ముంబై పోర్టుకు చేరుకున్న షెన్‌లాంగ్
సిగ్నళ్లు, లైట్లు ఆర్పేసి జాగ్రత్తగా హార్మూజ్‌ను దాటిన ముడిచమురునౌక
విజయవంతంగా ముంబైకి చేరుకున్నషెన్‌లాంగ్ నౌక
ఓడకు కెప్టెన్‌గా వ్యవహరించిన భారతీయుడు సుఖ్‌శాంత్ సంధూ
ముంబై: సంకల్పంతో ముందుకెళితే మార్గమధ్యంలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించేందుకు సరైన వ్యూహాలు అక్కరకొస్తాయంటారు. శత్రు నౌకలు, జలాంతర్గాముల సంచారాలను అడ్డుకునే సముద్ర మందుపాతరలైన ‘సీమైన్స్’ను హార్మూజ్ జలసంధిలో అక్కడక్కడా ఇరాన్ ఏర్పాటుచేసినా సరే దృఢనిశ్చయంతో అదే మార్గంలో ప్రయాణించి ముడి చమురునౌక షెన్‌లాంగ్ సూయిజ్‌మ్యాక్స్ సాహసోపేత యాత్రను పూర్తిచేసింది.
పశ్చిమాసియా యుద్ధం మొదలయ్యాక హార్మూజ్ జలసంధి గుండా ఎలాంటి దాడుల బారిన పడకుండా సురక్షితంగా ముంబై చేరుకున్న తొలి నౌకగా షెన్‌లాంగ్ సూయిజ్‌మ్యాక్స్ పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. బుధవారమే నౌక ముంబైకి చేరుకున్నప్పటికీ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లైబీరియా జెండాతో ఉన్న ఈ నౌక మార్చినెల ఒకటో తేదీన సౌదీ అరేబీచియాలోని రాస్ తనూరా నౌకాశ్రయంలో ఏకంగా 1,35,335 మెట్రిక్ టన్నుల ముడిచమురును నింపుకుంది. మార్చి మూడో తేదీన అక్కడి నుంచి బయల్దేరి క్షేమంగా ముంబై పోర్ట్‌కు చేరుకుంది.
ఏమాత్రం అనుమానం రాకుండా..
అంతర్జాతీయ సముద్రజలాల గుండా వెళ్లే ముడి చమురు, సరకు రవాణా నౌకలు పొరపాటున ఎదురెదురుగా రాకుండా, ఢీకొనకుండా ఉండేందుకు వాటి స్థానాన్ని అత్యంత కచ్చితత్వంతో తెల్సుకునేందుకు ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్‌ను ఉపయోగిస్తుంటారు. దీని సాయంతో నౌక ఎక్కడ, ఎంత వేగంతో, ఏ దిశలో వెళ్తుందో ఇట్టే చెప్పేయొచ్చు. దీని సాయంతో నౌకల గుట్టుమట్లను ఇరాన్ తెల్సుకుని నౌకల మీదకు ఆత్మాహుతి డ్రోన్ లేదా క్షిపణులను ప్రయోగించే ప్రమాదముంది. వాటితోనూ పనిలేకుండా సీమైన్స్‌నూ అక్కడక్కడా అమర్చింది. ఈ ఆటంకాలను అధిగమించేందుకు షెన్‌లాంగ్ నౌక కెపె్టన్, భారతీయుడు సుఖ్‌శాంత్ సింగ్ సంధూ బృందం నౌకాయాన విధానమైన ‘డార్క్‌మోడ్’టెక్నిక్‌ను అవలంభించారు.
నౌకకు సంబంధించిన ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్(ఏఎస్‌ఐ) వివరాలు ఎక్కడా ట్రాకింగ్ డేటాలో నమోదుకాకుండా ఉండేందుకు ఏఐఎస్‌ను స్విచ్ఛాఫ్ చేశారు. దీంతో ఫలానా చోట నౌక ఉంది అనే విషయం ఇరాన్‌కు తెలీకుండా పోయింది. హార్మూజ్ జలసంధిలోకి షెన్‌లాంగ్ నౌక ప్రవేశించగానే దాని సిగ్నళ్లు ఆర్పేశారు. దీనికి తోడు నౌకలోని అన్ని విద్యుత్‌దీపాలను ఆర్పేశారు. నౌక సిగ్నళ్లు చివరిసారిగా మార్చి 9వ తేదీన కన్పించాయి. తర్వాత నౌక పత్తాలేకుండా పోయింది. దాడులకు గురై మునిగిపోయిందేమోననే భయాందోళనల నడుమ అనూహ్యంగా నౌక హార్మూజ్‌ను దాటింది. తర్వాత ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్‌ను స్విచ్‌ఆన్ చేశారు. దీంతో నౌక క్షేమంగా గమ్యం దిశగా వస్తోందని అర్థమైంది.
బుధవారం మధ్యాహ్నం సరిగ్గా ఒంటి గంటకు ఇది ముంబై పోర్ట్‌కు చేరుకుంది. తర్వాత జవహర్ ద్వీప్ వద్ద సాయంత్రం 6.06 గంటలకు లంగరువేసింది. గ్రీస్ దేశంలోని ఏథెన్స్ నగరానికి చెందిన డైనాకామ్ ట్యాంకర్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ సంస్థ ఈ నౌకను నిర్వహిస్తోంది. ఈ నౌకలో 29 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో భారత్, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ దేశస్తులు ఉన్నారు. డార్క్‌మోడ్ విధానంలో మరో ఐదు నౌకలు తమ గమ్యస్థానాల దిశగా కదిలే ఆస్కారముందని నౌకల ప్రయాణాలను పర్యవేక్షించే ‘ట్యాంకర్‌ట్రాకర్స్.కామ్’సంస్థ పేర్కొంది. రెండు భారీ చమురు రవాణా నౌకలు, పనామా కాలువలో పట్టే మరో పనామామ్యాక్స్ ట్యాంకర్ నౌక, సూయిజ్‌కాలువలో పట్టే రెండు సూయిజ్‌మ్యాక్స్ ట్యాంకర్‌నౌకల జాడ సైతం గత 48 గంటలుగా కన్పించట్లేదని ఇవి కూడా డార్క్‌మోడ్‌లో సముద్రయానం చేస్తుండే అవకాశముందని సంస్థ అంచనావేస్తోంది.


