టీవీకే చీఫ్‌ విజయ్‌కు సీబీఐ మళ్లీ నోటీసులు | CBI again summons TVK chief Vijay | Sakshi
Sakshi News home page

టీవీకే చీఫ్‌ విజయ్‌కు సీబీఐ మళ్లీ నోటీసులు

Mar 10 2026 5:18 PM | Updated on Mar 10 2026 5:34 PM

CBI again summons TVK chief Vijay

న్యూఢిల్లీ: కరూర్ తొక్కిసలాట ఘటన కేసులో సినీనటుడు, టీవీకే అధినేత విజయ్‌ను మార్చి 15న ఢిల్లీలో విచారణకు హాజరుకావాలని సీబీఐ అధికారులు మంగళవారం సమన్లు పంపారు.

విజయ్‌ను సీబీఐ జనవరిలో రెండు సార్లు విచారించింది. మరోసారి మార్చి 9న హాజరుకావాలని చెప్పింది. అయితే, 15 రోజుల పాటు తన విచారణను వాయిదా వేయాలని ఆయన అభ్యర్థించినట్లు అధికారులు తెలిపారు.

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల కారణంగా రాజకీయ కార్యక్రమాలు ఉన్నాయని చెబుతూ విచారణ చెన్నైలో లేదా తమిళనాడులోని ఇతర ఏ కార్యాలయంలోనైనా నిర్వహించాలని విజయ్‌ కోరినట్లు అధికారులు తెలిపారు. అయితే, సీబీఐ మాత్రం తమ ప్రధాన కార్యాలయం ఉన్న ఢిల్లీలో మార్చి 15న హాజరుకావాలని సూచించింది.

కరూర్ నుంచి ద్రావిడ మున్నేట్ర కళగం ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీని కూడా మార్చి 17న విచారణకు హాజరుకావాలని కేంద్ర దర్యాప్తు సంస్థ తెలిపింది. దీనిపై ‘ఎక్స్’ వేదికగా బాలాజీ స్పందిస్తూ.. మార్చి 17న సీబీఐ ముందు హాజరై కరూర్ తొక్కిసలాట ఘటనపై వివరణ ఇస్తానని పేర్కొన్నారు.

కాగా, 2025 సెప్టెంబర్ 27న తమిళనాడు కరూర్ జిల్లాలో విజయ్ ర్యాలీ సమయంలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. 60 మందికి పైగా గాయాలు అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన ఆధారాలు సేకరించడంలో సీబీఐ నిమగ్నమైంది. సుప్రీంకోర్టు ఆదేశంతో ప్రత్యేక దర్యాప్తు బృందం నుంచి ఈ కేసును సీబీఐ స్వాధీనం చేసుకుంది.

గత సంవత్సరం అక్టోబరులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అజయ్ రస్తోగి నేతృత్వంలో పర్యవేక్షణ కమిటీ ఏర్పాటైంది. అదే సమయంలో దర్యాప్తు బాధ్యతలు స్వీకరించేలా సీనియర్ అధికారిని నియమించాలని సీబీఐ డైరెక్టర్‌కు ఆదేశించింది.

న్యాయమూర్తులు జేకే మహేశ్వరి, ఎన్వీ అంజారియా ధర్మాసనం ఈ తొక్కిసలాట దేశవ్యాప్తంగా ప్రజలను కలిచివేసిందని పేర్కొంది. ఈ కేసు దర్యాప్తు పూర్తిగా నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా సాగితేనే న్యాయ వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం తిరిగి ఏర్పడుతుందని ధర్మాసనం పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement