పెళ్లి వేడుక వద్ద పిస్టల్‌తో కాల్పులు
సురక్షితంగా బయటపడ్డ మాజీ సీఎం
డిప్యూటీ సీఎంకూ తప్పిన ముప్పు
జమ్మూ: జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ప్రాణాపాయం నుంచి త్రుటిలో బయటపడ్డారు. ఆయనపై దాడి యత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. బుధవారం జమ్మూలోని గ్రేటర్ కైలాష్ వద్ద ఒక పెళ్లి వేడుకకు హాజరై వెనుదిరుగుతుండగా ఈ ఘటన జరిగింది. ‘‘పెళ్లి జరిగిన రాయల్ పార్క్ ప్రాంగణంలో పొంచి ఉన్న దుండగుడు అబ్దుల్లాపై పిస్టల్‌తో కాల్పులకు దిగేందుకు ప్రయత్నించాడు.
అక్కడే ఉన్న ఇద్దరు పోలీసు అధికారులు స్పందించి అదుపులోకి తీసుకునే లోపే ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. అయితే ఫరూక్ అబ్దుల్లాకు గానీ, ఆయన వెంటే ఉన్న ఉప ముఖ్యమంత్రి సురీందర్ చౌదరికి గానీ ఎలాంటి గాయాలూ కాలేదు. దుండగున్ని అదుపులోకి తీసుకున్నాం. అతన్ని జమ్మూలోని పురానీ మండీకి చెందిన కమల్‌సింగ్‌గా గుర్తించాం’’ అని పోలీసులు తెలిపారు.


