అర్ధరాత్రి దాటితే ఔషధాల కోసం కొంత దూరం వెళ్లాల్సి రావొచ్చు.. మద్యం కావాలంటే అంతగా శ్రమించాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా.. ఎప్పుడైనా.. సమయం ఏదైనా అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వం వైన్స్, బార్స్‌కు ఓ సమయం కేటాయిస్తాయి.. ఆ తర్వాత బెల్టు షాపుల్లో విరివిగా మద్యం దొరుకుతుంది. ధర మాత్రం వారు ఎంత చెబితే అంత అధికంగా చెల్లించాల్సిందే.. ఇదేంటని ప్రశ్నిస్తే.. అధికారులకు భారీగా ముట్టజెప్పాల్సి వస్తుంది. అందుకే ఎక్కువ తీసుకుంటున్నాం అనే సమాధానం వస్తోంది. నిత్యం కూలి పనులు చేసు‘కొనే’ వారే మద్యం కోసం అధిక డబ్బులు చెల్లిస్తున్నారు. ప్రతి గల్లీలో బెల్టు షాపులు మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతున్నాయి.
ఆల్విన్ కాలనీ సర్కిల్ పరిధి ఎల్లమ్మబండ పరిసర ప్రాంతాల్లోని అనేక ప్రాంతాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు వెలిశాయి. ఎవరూ అడ్డూ అదుపు చెప్పక పోవడంతో జోరుగా మద్యం విక్రయిస్తున్నారు. అంతేకాకుండా జగద్గిరిగుట్ట హనుమాన్‌నగర్, దీనబందు కాలనీ, ప్రగతి నగర్, రిక్షా పుల్లర్స్ కాలనీ, భూదేవిహిల్స్, శంషీగూడ, పీజేఆర్‌నగర్, హైదర్‌నగర్ వంటి ప్రాంతాల్లో మద్యంతో పాటు కల్తీ మద్యం కూడా అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఆబ్కారీ శాఖ అధికారులు కేవలం నామమాత్రంగా దాడులు చేస్తూ వారి వద్ద నుంచి ప్రతినెలా మామూళ్లు వసూలు చేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. రోజు వారి కష్టాన్ని మద్యానికి ఖర్చు చేసి కుటుంబాలను రోడ్డుపైకి తీసుకువస్తున్నారని మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యువత మద్యం మత్తులో వాహనాలను అతివేగంగా నడుపుతూ మృత్యువాత పడుతున్నారని, విచ్చలవిడిగా కొనసాగుతున్న బెల్టు షాపులను నియంత్రించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రశ్నించే వారిపై దాడులు..
ఎల్లమ్మబండలో అర్ధరాత్రి వేళలో బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయించే వారిని సామాజికవేత్తలు, స్థానిక వాకర్స్ ప్రశ్నిస్తే 365 రోజులు, 24 గంటలు బెల్ట్ షాపులు నడిపిస్తాం.. అధికారుల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేవు. ప్రతినెలా వారికి మామూళ్లు అందజేస్తుంటాం.. ప్రశ్నించడానికి మీరెవరని బెదిరిస్తున్నారంటూ సామాజికవేత్తలు, వాకర్స్ ఆవేదన వ్యక్త చేస్తున్నారు.
ఎక్కడపడితే అక్కడ మద్యం తాగుతూ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఎన్నిమార్లు ఫిర్యాదులు చేస్తున్నా ఆబ్కారీ శాఖ అధికారులు తూతూమంత్రంగా హెచ్చరికలు జారీ చేస్తూ చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. భాగ్యనగర్‌కాలనీలో ప్రధాన రహదారిపై వైన్ షాపు నిర్వహించడంతో కాలనీవాసులు ధర్నా నిర్వహించారు. ఆ ప్రాంతం నుంచి తీసివేసి కొద్ది దూరంలో ఏర్పాటు చేశారు. అయినా మందుబాబులు ఆ ప్రాంతంలో రహదారులపైనే వాహనాల పార్కింగ్, అటుగా రాకపోకలు సాగించే వారితో దురుసుగా ప్రవర్తించడం చేస్తున్నారు. ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ అలసత్వం వీడాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.


