ఫిబ్రవరిలో ఉక్క‌పోత‌! | Above Average Temperatures Likely in February in India: IMD | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరిలో ఉష్ణోగ్రతలు ఎక్కువే: ఐఎండీ

Feb 1 2026 2:32 PM | Updated on Feb 1 2026 2:49 PM

Above Average Temperatures Likely in February in India: IMD

న్యూఢిల్లీ: ఈ ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగానే ఉంటాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది. అదే సమయంలో, సాధారణం కంటే తక్కువగా వర్షాలు కురుస్తాయంది. ముఖ్యంగా హిమాలయ ప్రాంతంలో కనిపిస్తున్న పొడి వాతావరణం ఈ మార్పులకు కారణమని పేర్కొంది.

ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర (Mrutyunjay Mohapatra) శనివారం మీడియాతో మాట్లాడారు. దేశం మొత్తమ్మీద చూస్తే ఈ ఫిబ్రవరి నెలలో వర్షపాతం సాధారణం కంటే తక్కువగానే ఉంటుందన్నారు. కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణానికి మించి ఉంటాయన్నారు.

ఉష్ణోగ్రతలు(Temperature) ఎక్కువగా ఉండటం వల్ల పంటల పెరుగుదల వేగం పుంజుకుంటుందన్నారు. గోధుమ, బార్లీ వంటి పంటలు నిర్ణీత సమయం కంటే ముందుగానే కోతకు వచ్చే అవకాశముందన్నారు. ఫలితంగా, కంకుల్లో గింజలు సరిగా లేక, తాలు గింజల కారణంగా దిగుబడి తగ్గుతుందని వివరించారు.  

పెరిగిన అంతర్జాతీయ పర్యాటకులు
సాక్షి, న్యూఢిల్లీ: వివిధ దేశాల నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని కేంద్ర పర్యాటక శాఖ వెల్లడించింది. 2020లో 63.37 లక్షలుగా ఉన్న అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య వరుసగా, 2021లో 70.10 లక్షలు, 2022లో 1.43 కోట్లు, 2023లో 1.88 కోట్లు, 2024లో 2.05 కోట్లుగా ఉందని వివరించింది.

విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రాంతాలు, ట్రావెల్‌ ట్రేడ్‌ రంగంతో కలిసి పర్యాటక శాఖ ప్రచార కార్యక్రమాలు నిర్వహించిందని వెల్లడించింది. ప్రచార కార్యక్రమాలకు ఐదేళ్లలో రూ.205 కోట్ల మేర ఖర్చు చేసినట్లు పేర్కొంది.

చ‌ద‌వండి: చెత్త కొండ‌ల‌కు కాలం చెల్లిన‌ట్టే!

పర్యాటక రంగం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, దేశ ఆర్థిక వ్యవస్థకు బలమిస్తుందని కేంద్రం అభిప్రాయపడింది. భారత్‌ను ప్రముఖ పర్యాటక గమ్యంగా తీర్చిదిద్దేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది.  

Advertisement
 
Advertisement
Advertisement