గోదావరి పుష్కరాలకు 8 కోట్ల మంది! | Telangana Govt estimating 8 crore people attend Godavari Pushkaralu | Sakshi
Sakshi News home page

గోదావరి పుష్కరాలకు 8 కోట్ల మంది!

Mar 11 2026 2:01 AM | Updated on Mar 11 2026 2:01 AM

Telangana Govt estimating 8 crore people attend Godavari Pushkaralu

పుణ్య స్నానాలు చేసేందుకు వస్తారని అంచనా వేస్తున్న ప్రభుత్వం 

మంత్రి శ్రీధర్‌బాబు అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘం భేటీ.. సన్నాహకాలపై చర్చ 

వచ్చే ఏడాది జూన్‌ 26–జూలై 7 వరకు 

ఆది పుష్కరాలు.. 2028 జూలై 13–24 అంత్య పుష్కరాలు 

నదీతీరంలోని 96 ప్రాంతాల్లో ఏర్పాట్లకు నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: అత్యంత భక్తి ప్రపత్తులతో ఆచరించే గోదావరి పుష్కరాలు వచ్చే సంవత్సరం జూన్‌ 26 నుంచి జూలై 7 వరకు జరగనున్నాయి. ఆది పుష్కరాల తర్వాత నిర్వహించే అంత్య పుష్కరాలు 2028 జూలై 13 నుంచి 24 వరకు జరుగుతాయి. ఈ మేరకు పండితులు తేదీలు ఖరారు చేసి ప్రభుత్వానికి అందజేశారు. పుష్కరాల నిర్వహణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం మంగళవారం పుష్కరాల నిర్వహణ ప్రణాళిక ఖరారుపై నిర్వహించిన సమావేశంలో ఈ తేదీలను అధికారికంగా ప్రకటించింది. కుంభమేళాకు చేసే ఏర్పాట్ల తరహాలోనే ఏర్పాట్లు ఉండాలని నిర్ణయించారు. గతంలో జరిగిన గోదావరి పుష్కరాల అనుభవాలను గమనంలో ఉంచుకొని ప్రణాళిక ఖరారు చేయాలని నిర్ణయించారు. 

వచ్చే పుష్కరాల్లో దాదాపు 8 కోట్ల మంది స్నానాలు ఆచరించే అవకాశం ఉందని మంత్రి శ్రీధర్‌బాబు అధ్యక్షతన జరిగిన ఉప సంఘం సమవేశంలో అంచనా వేశారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్‌రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. తెలంగాణ బ్రాండ్‌ మార్మోగేలా... మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను కమిటీ ఆదేశించింది. భారీ సంఖ్యలో పుణ్యస్నానాలకు వస్తారని భావిస్తున్నందున, వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో పుష్కర ఏర్పాట్లు ఉండాలని పేర్కొంది. 

ఈ మేరకు 96 ప్రాంతాలను అధికారులు ఎంపిక చేశారు. ఆయా ప్రాంతాల్లో స్నాన ఘట్టాలు, సులభంగా చేరుకునేలా మెరుగైన రోడ్లు నిర్మించాలని ఆదేశించింది. వానాకాలంలో పనులకు ఇబ్బందులుంటాయని, ఈలోపే పనులు మొదలయ్యేలా చూడాలని ఆదేశించింది. ఈ నెల చివరి నాటికి డీపీఆర్‌లను పూర్తి చేయాలని పేర్కొంది. ముఖ్యమైన ప్రాంతాలను ముందుగా ఎంపిక చేసి యుద్ధప్రాతిపదికన పనులు చేయాలని సూచించగా, రద్దీ ఎక్కువగా ఉంటుందని భావించిన 9 ప్రాంతాలను తొలి విడత పనులకు అధికారులు ఎంపిక చేశారు. సమన్వయలోపం తలెత్తకుండా గోదావరి పుష్కరాల నిర్వహణకు ప్రత్యేకంగా స్పెషల్‌ ఆఫీసర్, శాఖల వారీగా నోడల్‌ అధికారులను నియమిస్తున్నట్టు కమిటీ పేర్కొంది.    

Advertisement
 
Advertisement
Advertisement