కూల్చిన స్థలంలోనే ఇళ్లు కట్టి ఇవ్వాలి | Houses should be built on the demolished land | Sakshi
Sakshi News home page

కూల్చిన స్థలంలోనే ఇళ్లు కట్టి ఇవ్వాలి

Mar 11 2026 12:57 AM | Updated on Mar 11 2026 12:57 AM

Houses should be built on the demolished land

నిజమైన నిరుపేదలమే అక్కడ నివసిస్తున్నాం 

ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు కూల్చేశారు  

స్థలాలు కజ్జా చేస్తే మూడేళ్ల నుంచి అక్కడ ఉన్న ముగ్గురు మంత్రులు ఏం చేస్తున్నారు 

న్యాయస్థానం సుమోటోగా తీసుకొని న్యాయం చేయాలి  

విలేకరులతో వెలుగుమట్ల ఇళ్ల బాధితులు

సాక్షి, హైదరాబాద్‌ : పైసాపైసా కూడబెట్టుకున్నాం.. ఉన్న దాంట్లో సర్దుకుంటూ ఇళ్లు కట్టుకున్నాం. పిల్లలు పెద్దవారు అవుతున్నారు. ఇప్పుడిప్పుడే మా జీవితాలు కాస్తా మెరుగుపడుతున్నాయనుకునే సమయంలో బుల్డోజర్లతో మా ఇళ్లు కూల్చేశారు. మేము ఇప్పుడు ఎక్కడకు వెళ్లాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం మానవీయ కోణంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలి. లేదంటే మేమంతా రోడ్డుపాలవుతామని ఖమ్మం శివారు వెలుగుమట్ల భూదాన్‌ భూమిలో నివస్తున్న బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 

మంగళవారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో న్యాయవాదులు సుగుణారావు, తిరుమలరావు, బీఆర్‌ఎస్‌ లీగల్‌సెల్‌ ప్రతినిధి నిరూషా, బీఆర్‌ఎస్‌ ఖమ్మం టౌన్‌ అధ్యక్షుడు నాగరాజు తదితరులతో కలిసి బాధితులు మాట్లాడారు. వెలుగుమట్లలో కట్టుకున్న 700 ఇళ్లు కూల్చి.. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లు ఊరు అవతల ఇస్తామని అంటే సహించేది లేదు. కూల్చినచోటే ఇళ్లు కట్టి ఇవ్వాలని బాధితులు డిమాండ్‌ చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, కనీసం సమాచారం ఇవ్వకుండా తెల్లవారు జామున 4 గంటలకు వందలాది మంది పోలీసులతో వచ్చి ఇళ్లను కూల్చడం అమానుషమన్నారు. 

650 మంది బాధితులను అంబేడ్కర్‌ భవన్‌లో ఒక్కచోట ఉంచారని, అంత మంది కలిసి ఉన్నా.. నాలుగు బాత్రూమ్‌లు ఉన్నాయని వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు ఎలా ఉండగలుగుతారని ప్రశ్నించారు. ఇంటర్‌ పరీక్షలు జరుగుతున్నాయని, పది పరీక్షలకు పిల్లలు ప్రిపేర్‌ అవుతున్నారని, వారికి భోజనం ఇవ్వడం లేదని, భోజనం చేయడానికి వెళ్తామంటే కూడా బయటకు పంపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

భూదా న్‌ బోర్డు అక్కడ పేదలకు 62 ఎకరాల ఏడు గుంటల భూమి ఇచ్చిందని, ప్రభుత్వం కేవలం 32 ఎకరాలే చూపిస్తుందని, మిగిలిన 30 ఎకరాలు ఎక్కడకు వెళ్లిందో సీబీసీఐడీతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. దీనిని న్యాయస్థానం సుమోటోగా తీసుకొని న్యాయం చేయాలన్నారు.

ఇప్పుడు ఎక్కడకు పోవాలి  
2011లో ఖమ్మంలోని వెలుగుమట్లకు వచ్చాం. వంద గజాల స్థలంలో ఇల్లు కట్టుకున్నాం. దాదాపు నాతోపాటు 100 మంది వరకు ఇళ్లు కట్టుకొని ఉంటున్నారు. ఇంకా 800 మందికిపైగా ఇళ్లు కట్టుకోలేదు. ఇళ్లల్లో, బయట పని చేసుకుంటా పైసా పైసా కూడబెట్టుకొని ఇళ్లు కట్టుకున్నాం. ఒక్కసారిగా మా ఇళ్లను కూల్చేశారు. మేము ఇప్పుడు ఎక్కడకు వెళ్లాలి. ఏం చేయాలో అర్థం కావడం లేదంటూ కన్నీటిపర్యంతమయ్యారు శాంతి.

బుల్డోజర్‌ మా ఇంటిపైకి వచ్చింది  
ఉదయం నాలుగు గంటలకు ఏదో శబ్దం వస్తుందని లేచా. లేచి వాళ్ల ముఖాలే చూశా. మా ఇళ్ల వద్ద హడావుడి. ఒక వైపు అరుపులు, మరో వైపు ఏడుపులు, తీరా చూస్తే ఒక బుల్డోజర్‌ మా ఇంటిపైకి వచ్చింది. ఎలాంటి వస్తువులు తీసుకోకుండానే ఇళ్లు కూల్చారు. వస్తువులు తీసుకోవడానికి కూడా సమయం ఇవ్వలేదు. ఇలాంటి దారుణం మరెక్కడా ఉండదని బోరున విలపించారు సరస్వతి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement