ప్రపంచవ్యాప్తంగా ఏటా 5,46,000 మందిని బలిగొంటున్న అత్యధిక వేడి
ప్రతి నలుగురు భారతీయుల్లోముగ్గురికి ముప్పు
దేశంలో 151 జిల్లాలకు అధిక ముప్పు, 266 జిల్లాలకు అత్యధిక ముప్పు
మూడు అత్యధిక ఉష్ణ సంవత్సరాలుగా 2023, 2024, 2025 రికార్డు సృష్టించినట్లు అంతర్జాతీయ వాతావరణ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. ప్రస్తుత లానినా వాతావరణ పరిస్థితులు చూస్తుంటే 2026 కూడా ఈ వరుసలో చేరేలా ఉంది. ప్రపంచ సగటుతో పోల్చితే ఆసియా ఖండంలో వేడి రెట్టింపవుతోందని గణాంకాలు చెబుతున్నాయి. ఇంతకీ మన దేశంలో అధిక వేడి ముప్పు స్థితిగతులు ఎలా ఉన్నాయి? అధ్యయనాలేం చెప్తున్నాయి? ప్రభుత్వాలేం చేస్తున్నాయి? -సాక్షి, స్పెషల్ డెస్క్
విపత్తు అంటే?
భారతీయ వాతావరణ శాఖ నిబంధనల ప్రకారం పగటి ఉష్ణోగ్రత మైదాన ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్, కోస్తా తీర ప్రాంతాల్లో 37 డిగ్రీలు, కొండ ప్రాంతాల్లో 30 డిగ్రీలు దాటితే వడగాడ్పు (హీట్‌వేవ్) పరిస్థితులు ఏర్పడినట్లు భావిస్తారు. ఈ స్థాయి కన్నా 4.5–6.4 డిగ్రీల మేరకు ఉష్ణోగ్రత పెరిగితే వడగాడ్పు రోజుగా, 6.4 డిగ్రీల కన్నా పెరిగితే తీవ్ర వడగాడ్పుల రోజుగా ప్రకటిస్తారు.
ఎవరికి ఎక్కువ ముప్పు?
ముఖ్యంగా పారిశుధ్య కార్మికులు వీధుల్లో తిరుగుతూ కూరగాయలు, పండ్లు, వస్తువులు అమ్ముకునే చిరువ్యాపారులు, రైతులు, వ్యవసాయ కూలీలు, మత్స్య కార్మికులు, భవన నిర్మాణ కార్మికులకు ఎండ దెబ్బ ముప్పు మరీ ఎక్కువ. ఇతర వయసు్కల కంటే వృద్ధులు, పిల్లలకు ముప్పు ఎక్కువ. 20 డిగ్రీల సెల్సియస్‌కు మించి పెరిగే ఎండ వల్ల ప్రతి డిగ్రీకి 2–3 శాతం మేరకు పని సామర్థ్యం తగ్గిపోతోంది.
57 శాతం జిల్లాలకు అధిక వేడి ముప్పు
కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్ (సీఈఈడబ్ల్యూ) సంస్థ అధ్యయనం ప్రకారం దేశంలోని సగానికి పైగా (57%) జిల్లాల్లో అధిక స్థాయి నుంచి అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. 734 జిల్లాలకు గాను 151 జిల్లాలు అధిక వేడి ముప్పును, 266 జిల్లాలు అత్యధిక వేడి ముప్పును ఎదుర్కొంటున్నాయి. ప్రతి నలుగురు భారతీయుల్లో ముగ్గురు ఈ జిల్లాల్లోనే జీవిస్తున్నారు. గత 40 ఏళ్లలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పగళ్ల కంటే రాత్రులే ఎక్కువగా ఉన్నాయని ఈ అధ్యయనం తెలిపింది.
ఏసీలు, కూలర్ల వాడుక ఎంత?
మండే ఎండలను తట్టుకునేందుకు గదుల్లో కూలింగ్ సదుపాయం కల్పించుకోవటం ప్రజలకు నిత్యావసరంగా మారుతోంది. నేషనల్ శాంపిల్ సర్వే (2024) గణాంకాల ప్రకారం దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో 24 శాతం కుటుంబాలు, నగరాలు/పట్టణాల్లో 42 శాతం కుటుంబాలు మాత్రమే ఎయిర్ కండిషనర్లు లేదా కూలర్లను ఉపయోగిస్తున్నాయి. రిఫ్రిజిరేటర్లను మాత్రం 33 శాతం గ్రామీణ కుటుంబాలు, 68 శాతం నగర/పట్టణ కుటుంబాలు వాడుతున్నాయి.
ఏటా5.46 లక్షల మంది మృతి
ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ వాతావరణ సంస్థ అధ్యయనం ప్రకారం ఆరుబయట పనులు చేసే 160 కోట్ల మందికి అధిక వేడి ముప్పుఎక్కువగా ఉంది. కూలింగ్ సదుపాయాలు తక్కువగా ఉన్న భారత్ సహా 77 దేశాల్లోని 100 కోట్ల మందికి ఈ ముప్పు మరీ ఎక్కువగా ఉంది. ఎక్స్‌ట్రీమ్ హీట్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 5,46,000 మంది చనిపోతున్నారని ‘సస్టెయినబుల్ ఎనర్జీ ఫర్ ఆల్’సంస్థ నివేదిక చెబుతోంది.
2024లో మేల్కొన్న ప్రభుత్వం
అధిక వేడి ముప్పు గత మూడేళ్లలో ఉధృతం కావటంతో అధిక వేడిని తట్టుకునే ప్రత్యేక ప్రణాళికలతో పాలకులు సంసిద్ధతను పెంచుకోవటం తప్పనిసరైంది. అధిక వేడిని ఒక విపత్తుగా పరిగణిస్తూ 2024లో కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది. వడగాడ్పుల బాధితుల కోసం విపత్తు సహాయక నిధులను ఉపయోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు దీంతో అవకాశం ఏర్పడింది. అనేక రాష్ట్రాలు నగర, జిల్లా, స్థానిక స్థాయిలో హీట్ యాక్షన్ ప్లాన్లను రూపొందించుకోవటం ప్రారంభించాయి. ఫలితంగా కొన్ని చోట్ల అధిక వేడిని తట్టుకునే ఉపాయాలను ప్రభుత్వ స్థాయిలో అమలు చేయడం మొదలైంది.


