మమతా బెనర్జీ (ముఖ్యమంత్రి) రాయని డైరీ | Mamata Banerjee Rayani diary | Sakshi
Sakshi News home page

మమతా బెనర్జీ (ముఖ్యమంత్రి) రాయని డైరీ

Mar 8 2026 12:45 AM | Updated on Mar 8 2026 12:45 AM

Mamata Banerjee Rayani diary

మాధవ్‌ శింగరాజు

కేంద్రం శుక్రవారం పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా కొత్త ‘వైస్రాయ్‌’ ని పంపింది! పేరుకే గవర్నర్‌లు వీళ్లు. పోకడలు వైస్రాయ్‌లవి! ఎవరికి వారు లార్డ్‌ బెంటింక్‌లు, లార్డ్‌ మౌంట్‌ బాటెన్‌లు. లార్డులు వెళ్లేటప్పుడు ‘వెళ్తున్నాం’ అని, వచ్చేటప్పుడు ‘వస్తున్నాం’ అనీ చెప్పరు! సీవీ ఆనంద బోస్‌ అటు వెళ్లగానే, ఆర్‌.ఎన్‌. రవి ఇటు వచ్చి కూర్చున్నారు. ‘‘ఆయన ఎవరితోనూ మాట్లాడటం లేదు మేడమ్‌...’’ అన్నారు గౌతమ్‌ సన్యాల్‌ వచ్చి! నవ్వాను నేను.

సన్యాల్‌ నా పీఎస్‌. నేను రైల్వే మినిస్టర్‌గా ఉన్నప్పటి నుంచి నాతో ఉన్నారు. నా పక్కనే ఉంటూ నాతో పాటుగా ఈ ‘లార్డ్‌ వైస్రాయ్‌’ లందరినీ చూస్తూ వస్తున్నారు. ‘‘మరి, మీరైనా పలరించక పోయారా గౌతమ్‌?’’ అన్నాను, నవ్వుతూ. ‘‘బహుశా ఆయన ఇంకెవరి పలకరింపు కోసమైనా ఎదురుచూస్తున్నారేమో మేడమ్‌’’ అన్నారు సన్యాల్, సీరియస్‌గా. పెద్దగా నవ్వాన్నేను. ‘‘మేడమ్‌! ఈ రోజు మీ షెడ్యూల్‌ కాస్త హెక్టిక్‌గా ఉంది. 24 లక్షల మంది బతికున్న ఓటర్లను ఈసీ ‘చంపేసినందుకు’ నిరసనగా రెడ్‌ రోడ్‌లో బైఠాయింపు ధర్నా; పింక్‌ బూత్‌లు, ఉమెన్‌ పెట్రోలింగ్‌ టీమ్‌ల లాంచింగ్, పార్టీ లీడర్స్‌తో ఎలక్షన్‌ స్ట్రాటజీ మీటింగ్, బీజేపీ పరివర్తన్‌ యాత్రకు కౌంటర్‌ ఇవ్వటం, ఇక టైమ్‌ ఉంటే రాయ్‌దిఘిలో అభిషేక్‌ బెనర్జీ ర్యాలీకి అటెండ్‌ అవటం...’’ అని మొత్తం లిస్ట్‌ చెప్పారు సన్యాల్‌.

సన్యాల్‌ సూపర్‌ పీఎస్‌! సూపర్‌ అంటే పెద్ద పెద్ద పనుల్లో తలమునకలై ఉండటమే కాదు, చిన్న చిన్న డీటెయిల్స్‌ను కూడా వేళ్లకు ఉంగరాల్లా తొడుక్కొని ఉండటం కూడా! ‘‘గౌతమ్‌... నాకనిపిస్తోందీ, ఈ కొత్త వైస్రాయ్‌ ప్లేస్‌లో మీరుంటే ఎంత బాగుంటుందీ అని!’ అన్నాను. గౌతమ్‌ ఎప్పటిలా ‘‘హా... మేడమ్‌’’ అని నవ్వి ఊరుకున్నారు. ఆయన చేతిలో ఫోన్‌ బ్లింక్‌ అయింది. ‘‘మేడమ్‌! సీఎం స్టాలిన్‌ లైన్‌లో ఉన్నారట. కనెక్ట్‌ చేయించమంటారా?’’ అన్నారు సన్యాల్‌.

‘‘ఇవ్వండి’’ అన్నాను. ‘‘హలో సిస్టర్‌... హ్యాపీ ఉమెన్స్‌ డే’’  అన్నారు స్టాలిన్, లైన్‌లోకి వచ్చీ రావటంతోనే!
‘‘హ్యాపీ మార్నింగ్‌ స్టాలిన్‌జీ... ఏమిటి విశేషం?’’ అన్నాను నవ్వుతూ. నిన్ననే నేను స్టాలిన్‌కి బర్త్‌ డే విషెస్‌ చెప్పాను.
‘‘మా మణిరత్నాన్ని మోదీజీ మీకు ఉమెన్స్‌ డే గిఫ్ట్‌గా పంపినట్లున్నారు కదా...’’ అని పెద్దగా నవ్వారు స్టాలిన్‌. కొత్త గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవి గురించే ఆయన అంటున్నది.

‘‘స్టాలిన్‌జీ...! మణిరత్నం అని ఆయన్ని తక్కువ చేయకండి. అంతకన్నా విలువైన భారతరత్నం ఆయన’’ అన్నాను, నవ్వుతూ.
‘‘నిజానికి అది కూడా సరిపోదు సిస్టర్‌. ఆయనకు మహిళారత్న ఇవ్వాలి. గవర్నర్‌ స్పీచ్‌లో ‘ఉమన్‌ ఎంపవర్‌మెంట్‌’ అనే మాటను తొలగించి చదివిన భారతదేశపు మొట్టమొదటి గవర్నర్‌ ఆయన’’ అన్నారు స్టాలిన్‌.

‘‘అవును, గుర్తుంది స్టాలిన్‌జీ. అదొకటే కాదు, తమిళనాడు పేరును ‘తమిళVýæం’ అని మార్చాలని కూడా అన్నట్లున్నారు కదా! అసలు ఈ మణిరత్న, మహిళారత్న, భారతరత్న కాదు... ఆయనకు తమిళరత్న ఇవ్వాలి...’’ అన్నాను. మళ్లీ పెద్దగా నవ్వారు స్టాలిన్‌. స్టాలిన్‌తో మాట్లాడి, ఫోన్‌ పెట్టేయగానే, సన్యాల్‌ వచ్చి చెప్పారు... ‘‘మేడమ్‌! కొత్త గవర్నర్‌ మిమ్మల్ని రాజ్‌ భవన్‌కి వచ్చి కలవమంటున్నారు’’ అని!

నవ్వొచ్చింది నాకు. ‘‘వస్తున్నానని చెప్పండి. వస్తానో రానోనని పాపం ఆయన టెన్షన్‌ పడుతూ కూర్చోవటం ఎందుకు?’’ అన్నాను సన్యాల్‌తో. హవాయి స్లిప్పర్లతో ప్రజల దగ్గరికి లక్షల కిలో మీటర్లు నడిచిన నాకు, ప్రజల ప్రతినిధిగా రాజ్‌ భవన్‌ వైపు రెండు అడుగులు వేయటం ఏమంత చిన్నబుచ్చుకునే విషయం?  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement