చల్లదనం గురించీ, వేడి గురించీ ఒక్కోసారి మన ఊహల్ని తలకిందులు చేస్తూ, మాటలకు మనమిచ్చే అర్థాలను సవరించుకోవలసిన పరిస్థితులు ఎదురవుతాయి. ఈ శీత ఋతువులో అదే జరుగుతోంది. శీతవాయువు కోతకత్తిగా మారి శరీరాన్ని నిలువునా కోసి చలికారం అద్దుతోంది. మండువేసవిని మించి, రోజంతా చలి దహిస్తోంది. బతుకైనా, బాగైనా మితిలోనే ఉందనీ, అతి అన్నిటా అనర్థానికే దారి తీస్తుందనీ మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తోంది. ఈ ఏడాది దేశంలో అనేకచోట్ల సాధారణ ఉష్ణోగ్రత గణనీయంగా పడిపోయి చలిగాలుల ఊపేస్తాయని వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది.
భూమి చరిత్రలోనే కానీ, మానవ చరిత్రలోనే కానీ ఋతుగమనం హఠాత్తుగా తూకం తప్పి బతుకులను తలకిందులు చేసిన ఘట్టాలు అసంఖ్యాకం. చరిత్రకెక్కినవి కొన్నే. సాధారణ శకం 536లో అగ్నిపర్వతాలు బద్దలై యూరప్, మధ్యప్రాచ్యం, ఆసియా లలో ఆకాశాన్ని అంధకారంతో కప్పేసి అతి శీతల వత్సరాలను సృష్టించాయి. అది అసాధారణ స్థాయిలో హిమపాతానికీ, కరవు కాటకాలకూ, మానవ, జంతు మరణాలకూ దారితీసింది. యూరప్‌తో సహా పలుచోట్ల 1300–1850 మధ్యకాలాన్ని చిన్నపాటి మంచుయుగంగా లెక్కించారు.
1709లో యూరప్‌లో విస్తారమైన ప్రాంతాలు మంచు భూములుగా మారిపోయి, అనేక ప్రాణాలకు సమాధులయ్యాయి. 1783–84లో ఉత్తర అమెరికాలో విపరీత శైత్యం తీవ్ర దుర్భిక్షానికీ, చివరికి ఫ్రెంచి విప్లవానికీ దారితీసింది. 1816లో వేసవే లేకుండా పోయింది. 1963లో బ్రిటన్‌లో, 1972లో ఇరాన్‌లో, 2008లో అఫ్గానిస్తాన్‌లో హిమపాతాలూ, చలిగాలులూ పెద్ద సంఖ్యలో ప్రాణాలు హరించాయి.
శిశిరం శివతాండవం చేస్తూ కరవు కాటకాలతో జీవజాలాన్ని ఆకుల్లా రాల్చి వేయడం గమనిస్తే శ్రీశ్రీ ‘దేశచరిత్రలు’ కవిత గుర్తొస్తుంది. అంతా తన ప్రయోజకత్వమే అనుకుంటూ మనిషి స్థాపించిన సామ్రాజ్యాలు... ‘ఇతరేతర శక్తులు’ లేస్తే పేకమేడల్లా పడిపోయా యంటాడాయన. అలాగే, మౌర్య సామ్రాజ్యంలో తలెత్తినట్టు చెబుతున్న పన్నెండేళ్ళ దుర్భిక్షానికి అతిశీతల వాతావరణమో, లేదా అలాంటి మరేదైనా ‘ఇతరేతర’ శక్తో కారణం కావచ్చు. అప్పుడు భద్రబాహుడనే జైనముని జైన సంఘాన్ని వెంట బెట్టుకుని దక్షిణ భారతానికి తరలివచ్చాడనీ, చక్రవర్తి చంద్రగుప్తుడు కూడా సింహా సనాన్ని త్యజించి దక్షిణాపథానికి వచ్చాడనీ చరిత్ర చెబుతోంది.
సమతూకపు ఋతుగమనానికీ, భూమ్మీద జీవజాలం మనుగడకూ ఉన్న పీటముడి ఎలాంటిదో – ఆ తూకం హఠాత్తుగా తారుమారైనప్పుడే తెలిసి వస్తుంది. శీతర్తువు కరుణించి తగినంత వెచ్చదనాన్ని జోడించినప్పుడు, పోతన భాగవతంలో వర్ణించినట్టు మన్మథుడు విరహులకు హేమంతం అడుగుపెట్టినట్టు గబ్బున తోపించి అదేపనిగా వేధిస్తూ అర్ధాంగి నులివెచ్చని ఆలింగన సౌఖ్యం వైపు నడిపిస్తాడు. హాలుడు ‘గాథాసప్తశతి’లో అభివర్ణించినట్టు, ఆ భరోసాతోనే భర్త పశువులను కొనుక్కోడానికి పైబట్టను అమ్ముకుంటాడు. ‘చలి వడి కించే శైశిర కాలం వస్తూపోతూ దాగుడుమూతల క్రీడలాడుతవి మీ నిమిత్తమే’నంటూ మహాకవి శ్రీశ్రీ శైశవగీతిని ఆలపిస్తాడు. అదే శీతర్తువు ఒకింత గతి తప్పిందా... అస్తిత్వమే అల్లకల్లోలమైపోతుంది.
చలిగాలుల విజృంభణకు శాస్త్రవేత్తలిప్పుడు వివిధ కారణాలు ఎత్తి చూపుతున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో సంభవించే వాతావరణ పరిస్థితులూ, మధ్యధరా సముద్ర ప్రాంతంలో సంభవించే అలజడులూ చల్లని ఉత్తరపు గాలుల్ని సృష్టించి హిమాలయాల మీదుగా వ్యాపింపజేస్తాయంటున్నారు. శిలాజ ఇంధనాల విచ్చలవిడి వినియోగం కూడా ఉష్ణోగ్రతను కట్టడి చేసి శీతల వాయువులను సృష్టిస్తోందట. శాస్త్రజ్ఞులు చెప్పిన కారణాలు కొన్ని భాగవత కవికి అనుభవపూర్వకంగా తెలుసు.
ఉత్తరపు గాలి విసురుతోందనీ, తామరలు తరిగి అంతటా మంచు నెలకొందనీ అంటాడు. సూర్యుడు శక్తిహీనుడు కావడం వల్ల హిమాలయాల నిండా మంచు పేరుకుని ఆ పేరును సార్థకం చేస్తోందని రామాయణ కవి అంటాడు. వందల కోట్ల సంవత్సరాల అస్తిత్వంలో పుడమితల్లి ఇలాంటి పురిటినొప్పులు ఎన్ని పడిందో! ఎన్ని మంచు యుగాలను చూసిందో! మన మేరకు మనం చేజేతులా వాతావరణ విధ్వంసానికి పాల్పడకుండా జాగ్రత్త పడటమే చేయవలసినదీ, చేయగలిగినదీ!


