బెంగళూరు (బనశంకరి): గోవా నుంచి మహారాష్ట్రకు సుమారు రూ.400 కోట్ల నగదు తరలిస్తున్న రెండు ట్రక్ కంటైనర్లు కర్ణాటకలో అదృశ్యమయ్యాయి. అక్టోబర్‌లో బెళగావి జిల్లా ఖానాపుర తాలూకా చోలార్‌ఘాట్‌లో ఈ కంటైనర్లు మాయమైన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కిశోర్ సేఠ్ ఈ నగదును తరలిస్తున్నట్లు తెలిసింది. కర్ణాటక, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల పోలీసులు కంటైనర్ల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తునకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సిట్ ఏర్పాటుకు ఆదేశించారు.
మహారాష్ట్రలో స్థానికసంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు పంచడానికి ఈ నగదు తరలిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖానాపుర తాలూకాలో ప్రమాదకర అటవీ ప్రదేశమైన చోలార్‌ఘాట్ ఈ కంటైనర్లు అదృశ్యమైన కొద్దిరోజులకు మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన సందీప్‌పాటిల్‌ను నగదును యజమాని కిశోర్ సేఠ్ అనుచరులు బంధించారు. నగదు నువ్వే అపహరించావని ఆరోపించి, వెనక్కి ఇవ్వకపోతే ప్రాణాలు తీస్తామంటూ చిత్రహింసలు పెట్టారు.
వారి చెరనుంచి తప్పించుకున్న సందీప్‌పాటిల్ ఈ నెల 1వ తేదీన నాసిక్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రూ.400 కోట్ల నగదు కంటైనర్లు మాయం కావడంతో తనను కిడ్నాప్ చేశారని తెలిపాడు. నాసిక్ పోలీసులు గోవా, బెళగావి పోలీసులతో కలిసి దర్యాప్తు ప్రారంభించారు. ఐదుగురిని.. విరాట్‌గాం«దీ, జయేశ్ కదమ్, విశాల్‌నాయుడు, సునీల్ దుమాల్, జనార్దన్ దైగుడేలను అరెస్టు చేసి విచారిస్తున్నారు. వీరిలో విరాట్‌గాంధీ రాజస్థాన్‌కు చెందిన హవాలా ఆపరేటర్. ఇద్దరు నిందితులు.. అజార్ బిల్డర్, కిశోర్ సావ్లా పరారీలో ఉన్నారు.


