'ఆందోళన వద్దు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం' | PM Modi thanks gulf nations for taking care of Indians | Sakshi
Sakshi News home page

'ఆందోళన వద్దు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం'

Mar 11 2026 5:36 PM | Updated on Mar 11 2026 6:19 PM

PM Modi thanks gulf nations for taking care of Indians

గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ రోజు (బుధవారం) కేరళలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా రూ. 10 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులను కాంగ్రెస్‌ రాజకీయంగా వాడుకుంటుందని దుయ్యబట్టారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయని కాంగ్రెస్ పార్టీ  ఈ గడ్డు పరిస్థితులనూ రాజకీయం చేస్తుందన్నారు. వీటిని సైతం రాజకీయంగా వాడుకుంటుందన్నారు. యుద్ధంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు చేస్తోందని గల్ఫ్‌లో భారతీయులు చిక్కుకోవాలని కాంక్షిస్తుందని ఆ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్‌ గాంధీ బాధ్యతాయుతంగా మట్లాడుతున్నారని.. దేశ యువతపై రాహుల్‌ గాంధీకి సరైన అవగాహన లేదని మోదీ ఆరోపించారు.  

ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న యుద్దంతో భారతీయుల భద్రతపై ఆందోళన నెలకొందన్నారు. మోదీ మాట్లాడుతూ " మన దేశ ప్రజలు సమస్యల్లో ఉన్న ప్రతీసారి వారిని కాపాడడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాం. ఇరాక్‌ సంక్షోభంలో భారతీయ నర్సులను క్షేమంగా తీసుకవచ్చాం. యెమెన్‌లో ఉగ్రవాదుల చెర నుంచి ఫాదర్‌ టామ్‌ను రక్షించాం " అని అన్నారు. ప్రస్తుతం గల్ఫ్‌లో జరుగుతున్న సంక్షోభం స్వయం సమృద్ధితి అవసరాన్ని మరింత నొక్కిచెబుతుందన్నారు.

ఆత్మనిర్భర్‌ అవసరం 
కేంద్రం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆత్మనిర్భర్ భారత్ ఎంత అవసరమో  ఇటీవల కాలంలో జరిగిన సంక్షోభాలు తెలియజేస్తున్నాయన్నారు. కరోనా , ఉక్రెయిన్- రష్యా యుద్దం, ఇరాన్ వార్  దాని అవసరాన్ని తెలియజేశాయన్నారు. ఆత్మనిర్భర్ ప్రారంభ సమయంలో కాంగ్రెస్, లెప్ట్ పార్టీలు  దానిని ఎగతాళి చేశాయని ప్రస్తుతం దాని విలువ అందరికీ అర్థమైందని తెలిపారు. దేశం ఇతర దేశాలపై ఆదారపడేలా చేసిందని  ఈ రెండు పార్టీలే ఇంతకాలం భారత్‌ను వేరే దేశాలపై ఆధారపడేలా చేశాయన్నారు.  

ఇంధన కొరతపై   
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇంధన రంగంలో ఆత్మనిర్భర్ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఇంధనం కోసం ఇతర దేశాలపై ఆదారపడడం చాలావరకూ తగ్గించుకున్నామన్నారు. ప్రత్యామ్నయ ఇంధన వనరులపై ఫోకస్ పెట్టామని తెలిపారు. పెట్రోల్, డీజీల్ దిగుమతులు తగ్గించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అందుకే కేంద్రం ఎలక్ట్రిక్ బస్సులకు, వాహనాలకు ప్రోత్సహాకాలు అందిస్తున్నామని మోదీ అన్నారు. ప్రస్తుతం గల్ఫ్‌లో చిక్కుకున్న భారతీయులకు ఆయా దేశాలు తగిన రక్షణ కల్పిస్తున్నాయని అందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలని తెలిపారు.
 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement