ఇది సొసైటీ... నడబడిక! | students attack teacher inside classroom | Sakshi
Sakshi News home page

ఇది సొసైటీ... నడబడిక!

Mar 10 2026 2:04 AM | Updated on Mar 10 2026 2:05 AM

students attack teacher inside classroom

స్కూళ్లలో గంజాయి, స్కూళ్లలో వీడియోగేమ్స్‌, స్కూళ్లలో చెడ్డ మాటలు, స్కూళ్లలో రౌడీయిజం చదువుకునే పిల్లల మధ్య కలుపుమొక్కలు. చివరకు క్లాస్‌రూమ్‌లో టీచర్‌ మీద చెయ్యెత్తే వరకూ వచ్చారు. ఇందులో ఎవరి మీద నెపం నెడదాం? ఈ విద్యా భారతాన్ని ఎలా చూద్దాం?

బడి అంటే ఉత్తి భవనం కాదు. విద్యార్థుల భవితను తీర్చిదిద్దే ఆలయం. చదువు చెప్పే ప్రతి గురువు దైవంతో సమానం. తల్లిదండ్రుల తర్వాతి స్థానం మన పెద్దలు గురువుకే ఇచ్చారు. విద్యార్థుల్ని సొంత పిల్లల్లా చూసుకుంటూ, వారి బతుకును తీర్చిదిద్దే దిక్సూచులుగా మారి వారిని గమ్యానికి చేర్చే బాధ్యత ఉపాధ్యాయులది. కానీ.. పరిస్థితి తారుమారైంది. చదువు చెప్పే గురువులకు మర్యాద కరువైంది. విద్య నేర్పే ఒజ్జలకు విలువనిచ్చే సంస్కృతి కనుమరుగవుతోంది. తప్పు చేస్తే విద్యార్థులను ఉపాధ్యాయులను దండించే కాలం పోయి, విద్యార్థులే ఉపాధ్యాయులను దండించే కాలం వచ్చింది. ఇది కాలరీతి అనుకోవాలా లేక సమాజంలో దిగజారిపోతున్న విలువలకు తార్కాణంగా భావించాలా తెలియని పరిస్థితి. 

ఇటీవలి ఘటన కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వీరవల్లి జడ్పీ ఉన్నతపాఠశాలలో జరిగిన ఘటన అందరినీ నివ్వెరపరిచింది. మరుగుదొడ్ల వద్ద సిగరెట్లు తాగుతున్న ముగ్గురు విద్యార్థులను గమనించి ల్యాబ్‌ అసిస్టెంట్‌ మందలించారు. దీనిపై ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ విద్యార్థులు ఆయనతో వాగ్వాదానికి దిగి దాడి చేశారు. ఈ ఘటనను వీడియో తీస్తున్న వారిపైనా దాడి చేశారు. దీంతో ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో తరచూ జరుగుతున్నాయి. బడిలో మద్యం, గంజాయి తాగడం, అమ్మాయిలను ఏడిపించడం, గ్రూపులుగా విడిపోయి కొట్టుకోవడం తరచూ కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల ఇవి తీవ్రస్థాయికి చేరుతున్నాయి. వీటిని కట్టడి చేయలేక ఉపాధ్యాయులు చేతులెత్తేస్తున్నారు. గట్టిగా చర్యలు తీసుకోవాలని చూస్తున్నా స్థానిక రాజకీయాలు, ఒత్తిడి వారి ఆ పని చేయనీయకుండా చేస్తోంది. దీంతో మిన్నకుండిపోతున్నారు.

సినిమాలు... సోషల్‌ మీడియా ప్రభావం
స్కూల్‌ పిల్లలు చెడ్డదారిలో పడటానికి సినిమాలు, సోషల్‌ మీడియా ప్రధాన కారణంగా మారుతున్నాయని నిపుణులు అంటున్నారు. సినిమాల్లో విద్యార్థులు తమ లెక్చరర్లను ఏడిపించడం, వారి మీద జోకులేయడం వంటి సన్నివేశాలు చూసి తామూ అలా చేయాలని భావిస్తున్నారని అంటున్నారు. ఇటీవల కాలంలో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ వీడియోలు, బూతులు, అశ్లీల వీడియోలు సైతం వారి మనసుల మీద చెడు ప్రభావం చూపిస్తున్నాయంటున్నారు. ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్‌ ఉండటం వల్ల చాలా సులభంగా వీటిని చూస్తూ ఆ ప్రభావానికి లోనవుతున్నారని అంటున్నారు.

తల్లిదండ్రుల మాటలనూ లెక్కచేయక...
విద్యార్థులు బడిలోనే ఇలా ఉంటున్నారనుకుంటే ΄÷రపాటే. కొందరు తమ ఇళ్లల్లోనూ ఇదే రీతిలో ప్రవర్తిస్తున్నారు. తల్లిదండ్రుల మాట వినకుండా, వారి మాటలకు ఎదురుచెప్తూ, వారి మీదే దాడికి పాల్పడుతున్నవారూ ఉన్నారు. అతిగారాబం, అడిగినవన్నీ అందించడం, అందరిలోనూ గొప్పగా ఉండాలని కోరుకోవడం వంటి కారణాలతో తల్లిదండ్రులే పిల్లల్ని ఇటువంటి ప్రవర్తనకు పురిగొల్పుతున్నారని మానసిక వైద్యులు అంటున్నారు. చివరకు సొంత అమ్మానాన్నల మాట కూడా వినని స్థితికి చేరుకున్నాక ఏమీ చేయలేక కుమిలిపోతున్నారని అంటున్నారు.

ఇలా చేస్తే మేలు...
పిల్లలను అతిగారాబం చేయకూడదు. వారి అవసరాలను గుర్తించి అందుకు తగ్గట్టు అందించాలి తప్ప వారి అడిగిన ప్రతి వస్తువూ కొనివ్వకూడదు. 
⇒  పెద్దల్ని గౌరవించడం, ఆడవారితో మర్యాదగా ఉండటం, తోటివారితో స్నేహంగా మెలగడం వంటివి చిన్ననాటి నుంచే నేర్పించాలి. 
⇒  పిల్లలు వారి ఫోన్ లో ఏమేం చూస్తున్నారో కనిపెడుతూ ఉండాలి. చూడకూడదని మొండికేస్తే ఆ ఫోన్‌ వారి నుంచి తీసుకోవాలి. 

⇒  పిల్లల స్నేహితులు ఎవరు, వారి అలవాట్లు ఏమిటి, వారి పద్ధతి ఎలా ఉంది అనేది గమనించాలి. ఎక్కడైనా తప్పుడు స్నేహాల బారిన పడుతున్నట్లు అనిపిస్తే వెంటనే హెచ్చరించాలి. 

⇒  కనీసం నెలకోసారైనా బడికి వెళ్లి పిల్లల ప్రవర్తన గురించి ఆరా తీయాలి. కేవలం మార్కుల గురించే కాకుండా నడవడిక గురించి కనుక్కోవాలి. 
⇒  రాత్రుళ్లు ఆలస్యంగా ఇంటికి రావడం, రోజంతా ఫోన్ లోనే గడపడం, అందరిపట్లా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటివి గమనిస్తే వెంటనే పిల్లల్ని మందలించాలి. అయినా మారకపోతే కొన్నిసార్లు కఠినంగా వ్యవహరించక తప్పదు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement