బెంగాల్ ప్రభుత్వం అన్ని హద్దులూ అతిక్రమించింది
ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం
న్యూఢిల్లీ / సిలిగురి / కోల్‌కతా: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అవమానించడం నిజంగా సిగ్గుచేటు అని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. గతంలో ఇలాంటి పరిణామం ఇప్పుడూ జరగలేదని చెప్పారు. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని హద్దులూ దాటేసిందని ధ్వజమెత్తారు. బెంగాల్‌లో రాష్ట్రపతి పాల్గొన్న సంథాల్ సదస్సు వేదికను రాష్ట్ర ప్రభుత్వం హఠాత్తుగా మార్చేసింది. ఈ విషయాన్ని ద్రౌపదీ ముర్ము తప్పుపట్టారు. తన అసంతృప్తిని వ్యక్తంచేశారు. అలాగే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె మంత్రివర్గ సభ్యులు కూడా తన పర్యటన సందర్భంగా హాజరు కాకపోవడాన్ని ముర్ము ఆక్షేపించారు. ఈ పరిణామాలపై మోదీ శనివారం ‘ఎక్స్’లో స్పందించారు. రాష్ట్రపతి పదవి రాజకీయాలకు అతీతం అని గుర్తుచేశారు.
ఆ పదవికి ఉన్న ప్రతిష్టను ఎల్లప్పుడూ గౌరవించాలన్నారు. బెంగాల్ ప్రభుత్వ చర్యతో ప్రజాస్వామ్యవాదులు, గిరిజనుల మనోభావాలు గాయపడ్డాయని ఆవేదన వ్యక్తంచేశారు. గిరిజన మహిళ అయిన ద్రౌపదీ ముర్ము ఆవేదన విని దేశ ప్రజల హృదయాలు బాధతో నిండిపోయాయని పేర్కొన్నారు. రాష్ట్రపతిని కించపర్చారని, దీనికి బెంగాల్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని మోదీ తేలి్చచెప్పారు. బెంగాల్ ప్రభుత్వానికి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఇకనైనా సద్భుద్ధి కలుగుతుందని ఆశిస్తున్నట్లు స్పష్టంచేశారు. సంథాల్ సంస్కృతిపై జరిగిన గొప్ప సదస్సును బెంగాల్ సర్కార్ తేలిగ్గా తీసుకోవడం దురదృష్టకరమని ప్రధానమంత్రి వెల్లడించారు.
రాష్ట్రపతిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తారా?: మమత
బీజేపీ సలహా మేరకే రాష్ట్రపతి ముర్ము నడుచుకుంటున్నారని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. మణిపూర్, చత్తీస్‌గఢ్‌లో గిరిజనులపై దాడులు జరిగితే ముర్ము ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బెంగాల్‌లో గిరిజనుల సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు చేపట్టలేదని రాష్ట్రపతి ఆరోపించడం దురదృష్టకరమని అన్నారు. రాష్ట్రపతిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తారా? అంటూ బీజేపీపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రపతి పట్ల తమకు ఎనలేని గౌరవం ఉందన్నారు. ముర్ము పాల్గొన్న సదస్సు వేదికను మార్చేసిన సంగతి తనకు తెలీదని మమత చెప్పారు.
ఆ సదస్సును ఎవరు నిర్వహించారో, ఎవరు నిధులిచ్చారో తెలియదని అన్నారు. రాష్ట్రపతి ఏడాదికి ఒకసారి బెంగాల్‌కు వస్తే తాను స్వాగతిస్తానని పేర్కొన్నారు. కానీ, తరచుగా వస్తూ ఉంటూ ప్రతిసారీ స్వాగతించడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఎల్లప్పుడూ రాష్ట్రపతి వెంట ఉండడమే మా పనా? అని వ్యాఖ్యానించారు. బెంగాల్‌లో గిరిజనుల ఓట్లు తొలగించిన విషయం ముర్ముకు తెలుసా? అని పేర్కొన్నారు. తమ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి రాష్ట్రపతిని బీజేపీ ఉపయోగించుకుంటోందని మమతా బెనర్జీ ఆరోపించారు.
మమతా బెనర్జీకి నాపై కోపం ఉండొచ్చు: ముర్ము
షెడ్యూల్ ప్రకారం బిదాన్ నగర్‌లో జరగాల్సిన సంథాల్ సదస్సును బెంగాల్ ప్రభుత్వం బాగ్‌డోగ్రా ఎయిర్‌పోర్టు సమీపంలోకి మార్చేసింది. దాంతో శనివారం సదస్సు అక్కడే జరిగింది. సరైన సమాచారం లేకపోవడంతో జనం పెద్దగా హాజరు కాలేదు. దీనిపై రాష్ట్రపతి ముర్ము తన అసంతృప్తిని వ్యక్తంచేశారు. తనకు స్వాగతం పలకడానికి ముఖ్యమంత్రి గానీ, మంత్రులు గానీ రాలేదని పేర్కొన్నారు. బిదాన్‌నగర్‌లో సదస్సు జరిగి ఉంటే గొప్పగా విజయవంతం అయ్యేదని అన్నారు.
సదస్సు వేదికను ఎందుకు మార్చారో తనకు తెలియదని స్పష్టంచేశారు. గిరిజనుల సంక్షేమాన్ని బెంగాల్ ప్రభుత్వం కోరుకోవడం లేదని తప్పుపట్టారు. తాను బెంగాల్ బిడ్డనని, మమతా బెనర్జీ తన చిన్న చెల్లెలు అని వివరించారు. కానీ, తనను బిదాన్ నగర్‌కు ఎందుకు అనుమతించలేదో తెలియదన్నారు. మమతా బెనర్జీకి తనపై కోపం ఉండొచ్చని, అందుకే ఇదంతా జరిగినట్లు భావిస్తున్నానని పేర్కొన్నారు.


