శివాజీనగర( కర్ణాటక): ఇరాన్– ఇజ్రాయెల్, అమెరికా దేశాల యుద్ధం, గల్ఫ్ దేశాలపై దాడులు వల్ల బెంగళూరులో వంట గ్యాస్, వాహనాలకు సీఎన్‌జీ, ఎల్‌పీజీ కొరత ఏర్పడింది. స్టాక్ లేక బుధవారం నగరంలోని పలు ఆటో గ్యాస్ బంక్‌లు బంద్ అయ్యాయి. బంక్‌లకు మంగళవారం నుంచి సక్రమంగా గ్యాస్ సరఫరా కాలేదంటూ యజమానులు మూసివేశారు. శేషాద్రిపురం–గుట్టహళ్లి వద్ద ఉన్న ఆటో గ్యాస్ బంక్‌లో నో స్టాక్ బోర్డు పెట్టారు. పలుచోట్ల బంకుల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
రెండు రోజుల క్రితం కేజీ గ్యాస్ రూ.65 ఉండగా ఇప్పుడు రూ. 80 అయ్యింది. ఓ బంక్ మేనేజర్ బాబు మాట్లాడుతూ, ఆటో గ్యాస్ సక్రమంగా సరఫరా కావడం లేదు. ఎక్కువ ధర పెట్టి కొని విక్రయించే స్తోమత లేదు. కొత్త స్టాక్ వచ్చిన తరువాత బంక్‌ను తెరుస్తామని తెలిపారు. ఉపాధికి గండిపడుతోందని డ్రైవర్లు ఆవేదన చెందారు.
బెంగళూరులో ప్రముఖ ఆలయాల కూడా ఇబ్బంది వచ్చింది. ప్రసాదాలు, నైవేద్యాలు వండడానికి రోజుకు కనీసం 1 నుంచి 4 సిలిండర్లు కావాలి. మంగళవారం, శుక్ర, శనివారాల్లో భక్తుల రద్దీ ఎక్కువ. గ్యాస్ కొరతతో ఇబ్బందులు పడుతున్నట్లు ఆలయ సిబ్బంది తెలిపారు.


