విద్యార్థి నేత నుంచి తెలంగాణ గవర్నర్‌ దాకా | Shiv Pratap Shukla life has been a journey of courage | Sakshi
Sakshi News home page

విద్యార్థి నేత నుంచి తెలంగాణ గవర్నర్‌ దాకా

Mar 6 2026 4:22 AM | Updated on Mar 6 2026 4:22 AM

Shiv Pratap Shukla life has been a journey of courage

ఏబీవీపీలో శివ ప్రతాప్‌ శుక్లా చురుకైన పాత్ర.. ఎమర్జెన్సీ కాలంలో జైలుపాలు 

యూపీలోని గోరఖ్‌పూర్‌ 

నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా విజయం 

యూపీ కేబినెట్‌ మంత్రిగా, ఆపై కేంద్ర మంత్రిగానూ సేవలు

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ నూతన గవర్నర్‌గా నియమితులైన శివ ప్రతాప్‌ శుక్లాకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆయన దశాబ్దాలపాటు బీజేపీలో క్రియాశీలకంగా పనిచేశారు. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా, రాష్ట్రాల గవర్నర్‌ స్థాయికి ఎదిగారు. 1952 ఏప్రిల్‌ 1న యూపీలోని గోరఖ్‌పూర్‌లో జని్మంచిన ఆయన.. దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గోరఖ్‌పూర్‌ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో (ఎల్‌ఎల్‌బీ) పట్టా పొందారు. ఏబీవీపీ విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

1975లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి 19 నెలలపాటు జైలు శిక్ష అనుభవించారు. 1989లో తొలిసారి గోరఖ్‌పూర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. ఆ తర్వాత 1991, 1993, 1996లలోనూ వరుస విజయాలు సాధించారు. యూపీ ప్రభుత్వంలో కళ్యాణ్‌ సింగ్, రాజ్‌నాథ్‌ సింగ్, రామ్‌ ప్రకాష్‌ గుప్తాల కేబినెట్లలో జైళ్లు, గ్రామాభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేశారు. 2016లో యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.

2017లో ప్రధాని మోదీ కేబినెట్‌లో ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. పాలనాపరమైన అనుభవం, వివాదరహితుడిగా ఆయనకు పేరు ఉండటంతో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను 2023 ఫిబ్రవరిలో హిమాచల్‌ ప్రదేశ్‌ 29వ గవర్నర్‌గా నియమించింది. అక్కడ పాలనా వ్యవహారాలను పర్యవేక్షించిన ఆయన్ను తాజాగా తెలంగాణ గవర్నర్‌గా బదిలీ చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement