ఫిషింగ్‌ హార్బర్‌ పోయింది.. ‘జువ్వలదిన్నె’ ప్రైవేట్‌ పరం! | Chandrababu Naidu government has not made Juvvaladinne Harbor accessible | Sakshi
Sakshi News home page

ఫిషింగ్‌ హార్బర్‌ పోయింది.. ‘జువ్వలదిన్నె’ ప్రైవేట్‌ పరం!

Mar 13 2026 3:44 AM | Updated on Mar 13 2026 3:44 AM

Chandrababu Naidu government has not made Juvvaladinne Harbor accessible

2024లో ప్రధాని ప్రారంభించినా.. హార్బర్‌ను అందుబాటులోకి రానివ్వని చంద్రబాబు సర్కారు 

ఫిషింగ్‌ హార్బరులో 29.58 ఎకరాలు ముంబై సంస్థ సాగర్‌ డిఫెన్స్‌ ఇంజనీరింగ్‌కు కేటాయింపు 

అనంతరం మొత్తం 150 ఎకరాలు కేటాయించేందుకు సన్నద్ధం 

సంపద సృష్టించకపోగా.. క్రెడిట్‌ చోరీలతో అంతా ప్రైవేట్‌పరం చేస్తున్న బాబు సర్కారు  

మన మత్స్యకారుల కోసం 10 ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం చేపట్టిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం  

సాక్షి, అమరావతి: మెడికల్‌ కాలేజీల నుంచి ఒక్కో రంగాన్ని ప్రైవేట్‌పరం చేసి సంపద సృష్టించకపోగా ఆస్తులను తెగనమ్ముతూ క్రెడిట్‌ చోరీలకు పాల్పడుతున్న చంద్రబాబు సర్కారు తాజాగా గత ప్రభుత్వ కృషితో సాకారమైన ఫిషింగ్‌ హార్బర్లపై కన్నేసింది. మన రాష్ట్రానికి చెందిన మత్స్యకారులు వేట కోసం వలస వెళ్లి అవస్థలు పడకూడదని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి చేసిన ఫిషింగ్‌ హార్బర్‌ను చంద్రబాబు సర్కారు ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతోంది. 2024 ఆగస్టులో ప్రధాని మోదీ ప్రారంభించిన నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ను కూటమి సర్కారు ఇంతవరకూ అందుబాటులోకి తేకుండా మత్స్యకారుల ఆశలను నీరుగార్చింది. 

తాజాగా దీన్ని నౌకా నిర్మాణ కేంద్రంగా మారుస్తూ ముంబైకి చెందిన సాగర్‌ డిఫెన్స్‌ ఇంజనీరింగ్‌ లిమిటెడ్‌కు 29.58 ఎకరాలు కేటాయించింది. ఇందులో 7.58 ఎకరాలు వాటర్‌ ఫ్రంట్‌ ల్యాండ్, 22 ఎకరాలు హార్బర్‌ ల్యాండ్‌కు నిర్దేశించారు. మత్స్యకారుల నోట్లో మట్టి కొట్టే ఈ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహాత్మకంగా తన తనయుడు లోకేశ్‌తో శంకుస్థాపన చేయించడం గమనార్హం. ముంబైకి చెందిన సాగర్‌ డిఫెన్స్‌ జువ్వలదిన్నెలో అటానమస్‌ మారిటైమ్‌ షిప్‌యార్డ్‌ యూనిట్‌ సిస్టమ్స్‌ సెంటర్‌ను అభివృద్ధి చేయనుంది. 

ముఖ్యంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సహాయంతో నడిచే మానవ రహిత ఉపరితల వాహనాలు,  నీటి అడుగున తిరిగే వాహనాలను అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం తొలి దశలో కేవలం రూ.45 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. ఈ ప్రాజెక్టుకు మొదట 29.58 ఎకరాలు కేటాయించగా మొత్తం 150 ఎకరాలు అప్పగించనున్నట్లు శుక్రవారం అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో అధికారులు పేర్కొన్నారు. అంటే రానున్న కాలంలో జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ మొత్తం సాగర్‌ డిఫెన్స్‌కు కేటాయించనున్నట్లు స్పష్టమవుతోంది. 

మత్స్యకారుల నోట్లో మట్టి.. 
రాష్ట్రంలోని మత్స్యకారుల కోసం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 10 ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం చేపట్టింది. తొలి దశలో రూ.1,522.8 కోట్లతో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్‌ హార్బర్లను అభివృద్ధి చేసింది. జువ్వలదిన్నె హార్బర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది ఆగస్టు 30న వర్చువల్‌గా ప్రారంభించినా చంద్రబాబు ప్రభుత్వం మత్స్యకారులకు అందుబాటులోకి తేలేదు. రెండేళ్లలో ఏ ఒక్క ఫిషింగ్‌ హార్బర్‌నూ అందుబాటులోకి తేకపోగా గత ప్రభుత్వం చేపట్టిన వాటిని సైతం ప్రైవేట్‌పరం చేస్తోంది. 

జువ్వలదిన్నె హార్బర్‌ అందుబాటులోకి రాకపోవడంతో ఈ ప్రాంత మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారు. తమిళనాడుకు చెందిన మత్స్యకారులు భారీ బోట్లతో మన తీర ప్రాంతంలో వేటాడుతున్న విషయాన్ని కొద్ది రోజుల క్రితం నెల్లూరు కలెక్టర్‌ సీఎం చంద్రబాబు దృష్టికి తెచి్చనా తనకు పట్టనట్లే వ్యవహరించారు. ఇప్పుడు జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ స్థానంలో షిప్‌యార్డ్‌కు శంకుస్థాపన ద్వారా మత్స్యకారుల ఆశలను శాశ్వతంగా నీరుగార్చారు. 

మత్స్యకారుల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతో కేవలం చేపలు పట్టడానికి ఉపయోగపడే టెక్నాలజీని అభివృద్ధి చేస్తారంటూ నమ్మబలుకుతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే పెద్ద నౌకల తయారీతోపాటు సముద్ర జలాల్లో పరీక్షలు నిర్వహించడం స్థానిక మత్స్య సంపదపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.  

బందరు ఫిషింగ్‌ హార్బరు వద్ద కూడా..
ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లకుండా మన జలాల్లోనే చేపల వేట చేపట్టేలా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ జువ్వలదిన్నె హార్బర్‌కు శ్రీకారం చుడితే ఇప్పుడు షిప్‌యార్డ్‌ పేరుతో ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నారంటూ మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుగరాజపట్నం వద్ద అభివృద్ధి చేయనున్న షిప్‌ బిల్డింగ్‌ క్లస్టర్‌లో కాకుండా జువ్వలదిన్నె వద్ద షిప్‌ యార్డు నిర్మాణం చేపట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇదే రీతిలో మచిలీపట్నం ఫిషింగ్‌ హార్బరు వద్ద కూడా మరో షిప్‌ యార్డు నిర్మాణం చేపట్టడానికి చంద్రబాబు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుండటం మత్స్యకారులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement