నిఘా నీడలో టెన్త్ పరీక్షలు పరీక్షలకు హాజరుకానున్న 5.28 లక్షల మంది విద్యార్థులు
హాల్‌టికెట్‌పైనే క్యూఆర్ కోడ్
సీసీ కెమెరాల ముందే ప్రశ్నపత్రాల ఓపెనింగ్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 14 నుంచి పదవ తరగతి పరీక్షలు మొదలవుతాయి. ఏప్రిల్ 16తో ఈ పరీక్షలు ముగుస్తాయి మొత్తంగా 5,28,239 మంది పరీక్షలకు హాజరవుతున్నారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 5,17,727 మంది. 5,329 ప్రభుత్వ పాఠశాలల నుంచి 2,07,573 మంది, 1,057 గురుకులాల నుంచి 60,139 మంది, 5,288 ప్రైవేట్, ఎయిడెడ్ స్కూల్స్ నుంచి 2,50,015 మంది పరీక్షలకు హాజరవుతున్నారు.
ఉదయం 9.30 నుంచి మొదలయ్యే పరీక్ష మధ్యాహ్నం 12.30 గంటలకు ముగుస్తుంది. విద్యార్థులు పరీక్ష కేంద్రాలను తేలికగా తెలుసుకునేందుకు హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్‌ను ముద్రించారు. విద్యార్థులకు ఇప్పటికే హాల్‌టికెట్లు పంపినట్టు అధికారులు తెలిపారు. మీ సేవ కేంద్రాల ద్వారా కూడా డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. 8096958096 వాట్సాప్ నంబరు ద్వారా కూడా హాల్‌టికెట్లు పొందొచ్చు.
కంగారు పెట్టకుండా నిఘా
పరీక్షలు సజావుగా నిర్వహించాలని జిల్లా అధికారులను పాఠశాల విద్య డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు. పటిష్టమైన నిఘా వ్యవస్థ, సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందన్నారు. ప్రతీ కేంద్రానికి సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశామని చెప్పారు. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ నిఘా సిబ్బంది, పరీక్షల సిబ్బంది విద్యార్థులను ఆందోళనకు గురిచేసేలా వ్యవహరించొద్దని ఆదేశించారు.
ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరగాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ముందే భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీసు విభాగాన్ని కోరారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రంలో తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించాలని అధికారులను నికోలస్ ఆదేశించారు. సీసీ కెమెరాల ముందే పరీక్ష పేపర్ ఓపెన్ చేసేలా ఏర్పాట్లు చేశారు.


