కవిత దీక్ష భగ్నం.. హైదరాబాద్‌ తరలింపు | Police broke up the protest initiated by Kalvakuntla Kavitha | Sakshi
Sakshi News home page

కవిత దీక్ష భగ్నం.. హైదరాబాద్‌ తరలింపు

Mar 11 2026 1:01 AM | Updated on Mar 11 2026 1:01 AM

Police broke up the protest initiated by Kalvakuntla Kavitha

జాగృతి కార్యాలయంలో కొనసాగుతున్న దీక్ష 

సాక్షి హైదరాబాద్‌/ఖమ్మంఅర్బన్‌: ఖమ్మం జిల్లా కేంద్రంలోని వెలుగుమట్లలో భూదాన్‌ బాధితులకు మద్దతుగా అంబేడ్కర్‌ భవన్‌ వద్ద తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన దీక్షను పోలీసులు మంగళవారం తెల్లవారుజామున భగ్నం చేశారు. డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్‌ మహరాజ్‌తో కలిసి సోమవారం రాత్రి ఆమె దీక్ష ప్రారంభించిన విషయం విదితమే. 

ఈ మేరకు తెల్లవారుజామునే పెద్దసంఖ్యలో చేరుకున్న పోలీసులు కవిత తదితరులను వాహనాల్లో ఎక్కించి హైదరాబాద్‌లోని జాగృతి కార్యాలయానికి తరలించారు. అయితే వెలుగుమట్ల బాధితులకు ప్రభుత్వం కూల్చివేసిన చోటే కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే డిమాండ్‌తో కవిత తన దీక్షను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ‘వెలుగుమట్లలో బాధితులకు ఇళ్లు నిర్మించి ఇచ్చేంత వరకు నిరాహార దీక్ష కొనసాగుతుంది’అని చెప్పారు.  

రాహుల్‌గాంధీకి కవిత లేఖ : వెలుగుమట్లలో భూదాన్‌ భూముల్లో పేదల ఇళ్ల కూల్చివేత ఘటనపై కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నాయకత్వం జోక్యం చేసుకోవాలని కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. ఈ మేరకు లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాందీకి ఆమె మంగళవారం లేఖ రాశారు. ప్రభుత్వ చర్యల వల్ల సుమారు 600 ఇళ్లు బుల్డోజర్లతో కూల్చివేయబడగా దాదాపు 2 వేల మంది ఒక్కరాత్రిలోనే నిరాశ్రయులయ్యారని ఆమె తెలిపారు. బాధితుల్లో అధికంగా సమాజంలోని బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలే ఉన్నాయని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement