బ్లాక్ డే
కౌన్సిల్‌లో
ప్రజాస్వామ్యం ఖూనీ.. అక్రమాలకు తలవంచిన టీడీపీ, జనసేన, బీజేపీ హోరెత్తిన వైఎస్సార్ సీపీ, సీపీఎం, సీపీఐ సభ్యుల ఆందోళన జీవీఎంసీ కౌన్సిల్ హాల్లో రగడ వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లపై దాడికి దిగిన అధికారపక్ష కార్పొరేటర్లు రౌడీలా వ్యవహరించిన మేయర్
డాబాగార్డెన్స్: జీవీఎంసీ చరిత్రలో శుక్రవారం చీకటి రోజుగా మిగిలిపోయింది. ప్రజాస్వామ్య విలువలకు నిలయంగా ఉండాల్సిన కౌన్సిల్ హాల్, అధికార పార్టీ అహంకారానికి, నిబంధనల ఉల్లంఘనకు వేదికై ంది. చంద్రబాబు సర్కార్ అండతో అక్రమాలకే జై కొడుతూ, సభా మర్యాదలను పాతరేశారు. హుందాగా వ్యవహరించాల్సిన మేయర్, తన బాధ్యతను మరిచి ప్రతిపక్ష కార్పొరేటర్లపై గూండా తరహాలో విరుచుకుపడటం పరాకాష్టకు చేరింది. కార్పొరేషన్ చట్టం ప్రకారం సభలోకి పోలీసులకు ప్రవేశం లేదనే కనీస నిబంధనను తుంగలో తొక్కారు. మార్షల్స్ నిర్వహించాల్సిన బాధ్యతను పోలీసులకు అప్పగించి, మీడియాను సైతం రానీయకుండా అడ్డుకోవడం వెనుక ఉన్న కుట్రలేంటో స్పష్టమవుతోంది. ఇక జీవీఎంసీ కమిషనర్ అయితే నిష్పక్షపాతంగా ఉండాల్సింది పోయి, కేవలం సెక్రటరీ పాత్రకే పరిమితమై అధికార పక్షానికి వత్తాసు పలకడం విచారకరం. కౌన్సిల్‌లో ఏదైనా అంశం వస్తే దానిపై చర్చ జరగడం, సభ్యుల అభిప్రాయాలు తీసుకోవడం ఆనవాయితీ. కానీ మేయర్ తీరు ఒకటో తరగతి పిల్లాడి కంటే హీనంగా సాగింది. 1 నుంచి 5 వరకు అజెండా అంశాలను చకచకా చదువుకుంటూ, ఎవరికీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తనంతట తానే ‘ఓకే.. ఓకే..’ అంటూ ముగించేశారు. చివరకు అత్యంత వివాదాస్పదమైన ‘గీతం భూముల’ అంశాన్ని కూడా ఎటువంటి చర్చ లేకుండానే ఆమోదించుకుని సభ నుంచి పలాయనం చిత్తగించారు. ఈ దారుణమైన తీరును తీవ్రంగా ఖండిస్తూ ఘెరావ్ చేసినప్పటికీ, అధికార టీడీపీ, జనసేన, బీజేపీ కార్పొరేటర్లు మాత్రం మేయర్ ఏకపక్ష నిర్ణయాలకే జై కొట్టడం గమనార్హం. నగర ప్రయోజనాలను గాలికొదిలేసి, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం సభా వేదికను వాడుకోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఇది కౌన్సిల్ సమావేశం కాదు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ‘చీకటి అధ్యాయం’ అని విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
అసలేం జరిగిందంటే?
విశాఖ ఎంపీ శ్రీభరత్‌కు చెందిన గీతం కబ్జా చేసిన రూ.5 వేల కోట్ల విలువైన 54.79 ఎకరాల భూమిని క్రమబద్ధీకరించేందు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో అజెండా అంశంగా చేర్చారు. ఈ భూదోపిడీపై వైఎస్సార్ సీసీ, సీపీఎం, సీపీఐ పోరుబాట పట్టాయి. కౌన్సిల్ సమావేశాన్ని అడ్డుకునేందుకు ఆందోళనకు దిగాయి. శుక్రవారం 11 గంటలకు సమావేశం ప్రారంభం కావాల్సి ఉండగా.. ఉదయం 9 గంటలకే మేయర్ పీలా శ్రీనివాసరావు జీవీఎంసీకి చేరుకున్నారు. ఆ తర్వాత కొద్ది సమయానికే టీడీపీ, జనసేన కార్పొరేటర్లు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్.. మేయర్ చాంబర్‌లోకి వచ్చారు. వారంతా రహస్య సమావేశం జరిపారు. సమావేశానికి 20 నిమిషాల ముందుగానే మాజీ మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్, మాజీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్, జీవీఎంసీ వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకరరావుతో పాటు వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లందరూ కౌన్సిల్ హాల్లోకి ప్రవేశించారు. 11.20 గంటలకు మేయర్ తన సైన్యం (టీడీపీ, జనసేన, బీజేపీ కార్పొరేటర్లు)తో సభలోకి ప్రవేశించారు. ఇటీవల మరణించిన జీవీఎంసీ ఎస్‌ఈ గోవిందరావుకు నివాళులర్పించారు. అనంతరం నేరుగా అజెండా అంశాల్లోకి వెళ్లేందుకు మేయర్ సిద్ధమయ్యారు.
మేమిచ్చిన వినతిపై స్పందనేది?
