ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది భక్తుల మనోభావాలతో ముడిపడే ఉండే తిరుమ లేశుని లడ్డూ ప్రసాదంపై ఏ ముహూర్తాన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తప్పుడు ఆరోపణలకు దిగారో గానీ... అప్పటి నుంచి రాష్ట్రంలో జరగని అనర్థాలంటూ లేవు. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై, కార్యకర్తలపై దాడులు, తప్పుడు కేసులు, అరెస్టులు వగైరాలతో ముఖ్యమంత్రి మొదలుకొని అందరి కందరూ బిజీగా ఉంటే రాజమండ్రి సమీపంలోని లాలాచెరువు చుట్టుపట్ల కల్తీ పాల బారినపడి ఆరుగురు మరణించారు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది.
గత ఆదివారం దీని తీవ్రత వెల్లడైనా, అంతక్రితం వారం నుంచి అనేకమంది ఆసుపత్రుల్లో చేరుతూనే ఉన్నారు. కాస్త ఆలస్యంగా స్థానిక అధికారులైనా మేల్కొన్నారేమోగానీ... అమరావతిలో కొలువుదీరిన యంత్రాంగం నిద్ర లేవడానికి మరికొన్ని రోజులు పట్టింది. తీరిగ్గా ఇప్పుడు రాష్ట్రవ్యాప్త తనిఖీలు మొదలయ్యాయి. తిరుమల లడ్డూ వ్యవహారంలో శాసనసభలో పచ్చి అబద్ధాలు వల్లెవేయటానికి కావలసిన సరంజామా సిద్ధం చేసుకుని, ఎవరు ఏ అసత్యాలతో రక్తి కట్టించాలో తేల్చుకుని, స్క్రిప్టులు బట్టీ పట్టడంలో కూటమి నేతలు తంటాలు పడుతుంటే, అడిగిందల్లా అందించటంలో యంత్రాంగమంతా తరించింది.
ఇక కల్తీ పాలపై, కలుషిత నీటిపై పట్టించుకొనే నాథుడేడి? చివరకు కుప్పంకేంద్రంగా సాగే కల్తీ పాల దందాను కూడా కర్ణాటక పోలీసులు వచ్చి బట్టబయలు చేయాల్సి వచ్చింది.పాలకుల పాపాలు, వారి అసమర్థత ప్రజలకు శాపాలెలా అవుతాయో తెలియాలంటే 2024 సెప్టెంబర్‌లో లడ్డూ ప్రసాదంలో కల్తీ ఆరోపణ మొదలుకొని సాగుతున్న వరస పరిణామాలు గమనించాలి. నిరుడు జనవరిలో తిరుపతిలో వైకుంఠద్వార దర్శనం టోకెన్లు జారీ సమయంలో తీవ్ర తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మరణించారు. 40 మందికి పైగా గాయపడ్డారు.
అటుతర్వాత ఏప్రిల్‌లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలంలో చందనోత్సవం కోసం నిర్మించిన నాసిరకం గోడ కూలి ఏడుగురు భక్తులు దుర్మరణంపాలయ్యారు. నిరుడు నవంబర్‌లో కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది భక్తులు మరణించారు. ఈ ఉదంతాలకు సాటిరాగలది 2015 పుష్కరాల్లో రాజమండ్రిలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన. అందులో 25 మంది మహిళలు సహా 29 మంది మరణించగా, 60 మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటన సమ యంలో బాబు కుటుంబసమేతంగా అక్కడ ఉండటమే కాదు... తన షూటింగ్ కోసం భక్తుల్ని గంటల తరబడి ఆపటం వల్లే ఇలా జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఎంతో ఆరోగ్యంతో నిక్షేపంలా ఉండే సామాన్య పౌరులు ఒక్కసారిగా అస్వస్థులు కావటం, వారికి రోజుకు రెండుసార్లు డయాలసిస్ చేసే పరిస్థితి తలెత్తటం ఎంత విషాద కరం! అన్నిటికన్నా ఘోరమేమంటే... రాజమండ్రికి చెందిన ఆరేళ్ల బాలుడికి ఆరు రోజుల్లో ఏకంగా 63 సార్లు డయాలసిస్ అవసరమైంది. ఆ లేత ప్రాణం దీన్నితట్టుకోలేక కన్నుమూసింది. డయాలసిస్ సాగుతున్న పిల్లల్లో మూడేళ్లలోపు వారు కూడా ఉన్నారంటే ఉదంతం తీవ్రతేమిటో తెలుస్తుంది.
పాలలో కలిపిన ఇథిలీన్ గ్లైకాల్ అనే పదార్థం వల్లే బాధితుల రక్తంలో ప్రమాదకర స్థాయిలో యూరియా, క్రియాటిన్‌లు ఉన్నాయని చెబు తున్నారు. రక్తంలో గరిష్ఠంగా 24 మిల్లీగ్రాములు ఉండాల్సిన యూరియా దాదాపు 140 మిల్లీ గ్రాములు... గరిష్ఠంగా 1.3 మిల్లీగ్రాములు ఉండాల్సిన సీరమ్ క్రియాటిన్ ఏకంగా 9 మిల్లీ గ్రాములు ఉందంటే యంత్రాంగం కళ్లు ఎంతగా మూసుకుపోయాయో అర్థం చేసుకోవచ్చు.
ఇదింకా సద్దుమణగక ముందే గత అయిదు రోజులుగా శ్రీకాకుళం నగరంలో కలుషిత నీరు తాగి భారీ సంఖ్యలో ప్రజలు డయేరియా వాతబడ్డారు. నగరంలోని సగం ప్రాంతానికి కలుషిత నీరు సరఫరా కావటమే ఇందుకు కారణమంటున్నారు. 2024 జూలైలోనే అక్కడి బీసీ హాస్టల్‌లో ఇలాంటి కారణంతోనే పలువురు విద్యార్థులకు డయేరియా సోకింది. అప్పుడు కాస్తయినా శ్రద్ధపెట్టి ఉంటే ఇప్పుడు ఇది పునరావృత మయ్యేది కాదు. కల్తీ మాటలతో అధికారంలోకొచ్చి, ఆ బాణీనే కొనసాగిస్తున్న పాలకుల అసమర్థత అన్నిటినీ కల్తీమయం చేస్తోంది. ఇప్పటికైనా పాలించటం మొదలెడతారో లేదో బాబు అండ్ కో తేల్చుకోవాలి.


