సిల్వర్‌ హిట్‌.. క్రూడ్‌ ర్యాలీకి బ్రేక్‌ | Silver jumped more than Rs 11000 per kg | Sakshi
Sakshi News home page

సిల్వర్‌ హిట్‌.. క్రూడ్‌ ర్యాలీకి బ్రేక్‌

Mar 11 2026 1:29 AM | Updated on Mar 11 2026 1:29 AM

Silver jumped more than Rs 11000 per kg

రూ. 11 వేలు ఎగసిన వెండి 

క్రూడాయిల్‌ 18% డౌన్‌

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక–రాజకీయ పరిణామాలతో మంగళవారం వెండి పరుగులు తీయగా, ముడి చమురు ధరలు కుదేలయ్యాయి. ఆలిండియా సరాఫా అసోసియేషన్‌ ప్రకారం న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్లో వెండి రేటు కేజీకి రూ. 10,975 పెరిగి రూ. 2,79,275కి ఎగసింది. తద్వారా మూడు సెషన్ల నష్టాలకు బ్రేక్‌ పడింది. 99.9% స్వచ్ఛత బంగారం కూడా రూ. 400 పెరిగి రూ. 1,64,300కి చేరింది.

ఇన్వెస్టర్లను కునుకు లేకుండా చేస్తున్న పశ్చిమాసియా ఉద్రిక్తతలకు త్వరలోనే పరిష్కారం ఉండబోతోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సూచనప్రాయంగా ప్రకటించడం భౌగోళిక–రాజకీయ మార్పులకు దారి తీయడంతో పసిడి, వెండి రేట్లు పెరిగాయని లెమన్‌ మార్కెట్స్‌ డెస్క్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ గౌరవ్‌ గర్గ్‌ తెలిపారు.

అటు అంతర్జాతీయంగా స్పాట్‌ మార్కెట్లో వెండి ఔన్సుకి (31.1 గ్రాములు) 1.38 డాలర్లు పెరిగి 88.33 డాలర్లకు చేరగా, పసిడి 1 శాతం పెరిగి 5,172.86 వద్ద ట్రేడయ్యింది. మరోవైపు, న్యూయార్క్‌ ఫ్యూచర్స్‌ మార్కెట్లో సిల్వర్‌ మే నెల కాంట్రాక్టు 5.07 డాలర్లు (సుమారు 6 శాతం) పెరిగి 89.59 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. వెండి 90 డాలర్ల దగ్గర ఉన్న నేపథ్యంలో 95 డాలర్ల (దేశీయంగా రూ. 2.85 లక్షలు) వైపుగా వెళ్లే అవకాశం ఉందని ఆగ్మంట్‌ హెడ్‌ (రీసెర్చ్‌) రెనిషా చెయినాని తెలిపారు. 

దిగొచ్చిన చమురు..: మూడు రోజులుగా ర్యాలీ చేస్తున్న ముడిచమురు ధరలకు ట్రంప్‌ భరోసాతో బ్రేక్‌ పడింది. ఎంసీఎక్స్‌లో మార్చి డెలివరీ క్రూడ్‌ కాంట్రాక్టు బ్యారెల్‌కి రూ. 1,483 (సుమారు 17 శాతం) క్షీణించి రూ. 7,366 వద్ద ట్రేడయ్యింది. అదే విధంగా ఏప్రిల్‌ కాంట్రాక్టు కూడా రూ. 1,245 (15 శాతం) తగ్గి రూ. 7,300 వద్ద ట్రేడయ్యింది. అటు అంతర్జాతీయంగా నైమెక్స్‌ క్రూడ్‌ ఏప్రిల్‌ డెలివరీ 18 శాతం క్షీణించి 88 డాలర్లకు, బ్రెంట్‌ క్రూడ్‌ మే కాంట్రాక్ట్‌ 16 శాతం తగ్గి 84 డాలర్ల వద్ద ట్రేడయ్యింది.

Advertisement
 
Advertisement
Advertisement