ప్రధాని నరేంద్ర మోదీ ధీమా
అభివృద్ధి కావాలంటే మార్పునకు పట్టం కట్టాలని పిలుపు
కేరళ, తమిళనాడులో ప్రధానమంత్రి పర్యటన
రూ.వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభం, శంకుస్థాపనలు
కొచ్చి/తిరుచిరాపల్లి: కేరళలో సీసీఎం నేతృత్వంలోని అధికార ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష యూడీఎఫ్ కూటములు అవినీతిలో కూరుకుపోయాయని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు కూటములకు గట్టిగా బుద్ధి చెప్పాలని కేరళ ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మార్పునకు పట్టం కట్టాలని కోరారు. ప్రధాని మోదీ బుధవారం కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించారు. తొలుత కేరళలో ‘అఖిల కేరళ ధీవర సభ’ స్వర్ణోత్సవాలకు హాజరయ్యారు.
అనంతరం కొచ్చిలో ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో భాగంగా రూ.11,000 కోట్ల విలువైన అభివృద్ధి, మౌలిక సదుపాయాలు ప్రాజెక్టులు ప్రారంభించారు, మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, మంత్రులు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించడం గమనార్హం. అనంతరం బీజేపీ ర్యాలీలో ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. రాష్ట్రంలో తమ పార్టీ బలం పెరిగిందని చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. పశ్చిమాసియా పరిణామాలపై రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాందీపై మోదీ మండిపడ్డారు.
పశ్చిమాసియా యుద్ధంపై ప్రజలను రెచ్చగొట్టేలా, బాధ్యతారాహిత్యంగా విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మన దేశ అభివృద్ధి గురించి కాంగ్రెస్ యువరాజుకు ఏమాత్రం తెలియదని ఎద్దేవా చేశారు. మన కంపెనీలు, మన యువత సాధిస్తున్న విజయాలు రాహుల్ ఏం తెలుసని ప్రశ్నించారు. శబరిమల బంగారం దొంగతనంలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్‌లకు ప్రమేయం ఉందని ఆరోపించారు. మత రాజకీయాలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధి అడ్డుకుంటున్నాయని ధ్వజమెత్తారు. ఆ రెండు కూటములకు బుద్ధి చెప్పాలని, ఈసారి ‘మోదీ గ్యారంటీల’తో ముందుకొస్తున్న బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు.
తమిళనాడు అభివృద్ధికి ప్రణాళికలున్నాయి
తమిళనాడు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ఆయన తమిళనాడులోని తిరుచిరాపల్లిలో రూ.5,650 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించారు, మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు పచ్చజెండా ఊపారు. అనంరతం ఎన్డీఏ ఎన్నిక ప్రచార సభలో ప్రసంగించారు. రాష్ట్రంలో డీఎంకే పాలనలో మహిళలు, చిన్నారులపై నేరాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తంచేశారు. నేరగాళ్లు యథేచ్ఛగా తిరుగుతున్నారని ఆరోపించారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే గెలిపిస్తే ప్రజలకు అన్ని విధాలుగా రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. శాంతి భద్రతలు కాపాడుతామన్నారు. నేరగాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. తమిళనాడులో అవినీతికి అంతే లేకుండాపోయిందని దుయ్యబట్టారు. నదులన్నీ చివరికి సముద్రంలో కలిసిపోయినట్లు అవినీతి సొమ్ము చివరకు ఒక కుటుంబానికి చేరుతోందని సీఎం స్టాలిన్‌పై నిప్పులు చెరిగారు. డీఎంకే ‘శాస్త్రీయమైన అవినీతి మోడల్’ను అమలు చేస్తోందన్నారు.
తమిళనాడు అభివృద్ధి పట్ల తన వద్ద ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు. ఈ ప్రాంతాన్ని రేర్ ఎర్త్ కారిడార్‌లో ఒక భాగంగా మారుస్తామని ప్రకటించారు. బెంగళూరు–చెన్నై, చెన్నై–హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు నిర్మించాలన్న ప్రతిపాదన ఉందని మోదీ తెలిపారు. ‘అభివృద్ధి చెందిన భారత్‌కు అభివృద్ధి చెందిన తమిళనాడు’ అత్యంత కీలకమని స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమమే తమ ధ్యేయమని వెల్లడించారు.


