నిశ్చితార్థం అయ్యాక పెళ్లి చేసుకోనన్న యువకుడు | Engaged young man refuses to marry | Sakshi
Sakshi News home page

నిశ్చితార్థం అయ్యాక పెళ్లి చేసుకోనన్న యువకుడు

Mar 13 2026 3:15 AM | Updated on Mar 13 2026 3:15 AM

Engaged young man refuses to marry

మనస్తాపంతో పెళ్లి కుమార్తె, ఆమె తల్లి ఆత్మహత్య 

మార్టూరు: నిశ్చితార్థం చేసుకున్న యువకుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్థాపానికి గురైన తల్లీ కుమార్తె ఎలుకల మందు, గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనతో  బాపట్ల జిల్లా మార్టూరు మండలం ద్రోణాదులలో విషాదం నెలకొంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. స్థానిక బీసీ కాలనీకి చెందిన సిరికొండ శ్రీనివాసరావు, సుజాత (45) దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె దివ్య (25) ఉన్నారు. కుమారుడు హేమంత్‌ కుమార్‌ అమెరికాలో ఉద్యోగం చేస్తుండగా, కుమార్తె దివ్య హైదరాబాద్‌లో మూడేళ్లుగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తోంది. 

దివ్యకు మార్టూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రావులకొల్లు శేషుబాబుతో పెద్దలు వివాహం నిశ్చయించి గత ఏడాది డిసెంబర్‌ 14న నిశ్చితార్థం చేశారు. ఈ వేసవిలో వివాహం జరగాల్సి ఉండగా.. ఈ నెల 4న మాట్లాడాలంటూ దివ్యను, ఆమె తల్లిదండ్రులను మార్టూరులోని తన నివాసానికి శేషుబాబు పిలిపించాడు. దివ్యను పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి, కుమార్తె మార్టూరులోనే ఎలుకల మందుతోపాటు గడ్డి మందు కొనుగోలు చేసి ద్రోణాదుల వచ్చి ఇద్దరూ తాగేశారు. 

మరుసటి రోజు సాయంత్రం అపస్మారక స్థితిలో ఉన్న దివ్య, సుజాతను గమనించిన శ్రీనివాసరావు మొదట చిలకలూరిపేట ఆస్పత్రికి... అనంతరం గుంటూరులోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స నిమిత్తం చేరి్పంచారు. వారం రోజులుగా చికిత్స పొందుతున్న సుజాత, దివ్య ఆరోగ్య పరిస్థితి విషమించి గురువారం మృతిచెందారు. సుజాత భర్త శ్రీనివాసరావు ఇచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసుకున్న గుంటూరు పోలీసులు మార్టూరు పోలీసులకు సమాచారం అందించగా దర్యాప్తు చేస్తున్నారు. ఇరువురి మృతికి కారకుడైన శేషుబాబుపై అధికారులు చట్టపరంగా చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement