యూజీఎం) హోదాను సాధించారు. సెర్బియాలో ఇటీవల జరిగిన అంతర్జాతీయ టోర్నీలో మూడో, తుది డబ్ల్యూజీఎం నార్మ్‌ను పూర్తి చేసి ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రధాన విజయాలు: సెర్బియా టోర్నీలో 9 రౌండ్లలో 6 పాయింట్లు సాధించి రన్నరప్‌గా నిలిచారు. అంతకుముందు ఫ్రాన్స్‌లో ‘బెస్ట్ ఉమెన్ ప్లేయర్’గా నిలవడంతో పాటు, హంగేరీ ఓపెన్‌లో రెండో డబ్ల్యూజీఎం నార్మ్‌ను దక్కించుకున్నారు. రికార్డులు: విశాఖ నుంచి ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్(డబ్ల్యూఐఎం) టైటిల్ సాధించిన తొలి మహిళా చెస్ క్రీడాకారిణిగా సాహితి గతంలోనే గుర్తింపు పొందారు. చిన్ననాటి నుంచి తండ్రి లోకేశ్వరరావు పర్యవేక్షణలో శిక్షణ పొందుతూ నేడు ఈ అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. -
విశాఖకు దాహం
సాక్షి, విశాఖపట్నం: నగరంలో తాగునీటి సంక్షోభం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది.. కనీసం దాహార్తిని కూడా తీర్చలేకపోవడం కూటమి ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.మంగళవారం ఆయన 6వ వార్డు లక్ష్మీవానిపాలెం ఆర్.హెచ్.కాలనీ, ఉత్తర నియోజకవర్గంలోని 26వ వార్డు చిన్నూరు మసీదు ప్రాంతాల్లో పర్యటించారు. స్థానికులు తమ నిత్య అవస్థలను ఆయన వద్ద వెళ్లబోసుకున్నారు. ‘రోజువారీ పనులు, పిల్లల చదువులను పక్కనబెట్టి ఉదయం నుంచి రాత్రి వరకు నీటి కోసమే జాగారం చేయాల్సి వస్తోంది. మూడు రోజులకోసారి అదీ అర్ధరాత్రి వేళ సరఫరా చేస్తుండటంతో చుక్క నీటి కోసం గంటల తరబడి క్యూలలో నిలబడుతున్నాం. విశాఖ చరిత్రలోనే ఇలాంటి దయనీయ పరిస్థితిని ఎన్నడూ చూడలేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి కొరతే వ్యాపారమా..? రెండు నెలలుగా కుళాయిల్లో నీరు రాకపోవడంతో ప్రైవేటు వాటర్ ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నామని స్థానికులు తెలిపారు. నీటి కొరతను కొందరు ట్యాంకర్ నిర్వాహకులు, దళారులు వ్యాపారంగా మార్చుకున్నారని, తప్పనిసరి పరిస్థితుల్లో అధిక ధరలు చెల్లించి నీటిని కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ప్రజల దాహార్తిని తీర్చాల్సిన ప్రభుత్వం సమస్యను పట్టించుకోకపోవడంపై కేకే రాజు కూటమి ప్రభుత్వం, జీవీఎంసీ అధికారుల తీరును తప్పుబట్టారు. తాగునీటి సమస్యపై ప్రభుత్వం ముందస్తు సమీక్ష చేయడంలో విఫలమైందని విమర్శించారు. రిజర్వాయర్లలో నీటి నిల్వలు, పూడికతీత, వర్షపు నీటి సంరక్షణపై ముందస్తు ప్రణాళిక లేకపోవడమే ప్రస్తుత సంక్షోభానికి కారణమని పేర్కొన్నారు. నాలుగు రోజుల్లో పరిష్కరించాలి నగరంలోని నీటి సరఫరా వ్యవస్థపై జీవీఎంసీ అధికారులు సమగ్ర సమీక్ష నిర్వహించాలని కేకే రాజు కోరారు. ఏ ప్రాంతానికి ఎన్ని గంటలు నీరు సరఫరా అవుతోంది? ఎక్కడ లీకేజీలు ఉన్నాయి? ఎక్కడైనా మురుగునీరు కలిసే పరిస్థితి ఉందా? అనే అంశాలను పరిశీలించి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సమస్యను పరిష్కరించడంలో విఫలమైతే వైఎస్సార్సీపీ తరఫున అవసరమైన ప్రాంతాల్లో ఉచితంగా మంచినీటి ట్యాంకర్లు ఏర్పాటు చేసి ప్రజలకు అండగా నిలుస్తామని తెలిపారు. విశాఖలో నెలకొన్న తాగునీటి సంక్షోభాన్ని నాలుగు రోజుల్లోగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే నీటి కోసం ఇబ్బందులు పడుతున్న ప్రజలను కలుపుకుని సోమవారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జీవీఎంసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ నేతలు పోతిన హనుమంతు, పోతిన శ్రీనివాసరావు, పోతిన ప్రసాద్, బొడ్డెటి కిరణ్‌కుమార్, డోప్ప శ్రీను, జక్కపూడి సత్యనారాయణ, పార్టీ నాయకులు మారుతి ప్రసాద్, భోగవల్లి గోవింద్, పిల్లి సుజాత, రాజేశ్వరి, జగ్గుపల్లి నరేష్, అప్పన్న, రోషి రెడ్డి, నర్సింగరావు, మూర్తిబాబు, నాగభూషణ్, బొట్ట అప్పలరాజు, ఎల్లాజీ, పిల్లా రమణ, శేషు, అమ్మాజీ, నవాబ్, పోతున్న బంతి హరి, బొట్టా రాజు పాల్గొన్నారు. -
19న సీఎం పర్యటన
ఏర్పాట్లపై సమీక్ష మహారాణిపేట: విశాఖలో ఈ నెల 19న ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, ఎంపీ శ్రీభరత్ సూచించారు. కలెక్టరేట్లో కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న వారిద్దరూ అధికారులు, ఎమ్మెల్యేలకు ఆదేశాలిచ్చారు. ఇళ్ల స్థలాల పట్టాలకు సంబంధించి అర్హులైన లబ్ధిదారులందరికీ ముందుగానే ఆహ్వానపత్రాలు అందించాలన్నారు. 26,426 మంది లబ్ధిదారులు : జిల్లాలో ఇళ్ల స్థలాల పట్టాలు, కన్వేయన్స్ డీడ్ల పంపిణీకి సంబంధించి మొత్తం 26,426 మంది లబ్ధిదారులను గుర్తించినట్లు కలెక్టర్ తెలిపారు. భీమిలిలో 4,198, గాజువాకలో 5,597, పెందుర్తిలో 2,896, విశాఖ తూర్పులో 5,107, ఉత్తరలో 2,425, దక్షిణలో 1,228, పశ్చిమలో 4,975 మంది లబ్ధిదారులు ఉన్నట్లు వివరించారు. ఏయూలో జరిగే కార్యక్రమంలో అర్హులందరికీ పత్రాలు అందేలా చర్యలు చేపట్టామన్నారు. అదేరోజు ఆర్కే బీచ్ పరిసరాల్లో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇన్కాయిస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న నిర్మల్ సాగర్ పైలట్ ప్రాజెక్టును సీఎం ప్రారంభిస్తారని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యేలు గణబాబు, పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, పి.విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్, సీపీ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జేసీ విద్యాధరి తదితరులు పాల్గొన్నారు. -
డిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళన
మహారాణిపేట: తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళన విరమించే ప్రసక్తి లేదని వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ఎస్.కె.ఆశ అన్నారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట కాంట్రాక్టు ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన ప్రదర్శన చేశారు. గత కొద్ది రోజుల నుంచి వివిధ రకాల పద్ధతుల్లో ఆందోళన చేస్తున్నా.. ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. దీంతో ఆందోళన ఉధృతం చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా కన్వీనర్ కిషోర్రావు, జేఏసీ నాయకుడు శివప్రసాద్, పైడిరాజు, సతీష్ కుమార్, బి.నాగేంద్రకుమార్, ప్రసాదరావు, పీకే రాజు, కె.నాగిరెడ్డి, బి.నాగేంద్ర కుమార్, పి.రాజశేఖర్, సతీష్ కుమార్, ఉమెన్ వింగ్ చైర్మన్ పి.పద్మావతి, ప్రతినిధులు కె.పద్మావతి, ఏపీ బిందు తదితరులు పాల్గొన్నారు. -
బాలగణపతి అలంకరణలో సంపత్ వినాయకుడు
మహారాణిపేట: ఆశీలమెట్టలోని శ్రీ సంపత్ వినాయగర్ ఆలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలు, కటౌట్లతో అలంకరించారు. సోమవారం సంపత్ వినాయకర్ అలంకరణలో, మంగళవారం శ్రీ బాలగణపతి అలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. విష్ణు సహస్రనామ పారాయణం, భక్తిగీతాలు, సాంస్కృతిక కార్యక్రమా లు నిర్వహించారు. మంగళవారం అన్నదానం చేపట్టగా.. ఈనెల 23న మహా అన్నదానానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల నేపథ్యంలో ఆశీలమెట్ట రహదారిపై ట్రాఫిక్ రద్దీ నెలకొంది. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి సిరిపురం వెళ్లే మార్గంలో వాహనాలు బారులు తీరడంతో భక్తులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. -
జీవీఎంసీలో ఇక 120 వార్డులు
డాబాగార్డెన్స్: గ్రేటర్ విశాఖపట్నం నగర పాలక సంస్థలో ఇకపై 120 వార్డులు ఉండనున్నాయి. ప్రస్తుతం ఉన్న 98 వార్డులను 120 వార్డులుగా పునర్విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది. కొత్త వార్డుల పరిధులు, సరిహద్దులను ఖరారు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ ప్రచురితమైందని జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ తెలిపారు. వార్డుల పునర్విభజన ప్రక్రియలో భాగంగా తొలుత ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసి ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించారు. వాటిని పరిశీలించిన అనంతరం తుది ప్రతిపాదనలను ఖరారు చేసి 120 వార్డుల పునర్విభజనపై తుది గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్టు కమిషనర్ వివరించారు. కొత్తగా ఏర్పాటైన ప్రతి వార్డుకు సంబంధించిన పరిధులు, సరిహద్దుల వివరాలను గెజిట్‌లో పొందుపరిచినట్టు పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలోనూ కొత్త వార్డులే.. కొత్త వార్డుల ప్రాతిపదికన ఓటర్ల జాబితాల రూపకల్పనకు కూడా జీవీఎంసీ సిద్ధమవుతోంది. పునర్విభజన చేసిన వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితాలను ఈ నెల 22న ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల 15న నోటిఫికేషన్ జారీ చేసినట్టు కమిషనర్ తెలిపారు. ఈ ఏడాది జనవరి 1వ తేదీని అర్హత తేదీగా పరిగణనలోకి తీసుకుని, తాజా అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాల ఆధారంగా కొత్త వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితాలను సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. ఆయా జోన్ల పరిధిలో వార్డుల వారీ ఫొటో ఓటర్ల జాబితాల తయారీ, ప్రచురణ బాధ్యతలను సంబంధిత జోనల్ కమిషనర్లు నిర్వహిస్తారని రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్లో పేర్కొన్నట్టు తెలిపారు. మీ ప్రాంతం.. ఏ వార్డు? వార్డుల పునర్విభజనతో నగరంలోని అనేక ప్రాంతాల వార్డు పరిధుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సూచించారు. గెజిట్‌లో పొందుపరిచిన కొత్త వార్డుల పరిధులు, సరిహద్దులను పరిశీలించి తమ నివాస ప్రాంతం ప్రస్తుతం ఏ వార్డు పరిధిలోకి వచ్చిందో తెలుసుకోవాలని కోరారు. అలాగే ఈ నెల 22న ప్రచురించే కొత్త వార్డుల వారీ ఫొటో ఓటర్ల జాబితాల్లో తమ పేర్లు, ఇతర వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు. -
డిసెంబర్లో విశాఖ ఉత్సవ్
మహారాణిపేట: ఈ ఏడాది డిసెంబరులో విశాఖ ఉత్సవ్ నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ తెలిపారు. మంగళవారం తన చాంబర్లో విలేకరులతో మాట్లాడుతూ.. పర్యాటక శాఖ కార్యదర్శి ఇప్పటికే రెండుసార్లు సమీక్షించారని, ఉత్సవ్‌లో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ‘విజిట్ వైజాగ్’ కాన్సెప్ట్‌ను రూపొందిస్తున్నామని, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా నగరానికి ప్రత్యేక బ్రాండ్ కల్పిస్తామన్నారు. కై లాసగిరి నుంచి భీమిలి వరకు బేసిటీ అభివృద్ధికి ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సుమారు 40 చదరపు కిలోమీటర్ల పరిధిలో కోస్టల్ కారిడార్ ఏర్పాటుకు డీపీఆర్ డిసెంబర్ నాటికి సిద్ధమవుతుందని, అవసరమైన భూసేకరణకు జాయింట్ కలెక్టర్‌ను నియమించామన్నారు. విశాఖకు వచ్చిన 58 పెట్టుబడి ప్రాజెక్టుల్లో 36 ఇప్పటికే గ్రౌండింగ్ అయ్యాయని, మిగిలినవి రెండు నెలల్లో ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అక్టోబర్‌లో ప్రాంతీయ పెట్టుబడుల సదస్సు, నవంబర్‌లో భాగస్వామ్య సదస్సు నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. -
దివ్యాంగులకు ఉపకరణాల వితరణ
సింథియా: కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా హిందుస్థాన్ షిప్‌యార్డ్ సంస్థ శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాల పరిధిలోని 420 మంది దివ్యాంగులకు రూ.35 లక్షల వ్యయంతో సహాయక పరికరాలను అందజేసింది. మంగళపాలెంలోని శ్రీగురుదేవ చారిటబుల్ ట్రస్ట్ అండ్ హాస్పిటల్లో ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. లబ్ధిదారులకు కృత్రిమ అవయవాలు, వీల్చైర్లు, ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలు, కాలిపర్లు, చేతికర్రలు, వైట్ కేన్లతో పాటు పలు ప్రత్యేక ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షిప్‌యార్డ్ సీఎండీ రియర్ అడ్మిరల్ చంద్రశేఖరన్ రఘురామరన్ మాట్లాడుతూ... సమాజ సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తున్న ట్రస్ట్ వైద్య బృందం, స్వచ్ఛంద సేవకుల కృషిని అభినందించారు. -
ముదిరిన ‘గాజువాక గణపతి’ వివాదం
గాజువాక : గాజువాక శ్రీనగర్ వద్ద గాజువాక గణేష్ ఉత్సవ కమిటీ, ఎస్వీ ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దివ్య కంకణ మహాగణపతి (గాజుల గణపతి) ఉత్సవాలవద్ద ప్రభుత్వ అధికారులు, నిర్వాహకులమధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక్కడ భారీ గణపతి విగ్రహంతో పాటు 21 కమర్షియల్ స్టాళ్లు, యమలోకం సెట్ ఏర్పాటు చేసి డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు రావడంతో సౌత్ ఏసీపీ వై.శ్రీనివాసరావు, గాజువాక సీఐ వాసునాయుడు, గాజువాక జోనల్ కమిషనర్ శేషాద్రితోపాటు రెవెన్యూ, ఫైర్ తదితర విభాగాల అధికారులు మంగళవారం జాయింట్ ఇన్స్పెక్షన్ నిర్వహించారు. ఉత్సవం నిర్వహిస్తున్న ప్రాంగణంలో మొత్తం పరిస్థితిని పరిశీలించారు. ఎటువంటి అనుమతులు లేనికారణంగా ప్రాంగణంలోని కమర్షియల్ స్టాళ్లను, యమలోకం సెట్టును తొలగించాలని నిర్వాహకులను ఆదేశించారు. దానికి వారు అంగీకరించకపోవడంతో అధికారులు, నిర్వాహకులమధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో స్టాళ్లను, యమలోకం సెట్టును తొలగించాలని, వినాయక విగ్రహ దర్శనం ఉచితంగానే కల్పించాలని అధికారులు స్పష్టం చేశారు. దీంతో కొద్దిసేపు ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. దీనిపై స్పష్టమైన నివేదిక తయారు చేసిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు అక్కడి నుంచి నిష్క్రమించారు. 21 స్టాల్స్ నుంచి డబ్బుల వసూళ్లు : సీఐ సీఐ వాసునాయుడు మాట్లాడుతూ గాజుల గణపతి దర్శనం కోసం నిర్వాహకులు రూ.100, యమలోకం సెట్టు చూడానికి రూ.80 వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. 21 స్టాళ్లను ఏర్పాటు చేసి వాటినుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. వాహనాల పార్కింగ్ కోసం స్థలం చూపించలేదని, దీనివల్ల సర్వీస్ రోడ్డు మూసుకుపోతోందని పేర్కొన్నారు. అక్కడ ఏదైనా తొక్కిసలాట జరిగితే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. అందువల్ల స్టాళ్లను, యమలోకం సెట్టును తొలగించాలని ఆదేశించామన్నారు. అనుమతి లేకపోయినా విగ్రహం ఉంచి ఉచిత దర్శనాలు కల్పించాలని సూచించామని చెప్పారు. -
అడుగడుగునా అడ్డంకులే!
పింఛన్‌కు..సాక్షి, విశాఖపట్నం: కొత్త పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే అర్హులకు మంగళవారం కూడా పాట్లు తప్పలేదు. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ తదితర పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు బుధవారమే చివరి రోజు కావడంతో అర్హుల్లో ఆందోళన నెలకొంది. కేవలం ఎనిమిది రోజుల గడువు ఇవ్వడం, అందులోనూ వరుస సెలవులు రావడంతో చివరి రెండు రోజుల్లో సచివాలయాలకు దరఖాస్తుదారుల తాకిడి ఒక్కసారిగా పెరిగింది. అయితే సర్వర్లు మొరాయించడం, ఓటీపీలు రాకపోవడం, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో సమస్యలు తలెత్తడంతో ఆన్లైన్ ప్రక్రియ నత్తనడకన సాగింది. మరోవైపు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అందకపోవడం, ఇంటి పన్ను రసీదు తప్పనిసరి చేయడంతో అర్హులు మరింత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలతోపాటు మీసేవా కేంద్రాల వద్ద మంగళవారం పెద్ద సంఖ్యలో ప్రజలు బారులు తీరారు. దరఖాస్తు చేసుకునేందుకు పదుల సంఖ్యలో వచ్చినా సర్వర్ సక్రమంగా పనిచేయకపోవడంతో చాలామంది నిరాశతో వెనుదిరిగారు. కొన్ని సచివాలయాల పరిధిలో డిజిటల్ అసిస్టెంట్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లు అందుబాటులో లేకపోవడం కూడా సమస్యగా మారింది. మరికొన్ని చోట్ల దరఖాస్తు పత్రాలు సైతం అందుబాటులో లేకపోవడంతో వృద్ధులు, దివ్యాంగులు కిలోమీటర్ల దూరం తిరగాల్సి వచ్చింది. సచివాలయం లేదు.. సిబ్బందీ లేరు! భీమిలి మండలం మూలకుద్దు పంచాయతీని ఆనుకుని ఉన్న రేఖవానిపాలెం పంచాయతీకి గ్రామ సచివాలయం లేకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పంచాయతీ పరిధిలోని మరడపాలెం, రేఖవానిపాలెం, మహాలక్ష్మిపురం, తాతాజీనగర్, కీటిన్‌పేట, బ్యాంకు కాలనీ, రాయపాలెం తదితర ప్రాంతాల ప్రజలు దాదాపు రెండున్నర కిలోమీటర్ల దూరంలోని కొత్త మూలకుద్దు సచివాలయానికి వెళ్లాల్సి వస్తోంది. అక్కడ డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్లు లేకపోవడంతో మరో పంచాయతీకి చెందిన డిజిటల్ అసిస్టెంట్‌కు బదులుగా ఫిషరీస్ అసిస్టెంట్‌ను నియమించారు. ఇదిలా ఉండగా, కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు పత్రాలు అందుబాటులో లేవని సిబ్బంది చెప్పడంతో ప్రజలకు మరో సమస్య ఎదురైంది. దరఖాస్తు కోసం తగరపువలస లేదా భీమిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఒక్క దరఖాస్తు కోసం రానుపోను సుమారు పది కిలోమీటర్లు తిరగాల్సి వస్తోందని వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మూడు రోజులు మూలకుద్దు సచివాలయంలో, మరో మూడు రోజులు రేఖవానిపాలెం పంచాయతీ కార్యాలయంలో సేవలు అందుబాటులో ఉండేవని, ఇప్పుడు కూడా అదే విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నారు. 34 వేలకు పైగా దరఖాస్తులు జిల్లాలో ఇప్పటివరకు 34 వేలకు పైగా కొత్త పింఛన్ దరఖాస్తులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. అయితే విశాఖ జిల్లాలో అర్హులైన వారు మరో 35 వేలకుపైగా ఉన్నట్లు సమాచారం. అంటే ఇప్పటివరకు అర్హుల్లో సగం మంది కూడా దరఖాస్తు చేసుకోలేదని స్పష్టమవుతోంది. తక్కువ గడువు, వరుస సెలవులు, సర్వర్ సమస్యల కారణంగా చాలామందికి అవకాశం దక్కలేదని అర్హులు వాపోతున్నారు. కనీసం మరికొంత కాలం గడువు పొడిగించి, దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.


