రెండు నౌకలపై ఇరాన్‌ దాడి | Indian National Killed After Iran Strikes Hit Two Iraqi Tankers In Strait Of Hormuz Amid Gulf War | Sakshi
Sakshi News home page

రెండు నౌకలపై ఇరాన్‌ దాడి

Mar 13 2026 4:25 AM | Updated on Mar 13 2026 4:25 AM

Indian National Killed After Iran Strikes Hit Two Iraqi Tankers In Strait Of Hormuz Amid Gulf War

ఇరాక్‌లోని బస్రా సమీపంలో మంటల్లో అమెరికా చమురు నౌక

భారతీయుడు మృత్యువాత

న్యూఢిల్లీ: తమపై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులకు ప్రతిగా ఇరాన్‌ సైతం దీటుగా స్పందిస్తూ అమెరికా తదితర ఇతర దేశాల నౌకలపై దాడులుచేస్తోంది. బుధవారం రాత్రి ఇరాక్‌లోని ఉమ్‌ ఖాసర్‌ నగరంలోని ఖోర్‌ అల్‌ జుబేర్‌ నౌకాశ్రయంలోని అమెరికాకు చెందిన మార్షల్‌ ఐలాండ్స్‌ జెండాతో ఉన్న ముడిచమురు రవాణా నౌక ‘సేఫ్‌సీ విష్ణు’పై ఇరాన్‌ దాడిచేసింది. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. అతడిని భారతీయునిగా గుర్తించామని ఇరాక్‌లోని భారతీయ రాయబార కార్యాలయం గురువారం తమ సామాజికమాధ్య ఖాతాలో ఒక పోస్ట్‌పెట్టింది. అతని స్వరాష్ట్రం, కుటుంబం వంటి ఇతర వివరాలు ఏవీ ఇంకా తెలియరాలేదు. మంటల్లో చిక్కుకున్న ఆ నౌక నుంచి 27 మంది సిబ్బందిని ఎలాగోలా కాపాడారు.

గాయపడిన వారిని సమీపంలోని బస్రా నగరంలోని ఆస్పత్రిలో చేరి్పంచి వైద్యం అందిస్తున్నారు. నౌకలోని 27 మంది సిబ్బందిలో 15 మంది భారతీయులేనని ఇండియన్‌ ఎంబసీ పేర్కొంది. ఈ నౌకతోపాటు సమీపంలోని మాల్టా దేశ జెండాతో ఉన్న జిఫిరోస్‌ నౌక మీదా ఇరాన్‌ ఆత్మాహుతి పడవలు దాడిచేశాయి. పేలుడుపదార్థాలతో దూసుకొచ్చి సూసైడ్‌ బోట్‌లు ఢీకొనడంతో పేలుళ్లు జరిగి సేఫ్‌సీ విష్ణు, జిఫిరోస్‌ నౌకలు మంటల్లో చిక్కుకున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

ఈ రెండు నౌకలు మొత్తంగా 4,00,000 బ్యారెళ్ల ముడిచమురును ఇరాక్‌ నుంచి తీసుకొస్తున్నట్లు షిప్‌ల ట్రాకింగ్‌ వెబ్‌సైట్‌ అయిన ‘ట్యాంకర్‌ట్రాకర్స్‌.కామ్‌’వెల్లడించింది. అమెరికాకు చెందిన సేఫ్‌సీ ట్రాన్స్‌పోర్ట్‌ ఐఎన్‌సీ సంస్థ ‘సేఫ్‌సీ విష్ణు’నౌకను నిర్వహిస్తోంది. 228.6 మీటర్ల పొడవు, 32.57 మీటర్ల వెడల్పయిన సేఫ్‌సీ విష్ణు నౌకను 2007లో తయారుచేశారు. గరిష్టంగా దాదాపు 74,000 టన్నుల బరువైన సరకులను ఇది మోసుకెళ్లగలదు. జిఫిరోస్‌ను గ్రీస్‌కు చెందిన సంస్థ నిర్వహిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement