చెన్నైలో వాణిజ్య సిలిండర్ల కొరత వల్ల తాత్కాలికంగా హోటల్‌ను మూసివేస్తున్నట్టు నోటీస్ అంటిస్తున్న సిబ్బంది
ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో.. గృహావసరాలకు, అత్యవసర సేవలు అందించే ఆస్పత్రులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచన
దీంతో వాణిజ్య సిలిండర్ల సరఫరా నిలిపివేసిన గ్యాస్ ఏజెన్సీలు
రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం వంటి ప్రధాన నగరాల్లోని హోటళ్లపై ఎఫెక్ట్!
చిన్న, మధ్యతరగతి రెస్టారెంట్లు, మెస్‌లు, టిఫిన్ సెంటర్లపైనా ప్రభావం పడే అవకాశం
ఇప్పటికే ముంబై, బెంగళూరులో 20 శాతం వరకు మూతపడ్డ హోటళ్లు!
గృహావసరాలపై ఆందోళన వద్దు.. సిలిండర్ల నిల్వలు పుష్కలంగా ఉన్నాయంటున్న అధికారులు
సాక్షి, హైదరాబాద్: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం హోటల్ రంగాన్ని తీవ్రస్థాయిలో ప్రభావితం చేస్తోంది. గల్ఫ్ దేశాల నుంచి పెట్రో ఉత్పత్తుల దిగుమతికి ఆటంకాలు ఎదురవుతుండటంతో దేశంలో వాణిజ్యావసరాలకు ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. గృహావసరాలకు, అత్యవసర సేవలు అందించే ఆస్పత్రులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. మరోవైపు ఈ నెల 7వ తేదీ నుంచి గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచింది. కేంద్రం ఆంక్షల నేపథ్యంలో గ్యాస్ ఏజెన్సీలు కమర్షియల్ సిలిండర్ల సరఫరాను నిలిపివేశాయి. దీంతో ఇప్పటికే ముంబై, బెంగళూరులో 20 శాతం హోటళ్లు మూతపడినట్లు తెలుస్తోంది. చిన్న, మధ్య తరగతి హోటళ్లు, మెస్‌లు, హాస్టళ్లపై సైతం దీని ప్రభావం పడుతోంది. రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం వంటి ప్రధాన నగరాల్లోనూ సమస్య తలెత్తుతున్నట్టు సమాచారం.
వీరికి హోటళ్లే ఆధారం
తెలంగాణలో 1.49 కోట్ల గృహ వినియోగదారులు ఉండగా, నెలకు కోటికి పైగా సిలిండర్లు వినియోగమవుతున్నాయి. అలాగే 5 లక్షల వాణిజ్య కనెక్షన్లు ఉండగా, వినియోగం దానికి రెట్టింపు స్థాయిలో ఉంటుంది. కాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 25 వేలకు పైగా మీడియం స్థాయి హోటళ్లు, రెస్టారెంట్లు ఉండగా, చిన్న హోటళ్లు భారీ ఎత్తున ఉన్నాయి. మెస్‌లు, చిన్న చిన్న రోడ్డుపక్క హోటళ్లు లెక్కలేనన్ని ఉన్నాయి. ఇక స్టార్ హోటళ్లు, క్లబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్లు కూడా హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. చిన్న చిన్న హోటళ్లు రోజుకు ఒక సిలిండర్, పెద్దవి 3–5 వినియోగిస్తాయి. వినియోగదారులను బట్టి రెస్టారెంట్లు, బార్లలో కూడా రోజుకు ఐదుకు తక్కువ కాకుండా సిలిండర్ల వినియోగం ఉంటుంది.
అదే స్టార్ హోటళ్లు రోజుకు 25 సిలిండర్లకు పైగా వినియోగిస్తాయి. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, మంచిర్యాల, రామగుండం, కొత్తగూడెం వంటి నగరపాలక సంస్థలతో పాటు జిల్లా కేంద్రాలు, మునిసిపాలిటీలు, మండల కేంద్రాలలోని హోటళ్లలో కూడా గ్యాస్ సిలిండర్ల వినియోగం పెద్ద ఎత్తున ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు, విద్యార్థులకు హోటల్ ఆహారమే ఆధారం. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను పూర్తిగా నిలిపివేస్తే హోటళ్లు మూత పడడమే కాకుండా లక్షలాది మంది ఉపాధికి గండి పడుతుంది.
60–65 శాతం ఎల్‌పీజీ దిగుమతి
భారత్ 60–65 శాతం ఎల్‌పీజీ కోసం దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇరాన్, సౌదీ అరేబియా వంటి దేశాల నుంచి సరఫరా ఆగిపోవడంతో దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడింది. 2025లో ఎల్‌పీజీ వినియోగం 31 మిలియన్ టన్నులకు చేరగా, దేశీయంగా గ్యాస్ ఉత్పత్తి కేవలం 12–13 మిలియన్ టన్నులకే పరిమితమవడంతో సమస్య మరింత ఉధృతమైంది.
ప్రత్యామ్నాయాల అన్వేషణలో హోటల్ రంగం
తాజా పరిస్థితులతో ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు హోటల్ రంగం మొగ్గు చూపుతోంది. ఎలక్ట్రిక్ స్టవ్‌లు, బయోగ్యాస్ వంటి ఆప్షన్లు పరిశీలిస్తున్నప్పటికీ, అవి ఖర్చుతో కూడుకున్నవే గాక తక్షణ పరిష్కారానికి వీలుకానివనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు వంటగదుల్లో విద్యుత్ వినియోగం పెంచే ఆలోచనలో హోటళ్ల యజమానులు ఉన్నారు.
హైదరాబాద్‌లో పుష్కలంగా నిల్వలు
యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడుతుందనే ప్రచారంతో సాధారణ రోజుల కంటే ఇప్పుడు గృహ వినియోగం బుకింగ్‌ల సంఖ్య 15 శాతం నుంచి 20 శాతం వరకు పెరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో సిలిండర్ల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, వినియోగదారులు అనవసరంగా భయాందోళన చెందవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
గ్యాస్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి: భారత్ గ్యాస్
వంట గ్యాస్ కొరతపై జరుగుతున్న ప్రచారంతో ప్రజలు ఆందోళన చెందుతుండడంతో గ్యాస్ కంపెనీలు అప్రమత్తమయ్యాయి. భారత్ పెట్రోలియం కంపెనీ లిమిటెడ్..ఎల్‌పీజీ వినియోగదారులు ఆందోళన చెందవద్దంటూ సంక్షిప్త సందేశాలు పంపుతోంది. ‘ఇంధన సరఫరాలో కొరత ఉందని సోషల్ మీడియాలో ప్రజలను తప్పుదారి పట్టించే, ఆధార రహితమైన వార్తలు ప్రచారం చేస్తున్నారు. దేశంలో ఇంధనం సమృద్ధిగా అందుబాటులో ఉంది. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియజేస్తున్నాం. ఇంధనాన్ని సమర్థవంతంగా, అవసరానికి అనుగుణంగా వినియోగించడం మంచిది’ అని బీపీసీఎల్ ఆంగ్లంలో ఎస్‌ఎంఎస్‌లు పంపించింది. అయితే గృహ వినియోగదారులు ఒకసారి గ్యాస్ బుక్ చేసిన తర్వాత మరోసారి బుక్ చేయాలంటే ఇప్పటివరకు ఉన్న 21 రోజుల గడువును 25 రోజులకు పెంచుతూ ఆయిల్ కంపెనీల నుంచి ఆదేశాలు వచ్చినట్లు ఏజెన్సీలు చెబుతున్నాయి.
హోటళ్లు మూతపడే ప్రమాదం: హోటల్స్ అసోసియేషన్
వాణిజ్య ఎల్‌పీజీ సరఫరా నిలిచిపోతే హోటల్ రంగం మూతపడే పరిస్థితి ఏర్పడుతుందని తెలంగాణ రాష్ట్ర హోటళ్ల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. సంఘం అధ్యక్షుడు ఎస్.వెంకటరెడ్డి, కార్యదర్శి సీహెచ్ వేణుగోపాల్ తదితరులు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిని కలిసి సమస్యను వివరించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మంత్రి ఢిల్లీకి వెళ్లిన కారణంగా వచ్చిన తర్వాత ఆయన్ను కలుస్తామని వెంకటరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటివరకు హైదరాబాద్ నగరంలో హోటళ్లు మూతపడిన దాఖలాలు లేవని, కానీ సోమవారం నుంచి కమర్షియల్ సిలిండర్ల సరఫరాను నిలిపివేశారని ఆయన వివరించారు.


