విదేశాల్లో ఉన్న పిల్లల ఫోన్లతో తల్లిదండ్రుల్లో కలవరం
పశ్చిమాసియాలో యుద్ధంతో పరిస్థితి దయనీయం
పార్ట్ టైమ్ ఉద్యోగం లేదు..చదువులూ సాగడం లేదు
గల్ఫ్‌లో గందరగోళం..యూఎస్‌లో మరీ దారుణం!
సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో చదువుతున్న పిల్లల నుంచి ఫోన్లు వస్తే సంతోషపడిపోయే మధ్య తరగతి తల్లిదండ్రులు ఇప్పుడు హడలి పోతున్నారు. తీవ్రంగా కలవర పడుతున్నారు. ఏం చెబుతారోనని ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ కష్టంగా ఉందని, ఎంతోకొంత సర్దమని బేలగా మాట్లాడు తుండటంతో అల్లాడిపోతున్నారు. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో విదేశాల్లో ఉంటున్న విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. జీవన వ్యయం భారీగా పెరిగింది.
తాత్కాలిక ఉపాధి దొరకడం కూడా కష్టమవుతోందని విద్యార్తులు చెబుతున్నారు. అమెరికాలో పరిస్థితి మరీ దారుణంగా ఉందని సమాచారం. యుద్ధం కారణంగా నిత్యావసరాల ధరలు పెరిగాయని, ఇంటి అద్దెలూ ఎక్కువగా వసూలు చేస్తున్నారని యూఎస్‌లోని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు యూనివర్సిటీలు, అధికార యంత్రాంగం.. విద్యార్థులపై, వారి సామాజిక మాధ్యమాలపై అనుక్షణం నిఘా కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. ముమ్మర తనిఖీలు కొనసాగుతుండటంతో పార్ట్‌టైం ఉద్యోగాలు చేయలేకపోతున్నామని విద్యార్థులు చెబుతున్నారు.
చదువులూ అంతంత మాత్రమే
విదేశీ విద్యార్థులు అందిస్తున్న సమాచారం మేరకు యుద్ధం నేపథ్యంలో చదువులు సైతం సరిగా సాగడం లేదు. కొన్ని చోట్ల క్యాంపస్‌లు తాత్కాలికంగా మూసివేశారు. గల్ఫ్ దేశాల్లో ఆన్‌లైన్ క్లాసులకే పరిమితమవుతున్నారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ 2025 డేటా ప్రకారం 150 దేశాల్లో 18.8 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు.
దాదాపు 12.5 లక్షల మంది ఉన్నత విద్య చదువుతున్నారు. 6 లక్షల మంది పాఠశాల విద్యలో ఉన్నారు. యుద్ధ వాతావరణంలో యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఒమన్ దేశాల్లో విద్యార్థులు మానసికంగా కుంగిపోతున్నట్టు వార్తలొస్తున్నాయి. వైద్య విద్య కోసం వెళ్ళిన విద్యార్థులు తమను స్వదేశానికి పంపమంటూ వేడుకుంటున్నారు.
అప్పులు తీర్చేదెలా? : లక్షల్లో అప్పు చేసి పిల్లలను విదేశీ చదువులకు పంపిన తల్లిదండ్రుల ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. అప్పులు తీర్చలేక, విదేశాల్లో ఉన్న పిల్లలకు డబ్బులు పంపలేక తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పిల్లల నుంచి ఫోన్ వచ్చిందంటే కంగారు పడిపోతున్నారు. క్షేమ సమాచారం తెలుసుకుంటూనే పరిస్థితి ఎలా ఉందని ఆరా తీస్తున్నారు. మధ్యతరగతి తల్లిదండ్రులు ఉన్న ఆస్తిని అమ్మేసి పిల్లలకు పంపుతున్నారు. ఈ పరిస్థితి ఇంకెన్నాళ్ళు కొనసాగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.
మెడిసిన్ తరగతులు జరగడం లేదు
వైద్య విద్య కోసం ఇక్కడికి వచ్చా. తరగతులు జరగడం లేదు. యుద్ధం భయంతో నిద్రచీ కూడా పట్టడం లేదు. చదువు మీద దృష్టి పెట్టలేకపోతున్నాం. మా తల్లిదండ్రులూ కంగారు పడుతున్నారు. నిత్యావసరాల కోసం రెట్టింపు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. – పల్లవి సామంతుల (యూఏఈలో వరంగల్ వైద్య విద్యార్థి)
ఏం చేయాలో పాలు పోవడం లేదు
యుద్ధం కారణంగా ఇక్కడ నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. తాత్కాలికంగా ఉద్యోగం చేసే పరిస్థితి లేదు. ఇంటి దగ్గర్నుంచి డబ్బులు పంపమని అడగాలన్నా ఇబ్బందిగానే ఉంటోంది. ఏం చేయాలో తెలియడం లేదు. కొన్నిసార్లు పస్తులు కూడా ఉంటున్నాం. – నీలేష్ సుకుమార్ (అమెరికాలోని హైదరాబాద్ విద్యార్థి)
పొలం అమ్మి డబ్బులు పంపా
బాబు అమెరికాలో పడుతున్న అవస్థలు చూస్తే కడుపు తరుక్కుపోతోంది. యూఎస్‌కు పంపడానికి చేసిన అప్పు ఇప్పటికీ కడుతున్నాం. మరోవైపు యుద్ధం కారణంగా అక్కడ ఆర్థిక పరిస్థితి తారుమారైంది. దీంతో కొంత పొలం అమ్మేసి డబ్బులు పంపాల్సి వచ్చింది. – నీలకంఠం రామారావు(విద్యార్థి తండ్రి, మహబూబ్‌నగర్)


