అభిప్రాయం
అబద్ధాలు చెప్పడం చంద్రబాబు గారి జన్మహక్కు. దాన్ని మనం కాదన్నా ఆయన ఒప్పుకోరు. అందుకే అసెంబ్లీ లోనూ, బయటా, దేవుడి ముందూ, దేవుడి మీదా కూడా అబద్ధాలు చెప్ప గలరు. కోట్లాది మంది భక్తితో మోకరిల్లే తిరుమల శ్రీవారికే పంగనామం పెట్టగల సమర్థత బాబు గారి సొత్తు. మంగళవారం జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తిరుమల గురించి గుక్క తిప్పుకోకుండా అబద్ధాలు చెప్పారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి గారు తిరుమలను రెండు కొండలుగా ప్రకటించారని ఘోరమైన అసత్యం ప్రకటించారు. దాదాపు 20 ఏళ్లుగా ఈ ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఒక అబద్ధాన్ని కోట గోడలా కట్టి, నమ్మించడం చంద్రబాబు స్పెషా లిటీ. గోడలు బద్ధలు కొట్టకపోతే దేవుడు మమ్మల్ని క్షమించడు.
బ్రిటిష్ వారి మాన్యువల్ లెక్క
ఏడుకొండలపై వెలసిన తిరుమల క్షేత్రం సువిశాలమైంది. శేషాచలం కొండలు సమస్తం శ్రీవారి నిలయమే. దైవానికీ, భక్తికీ పరిధి లేదు. అయితే బ్రిటిష్ వారి నార్త్ ఆర్కాట్ మాన్యుయల్‌లో తిరుమల పరిధి 27 చదరపు కిలోమీటర్లు అని లిఖితమై ఉంది. టీటీడీ నిర్మాణాలకు అవసరమైన అనుమతులన్నీ కేంద్ర అటవీ శాఖ నుంచి లభించేవి కాబట్టి ఎప్పుడూ ఏ సమస్యా రాలేదు. స్వాతంత్య్రానికి ముందూ, తర్వాతా పాలకులూ, ముఖ్యమంత్రులూ వచ్చారు. టీడీపీ ఎన్టీఆర్ హయాంలోనూ, తొమ్మిదేళ్లచంద్రబాబు హయాంలోనూ కూడా బ్రిటిష్ వారి లెక్కల ప్రకారమే తిరుమల ఉండింది. ఎవరికీ ఏ సందేహం లేదు, రాలేదు. ఇది దైవ కార్యం కాబట్టి!
వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, చంద్ర బాబు దిగజారి తిరుమలను రాజకీయం చేయడం మొదలు పెట్టారు. కొండపై పంచాయతీ ఎన్నికల విషయమై జయచంద్ర నాయుడు అనే తెలుగుదేశం నాయకుడితో కోర్టులో పిటిషన్ వేయించారు. ఈ సందర్భంగా అప్పటి పంచాయతీ రాజ్ సెక్రటరీ శామ్యూల్ జీవో నంబర్ 338 విడుదల చేశారు. శతాబ్దాలుగా ఉన్న బ్రిటిష్ వారి ఉత్తర్వుల్లోని 27 చ.కి.మీ. పరిధినే జీవోలో తెలిపారు.
ఇదే అదనుగా చంద్రబాబు గగ్గోలు పెట్టి బురద చల్లడం ప్రారంభించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తిరుమలను రెండు కొండ లుగా మార్చాడని అబద్ధం ప్రచారంలోకి తెచ్చారు. అయితే ఆ రెండు కొండలు ఏమిటి? మినహాయించిన ఐదు కొండల పేర్లను చంద్ర బాబు జన్మలో చెప్పలేరు. ఎందుకంటే, అటువంటి ఆలోచనే జరగ లేదు కాబట్టి!
వైఎస్‌తో బాబుకు పోలికా!
అయితే చంద్రబాబు కుటిలత్వాన్నీ, దేవుణ్ణి రాజకీయానికి వాడుకునే దుర్మార్గాన్నీ అప్పటి టీటీడీ అధ్యక్షుడిగా ఉన్న నేను గుర్తించాను. అప్పటి ఈవో కేవీ రమణాచారి, ఎండోమెంట్ సెక్రటరీ ఐవీ సుబ్బారావు గార్లతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్‌తో స్వయంగా చర్చించాం. చంద్రబాబు దురుద్దేశాన్ని వివరించాం. వెంటనే ఆయన తిరుమల పరిధిని 352 చదరపు కిలోమీటర్లుగా నిర్దేశిస్తూ జీవో 746, తిరుమలలో అన్య మత ప్రచారాన్ని నిషేధిస్తూ జీవో నంబర్ 747ను విడుదల చేశారు.
తిరుమల శ్రీవారికి భక్తితో వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో చేశారు. ఏడుకొండల చట్టం తెచ్చింది ఆయనే. అన్యమత ప్రచారాన్ని నిషే ధించింది ఆయనే. వైఎస్ హయాంలోనే, నేను టీటీడీ చైర్మన్‌గా ఉన్నపుడు, టీటీడీలో హిందువులు తప్ప మిగతా మతస్థులతోఉద్యోగాల నియామకాలు చేపట్టకూడదని చట్టం తెచ్చాం. ఎన్టీఆర్ హయాంలో గొల్లపల్లి, పైడిపల్లి, తిరుపతమ్మ, పెద్దింటి కుటుంబాల వంశ పారంపర్య మిరాశీ హక్కును రద్దు చేశారు. 2007లో దేవుణ్ణి నమ్ముకున్న ఆ కుటుంబాల ఆనువంశిక హక్కును వైఎస్ రాజశేఖర రెడ్డి పునరుద్ధరించారు. హైందవ ధర్మ పరిరక్షణ కోసం సాధు పుంగవుల సమ్మేళనం నిర్వహించింది వైఎస్సార్ హయాంలోనే!
తిరుమల వేంకటేశ్వరస్వామి పవిత్రతను కాపాడ్డానికీ, ధర్మాన్ని, విశ్వాసాల్ని పరిరక్షించడానికీ వైఎస్ రాజశేఖరరెడ్డి నిరంతరం పాటుపడ్డారు. ఆయన పాదాల చెంత ఉన్న నారావారిపల్లెలో పుట్టి, తెల్లారి లేస్తే స్మరించుకుంటానని అబద్ధాలు చెప్పే చంద్రబాబు తిరుమలకు పంగనామం పెట్టడం తప్ప, చేసిందేమీ లేదు.
దేవుడి పేరుతో ఇంత రాజకీయమా?
అలిపిరి సంఘటనలో వేంకటేశ్వరస్వామి చంద్రబాబును కాపాడిన మాట నిజమే. అయితే దేవుణ్ణి రాజకీయాలకు వాడే ఆయన స్వభావానికి అది శ్రీవారు చేసిన హెచ్చరిక కూడా! ఆ తర్వాత కూడా తిరుమల శ్రీనివాసుడిని రాజకీయాలకు వాడారు, ఇంకా వాడుతున్నారు. బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి వస్త్రాలు భక్తితో తీసుకెళ్లిన వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన కుమారుడు వైఎస్ జగన్ ఇద్దరూ తిరు మలను రాజకీయాలకు వాడలేదు.
ఇపుడు కూడా చంద్రబాబునిందలకు సమాధానం మాత్రమే చెబుతున్నాం. ఎందుకంటే అబ ద్ధాన్ని నిజమని నమ్మించడంలో భారత రాజకీయాల్లోనే ఆయన్ని మించినవారు లేరు, ఇప్పట్లో రారు. 2009లో జరిగిన రాజకీయ సభలో జీవోలు 746, 747 రద్దు చేస్తానని చెప్పిన చంద్రబాబే,అసెంబ్లీలో జంకు లేకుండా మాట్లాడుతున్నారు. ఇదంతా సిగ్గుగా అనిపించదా?
పీవీ నరసింహారావు గారితో సహా ఎందరో మహనీయుడిగా భావించే పెజావర్ స్వామి ఈ జీవోల మీద వైఎస్‌ను ప్రశంసించారు. హైందవ ప్రచారానికి వైఎస్ చేసిన కృషిని పత్రికా సమావేశంలో కొనియాడారు. చంద్రబాబుకు బురద రాజకీయమే తెలుసు. మాకు గౌరవ రాజకీయాలు మాత్రమే తెలుసు. అందుకే ఆయన కుమారుడు లోకేశ్ పెళ్లికి, ఆయన వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ కోరిక మేరకు శేషాద్రి స్వామిని, తిరుమల అర్చకుల్ని స్వయంగా నేనే ఏర్పాటు చేశాను.
బాలకృష్ణ కూడా సౌకర్యాలకు ధన్యవాదాలు తెలిపారు. కానీ చంద్రబాబు మాత్రం దర్శన ఏర్పాట్లు ఘోరంగా ఉన్నాయని చెప్పారు. ఇదే విషయం బాలకృష్ణతో చెబితే, ‘రాజకీ యాలతో నాకు సంబంధం లేదు. మనస్ఫూర్తిగా చెబుతున్నా, మీ ఏర్పాట్లు బాగున్నాయి’ అన్నారు.
ధైర్యం ఉంటే జగన్ తో రాజకీయంగా తలపడండి. మతాన్నీ, దేవుడినీ అడ్డు పెట్టుకుని అబద్ధాల్ని చెప్పకండి చంద్రబాబూ!ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. దేవుడు ఇంకా బాగా గమనిస్తు న్నాడు. తిరుమల క్షేత్రం చాలా శక్తిమంతమైనది. ఆ దైవం ప్రతిసారీ మిమ్మల్ని క్షమించక పోవచ్చు!
-వ్యాసకర్త టీటీడీ పూర్వ అధ్యక్షులు
-భూమన కరుణాకరరెడ్డి


