2028 వరకు జల్‌జీవన్‌ మిషన్‌ | Union Cabinet approves extension of Jal Jeevan mission to 2028 | Sakshi
Sakshi News home page

2028 వరకు జల్‌జీవన్‌ మిషన్‌

Mar 11 2026 5:13 AM | Updated on Mar 11 2026 5:13 AM

Union Cabinet approves extension of Jal Jeevan mission to 2028

కేంద్ర కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు

న్యూఢిల్లీ: జల్‌ జీవన్‌ మిషన్‌(జేజేఎం)ను డిసెంబర్‌ 2028 వరకు పొడిగించడం సహా కేంద్ర మంత్రివర్గం మంగళవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జేజేఎం 2.0 కింద రూ.8.7 లక్షల కోట్లను వెచ్చించి గ్రామీణ ప్రాంతాల్లోని 3.23 కోట్ల గృహాలకు పైపులైన్ల ద్వారా తాగునీటిని అందజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఈ నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీడియాకు వెల్లడించారు.

దేశంతో భూ సరిహద్దులు కలిగిన చైనా, ఇతర దేశాలకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై ఉన్న నిబంధనలను సడలించాలని కూడా మంత్రి వర్గం నిర్ణయించిందని మంత్రి చెప్పారు. ఎలాంటి అనుమతుల అవసరం లేకుండానే ఆయా దేశాల వాటాదారులు, 10 శాతం వరకు దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఏర్పడనుందన్నారు. ఈ మేరకు 2020లో జారీ చేసిన నోటీసును సవరించనుందని చెప్పార. 

మదురై విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించాలన్న ప్రతిపాదనకు కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపైగల మధ్యప్రదేశ్‌లోని 80 కిలోమీటర్ల బద్నావర్‌–తిమర్వానీ సెక్షన్‌ను రూ.3,839 కోట్లతో నాలుగు లేన్లుగా 24 నెలల కాలంలో విస్తరించాలని కూడా కేబినెట్‌ నిర్ణయించింది. దీంతోపాటు, బెంగాల్‌–జార్ఖండ్‌లను కలిపే రూ.4,474 కోట్ల విలువైన రెండు రైల్వే ప్రాజెక్టులను కేబినెట్‌ ఆమోదించింది. ఇన్‌సాల్వెన్సీ లా, కంపెనీ చట్టానికి సవరణలు చేపట్టాలని కూడా కేబినెట్‌ తీర్మానించిందని మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement