టైరు పేలి పెళ్లి వాహనం పల్టీ | Wedding vehicle overturns after tire burst | Sakshi
Sakshi News home page

టైరు పేలి పెళ్లి వాహనం పల్టీ

Mar 13 2026 2:20 AM | Updated on Mar 13 2026 2:20 AM

Wedding vehicle overturns after tire burst

ఇద్దరు మృతి.. 22 మందికి గాయాలు

నిర్మల్‌ రూరల్‌/సిరికొండ: పెళ్లికి వెళుతున్న వాహనం పల్టీ కొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 22 మంది గాయపడ్డారు. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్‌ జిల్లా సిరికొండ మండలం సోన్‌పల్లి గ్రామానికి చెందిన బోయిన్‌వాడ్‌ గణపతి చెల్లి కుమారుడి వివాహం నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో గురువారం జరిగింది. ఈ పెళ్లికి సోన్‌పల్లి నుంచి ఐచర్‌ వాహనంలో 24 మంది బయల్దేరారు. 

వీరివెంట ఫర్నిచర్‌ కూడా తీసుకెళ్లారు. నిర్మల్‌ రూరల్‌ మండలం కొండపూర్‌ వద్ద వారు ప్రయాణిస్తున్న వాహనం టైరు పేలడంతో అదుపు తప్పి రోడ్డుపైనే పల్టీ కొట్టింది. దీంతో వాహనంలో ఉన్న వారంత ఎగిరి రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డారు. తీవ్రంగా గాయపడిన బోయిన్‌వాడ తులసీదాస్‌(38), బోరడే లక్ష్మణ్‌(60) అక్కడికక్కడే మృతిచెందారు. మరో 22 మంది గాయపడ్డారు. 

స్థానికుల సహాయంతో క్షతగాత్రులను 108లో నిర్మల్‌ ఏరియా ఆస్పత్రికి పోలీసులు తరలించారు. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తీసుకెళ్లారు. మిగతా వారు నిర్మల్‌లోనే చికిత్స పొందుతున్నారు. వాహనంలో ఉన్న ఫర్నిచర్‌ ప్రయాణికులపై పడడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని స్థానికులు తెలిపారు.  

» మృతుడు బోయిన్‌వాడ్‌ తులసీదాస్‌కు భార్య, డిగ్రీ చదువుతున్న కూతురు, ఏడో తరగతి చదువుతున్న కొడుకు ఉన్నారు. తులసీదాస్‌ మరణంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది 
» మృతుడు బోరడే లక్ష్మణ్‌ బోయిన్‌వాడ్‌ గణపతి ఇంటి పక్కన ఉంటాడు. ఇతనికి ఇద్దరు కూతుళ్లు ఉండగా, వారి పెళ్లిళ్లు అయ్యాయి. 

Advertisement
 
Advertisement
Advertisement