సాక్షి, చెన్నై: తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే కూటముల్లో చేరే పార్టీల జాబితా దాదాపుగా ఖరారైంది. అయితే టీవీకే అధినేత విజయ్ ఇచ్చిన పిలుపునకు ఎట్టకేలకు ముగ్గురు స్పందించారు. ఈ ముగ్గురి విజయ్‌తో కలిసి మెగా కూటమి దిశగా కసరత్తులలో ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. డీఎంకే మెగా కూటమి అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. ఇందులో ఏఏ పారీ్టలు ఉన్నాయో దాదాపుగా క్లారిటీ వచ్చినట్లే. ఇక, అన్నాడీఎంకే– బీజేపీ కూటమిలోనూ అదే పరిస్థితి. కాగా సంకీర్ణ ధర్మం మేరకు పాలనలోనూ భాగస్వామ్యం అన్న నినాదంతో తనతో కలిసి వచ్చేవారికి అధికారంలో వాటా ఇస్తానన్న విజయ్ వైపుగా ఇంత వరకు ఎవ్వరూ దృష్టి పెట్ట లేదు. చివరకు ఒంటరిగానైనా ఎన్నికలను ఎదుర్కొనేందుకు సన్నద్ధమయ్యారు.
ఈ పరిణామాల నేపథ్యంలో విజయ్‌కు మరింత బలాన్ని ఇచ్చేందుకు పీఎంకే వ్యవస్థాపకుడు రాందాస్ ఓ వైపు ,దివంగత సీఎం జె. జయలలిత నెచ్చెలి శశికళ మరోవైపు సన్నద్ధమవుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అన్బుమణి పీఎంకే అన్నాడీఎంకే కూటమిలో చేరిన దృష్ట్యా, డీఎంకేలో తమకు అవకాశం లేక పోవడంతో ఇక విజయ్ పక్షాన నిలబడేందుకు రాజకీయ అనుభవజు్ఞడైన రాందాసు నిర్ణయించి, అందుకు సంబంధించిన సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. అదే సమయంలో రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రకటన చేసిన దివంగత సీఎం జయలలిత నెచ్చెలి చిన్నమ్మ శశికళ సైతం రాందాసు పిలుపునకు స్పందించినట్టు ప్రచారం.
రహస్యంగా చర్చలు..
ఈ ప్రచారానికి అద్దం పట్టే విధంగా ఆమె మంగళవారం రాత్రి తైలాపురంలో రాందాసుతో భేటీ కావడం ప్రాధాన్యతకు దారి తీసినట్లయ్యింది. తనకు వెన్నుపోటు పొడిచిన పళణిస్వామి, టీటీవీ దినకరన్‌కు గట్టిగా బుద్ది చెప్పే రీతిలో అన్నాడీఎంకే కేడర్‌ను విజయ్ వైపుగా మళ్లించే దిశగా చిన్నమ్మవ్యూహాలకు పదును పెట్టనున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. వన్నియర్ సామాజిక వర్గం ఓటు బ్యాంక్, ముక్కళత్తోర్ సామాజిక వర్గం ఓటు బ్యాంక్‌ను విజయ్ వైపుగా మళ్లించే దిశగా ఆయనకు దన్నుగా నిలబడేందుకు సన్నద్ధమవుతున్నట్టు చర్చలు జోరందుకున్నాయి.
అదే సమయంలో దక్షిణ తమిళనాడులో వెనుకబడిన సామాజిక వర్గం ఓటు బ్యాంక్‌ను కలిగిన పుదియ తమిళగం నేత కృష్ణస్వామి సైతం విజయ్‌కు దన్నుగా నిలబడే రీతిలో సిద్ధమైనట్టు ఆయన మద్దతు దారులు పేర్కొంటున్నారు. అయితే సజావుగా వ్యవహారాలన్నీ సాగి, వ్యూహాలు ఫలించిన పక్షంలో విజయ్ నేతృత్వంలోమెగా కూటమి తథ్యమని రాందాసు ,చిన్నమ్మ శశికళ శిబిరంలోని కొందరు నేతలు పేర్కొంటుండటం గమనార్హం.


