ఎస్‌ఐఆర్‌కు వేగంగా కార్యాచరణ | Election Commission invites tenders for printing material and kits | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐఆర్‌కు వేగంగా కార్యాచరణ

Mar 6 2026 4:35 AM | Updated on Mar 6 2026 4:35 AM

Election Commission invites tenders for printing material and kits

ప్రింటింగ్‌ మెటీరియల్, కిట్స్‌ కోసం టెండర్లు పిలిచిన ఎన్నికల సంఘం 

నేడు ఆర్థిక బిడ్స్‌ తెరవనున్న అధికారులు 

బీఎల్‌ఓలకు వారం రోజులపాటు తుది దశ శిక్షణ 

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో పాల్గొననున్న 60 వేల మంది సిబ్బంది 

సెప్టెంబర్‌ నాటికల్లా ఓటరు జాబితా వెలువడే అవకాశం  

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(ఎస్‌ఐఆర్‌)కు ఎన్నికల సంఘం కార్యాచరణ వేగవంతం చేసింది. ఏప్రిల్‌ రెండో వారం నుంచి ఈ ప్రక్రియ చేపట్టనున్న నేపథ్యంలో ఓటర్ల ఎన్యూమరేటర్ల నుంచి సేకరించాల్సిన డేటాకు సంబంధించిన ఫారాల ముద్రణ, బీఎల్‌ఓలకు శిక్షణ, వారికి అవసరమైన కిట్స్‌ పంపిణీ కోసం అధికారులు టెండర్లు పిలిచారు. ఈ టెండర్ల ఆర్థిక బిడ్స్‌ను శుక్రవారం తెరవనున్నారు. ఆ తరువాత కాంట్రాక్టర్లకు ఆ బాధ్యత అప్పగిస్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితా ప్రకారం 3.36 కోట్ల మంది ఉన్నారు. 

మూడో దశ కింద 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎస్‌ఐఆర్‌ కోసం ఏప్రిల్‌ మొదటివారంలో నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఈ ప్రక్రియ చేపట్టడానికి అవసరమైన ప్రీ ఎస్‌ఐఆర్‌ ర్యాండమ్‌ పరిశీలన కొనసాగుతోంది. రాష్ట్రంలో ఉన్న 3.36 కోట్ల మంది ఓటర్ల దగ్గరకు వెళ్లి పోలింగ్‌ కేంద్ర అధికారులు(బీఎల్‌ఓ)లు పరిశీలన జరుపనున్నారు. ప్రీ ఎస్‌ఐఆర్‌ కసరత్తులో భాగంగా జరుగుతున్న ఫీల్డ్‌ సర్వే వివరాలు వచ్చేనెల మూడవ వారం నుంచి మొదలయ్యే అసలు ప్రక్రియకు దోహదపడనుంది. 

నోటిఫికేషన్‌ వచ్చే నాటికి... 
ఎస్‌ఐఆర్‌ నోటిఫికేషన్‌ వెలువడే నాటికి ఎన్యూమరేటర్‌ ఫామ్‌ల ముద్రణ, బీఎల్‌ఓలకు కిట్‌ల తయారీ పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కసరత్తు చేస్తున్నారు. నిర్వాచన్‌ సదన్‌ నుంచి వచ్చే మార్గదర్శకాలు, ఆదేశాలకు అనుగుణంగా ఒక వారమంతా బీఎల్‌ఓలకు తుది దశ శిక్షణను ఇవ్వనున్నారు.

బీఎల్‌వోలు పూర్తి చేసే ఎన్యుమరేటర్‌ ఫారాల్లో ఒకటి ఓటర్‌కు ఇవ్వడం, ఒకదాన్ని ఎన్నికల సంఘం తన వద్ద రికార్డు చేయనుంది. క్షేత్రస్థాయిలో తలెత్తే సమస్యలు, సందేహాలు, కొత్త గైడ్‌లైన్స్‌ మీద ఈసీ, సీఈఓ అధికారులు వాళ్లకు అవగాహన కల్పిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్యూమరేషన్‌ పూర్తై, తుది జాబితా వెలువడటానికి నాలుగు నెలలు పట్టే అవకాశం ఉందని అధికారవర్గాల సమాచారం.  

ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో 350 ఓటర్లు.. 
ఒక్కో పోలింగ్‌ కేంద్రం పరిధిలో 350 మంది ఓటర్ల వివరాలను బూత్‌ లెవెల్‌ ఆఫీసర్లు నమోదు చేయనున్నారు. ప్రతీ 10 మంది బీఎల్‌ఓలకు ఒక సూపర్‌వైజర్‌ ఉంటారు. రోజూ సేకరించిన సమాచారాన్ని ఓటర్లు ఎన్యూమరేషన్‌ ఫామ్‌లలో భర్తీ చేసిన తర్వాత ప్రత్యేక మొబైల్‌ యాప్‌ ద్వారా డిజిటల్‌ రూపంలోకి అప్‌లోడ్‌ చేస్తారు. మండలస్థాయిలో తహసీల్దారు అసిస్టెంట్‌ ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌గా. ఈఆర్వోగా రెవెన్యూ డివిజన్‌ స్థాయిలో ఆర్డీవోలు ఉంటారు. జిల్లాస్థాయిలో ఎలక్షన్‌ ఆఫీసర్‌గా కలెక్టర్‌ వ్యవహరిస్తారు. 

రాష్ట్రంలోని మొత్తం 37 వేల పోలింగ్‌ కేంద్రాల బీఎల్‌ఓలు, మరో 15 వేల మంది అసిస్టెంట్‌ బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్లు.. ఇలా దాదాపు 60 వేల మంది సిబ్బందిని స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో పాల్గొననున్నారు. క్షేత్రస్థాయిలో బీఎల్‌ఓలు సేకరించిన వివరాల తర్వాత ఓటర్ల పేర్లు గల్లంతైనా, నమోదు కాకపోయినా, పేర్లతో పాటు అడ్రస్‌ గల్లంతు అయిన వారి ఫిర్యాదులు, అభ్యంతరాలు, అభిప్రాయాలను తీసుకుని పరిష్కరించడానికి నెల రోజుల గడువులోగా పూర్తి చేస్తారని సమాచారం, వాటన్నిటినీ పరిగణలోకి తీసుకొని పరిష్కరించిన తరువాతనే తుది జాబితా సిద్ధం చేస్తారు. 

ఈ ఏడాది సెపె్టంబరు నాటికల్లా ఓటరు జాబితా వెలువడే అవకాశం ఉంది. అర్హత కలిగినవాళ్ల పేర్లు జాబితాలో యధావిధిగా ఉంటాయని, సమగ్రమైన వివరాలు, నిర్దిష్టమైన ప్రూఫ్‌ లేనివాళ్లు మాత్రం లిస్టులో నుంచి తొలగిస్తారని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement