అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఘటన
ఆలస్యంగా వెలుగులోకి.. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
విషయం బయటకు పొక్కడంతో మీడియాకు వివరాలు వెల్లడి
నక్కపల్లి/పాయకరావుపేట: రాష్ట్ర హోంమంత్రి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నాలుగు రోజుల క్రితమే ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుట్టుచప్పుడు కాకుండా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. హోం మంత్రి నియోజకవర్గం కావడంతో ఈ వ్యవహారం బయటకు పొక్కకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో గురువారం మీడియాకు వెల్లడించారు. సీఐ జి.అప్పన్న కథనం ప్రకారం.. బాధితులు ఇచి్చన ఫిర్యాదు వివరాల మేరకు.. అనకాపల్లి జిల్లాకు చెందిన బాలికను తల్లిదండ్రులు విశాఖలో ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్‌లో చేర్పించారు. హాస్టల్‌లో ఉంటున్న ఈ బాలికకు తన స్నేహితురాలి ద్వారా చినగదిలి(విశాఖ)కి చెందిన దల్లి సాయిచంద్(20) పరిచయమయ్యాడు. ఇతడు బాలికను ప్రేమించాలని వెంబడిస్తూ వేధింపులకు గురిచేసేవాడు. తన ప్రేమను అంగీకరించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.
గతేడాది ఏప్రిల్‌లో బాలికను పాయకరావుపేటకు సమీపంలో ఓ లాడ్జికి తీసుకువెళ్లి అసభ్యంగా వీడియోలు చిత్రీకరించాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించి బ్లాక్‌మెయిల్ చేసి బాలికను విశాఖలో పెందుర్తి ప్రాంతంలో తన నివాసానికి తీసుకెళ్లి పలుమార్లు లైంగిక దాడి చేశాడు. ఈ ఏడాది జనవరి చివరి వారంలో బాధితురాలిని నిందితుడు తన ఇంటికి తీసుకువెళ్లాడు. జరిగిన విషయాన్ని పోలీసులకు చెబితే వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని ఆమె తల్లిదండ్రులను ఫోన్‌లో బెదిరించాడు. బాధితురాలు మైనర్ అని తెలిసినప్పటికీ ఆమెను నెల పాటు పెందుర్తిలో తన ఇంట్లోనే నిందితుడి తల్లి నిర్బంధించింది.
బాధితురాలు ఈ వేధింపులను భరించలేక ఈ నెల 8న నిందితుడి ఇంటి నుంచి తప్పించుకుని తన తల్లిదండ్రుల వద్దకు వచ్చి జరిగిన విషయాన్ని తెలిపింది. దీంతో వారు పాయకరావుపేట పోలీసులను ఆశ్రయించారు. నిందితుడు తీసిన వీడియోలను బాధితురాలి తల్లిదండ్రులకు పంపడంతోపాటు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వారి బంధువులకు కూడా పంపినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడు మరో ఇద్దరు అమ్మాయిలతో కూడా ఇలాగే వీడియోలు తీసినట్లు విచారణలో వెల్లడైంది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు దల్లిసాయిచంద్, అతడి తల్లిని అరెస్టు చేశారు.


