చెత్త కొండలకు కాలం చెల్లినట్టే! | Centre Launches Dumpsite Remediation Accelerator To Clear 8. 8 Crore Tonnes Of Landfill Waste By 2026 | Sakshi
Sakshi News home page

చెత్త కొండలకు కాలం చెల్లినట్టే!

Feb 1 2026 5:25 AM | Updated on Feb 1 2026 5:25 AM

Centre Launches Dumpsite Remediation Accelerator To Clear 8. 8 Crore Tonnes Of Landfill Waste By 2026

అక్టోబర్‌ 2026 నాటికి నగరాల్లో ‘జీరో డంప్‌ సైట్‌’లక్ష్యం

‘డ్రాప్‌’తో క్లీన్‌ డ్రైవ్‌.. ఇప్పటికే 61% పాత చెత్త క్లియర్‌

80 శాతం చెత్త పేరుకుపోయిన 214 భారీ డంప్‌సైట్లపై దృష్టి

బయోమైనింగ్‌ విధానంలో చెత్త నుంచి సంపద సృష్టి

ఖాళీ అయిన వేల ఎకరాల్లో పార్కుల అభివృద్ధి

సాక్షి, న్యూఢిల్లీ: స్వచ్ఛ భారత్‌ మిషన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అంకానికి తెరలేపింది. దేశంలోని నగరాలను దశాబ్దాలుగా వేధిస్తున్న చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు నడుం బిగించింది. ‘లక్ష్య: జీరో డంప్‌సైట్‌’పేరుతో 2026 అక్టోబర్‌ నాటికి నగరాల్లోని డంప్‌సైట్లను పూర్తిగా తొలగించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఇందుకోసం 2025 నవంబర్‌లో ప్రారంభించిన ‘డంప్‌సైట్‌ రెమిడియేషన్‌ యాక్సిలరేటర్‌ ప్రోగ్రామ్‌’(డ్రాప్‌) ప్రస్తుతం శరవేగంగా అమలవుతోందని కేంద్రం శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.

భారీ లక్ష్యం.. పక్కా ప్రణాళిక
దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ఏకంగా 2,479 డంప్‌సైట్లు ఉన్నట్లు కేంద్రం గుర్తించింది. ఇవి సుమారు 15 వేల ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. వీటిలో పేరుకుపోయిన చెత్త పరిమాణం అక్షరాలా 25 కోట్ల మెట్రిక్‌ ట న్నులు. ఈ చెత్త కారణంగా భూగర్భ జలాలు కలుషితమవ్వడంతో పాటు, గాలిలో ప్రమాద కర వాయువులు కలుస్తున్నాయి. తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతూ స్థానికుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేపట్టింది.

214 ప్రాంతాలపై ‘స్పెషల్‌ ఫోకస్‌’
దేశంలోని మొత్తం పాత చెత్తలో దాదాపు 80 శాతం చెత్త కేవలం 214 భారీ డంప్‌సైట్లలోనే ఉందని ప్రభుత్వం గుర్తించింది. 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 200 మున్సిపాలి టీల పరిధిలో ఉన్న ఈ ప్రాంతాలను అత్యంత ప్రాధాన్యతగా ఎంచుకుంది. వీటిలో పేరుకుపోయిన 8.6 కోట్ల మెట్రిక్‌ టన్నుల చెత్తను తొలగించేందుకు రూ. 6,700 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది.

చెత్త నుంచి సంపద ఎలా?
కేవలం చెత్తను ఒక చోటి నుంచి మరో చోటికి తరలించడం కాకుండా.. ‘బయోమైనింగ్‌’అనే శాస్త్రీయ పద్ధతిలో దానిని వనరుగా మారుస్తున్నారు. చెత్త నుంచి వేరు చేసిన మట్టి, రాళ్లను రోడ్ల నిర్మాణానికి, లోతట్టు ప్రాంతాలను పూడ్చడానికి వినియోగిస్తు న్నారు. దీనివల్ల నిర్మాణ రంగంలో కొత్త మట్టి అవసరం తగ్గుతుంది. ప్లాస్టిక్, పేపర్, బట్టలు వంటి మండే స్వభావం ఉన్న వ్యర్థాలను ’రెఫ్యూజ్‌ డిరైవ్డ్‌ ఫ్యూయల్‌’ (ఆర్డీఎఫ్‌)గా మార్చి సిమెంట్‌ ఫ్యాక్టరీలు, విద్యుత్‌ ప్లాంట్లలో బొగ్గుకు ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు. భవన నిర్మాణ వ్యర్థాలను రీసైకిల్‌ చేసి ఇటుకలు, పేవర్‌ బ్లాకులు, టైల్స్‌గా తయారు చేస్తున్నారు. లోహాలు, గాజు, ప్లాస్టిక్‌ వంటి వాటిని రీసైక్లింగ్‌ యూనిట్లకు పంపిస్తున్నారు. కేవలం పనికిరాని వ్యర్థాలను మాత్రమే సైంటిఫిక్‌ ల్యాండ్‌ఫిల్స్‌కు తరలిస్తున్నారు.

విజయం దిశగా అడుగులు
ఇప్పటికే దేశవ్యాప్తంగా 61 శాతానికి పైగా పాత చెత్తను ప్రాసెస్‌ చేశారు. 2025 ఒక్క ఏడాదే 438 నగరాల్లోని 459 డంప్‌సైట్లను పూర్తిగా క్లీన్‌ చేశారు. ఢిల్లీలోని భల్సా్వ డంప్‌సైట్‌ ఇందుకు నిదర్శనం. కేంద్ర మంత్రి మనోహర్‌ లాల్‌ దీనిని దత్తత తీసుకుని పర్యవేక్షించగా.. కేవలం నెలన్నర రోజుల్లోనే భారీగా చెత్తను తొలగించారు. అక్కడ 25 ఎకరాల భూమిని శుభ్రం చేసి, అందులో 5 ఎకరాల్లో వెదురు వనాన్ని పెంచుతున్నారు.

‘5 పి’ఫార్ములాతో ముందడుగు
స్వచ్ఛ భారత్‌ అర్బన్‌ 2.0 కింద ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కేంద్రం ‘5పి ’వ్యూహాన్ని అమలు చేస్తోంది. మంత్రులు, ప్రజాప్రతినిధులు డంప్‌సైట్లను దత్తత తీసుకుని పనులను వేగవంతం చేయడం. నగరాలకు ఆర్థిక భారం కాకుండా కేంద్రమే టన్నుకు రూ.550 చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. నేషనల్‌ హైవేస్‌ అథారిటీ, సిమెంట్‌ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని వ్యర్థాలను వారికి అందిస్తున్నారు. 

డంప్‌సైట్ల సమీపంలో నివసించే ప్రజలకు అవగాహన కల్పించడం, సఫాయి మిత్రల ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం, పనుల్లో జాప్యం లేకుండా టెక్నాలజీ సాయంతో పర్యవేక్షణ వంటి 5 అంశాలపై కేంద్రం దష్టి సారించింది. డంప్‌సైట్ల తొలగింపు ద్వారా నగరాల్లో కాలుష్యం తగ్గి ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని, ఇది ‘వికసిత్‌ భారత్‌ 2047’లక్ష్య సాధనలో కీలకమని కేంద్రం పేర్కొంది. క్లీన్‌ చేసిన స్థలాల్లో పార్కులు, క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి నగరాలకు కొత్త ఊపిరిలూదనున్నారు. భవిష్యత్తులో కొత్తగా డంప్‌సైట్లు ఏర్పడకుండా తడి, పొడి చెత్తను ఎప్పటికప్పుడు ప్రాసెస్‌ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement