తప్పుడు ప్రచారం మానుకోవాలి
ఎల్పీజీ ఉత్పత్తిని 28 శాతం పెంచాం
లోక్‌సభలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పురి వెల్లడి
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ మనదేశంలో ఇంధన కొరత ఎంతమాత్రం లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పురి వెల్లడించారు. పెట్రోల్, డీజిల్, కిరోసిన్, ఏవియేషన్ టర్బైన్ ఇంధన నిల్వలు సరిపడా ఉన్నట్లు తెలిపారు. ఇంధనం విషయంలో ప్రజలను ఆందోళనకు గురిచేసేలా తప్పుడు ప్రచారం చేయొద్దని ప్రతిపక్షాలకు హితవు పలికారు. గురువారం లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఇంధన కొరత గురించి ప్రస్తావించారు. దీనిపై హర్దీప్‌సింగ్ పురి సమాధానం ఇచ్చారు. దేశంలోని 33 కోట్ల కుటుంబాలకు ఎల్పీజీ సరఫరాకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. ముఖ్యంగా పేద కటుంబాలకు ఎలాంటి కొరత రానివ్వబోమని ప్రకటించారు.
దేశీయ సరఫరా వ్యవస్థను పరిరక్షిస్తామన్నారు. అన్ని రకాల ఇంధనం విషయంలో రిటైల్ ఔట్‌లెట్ల వద్ద సరిపడా నిల్వలు ఉన్నాయని చెప్పారు. సప్లై చైన్స్ యథాతథంగా పని చేస్తున్నాయని వెల్లడించారు. అన్ని రాష్ట్రాలకు అదనంగా కిరోసిన్ కేటాయిస్తున్నా మని తెలిపారు. ఇంధన సరఫరాలో సంక్షోభం ఉన్నప్పటికీ మన దగ్గర మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేవని హర్దీప్‌సింగ్ పురి స్పష్టంచేశారు.
ఎల్పీజీ ఉత్పత్తిని 28% పెంచినట్లు వివరించారు. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలను బట్టి చూస్తే మన దేశంలో ఇంధనం ధరలు తక్కువగానే ఉన్నాయని వ్యాఖ్యానించారు. హార్మూజ్ జలసంధిలో చమురు రవాణా ఆగిపోయినప్పటికీ ఇతర దేశాల నుంచి మనకు ముడి చమురు అందుతూ నే ఉందని గుర్తుచేశారు. 2006–07లో కేవలం 27 దేశాల నుంచి ముడి చమురు దిగుమతి చేసుకున్నామని, ప్రస్తుతం 40 దేశాల నుంచి దిగుమ తి చేసుకుంటున్నామని తెలియజేశారు. మోదీ దౌత్య నీతి వల్లే ముడి చమురు విషయంలో ఆటంకాలు లేకుండాపోయాయని మంత్రి ఉద్ఘాటించారు.


