- కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు
- 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు ఆది పుష్కరాలు
- 2028 జూలై 13 నుంచి 24 వరకు అంత్య పుష్కరాలు
- ‘తెలంగాణ బ్రాండ్’ ప్రతిబింబించేలా ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: కుంభమేళా తరహాలోనే గోదావరి పుష్కరాలనూ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని ‘గోదావరి పుష్కరాలు 2027’ క్యాబినేట్ సబ్ కమిటీ తెలిపింది.మంగళవారం డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధ్యక్షతన నిర్వహించిన కమిటీ తొలి సమావేశం నిర్వహించింది.సభ్యులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వర రావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.
‘తెలంగాణ బ్రాండ్’ మార్మోగేలా... మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను కమిటీ ఆదేశించింది. పుష్కర నిర్వహణ తేదీలు, సంబంధిత శాఖల సన్నద్ధత, భవిష్యత్తు కార్యాచరణను సమీక్షించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ.... సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం సరస్వతీ పుష్కరాలు, సమ్మక్క సారక్క జాతరను అత్యంత వైభవోపేతంగా నిర్వహించిందన్నారు. అదే స్ఫూర్తితో... మరింత రెట్టించిన ఉత్సాహంతో రాబోయే గోదావరి పుష్కరాలనూ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు ఆది పుష్కరాలు, 2028 జూలై 13 నుంచి 24 వరకు అంత్య పుష్కరాలను నిర్వహించాలని వేద పండితులు నిర్ణయించారన్నారు. సుమారు 8 కోట్ల మంది భక్తులు ఈ పుష్కరాలకు తరలి వచ్చే అవకాశముందని, అందుకు అనుగుణంగానే గోదావరి ప్రవహించే జిల్లాల్లో... ప్రముఖ దేవాలయాలను అనుసంధానిస్తూ... 96 ప్రాంతాలను పుష్కరాల కోసం ప్రత్యేకంగా ఎంపిక చేశామన్నారు. గత పుష్కరాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఆయా చోట్ల క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఘాట్లు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి రాష్ట్ర, జిల్లా ప్రణాళికలను ప్రత్యేకంగా రూపొందిస్తున్నామన్నారు.
తొలి దశలో భాగంగా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టేందుకు రద్దీ అధికంగా ఉండే తొమ్మిది ప్రాంతాలను ‘టైర్ – 1’ కింద ఎంపిక చేశామన్నారు. సమన్వయలోపం తలెత్తకుండా గోదావరి పుష్కరాల నిర్వహణకు ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్, శాఖల వారీగా నోడల్ అధికారులను నియమిస్తామన్నారు. ప్రతి ఘాట్ దగ్గర ట్రాఫిక్ క్రమబద్దీకరణ, ఎమర్జెన్సీ రూట్, అత్యాధునిక వైద్య సౌకర్యాలు, పార్కింగ్ తదితర అంశాలపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు. ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా అత్యంత పకడ్బందీగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.


