కావాల్సిన వాళ్లకు దోచిపెట్టేందుకే ఎక్స్‌ప్రెస్‌ దోపిడీ | The value of the Talli Bidda express contract has been drastically increased | Sakshi
Sakshi News home page

కావాల్సిన వాళ్లకు దోచిపెట్టేందుకే ఎక్స్‌ప్రెస్‌ దోపిడీ

Mar 13 2026 3:38 AM | Updated on Mar 13 2026 3:38 AM

The value of the Talli Bidda express contract has been drastically increased

తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ కాంట్రాక్ట్‌ విలువ అమాంతం పెంపు 

83 శాతం అధిక ధరతో ఏటా రూ.14 కోట్లపైనే ప్రజాధనం లూటీ 

గత ప్రభుత్వం 2022లో ట్రిప్పునకు రూ.895 చెల్లింపు  

అదే సేవకు ఇప్పుడు రూ.1,640 చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధం 

అనుకూల ఫౌండేషన్‌కు కాంట్రాక్ట్‌ కట్టబెట్టడంలో చక్రం తిప్పిన మంత్రి  

సాక్షి, అమరావతి: కావాల్సిన వారికి ప్రజాధనాన్ని దోచిపెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు ఎక్స్‌ప్రెస్‌ వేగంతో అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. నిధులు దోపిడీ లక్ష్యంగా రెచి్చపోతున్నారు. అమాంతం కాంట్రాక్ట్‌ విలువలు పెంచి, జనం సొమ్ము అస్మదీయ కాంట్రాక్టర్లకు మళ్లించి, వారి నుంచి పెద్దలు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దోపిడీకి ఇటీవల వైద్య శాఖ ఖరారు చేసిన ‘తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ కాంట్రాక్ట్‌ నిదర్శనంగా నిలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో కొత్త వాహనాలను సమకూర్చి, అతి తక్కువ ధరకే అందిన ఈ సేవలకు, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం భారీగా ధర పెంచి కాంట్రాక్ట్‌ కట్టబెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన బాలింతలను ఇళ్లకు చేర్చడంతోపాటు, వైద్య సేవల నిమిత్తం హైరిస్క్‌ గర్భిణులకు హెల్త్‌ చెకప్స్‌ కోసం ఇళ్ల నుంచి ఆస్పత్రికి, తిరిగి ఇంటికి ఉచిత రవాణా సౌకర్యం కల్పించడానికి వైద్య శాఖ టెండర్‌ పిలిచింది. రూ.100 కోట్లకుపైగా విలువైన ఈ ప్రాజెక్ట్‌ను తన అస్మదీయుడికి చెందిన విద్యా వేద ఫౌండేషన్‌ సంస్థకు కట్టబెట్టడంలో కీలక మంత్రి చక్రం తిప్పారు.  కాంట్రాక్ట్‌ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా 500 వాహనాలను సమకూరిస్తే, వాటిలో బాలింతలు, గర్భిణుల రవాణాకు అనుగుణంగా ప్రభుత్వం చార్జీలు చెల్లిస్తుంది.

నాడు రూ.895.. నేడు రూ.1640..   
2019 వరకు మొక్కుబడిగా అరకొర వాహనాలతో అందే తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సేవలను గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం బలోపేతం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 500 బ్రాండ్‌ న్యూ వాహనాలతో సేవలను విస్తరించింది. ఇందుకోసం 2021లో టెండర్లు పిలిచి, ఒక్కో ట్రిప్పునకు  రూ.895 చెల్లించేలా కాంట్రాక్ట్‌ను ఖరారు చేసింది. 2022లో కాంట్రాక్ట్‌ సంస్థ సేవలను ప్రారంభించి, ప్రస్తుతం కూడా అదే రేటుతో వాహనాలను ఆపరేట్‌ చేస్తోంది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అదే సేవలకు ట్రిప్పునకు ఏకంగా రూ.1640 చొప్పున చెల్లించేలా రేటు ఖరారు చేసింది. 

ఒకే తరహా సేవలకు దాదాపు నాలుగేళ్ల వ్యవధిలో 83 శాతం రూ.745 (దాదాపు రెట్టింపు) చొప్పున ట్రిప్పునకు అదనంగా చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుతం మూడేళ్ల కాలపరిమితితో టెండర్‌ పిలిచి, మరో రెండేళ్లు పొడిగించుకోవడానికి వీలు కల్పించారు. అంటే ఐదేళ్ల కాంట్రాక్ట్‌ సంస్థకు రూ.1640 చొప్పున ప్రభుత్వం చెల్లించనుంది. వైద్య శాఖ గణాంకాల ప్రకారం ప్రస్తుతం 500 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలు నెలకు 15వేల ట్రిప్‌లు వేస్తున్నాయి. ఇప్పుడు ట్రిప్పునకు రూ.895 చొప్పున నెలకు రూ.1.34 కోట్ల చొప్పున ఏడాదికి రూ.16 కోట్ల పైనే ఖర్చు అవుతోంది. 

బాబు సర్కార్‌ కొత్తగా ఖరారు చేసిన రూ.1640 ధరతో నెలకు రూ.2.46 కోట్ల చొప్పున ఏడాదికి రూ.30 కోట్ల మేర వెచ్చించాల్సి ఉంటోంది. అంటే ప్రస్తుతం చేస్తున్న వ్యయంతో పోలిస్తే ఏడాదికి రూ.14 కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. గతేడాది మార్చిలోనే వైద్య శాఖ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ తొలి సారి టెండర్‌ పిలిచింది. అప్పట్లో ఇదే సంస్థ ఏకంగా ట్రిప్పునకు రూ.2300 చొప్పున ఫైనాన్షియల్‌ బిడ్‌ దాఖలు చేసింది. భారీగా కాంట్రాక్ట్‌ విలువను పెంచి, నిధుల దోపిడీకి చేస్తున్న కుట్రను అప్పట్లో ‘సాక్షి’ బట్టబయలు చేసింది. దీంతో ప్రభుత్వ పెద్దల దోపిడీకి సహకరించలేమని అధికారులు చేతులెత్తేశారు. 

ఖర్చుల్లో భారీ వృద్ధి లేకున్నా..
తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలను ఆపరేట్‌ చేసే సంస్థ సింహ భాగం ఇంధనం కోసం నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో 2022తో పోలిస్తే ప్రస్తుతం ఇంధన ధరల్లో భారీ వృద్ధి చోటు చేసుకోలేదు. మరోవైపు గతేడాది కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 2.0 సంస్కరణలు తీసుకొచి్చంది. దీంతో కొత్త వాహనాల కొనుగోలు, వాటి స్పేర్‌ పార్ట్‌లపై పన్నుల భారం కూడా గతంతో పోలిస్తే తగ్గింది. 2022లో 500 కొత్త మారుతి ఈకో వాహనాలతో ప్రస్తుత కాంట్రాక్ట్‌ సంస్థ సేవలు ప్రారంభించింది. నూతన కాంట్రాక్ట్‌ సంస్థ ఇదే తరహా వాహనాలతోనే సేవలు అందిస్తుందని భావించినా అప్పట్లో ఈ వాహనాలపై 25 శాతం జీఎస్టీ+1 శాతం సెస్‌ ఉండేది. 

గతేడాది జీఎస్టీ సంస్కరణల్లో జీఎస్టీని 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. మరోవైపు సెస్‌ను పూర్తిగా రద్దు చేశారు. ఫలితంగా గతంతో పోలిస్తే ఎక్స్‌ – షోరూమ్‌ ధరల్లో సుమారు రూ.50 వేల నుంచి రూ.70 వేలు పన్నుల రూపంలోనే తగ్గుదల ఉంది. ఓ వైపు సేవల్లో పెద్దగా మార్పు లేదు. మరోవైపు నిర్వహణ ఖర్చుల్లో భారీగా వృద్ధి లేకపోయినప్పటికీ కేవలం నిధులు దోచిపెట్టడమే లక్ష్యంగా బాబు సర్కార్‌ కాంట్రాక్ట్‌ విలువను పెంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో కొందరు ఉన్నతాధికారులు కుమ్మక్కయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement