కోల్‌కతా: ఓటరు జాబితా సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)తో పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్లను తొలగించడాన్ని నిరసిస్తూ శుక్రవారం టీఎంసీ అధినేత్రి, పశి్చమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సెంట్రల్ కోల్‌కతాలో ధర్నాకు పూనుకున్నారు. ఏప్రిల్‌లో జరగనున్న కీలకమైన ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా వివాదాన్ని టీఎంసీ ప్రచారంలో ప్రధాన రాజకీయ అస్త్రంగా మార్చుకోనున్నట్లు ఆమె సంకేతాలిచ్చారు.
రాజకీయంగా ఎంతో ప్రాముఖ్యం కలిగిన ఎస్‌ప్లానెడ్ ప్రాంతంలోని మెట్రో చానల్ వద్ద మమత మధ్యాహ్నం 2.15 గంటలకు ధర్నా ప్రారంభించారు. బీజేపీ, ఈసీలు కలిసి బెంగాలీ ఓటర్ల పేర్లను తొలగించాలని కుట్ర పన్నాయన్నారు. ఈ కుట్రను తాను బయటపెడతానని ఆమె ప్రకటించారు. ఇటీవల ప్రకటించిన జాబితాలో బతికున్న వారిని కూడా చనిపోయిన వారి కిందకి చేర్చారని ఆరోపించారు. అలాంటి వారిని ధర్నా వేదికపైకి తీసుకొచి్చ, ఈసీ పాల్పడిన అవకతవకలను బయటపెడతామన్నారు.
ఇదే అంశంపై శనివారం మరికొన్ని వివరాలను బయటపెడతామన్నారు. బీజేపీ, ఈసీలోని ఆ పార్టీ ఏజెంట్లు బరి తెగించారని, వారికి ఏమాత్రం సిగ్గు లేదంటూ తిట్టిపోశారు. ఇటీవల ఈసీ వెల్లడించిన తుది ఓటరు జాబితాలో 63.66 లక్షల పేర్లను, అంటే మొత్తం ఓటర్లలో 8.3 శాతం మందిని తొలగించడం తెల్సిందే. మరో 60 లక్షల పేర్లను న్యాయపరమైన పరిశీలన కోసం ఉంచారు. త్వరలో న్యాయాధికారులు వీటిని పరిశీలించి, తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇవన్నీ ఎన్నికల సమీకరణాలను తీవ్రంగా ప్రభావితం చేయనుండగా మమత పోరాటానికి దిగారు. అయితే, ధర్నా ఎన్ని రోజులు కొనసాగనుందనే విషయాన్ని మమత వెల్లడించలేదు.


