ఆచార్య చందు సుబ్బారావుకు ఘన వీడ్కోలు
ఎంవీపీకాలనీ: అభ్యుదయ రచయిత, అరసం క్రియాశీలక సభ్యుడు ఆచార్య చందు సుబ్బారావుకు సాహితీ లోకం ఘన వీడ్కోలు పలికింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం మరణించిన విషయం తెలిసిందే. ఎంవీపీ కాలనీ సెక్టార్–11లోని శ్మశానవాటికలో శుక్రవారం ఉదయం ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. తొలుతా ఎంవీపీ కాలనీ సెక్టార్–8లోని నివాసంలో సాహిత్య ప్రముఖులు, కుటుంబ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం(అరసం), విశాఖ రచయితల సంఘం నాయకులు చందు సుబ్బారావు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. తన రచనల ద్వారా సమాజాన్ని జాగృతం చేయడంలో ఆయన చేసిన కృషిని కొనియాడారు. సుబ్బారావు కుమారుడు దిలీప్ చందు, కుమార్తె చందు కవితలకు, కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఆచార్య కేఎస్ చలం తదితర సాహితీ ప్రియులు ఆయన పాడేమోసి సగర్వంగా సాగనంపారు. కార్యక్రమంలో అరసం రాష్ట్ర కార్యదర్శి ఉప్పల అప్పలరాజు, విశాఖ రచయితల సంఘం అధ్యక్షుడు అడపా రామకృష్ణ, సీపీఐ నాయకుడు చలసాని రాఘవేంద్రరావు, అవంతి శ్రీనివాసరావు, ఆచార్య వెలమల సిమ్మన్న, బీవీ అప్పారావు, డీవీ సూర్యారావు, సమతా సాహితీ అధ్యక్షుడు మాటూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


