ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించిన అప్పీలును జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ నుంచి మరో బెంచ్‌కు బదిలీ చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయకు మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. ఈ కేసు జస్టిస్ శర్మనే కొనసాగిస్తే నిష్పాక్షిక విచారణ జరగకపోవచ్చని కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఫిబ్రవరి 27న ట్రయల్ కోర్టు మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌తో పాటు మరో 22 మందికి విముక్తి కల్పించిన విషయం తెలిసిందే. వారిపై ఆరోపణలు నిరూపితం కాలేదని తేల్చింది. ఆ ఉత్తర్వును సీబీఐ సవాలు చేసింది. ప్రస్తుతం ఆ విషయంపైనే జస్టిస్ శర్మ విచారణ జరుపుతున్నారు.
మార్చి 9న జస్టిస్ శర్మ ఓ నోటీసు జారీ చేశారు. కేసు దర్యాప్తు చేసిన సీబీఐ అధికారిపై శాఖాపర చర్యలు చేపట్టాలని ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేశారు.ట్రయల్ కోర్టు ఉత్తర్వులో చేసిన కొన్ని వ్యాఖ్యలు తప్పుగా ఉన్నట్లు ప్రాథమికంగా కనిపిస్తున్నాయని కూడా ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.
అదే సమయంలో సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఉన్న పీఎంఎల్‌ఏ కేసు విచారణను వాయిదా వేయాలని కూడా ట్రయల్ కోర్టుకు ఆమె ఆదేశించారు.
రివిజన్ పిటిషన్‌లో సాధారణంగా స్పందన దాఖలు చేయడానికి కనీసం 4 నుంచి 5 వారాలు సమయం ఇస్తారని కేజ్రీవాల్ తెలిపారు. ఇంతకు ముందు కూడా అదే న్యాయమూర్తి ఎక్సైజ్ పాలసీ అంశాలపై విచారణ చేసి అదే అంశాలపై ప్రాథమిక అభిప్రాయాలు వ్యక్తం చేశారని కేజ్రీవాల్ తెలిపారు.