అజెండా అంశాల్లోకి వెళ్లేందుకు మేయర్ సిద్ధమైన సమయంలో తామిచ్చిన వినతికి మేయర్, కమిషనర్ స్పందన కావాలంటూ వైఎస్సార్ సీపీ, సీపీఎం, సీపీఐ కార్పొరేటర్లు పట్టుబట్టారు. మేయర్ పోడియం వద్ద బైఠాయించారు. అజెండాలో 15వ అంశం తొలగిస్తే, మిగిలిన అంశాలు చర్చిద్దామంటూ పట్టుబట్టారు. ఈ సందర్భంలోనే మీడియాను అనుమతించాలంటూ డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. గీతం భూ దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. గీతం భూముల వ్యవహారంపై కౌన్సిల్ సమావేశం దద్దరిల్లింది.
అంతా పక్కా స్కెచ్..
ఎంపీ శ్రీభరత్ తను వేసిన ప్రణాళికతో మేయర్, కూటమి కార్పొరేటర్లతో వాగ్వాదానికి దిగేలా చేశారు. విపక్షాలు ఎంత ఆందోళన చేపట్టినా.. ఆ అంశం ఎలాగైనా ఆమోదించాలన్న సూచనలతో అధికార మదంతో రెచ్చిపోయారు. విపక్షాలు మరింత ఆందోళనకు దిగడంతో నిబంధనలకు విరుద్ధంగా పోలీసులను సభలోకి దింపారు. అధికార యంత్రాంగంతో చెలరేగిపోయారు.
అసలు బాగోతం ఇదీ...
ఎంపీ శ్రీభరత్ అక్రమించుకున్న భూములను జీవీఎంసీ ద్వారా బదలాయించుకునేందుకు ఏడాదిగా స్కెచ్ గీశారు. రూరల్ తహసీల్దార్ పాల్ కిరణ్ ద్వారా తాజాగా జీవీఎంసీకి ప్రతిపాదనలు పంపారు. ఈ విషయంపై విపక్షాలు వారం రోజులుగా ఆందోళన బాట పట్టాయి. ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ ధర్నాలు, నిరసనలు చేపట్టాయి. ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, వంశీకృష్ణ శ్రీనివాస్‌తో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ కార్పొరేటర్ల సహకారంతో ఎంపీ శ్రీభరత్ అక్రమాలకు పాల్పడిన భూకబ్జా అంశాన్ని ఆమోదింపజేసుకున్నారు.
మీడియాపై చిన్నచూపు
గీతం ఆక్రమించిన రూ.5 వేల కోట్ల భూమిని అప్పనంగా ఇచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం తహతహలాడుతూ.. సభలో జరిగే సన్నివేశాలు ప్రజలకు తెలిసిపోతాయని ముందు నుంచి పక్కా ప్లాన్‌తో మీడియాకు ప్రవేశం కల్పించలేదు. తమను అనుమతించాలంటూ మీడియా ప్రతినిధులు మేయర్‌ను కోరేందుకు ప్రయత్నించే సమయంలో.. వెలగపూడి తన మార్క్ రౌడీయిజాన్ని ప్రదర్శించారు. మీడియాను అనుమతించాలంటూ వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, పత్రికా స్వేచ్ఛను హరిస్తారా..అంటూ మండిపడ్డారు.
వామపక్షాల ఆందోళన
ప్రజల ఆస్తులను రక్షించాల్సిన ప్రజాప్రతినిధులు భక్షిస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదని, తక్షణమే గీతం అక్రమ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కొత్తపల్లి లోకనాథం, జిల్లా కార్యదర్శి మరడాన జగ్గునాయుడు, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు మరుపిళ్ల పైడిరాజు, జిల్లా సమితి కార్యదర్శి ఎస్‌కే రహ్మన్ డిమాండ్ చేశారు. ఎంపీ శ్రీభరత్ కబ్జా చేసిన భూమి క్రమబద్ధీకరణకు కౌన్సిల్‌లో అజెండా అంశం పెట్టడాన్ని నిరసిస్తూ సీపీఎం, సీపీఐ నేతలు జీవీఎంసీ ప్రధాన ద్వారం వద్ద శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
కూటమి కార్పొరేటర్ల దౌర్జన్యం
గీతం ఆక్రమిత భూముల క్రమబద్ధీకరణ అంశాన్ని అజెండా నుంచి తొలగించాలంటూ విపక్ష కార్పొరేటర్లు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్, వైఎస్సార్‌సీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు నల్ల కండువాలు ధరించి మేయర్ పోడియం వద్ద బైఠాయించారు. తక్షణమే ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలంటూ నినదిస్తూ పోడియాన్ని చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ కార్పొరేటర్లు దౌర్జన్యానికి దిగారు. డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్, వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకరరావు, కార్పొరేటర్లు బిపిన్‌కుమార్ జైన్, బళ్ల లక్ష్మణరావు, రెయ్యి వెంకటరమణ, కోరుకొండ స్వాతిదాస్, చెన్నా జానకీరామ్‌కు గాయపడ్డారు. స్థాయీ సంఘం సభ్యురాలు సాడి పద్మారెడ్డి వెనక్కి తూలి పడ్డారు.
పోలీసులు అతి..
పోలీసులు అతిగా వ్యవహరించారు. ఉదయం 9 గంటలకే పోలీసులు జీవీఎంసీ వద్ద పెద్ద ఎత్తున మోహరించారు. జీవీఎంసీలోకి ఎవర్ని వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. మీడియా పాస్ ఉన్నప్పటికీ మీడియాను అనుమతించలేదు. పోలీసులు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా జీవీఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు సభలోకి చొరబడ్డారు.
బ్లాక్ డే
బ్లాక్ డే


