‘ఆందోళన వద్దు.. నేను చూసుకుంటా’: విజయ్ సంచలన వ్యాఖ్యలు | Vijay Respond To His Personal Life Divorce Controversy At TVKs Women’s Day Event, Comments Viral On Social Media | Sakshi
Sakshi News home page

‘ఆందోళన వద్దు.. నేను చూసుకుంటా’: విజయ్ సంచలన వ్యాఖ్యలు

Mar 8 2026 8:40 AM | Updated on Mar 8 2026 12:49 PM

Vijay respond to his personal life controversy at TVKs Women’s Day event

చెన్నై: తమిళ సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా వెలుగొందుతూ, ఇటీవలే రాజకీయ అరంగేట్రం చేసిన ‘తమిళ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత విజయ్ తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న ఊహాగానాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టే ప్రయత్నం చేశారు. గత కొంతకాలంగా తన వైవాహిక జీవితం గురించి సోషల్ మీడియాలోనూ, రాజకీయ వర్గాల్లోనూ జరుగుతున్న ప్రచారంపై ఆయన తొలిసారిగా స్పందించారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహాబలిపురంలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన అభిమానులను ఉద్దేశించి ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ‘నా  కారణంగా మీరు బాధపడుతుంటే అది నన్ను మరింత కలచివేస్తోంది.. ఈ సమస్యలను నేను పరిష్కరించుకుంటాను, మీరేమీ ఆందోళన చెందవద్దు’ అంటూ భరోసా ఇచ్చారు. గత కొన్ని నెలలుగా విజయ్, ఆయన భార్య సంగీత విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు కోలీవుడ్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం నాటి సభలో విజయ్ మాటలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

‘ఇటీవల కాలంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటిపై పోరాడుతూ మీరు పడుతున్న బాధను నేను గమనిస్తున్నాను. మీ మనోవేదన చూస్తుంటే నాకూ బాధగా ఉంది. నా వ్యక్తిగత విషయాలను నేనే చక్కదిద్దుకుంటాను. మీరు అధైర్యపడకండి, దేనికీ భయపడాల్సిన అవసరం లేదు’ అని ఆయన స్పష్టం చేశారు. కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా, తనను ప్రాణప్రదంగా భావించే కార్యకర్తల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయవద్దని ఆయన కోరారు.

మరోవైపు విజయ్ భార్య సంగీత చెంగల్పట్టు జిల్లా కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చెన్నైలోని కాసువారినా డ్రైవ్‌లో ఉన్న నివాసంలోనే తనను కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆమె కోర్టును కోరినట్లు సమాచారం. తాను బ్రిటీష్ పౌరురాలినని, భారత్‌లో తనకు మరో నివాసం లేదని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే, ఈ వ్యవహారంలో విజయ్‌పై ఆమె చేసిన కొన్ని ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. విజయ్ ఒక నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని, అందుకే తాము విడిపోవాలని నిర్ణయించుకున్నామని ఆమె ఆరోపించినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసు న్యాయస్థానం పరిధిలో ఉంది.

వ్యక్తిగత వివాదాలను పక్కన పెడితే, రాబోయే 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని విజయ్ వరాల జల్లు కురిపించారు. టీవీకే అధికారంలోకి వస్తే అమలు చేయబోయే పథకాలను ఆయన ప్రకటించారు:
మహిళలకు నెలకు రూ. 2,500 చొప్పున ఆర్థిక సాయం.
పేద యువతుల వివాహానికి ఒక తులం బంగారం,  పట్టుచీర కానుక.
ప్రతి కుటుంబానికి ఏడాదికి ఆరు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితం.
రాజకీయంగా తన గ్రాఫ్‌ను పెంచుకునే ప్రయత్నంలో ఉన్న విజయ్‌కు ఈ వ్యక్తిగత వివాదాలు ఒక పరీక్షగా మారాయి. అయితే, తన వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాలకు ముడిపెట్టవద్దని, తనపై నమ్మకం ఉంచాలని ఆయన కోరడం ద్వారా కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. 2026 ఎన్నికల కురుక్షేత్రంలో ఈ పరిణామాలు విజయ్ రాజకీయ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయో వేచి చూడాలి.

ఇది కూడా చదవండి: మీ ఆరోగ్యం మీ చెవుల్లోనే..

Advertisement
 
Advertisement
Advertisement