‘ఖద్దర్ నాక్’పై డీజీపీ కార్యాలయం స్పందన
సీపీతో మాట్లాడిన పోలీసు ఉన్నతాధికారులు
కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్న ఎల్‌ఎండీ పోలీసులు
దాడిచేస్తే విధులకు ఆటంకం కేసుతో సరి
సాక్షిప్రతినిధి,కరీంనగర్: విధుల్లో ఉన్న ఎస్సై గల్లా పట్టి దాడి చేసిన ఘటనపై కరీంనగర్ పోలీసులు స్పందించారు. ఘటనపై ‘సాక్షి’లో శనివారం ‘ఖద్దర్‌నాక్’ శీర్షికన కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ వార్తపై డీజీపీ కార్యాలయం స్పందించింది. ఉన్నతాధికారులు శనివారం ఉదయమే సీపీ గౌస్ ఆలంతో ఆరా తీశారు. అనంతరం ఎల్‌ఎండీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై గల్లా పట్టుకుని చేతులతో దాడిచేస్తే, విధులకు ఆటంకం కలిగించాడని కేసు నమోదు చేయడం విడ్దూరం.
ఆ రోజు ఏం జరిగిందంటే?
తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెంలో ఈ నెల 4వ తేదీన సాయంత్రం 6.50 గంటలకు జాతర సందర్భంగా విధుల్లో ఉన్న గన్నేరువరం ఎస్సై నరేందర్‌రెడ్డిపై చెన్నబోయిన రమేశ్ అనే వ్యక్తి గల్లా పట్టి దాడి చేశాడు. పోలీసులు అతడిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. పరీక్షించగా.. తాగినట్లు గుర్తించారు. అదే సమయంలో అధికార పార్టీ నేతను స్టేషన్‌కు ఎలా తీసుకెళ్తారు? అంటూ రాజకీయ ఒత్తిడి మొదలైంది. దీంతో తిమ్మాపూర్ సర్కిల్, సీపీ కార్యాలయం ఉన్నతాధికారులు ఈ ఘటన విషయంలో చేతులెత్తేశారు. సాక్షాత్తూ సీసీ కెమెరా ఫుటేజీ ఉన్నా.. కేసు నమోదు చేయలేదు. సాక్షాత్తూ పోలీసులపై సామాన్యుడు దాడి చేసినా ప్రతిఘటించలేని స్థితికి చేరుకున్నామని వాపోయారు.
దాడి చేస్తే.. విధులకు ఆటంకం కేసేంటి?
ఘటనను సాక్షిలో శనివారం ‘ఖద్దర్’నాక్ శీర్షికన ప్రచురితమైన కథనంపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. కరీంనగర్ పోలీసులతో మాట్లాడారు. స్పందించిన సీపీ అదే సీసీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేశారు. ఇది కేవలం తూతూ మంత్రపు కేసు కావడం మరో చర్చకు దారితీస్తోంది. ఎస్సై గల్లా పట్టుకుని, చేతులతో కొడితే.. ఆయనపై దాడి కేసు పెట్టకుండా కేవలం విధులకు ఆటంకం కలిగించాడని కేసు పెట్టడం.. ఉన్నతాధికారులు తలొగ్గిన తీరుకు నిదర్శనమని కిందిస్థాయి పోలీసులు విమర్శిస్తున్నారు. ఘటన జరిగినా ఉన్నతాధికారులు దాన్ని తొక్కిపెట్టడం, మీడియా ఎత్తిచూపితే తప్ప కేసు నమోదు చేసుకోలేని దయనీయ స్థితి ఎదురవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


